వేరుశనగ ముఖ్యంగా ఖరీఫ్ సీజన్లో వర్షాధార పరిస్థితుల్లో సాగు చేసే ప్రధాన నూనెగింజల పంట. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో రబీ మరియు వేసవి కాలాల్లో కూడా వేరుశెనగను విజయవంతంగా సాగు చేయవచ్చు. వేరుశనగ పంట, భారతదేశంలో అత్యంత ముఖ్యమైన నూనె గింజల పంటలలో ఒకటి, మరియు ప్రధానంగా వర్షపాతం మీద ఆధారపడి సాగు చేయబడుతున్నపంట. వేరుశనగ రైతులకు కీలకమైన ఆదాయపు వనరు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు మరియు రాజస్థాన్ రాష్ట్రాలలో విరివిగా సాగు చేయబడుతూ ఉంది. వేరుశనగపంటను ఆంధ్రప్రదేశ్ రాష్రంలో సుమారు 3.11 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతూ 3.23 లక్షల టన్నుల కాయ దిగుబదినిస్తుంది. సగటు ఉత్పాదకత 1038 కిలోలు/హెక్టారుకు. ప్రధానంగా రాయలసీమ జిల్లాలైన అనంతపురము, కర్నూలు, చిత్తూరు, కడప మరియు ఉత్తర కోస్తాలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంజిల్లాల్లోను వేరుశనగసాగు చేపడుతున్నారు.
అనువైన నేలలు :- ఇసుకతో కూడిన గరప నేలలు వేరుశనగ విత్తనోత్పత్తికి చాలా అనుకూలమైనవి. చల్కాభూములు, ఎర్రగరప నేలలు కూడా అనుకూలము.
నేల తయారి :- ఏప్రిల్ – మే మాసాలలో తొలకరి వర్షాలతో నేల లోతుగా దున్నడం ద్వార పంటను నష్టపరచే కీటకాలు – తెగుళ్ళ ఉధృతిని తగ్గించవచ్చు. తరువాత పడే వర్షాలకు నీరు భూమిలోపలకి యింకి నిల్వ అవుతుంది. మూడు పంటల కొకసారి లోతుగా దున్నడం వలన 14 శాతము అధిక దిగుబడి వస్తుంది. దుక్కి మెత్తగా మట్టిగడ్డలు లేకుండా చదును చేయాలి.
వేరుశనగ రకాలు :- వేరుశనగలో విత్తనోత్పత్తికి నూతన మరియు అధిక దిగుబదినిచ్చే రకాలు కదిరి-6, కదిరి-9, కదిరి అమరావతి, కదిరి చిత్రావతి, కదిరి లేపాక్షి, ధరణి, నారాయణి, విశిష్ట (టి.సి.జి.ఎస్.1694), టిఏజి- 73, టిఏజి- 24, గిర్నార్ – 4.
విత్తన మోతాదు :- వేరుశనగ రకాలలో విత్తన పరిమాణం మరియు మొలక శాతం బట్టి ఎకరాకు 35-70 కిలోలు విత్తనం సరిపోతుంది.
విత్తన శుద్ధి :- విత్తనాన్ని విత్తుకునే ముందు ప్రతి కిలో విత్తనానికి 1 గ్రా, టెబ్యుకొనజోల్ 2 డి.యస్. లేదా 3 గ్రా,, మాంకోజెబ్ లేదా 2 గ్రా, కార్బెండజిమ్ తో విత్తనశుద్ధి చేస్తే విత్తనాల ద్వారా సంక్రమించే శిలీంద్రాలు రాకుండా కాపాడుకోవచ్చు. వేరుపురుగు ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనానికి 6 మి.లీ. క్లోరిపైరిఫాస్ లేదా 2 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ మందును 4 మి.లీ నీటితో కలుపుకొని ఆరిన తరువాత విత్తుకోవాలి. విత్తనాన్ని మొదట క్రిమిసంహారక మందుతో శుద్ధిచేసి ఆరబెట్టిన తరువాత శిలీంధ్రనాశనితో శుద్ధి చేయడం వలన తెగుళ్ళు రాకుండా అరికట్టవచ్చు. అవసరమైతే రైజోబియం కల్చరును 200 గ్రా. ఎకరా విత్తనాలకు పట్టించవచ్చు.
