అనాదిగా మానవాళికి ఆహారభద్రతను చేకూరుస్తున్నవారెందరో ……సస్య విప్లవ సారధులందరికి వందనములు.
స్వాగతం….సుస్వాగతం…

వ్యవసాయం అతిప్రాచీనమైన వృత్తి. మానవజాతి మనుగడకు ప్రధానమైన ఆహారాన్ని అందించడానికి సృష్టి ఆవిర్భావం నుండి నేటివరకూ రైతు అనేక ప్రక్రియలను చేపట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వ్యవసాయం ఒక యజ్ఞంలా మారింది. రైతాంగానికి ఒక పెద్ద సవాలుగా కూడా నిలిచింది. ఆరుగాలం కష్టించి శ్రమకి తగిన ఫలితం లేకపోవడంతో వ్యవసాయం దండగనే భావన సర్వత్రా వ్యాపించి ఈ ప్రాచీన వృత్తి కి దూరమవుతున్న వారెందరో….. ఈ తరం వరకు రైతులు విసిగిపోయి ఉన్న నేపథ్యంలో భవిష్యత్ తరాలు వ్యవసాయానికి దూరమయ్యే దుస్థితి ఏర్పడింది. ఈ పవిత్ర వృత్తి మనుగడ ప్రస్నార్ధకంగా మారిపోయినందున, భవిష్యత్ పట్ల, మనుగడ పట్ల తీవ్రమైన భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

అలాంటి ఈ పరిస్థితులలో వ్యవసాయాన్ని పండుగగా మార్చటానికి, లాభసాటి వృత్తిగా మార్చి, రైతుల హృదయాల్లో స్ఫూర్తి నింపేందుకు చేసే చిరు ప్రయత్నముగా మేము ఈ అక్షర యజ్ఞాన్ని ప్రారంభించాము. ఏరువాక సమగ్ర రైతు సాధికార మాసపత్రికగా, అందరి రైతుల గొంతుకగా మరియు వ్యవసాయంలో ఆధునిక పద్దతులు గురించి సమగ్ర సమాచారంతో కూడిన వ్యాసాలతో రైతులకు ఉపయోగపడే  విధంగా ప్రతి మాసం మీముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు ప్రారంభించాము. వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అనుబంధ రంగాలైన తోటల పెంపకం, పశుపోషణ, పాడిపరిశ్రమ, మత్స్య పరిశ్రమ, పట్టుపెంపకం వంటి అనుబంధ రంగాలకు సాంకేతిక పరిపుష్టిని, సమగ్ర యాజమాన్యాన్ని తక్కువ ఖర్చుతో, తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించే ప్రక్రియలను రైతులోకానికి అందుబాటులోకి తెస్తూ ప్రపంచ ప్రజలకు రసాయన రహిత ఆహారాన్ని అందించేందుకు చేపట్టవలసిన ఉత్తమ వ్యవసాయ పద్దతులను, ప్రపంచ ప్రామాణిక ఖచ్చిత వ్యవసాయ పద్దతులను అందుబాటులోకి తెచ్చేందుకు ఈ ఏరువాక పత్రికను సమస్త కృషీవలులకు అంకితమిస్తున్నాం..

ఈ కృషికి అనుబంధంగా అంతర్జాల వెబ్ సైట్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా వెలుగులోకి తెస్తున్నాము. వచ్చే 2050 నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లకు, భారత్ జనాభా 150 కోట్లకు చేరుకోనున్న సందర్భంలో రైతుకు వెన్నుదన్నుగా నిలిచి ఆహారభద్రత లక్ష్యాల సాధనలో సాటిలేని విజయాలను చేకూర్చడానికి మాధ్యమాల ద్వారా వెన్నుదన్నుగా నిలవాలనేదే మా ప్రధానమైన ఆశయం. ప్రపంచీకరణ నేపథ్యంలో విశ్వమంతా ఒక కుగ్రామంగా మారిపోయిన, మన గ్రామసీమల్లో ఉన్న రైతుల బ్రతుకులు మారడంలేదు. ఒకపక్క పాలకుల నిర్లక్ష్యం, మరోపక్క మోడుగామారిన జీవితాలను పట్టించుకోని సమాజం, మీడియా వివక్షతను ప్రశ్నిస్తూ రైతులకు ఆధునిక వ్యవసాయ నవీన పద్దతుల గురించి, వాణిజ్యం గురించి సమగ్ర విషయాలను రైతుకు అందచేసే విధంగా ఏరువాక కృషిచేస్తుంది. ప్రపంచంలోని ఇతరరంగాల్లో తాము ఉత్పత్తి చేసుకునే వస్తువుకు ఆయా ఉత్పత్తి ధరలు నిర్ణయించుకుంటుండగా రైతులకు మాత్రం ఎటువంటి అవకాశాలు లభించడంలేదు. ఈ దుస్థితి నుండి కాపాడుకునేందుకు పంటల ప్రణాళికలను రచించి పోటిమార్కెట్లో గిట్టుబాటు ధర లభింపచేసుకోవడానికి రైతు సంఘటిత శక్తిగా ఏరువాక నిలుస్తుంది.

