తెలంగాణవార్తలు

కొడంగల్‌లో నవంబర్ 7 నుంచి 9 వరకు మెగా రైతు మేళా

0
  •  నవంబర్ 7న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం
  •  150 ఎగ్జిబిషన్ స్టాళ్లు ఏర్పాటు
  • మూడు రోజుల పాటు రైతులకు ఆధునిక వ్యవసాయంపై అవగాహన.. శాస్త్రవేత్తలు, ప్రగతిశీల రైతులతో సమావేశాలు
  • చివరి రోజు  పొరుగు జిల్లాల నుంచి 50 వేల మంది రైతుల హాజరవుతారని అంచనా
  • రైతులందరూ మెగా రైతు మేళాను సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి తుమ్మల
               రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, అధిక ఆదాయం అందించే ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించడంతో పాటు వ్యవసాయ రంగంలో సాధించిన పురోగతిని ప్రదర్శించే లక్ష్యంతో ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు కొడంగల్‌లో మూడు రోజుల పాటు మెగా రైతు మేళాను నిర్వహించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నవంబర్ 7వ తేదీన ఉదయం 10 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖుల సమక్షంలో ఈ మేళాను ప్రారంభించనున్నారని వెల్లడించారు. ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి గారు, మంత్రులు ప్రదర్శన స్టాళ్లను సందర్శించనున్నారు.
ఈ మెగా రైతు మేళాలో వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, ఆయిల్‌ఫెడ్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU), పశుసంవర్ధక శాఖ, బ్యాంకింగ్ సంస్థలు, విత్తన పరిశ్రమ, వాలంతరి (WALAMTARI), క్రిడా (CRIDA), కేంద్ర ప్రభుత్వ సంస్థలు సహా మొత్తం 26 ప్రభుత్వ శాఖలు, అనుబంధ సంస్థల భాగస్వామ్యంతో సుమారు 150 ఎగ్జిబిషన్ స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. వ్యవసాయ ఇన్‌పుట్స్, నూతన తరం రసాయనాలు, నాణ్యమైన విత్తనాలు, ఆధునిక వ్యవసాయ పరికరాలు, యంత్రాలు, వ్యవసాయ డ్రోన్లు, వివిధ శాఖల సాంకేతిక పరిజ్ఞానం, ప్రభుత్వ కార్యక్రమాలను ఈ స్టాళ్ల ద్వారా ప్రదర్శించనున్నారని అన్నారు.
మొదటి రోజు గౌరవ ముఖ్యమంత్రిగారితో రైతు మేళా ప్రారంభోత్సవం
          నవంబర్ 7వ తేదీన మొదటి రోజు కొడంగల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని వికారాబాద్, నారాయణపేట జిల్లాల నుంచి సుమారు 7,500 మంది రైతులు పాల్గొననున్నారు. రైతులకు ముందుగానే అల్పాహారం అందించడంతో పాటు కార్యక్రమ ప్రాంగణంలో మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేయనున్నారు. ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి గారు మెగా రైతు మేళాను ప్రారంభిస్తారు.
            ప్రస్తుతం నెలకొన్న ఎల్‌నినో వాతావరణ పరిస్థితులు, వ్యవసాయ రంగంపై వాటి ప్రభావం, రైతులు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, ప్రత్యామ్నాయ సాగు విధానాలపై జరిగే చర్చలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నారు.  వైవిధ్యభరితమైన, అధిక ఆదాయం అందించే పంటల సాగును ప్రోత్సహించడం, సంప్రదాయ పంటలపై ఆధారపడటాన్ని తగ్గించడం, వ్యవసాయ ఆదాయాన్ని పెంచడం, సుస్థిర వ్యవసాయ పద్ధతులను అవలంబించడం, వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో నూతన అవకాశాలను అన్వేషించడం ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని మంత్రి వివరించారు.
రైతులకు వ్యవసాయ పరికరాలు, యంత్రాల పంపిణీ :-
          మొదటి రోజు ముఖ్యమంత్రి గారు, ఇతర ప్రముఖుల సమక్షంలో కస్టమ్ హైరింగ్ సెంటర్లు, పప్పుధాన్యాల మిల్లులు, నూనె గానుగ యూనిట్లు, భూసార పరీక్ష కార్డులు, బయో రిసోర్స్ ఇన్‌పుట్ సెంటర్లు, ఉద్యానవన శాఖకు సంబంధించిన డ్రిప్ సిస్టమ్స్ తదితర వ్యవసాయ పరికరాలు, యంత్రాలు, యూనిట్లను రైతులకు అందించనున్నారు. మొదటి రోజు కార్యక్రమాలు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నాయి.
రెండో రోజు మహిళా రైతులకు ప్రత్యేక ప్రాధాన్యత :-
             రెండో రోజు కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో మహిళా రైతులు పాల్గొనేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో మహిళా రైతుల పాత్ర, ఆదాయాన్ని పెంపొందించుకునే అవకాశాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై వారికి అవగాహన కల్పించనున్నారు.
మూడో రోజు 10 జిల్లాల నుంచి 50 వేల మంది రైతుల హాజరవుతారని అంచనా :-
మూడో రోజు పొరుగు జిల్లాల నుంచి సుమారు 50 వేల మంది రైతులను సమీకరించనున్నారు. చివరి రోజు సాయంత్రం గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రసంగంతో మెగా రైతు మేళా ముగియనుంది.
రైతులకు ఆధునిక వ్యవసాయ పరిజ్ఞానాన్ని అందించడంతో పాటు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు, సాంకేతిక సంస్థలతో నేరుగా చర్చించే అరుదైన అవకాశాన్ని ఈ మెగా రైతు మేళా కల్పిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలోని రైతులందరూ ఈ మూడు రోజుల మెగా రైతు మేళాలో పాల్గొని, అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
Leave Your Comments

ఎల్-నినో పరిస్థితులలో ప్రత్యామ్నాయ పంటగా యాసంగి కంది- యాజమాన్య పద్ధతులు

Previous article

ఎల్ నినో పరిస్థితుల్లో సపోటా మరియు పనసలో నీటి సంరక్షణ

Next article

You may also like