విత్తే దూరం మరియు విత్తడము : – వర్షాధార పంటలో సాలుకు, సాలుకు (వరుసల) మధ్య 30 సెం.మీ. మొక్కల మధ్య 10 సెం.మీ. దూరం ఉండేటట్లు సుమారు 5 సెం.మీ. లోతులో తడి మట్టి తగిలేలా విత్తనం గోర్రుతో విత్తుకోవాలి. ఒక చదరపు మీటరుకు 33 మొక్కలు వుండునట్లు చూసుకోవాలి. నీటి వసతి కింద సాగు చేసే పంటలో సాలుకు, సాలుకు (వరుసల) మధ్య 22.5 సెం.మీ. మొక్కల మధ్య 10 సెం.మీ. దూరం ఉండేటట్లు విత్తుకోవాలి. ఒక చదరపు మీటరుకు 44 మొక్కలు వుండునట్లు చూసుకోవాలి. విత్తు పరికరాలను విత్తే ముందు బాగా శుభ్రం చేసుకోవాలి.
ఎరువుల యాజమాన్యం :- నేల స్వభావాన్ని బట్టి నేలలో లభించే పోషకాల మోతాదును బట్టి రసాయన ఎరువులను వాడాలి. సాధారణంగా ఆఖరి దుక్కిలో ఎకరానికి 4-5 టన్నుల సేంద్రీయ ఎరువు వేసి కలియదున్నాలి. వర్షాధార పంటకి ఎకరానికి 18 కిలోల యూరియాను, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 35 కిలోల మ్యురేట్ అఫ్ పోటాష్ ఎరువులను దుక్కిలో వేయాలి. నీటి వసతి కింద సాగు చేసే పంటకి ఎకరానికి 10 కిలోల యూరియాను పై పాటుగా చల్లుకోవాలి. పైరులో జింకు లోపము గమనించినప్పుడు 0.2 శాతము జింకు సల్ఫేటు ద్రావణాన్ని స్ప్రేచేయాలి. జింకు లోపమున్నప్పుడు లేత ఆకులు ఇత్తడి రంగుకు తిరుగుతాయి. కణుపుకు, కణుపుకు మధ్య దూరము తగ్గి మొక్కలు పెరగవు. కాండము, ఆకులు ఊదారంగుకు తిరుగుతాయి. కాల్షియం, గంధకము మూలకాలను అందించే జిప్సంను ఎకరాకు 200 కిలోల చొప్పున తొలిపూత దశలో కాయలు అభివృద్ధి చెందే నేలపొరలలో పడేటట్లు వేయాలి.
నీటి యాజమాన్యం: – ముఖ్యంగా పూత దశలో, ఊడలు దిగే సమయంలో మరియు కాయ ఏర్పడే సమయంలో పంటకు తగిన నీరు/తేమ ఉండేలా చూసుకోవాలి.
కలుపు నివారణ మరియు అంతరకృషి :- పైరు విత్తిన 45 రోజుల వరకు పొలంలో ఏ విధమైన కలుపు లేకుండా చూసుకోవాలి. ఎకరానికి ఒక లీటరు పెండిమెథాలిన్ 30% 200 లీ. నీటిలో కలిపి విత్తిన వెంటనేగాని మరుసటి రోజున గాని పిచికారి చేయాలి. కలుపు మందు పిచికారి చేసే ముందు నేలలో తగినంత తేమ శాతం ఉండేలా చూసుకోవాలి. అవసరమైనచో 20, 25 రోజుల లోపు గుంటక/ దంతి/ మనుషులతో అంతరకృషి చేయాలి మరియు మొక్కల మోదళ్ళకు మట్టిని ఎగదోయాలి. విత్తిన 20 రోజలప్పుడు గడ్డిజాతి మరియు వెడల్పాకు కలుపు మొక్కలు ఎక్కువగా వుంటే ఎకరాకు 600 మి.లీ. ఇమజితాఫిర్ 10% SL లేదా క్విజలోఫాప్ ఇథైల్ 5% EC 400 మి.లీ. మందును 200 లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలి. విత్తిన 45 రోజుల తర్వాత ఏ విధమైన అంతరకృషి చేయరాదు. లేనిచో ఊడలు దెబ్బతిని దిగుబడి తగ్గుతుంది.
