ఆంధ్రప్రదేశ్మన వ్యవసాయంవార్తలు

అర్నబ్’ తీవ్ర తుఫాను నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

0
  • అక్టోబర్ 28న బాపట్ల–విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం
  • గంటకు 115–125 కి.మీ. వేగంతో గాలులు.. గరిష్ఠంగా 140 కి.మీ. వరకు పెరిగే ప్రమాదం
  • ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాలకు రెడ్ అలర్ట్
  • మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దు.. రైతులు పంటల సంరక్షణకు ముందస్తు చర్యలు చేపట్టాలి
  • పంటల కంటే ప్రాణరక్షణకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి
  • వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్యశాఖ అధికారుల సూచనలు పాటించాలి
  • రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
           బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తుఫాను తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు, రైతులు, మత్స్యకారులు, పశుపోషకులు, పౌల్ట్రీ రైతులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. పశ్చిమ మధ్య ప్రాంతంలో కొనసాగిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారిందన్నారు. అక్టోబర్ 26 అర్ధరాత్రికి తీవ్ర తుఫానుగా, 27న అత్యంత తీవ్ర తుఫానుగా బలపడి, 28వ తేదీ ఉదయం బాపట్ల–విశాఖపట్నం మధ్య ఆంధ్రప్రదేశ్–యానాం తీరాన్ని దాటే అవకాశముందన్నారు. తీరం దాటే సమయంలో గంటకు 115–125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా, గరిష్ఠంగా 140 కిలోమీటర్లకు చేరవచ్చని హెచ్చరించారు. అక్టోబర్ 27, 28 తేదీల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదమున్నందున అధికారులు జారీచేసే హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.
              తీరప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అవసరమైతే ముందుగానే సురక్షిత ప్రాంతాలు, పునరావాస శిబిరాలకు తరలివెళ్లాలని, అత్యవసర మందులు, తాగునీరు, పొడి ఆహారం, టార్చ్‌లైట్లు, బ్యాటరీలు, మొబైల్ ఛార్జర్లు, ముఖ్యమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన తీగలు, పెద్ద చెట్లు, బలహీన భవనాలు, హోర్డింగులు, నిర్మాణ ప్రాంతాలకు దూరంగా ఉండాలని, వరదనీటిలో మునిగిన విద్యుత్ పరికరాలను తాకవద్దని స్పష్టం చేశారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, దివ్యాంగుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. కలుషిత నీటిని వినియోగించకుండా కాచి చల్లార్చిన నీటిని తాగాలని, భారీ గాలులు, ఉరుములు, పిడుగుల సమయంలో బయటకు వెళ్లవద్దని కోరారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని, ఇప్పటికే సముద్రంలో ఉన్న పడవలు తక్షణమే సురక్షిత తీరాలకు చేరుకోవాలని ఆదేశించారు. పడవలు, వలలు, ఇంజిన్లు, ఇతర సామగ్రిని భద్రపరచుకోవడంతో పాటు బీచ్‌లు, రేవులు, సముద్రపు గట్ల వద్దకు ఎవరూ వెళ్లవద్దని హెచ్చరించారు.
            తుఫాను ప్రభావంతో పంటలకు నష్టం వాటిల్లకుండా రైతులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. కోతకు సిద్ధంగా ఉన్న వరి, పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, మినుము, పెసర, కంది తదితర పంటలను వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు కోసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ధాన్యం, వ్యవసాయ ఉత్పత్తులు తడవకుండా టార్పాలిన్లతో కప్పి భద్రపరచుకోవాలన్నారు. పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా మురుగు కాలువలను శుభ్రం చేయాలని, వరి పైరుపై వర్షాల సమయంలో యూరియా, ఇతర ఎరువుల పైపూతను వాయిదా వేయాలని సూచించారు. పత్తిలో పింక్ బోల్‌వార్మ్, తామర పురుగులు, మొక్కజొన్నలో కాండం కుళ్లు, కత్తెర పురుగు, వేరుశనగలో టిక్కా ఆకుమచ్చ, వేరు కుళ్లు, పప్పుధాన్యాల్లో కాయ తొలుచు పురుగుల ఉధృతిని వర్షాల అనంతరం పరిశీలించాలన్నారు. తడిసిన పత్తి, ధాన్యం, కాయలు, గింజలను పూర్తిగా ఆరబెట్టిన తరువాతే నిల్వ చేయాలని తెలిపారు.
         మిరప, టమాటా, వంగ, బెండ తదితర కూరగాయల పొలాల్లో నీటి పారుదల సక్రమంగా ఉండేలా చూడాలని, తీగజాతి పంటల పందిళ్లను బలపరచాలని సూచించారు. అరటి, బొప్పాయి వంటి ఉద్యాన పంటలకు మద్దతు కర్రలు ఏర్పాటు చేయాలని, పండిన పండ్లు, కూరగాయలను అనుకూల వాతావరణంలో కోసి భద్రపరచుకోవాలన్నారు. చెరకు, ఇతర నిలువు పంటలు గాలులకు పడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వర్షాల తరువాత ఆకుమచ్చలు, బ్యాక్టీరియా వ్యాధులు, కాండం, వేరు కుళ్లు లక్షణాలను పరిశీలించాలని తెలిపారు. వర్షాలు కురుస్తున్నప్పుడు పురుగుమందుల పిచికారీ చేయకూడదని, పంట పరిస్థితిని బట్టి శాస్త్రవేత్తల సలహాతో మాత్రమే ఎరువులు, మందులు వినియోగించాలని సూచించారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, ధాన్యం బస్తాలను ఎత్తైన ప్రదేశాల్లో ఉంచాలని, కోత యంత్రాలు, ట్రాక్టర్లు, పంపుసెట్లు, డ్రిప్ వ్యవస్థలు, విద్యుత్ మోటార్లను వరదనీటి నుంచి రక్షించుకోవాలన్నారు.
       తుఫాను అనంతరం పొలాల్లో నిల్వ నీటిని తొలగించి పంటలు, పశువులు, కోళ్ల షెడ్లు, వ్యవసాయ పరికరాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని మంత్రి పేర్కొన్నారు. నష్టానికి సంబంధించిన ఫొటోలు, పత్రాలను భద్రపరచుకుని సంబంధిత అధికారులకు, బీమా సంస్థలకు నిబంధనల ప్రకారం తెలియజేయాలన్నారు. ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల సూచనలను స్థానిక వాతావరణ పరిస్థితులు, పంట దశ, నేల స్వభావానికి అనుగుణంగా పాటించాలని కోరారు. భారత వాతావరణ శాఖ, రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ, జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్యశాఖల నుంచి వెలువడే అధికారిక సమాచారాన్నే పరిగణనలోకి తీసుకోవాలని, వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. పంటలు, ఆస్తులను కాపాడుకునే ప్రయత్నంలో రైతులు, ప్రజలు ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకోవద్దని, ముందస్తు అప్రమత్తతతోనే తుఫాను నష్టాన్ని తగ్గించుకోవచ్చని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
Leave Your Comments

ఆంధ్రప్రదేశ్‌లో పొగాకు రైతులపై వాతావరణ మార్పులు మరియు ఎల్-నినో ప్రభావం

Previous article

You may also like