భారత దేశానికి స్వాతంత్రం లభించి 7 పదులు నిండినా దాని ఫలాలు అందుకోలేని దేశ జనాభాలో 62 శాతంమందికి జీవనభృతి కలిపిస్తున్న వ్యవసాయరంగ సమస్యల పరిష్కార దర్పణంగా ఏరువాక నిలుస్తుంది. ఈ ఏరువాక వ్యవసాయ రంగాన్ని ”జోరువాక”గా మార్చి అన్నదాతలు, శాస్త్రజ్ఞులు, ప్రభుత్వ, ప్రైవేట్, విస్తరణ భాద్యులు, విత్తన, ఉపకరణాల సంస్థలు దీనికి సంబంధించిన అందరూ పాత్రధారులను కలుపుకొని ఒక సమగ్ర వేదికగా తెలుగు పత్రికా రంగంలో మాధ్యమాల మధ్య ఒక కీలక పాత్రధారిగా ఉండనున్నదని తెలుపుటకు సంతసిస్తున్నాము. అందరి సహాయ సహకారాలను ఈ సందర్భంగా ఆర్థిస్తున్నాము.

అనేక దశాబ్దాలుగా….ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ రంగాల స్థితిగతులపై అక్షరయజ్ఞంలో పాలు పంచుకున్న సీనియర్ జర్నలిస్ట్ లు…..డిజిటల్ మీడియాలో ప్రాచుర్యం పొంది రైతు సేవలను ఆధునికతకు అనుసంధానించి సంక్షోభం నుండి వ్యవసాయరంగాన్ని గట్టెక్కించడానికి. తపన పడే యువ తరంగాలు పాత..కొత్త కలయికలా ..ప్రింట్ మరియు డిజిటల్ మీడియాల్లో మా ఏరువాక నిలుస్తుంది. ఈకార్యక్రమానికి ఉపక్రమించే ముందు మాకు స్ఫూర్తి నిచ్చిన ప్రాతః స్మరణీయుల ముచ్చటైన అక్షరోక్తులను ఓ సారి నెమరు వేసుకుందాం….

ప్రధానంగా ఈనాటి పత్రికా రంగం పరిస్ధితులు గమనంలో పెట్టుకొని ఒక స్వతంత్ర రైతు వేదికగా మా బృందం పనిచేస్తుంది..

“హాలికులైననేమి..గహనాంతర సీమల కందమూల కౌధ్ధాలికులైన నేమి”….నిజోదర..సుతోదర పోషణార్ధమై..  అన్న బమ్మెర పోతన మాస్ఫూర్తి..

“పొలాలనన్నీ హలాల దున్ని” ఇలాతలంలో హేమం పండిస్తూ రైతన్నలకు సాహితీ స్ఫూర్తి నందించిన మహాకవి శ్రీశ్రీ కవితావేశం మా కాదర్శం.

రెండు శతాబ్దాల బానిస సృంఖలాలను సత్యాగ్రహ అస్త్రంతో ఛేదించిన మహాత్ముడు మా ఆదిగురువు

స్వాతంత్ర్యం వచ్చిందని సంబర పడనీయకుండా..ఆహార కొరతతో డొక్కలు మాడి చనిపోయిన లక్షలాది మంది భారతీయులమరణ మృదంగాన్ని మొదటి సస్యవిప్లవ నినాదంతో నిలువరించి పండిట్ నెహ్రూ మాకు మార్గదర్శి. జైజవాన్..జైకిసాన్ని…..నాదంతో అటు ఆహారభద్రత ఇటు దేశభద్రతకు ప్రాణంపోసిన శాస్త్రీజీ మా దార్శనికులు….

శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీకలుగా నిలిచి రైతులు..ఆహార భద్తతతోపాటు ఆంతరంగికభద్రతకు తోడ్పడుతున్న శాస్త్రజ్ఞులు, సస్యవిప్లవ వీరులందరికీ ఈ మా అక్షర యజ్జం అంకితం….ఆదరించండి…..ఆశీర్వదించండి

ఏరువాక అంటే ప్రతి రైతు గుండె, పైరు వెల్లువలా నాట్యం చేస్తుంది. జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమిని ఏరువాక పున్నమిగా పిలుస్తారు. ఏరు అంటే నాగలి లేదా హలం. వాక అంటే దుక్కి దున్నడం. ఇది తెలుగు రాష్ట్రాల్లో రైతులు తమ ఇళ్ళలో చేసుకొనే వేడుక.

వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది. అగ్రికల్చర్ అనే పదంలోనే కల్చర్ ఉంది. ప్రపంచానికి కల్చర్ని, సాయంచేసే గుణాన్ని నేర్పిన ఒకే ఒక్క స్ఫూర్తి రైతన్న …

నేలను నాశనం చేసేవాడు నింగికి ఎదుగుతున్నాడు ….నేలను ప్రేమించేవాడు ఆ నేలలోనే కలసిపోతున్నాడు..

ప్రతిక్షణం ఎగిసిపడే కెరటం….. వ్యవసాయం ప్రపంచానికి సాయం చేయడానికి…..ప్రతిసారి పడి లేస్తుంది. అందుకే అది అమృతం….అందరికి రైతన్న ఆదర్శం..