పురుగులు :
- రసం పీల్చే పురుగులు – తామర పురుగులు (పెను), పేనుబంక (నల్లజీడ),పచ్చ దోమ మరియు నల్లి:
- తామర పురుగు, పచ్చదోమ మరియు పేనుబంక నివారణకు ఇమిడాక్లోప్రిడ్ (0.3 మీ.లీ./లీ.) లేదా అసిటమిప్రిడ్ (0.2 గ్రా.,/లీ.) పిచికారి చేసుకోవాలి.
- నల్లి నివారణకు (3 మీ.లీ./లీ.) ప్రోపార్గైట్ లేదా (1 మీ.లీ./లీ.) స్పైరోమేసిఫెన్ పిచికారి చేసుకోవాలి.
- ఆకు తినే పురుగులు – ఆకు ముడుత (ఆగ్గి పురుగు), శనగ పచ్చ మరియు పొగాకు లద్దె పురుగు :
- ఆకు ముడుత పురుగు నివారణకు క్వినాల్ఫాస్ (2 మీ.లీ./లీ.) లేదా లాంబ్డా సైహలోత్రిన్ (2 మీ.లీ./లీ.) లేదా డెల్టామెత్రిన్ (2 మీ.లీ./లీ.) పిచికారి చేసుకోవాలి.
- శనగ పచ్చ మరియు పొగాకు లద్దె పురుగుల నివారణకు ఫ్లూబెండమైడ్ (0.2 మీ.లీ./లీ.) లేదా క్లోరంట్రానిలిప్రోల్ (0.3 మీ.లీ./లీ.) లేదా క్లోరంట్రానిలిప్రోల్ + లాంబ్డా సైహలోత్రిన్ (0.5 మీ.లీ./లీ.) పిచికారి చేసుకోవాలి.
తెగులు:
- తిక్కా మచ్చ తెగుళ్ళ: ఈ తెగులు నివారణకు క్లోరోథలోనిల్ (2 గ్రా./లీ.) లేదా హెక్సాకొనజోల్ (2 మీ.లీ./లీ.) లేదా టేబ్యుకొనజోల్ (1 మీ.లీ./లీ.) పిచికారి చేసుకోవాలి.
- మొదలు కుళ్ళు తెగులు: ఈ తెగులు మొదటి దశలో విత్తనం కుళ్ళిపోవడం జరుగుతుంది, ఆ తర్వాత దశలో కాండం మొదలు భాగంలో నల్లని శిరీంద్ర బీజం ఏర్పడుతుంది.
- కాండం కళ్ళు తెగులు (బూజు / బుడిమి తెగులు): ఈ తెగులు పంట వేసిన 70 రోజుల నుంచి పంట కోత వరకు ఆశిస్తుంది. ఈ తెగులు ఆశించినప్పుడు మొక్కలు పసుపు రంగుకు మారి ఎండిపోతాయి. తర్వాత దశలో భూమిపై ఉన్న కాండం మీద తెల్లటి బూజు తెరలు ఏర్పడుతుంది.
- వేరు కుళ్ళు తెగులు: ఈ తెగులు సుమారు 25 నుంచి 30 రోజుల తర్వాత వర్షాభావ పరిస్థితుల వలన ఎక్కువగా ఆశిస్తుంది. ఈ తెగులు ఆశించడం వలన తల్లి వేర్లు కూలిపోయి నలుపు రంగుకు మారి నుజ్జు నుజుగా తయారవుతుంది. వీటి నివారణకు ట్రైకోడెర్మా రెండు కిలోలు 90 కిలోల పశువుల ఎరువు మరియు 10 కిలోల వేప గింజలు పిండితో కలిపి మూడు రోజులకు ఒకసారి నీళ్లు చల్లుతూ 15 రోజుల తర్వాత ఒక ఎకరా భూమిలో విత్తి ముందు వేసుకోవాలి మరియు ఇదేవిధంగా పంట వేసిన 30 రోజులకు మరియు 60 రోజులకు వేసుకోవాలి.
- త్రుప్పు లేక కుంకుమ తెగులు: ఆకుల అడుగు భాగంలో ఎరుపు లేక ఇటుక రంగు గల చిన్న పొక్కులు ఏర్పడి ఆకు పైభాగంలో పసుపు రంగు మచ్చలు కనిపిస్తాయి. నివారణకు క్లోరోథలోనిల్ (2 గ్రా./లీ.) లేదా హెక్సాకొనజోల్ (2 మీ.లీ./లీ.) లేదా టేబ్యుకొనజోల్ (1 మీ.లీ. /లీ.) నీటికి పిచికారి చేసుకోవాలి.
- మొవ్వు కుళ్లు వైరస్ తెగులు మరియు కాండం కుళ్ళు వైరస్ తెగులు: ఈ రెండు తెగుళ్ళు ఆశించినప్పుడు మొవ్వు ఎండిపోతుంది, మొక్కలు గిడసబరితాయి మరియు ఆకులు పసుపచ్చగా మారుతాయి. మొవ్వు కుళ్లు వైరస్ తెగులు, లేత దశలో ఆశించినట్లయితే మొక్కలలో కాయలు ఏర్పడవు, ముదిరిన మొక్కలలో తెగులు ఆశించినట్లయితే కాయలు మరియు విత్తనాలు చిన్నవిగా ఉండి ముడుచుకొని ఉంటాయి. కాండం కుళ్ళు వైరస్ తెగులు, 15 రోజులలోపు వయసున్న మొక్కలులో ఆశించినట్లయితే మొక్కలు చనిపోతాయి, ముదిరిన మొక్కలలో ఆశించినట్లయితే ఊడలు నల్లగా మారి, కాయల పై కూడా మచ్చలు గమనించవచ్చు. ఈ వైరస్ తెగులు నివారణకు దానితోపాటుగా పంట వేసిన 20-25 రోజులకు ధయాక్లోప్రిడ్ 480 యస్.సి. 60 మి.లీ. మరియు 40 రోజులకు ఫీప్రొనీల్ 5 యస్.సి. 200 మి.లీ. మరియు 60 రోజులకు అసిటమిప్రిడ్ 20 యస్.పి. 40 గ్రా. మందులను 200 లీటర్ల నీళ్ళలో కలిపి ఒక ఎకరాకు పిచికారి చేసుకోవాలి.
పంటకోత : పంట కోతకు వచ్చినపుడు మొక్కలలోని అధిక బాగం ఆకులు, కొమ్మలు బాగా పసుపు వర్ణంలోకి మారడం, ఆకులపై మచ్చలు ఏర్పడడం, ముదురు ఆకులు రాలిపోవడం వంటి లక్షణాలు పంట కోతకు వచ్చిందనడాన్ని సూచిస్థాయి. 75 శాతం కాయలు గట్టిపడి, డొల్ల లోపలి భాగం నలుపు/ముదురు గోధుమ రంగుకు మారి, విత్తనాలు కొంత కుంచించుకుపోయి, విత్తనపు పొర రంగు తిరిగినప్పుడు కోతకు సిద్ధమవ్వాలి. కోత సమయంలో నేలలో తగినంత తేమ ఉండాలి.
డా. ఇ. ప్రియంకాబాయి, డి. అనిత, డా. ఎల్. మాధవిలత, డా. ఎన్. రమేష్ నాయక్, వ్యవసాయ శాస్త్రం, వ్యవసాయ పరిశోధనా కేంద్రం (ARS), కదిరి, ఫోన్ : 7674886210


























