ఆరోగ్యం / జీవన విధానంపశుపోషణ

Zoonotic Diseases: జంతువులు నుండి మానవులకు పొంచి ఉన్న వ్యాధులు.!

0
Zoonotic Diseases
Zoonotic Diseases - spread from animals to humans

Zoonotic Diseases: జూనోసిస్‌ అనే పదం జూపోటిక్‌ ఇటాలియన్‌ పదం నుంచి పుట్టినది. జూ అంటే జంతువులకు సంబంధించిన అంశం. జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులనే జూనోటిక్‌ (సంక్రమిత) వ్యాధులు అంటారు. జంతువుల నుండి మానవులకు ప్రత్యక్ష లేదా పరోక్ష తాకిడి, వెక్టర్‌-బోర్న్‌ లేదా ఆహారం ద్వారా వ్యాప్తి చెందుతాయి. ఇలాంటి జూనోటిక్‌ వ్యాధులను ఇప్పటి వరకు 253 వరకు గుర్తించారు.

లూయిస్‌ పాశ్చర్‌ అనే ప్రఖ్యాత శాస్త్రవేత్త పిచ్చి కుక్క కాటుకు గురైన వ్యక్తికి 1885వ సంవత్సరం జూలై 6న మొట్టమొదటి సారిగా యాంటీ రేబిస్‌ టీకాను వేసి సఫలీకృతులు అయ్యారు, ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతి యేడాది జులై 6వ తేదీన ‘‘వరల్డ్‌ జూనోసిస్‌ డే’’గా నిర్వహించు కోవడం ఆనవాయితీగా వస్తోంది. 1885కు ముందు కుక్క కాటుకు సరైన చికిత్స మరియు టీకా లేక చాలామంది మరణించడం జరిగినది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ కుక్క కాటు మరణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి.

మనదేశంలో ప్రతి సంవత్సరం 30 వేల మంది ఈ రేబిస్‌ వ్యాధి వల్ల చనిపోతున్నట్లు ఒక అంచనా, అలాగే ఏటా ప్రపంచ వ్యాప్తంగా 15 మిలియన్‌ ప్రజలు కుక్కకాటు వ్యాధి వల్ల రేబిస్‌ వ్యాధికి గురి అవుతున్నారు. రేబిస్‌ వ్యాధి నివారణకు సకాలంలో వ్యాక్సిన్‌ తీసుకోకపోతే ప్రాణానికే ప్రమాదం. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2030 నాటికి రేబిస్‌ రహిత ప్రపంచంగా మార్చాలని విశ్వప్రయత్నాలను చేస్తోంది. ఈ మధ్యకాలంలో ఎబోలా, నీపా, కరోనా వైరస్‌ వ్యాప్తి చాలా ఎక్కువగా విజృంభించడం చూడడం జరిగినది.

ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఈ రోగాల బారిన పడి చనిపోయినారు. ఈ రకమైన వైరస్‌ వ్యాధులు గబ్బిలాల నుంచి మనుషులకు సంక్రమించడం జరిగినది. గబ్బిలాలు అనేక రకాల వైరస్‌ రోగాలకు (దాదాపు 100కు పైగా) రిజర్వాయర్‌ హోస్ట్‌ ఉన్నాయి. ఆధునిక సమాజంలో ప్రతి ఇంటిలోనూ పెంపుడు జంతువులు కనిపిస్తున్నాయి. అయితే పెంపుడు జంతువులతో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా లేకుంటే మన ప్రాణాలకు ముప్పు తప్పదు. పెంపుడు జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సంక్రమించకుండా అవగాహన కల్పించేందుకు ఏటా జూలై 6న ప్రపంచ జునోసిస్‌ డేను నిర్వహిస్తుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఔనూ వారు ప్రతి సంవత్సరం వరల్డ్‌ జునోసిస్‌ డే నాడు ఒక థీమ్‌ చెప్తున్నారు, అదేవిధంగా 2023 థీమ్‌ ఈ విధంగా చెప్పారు. మనుషులతో పాటు జీవించే జంతువుల ఆరోగ్యాన్ని రక్షించడం మరియు చూడటం చాలా అవసరం.

వ్యాధులు ఎవరికి ఎలా సంక్రమిస్తాయి?
జూనోటిక్‌ వ్యాధులు మనుషులకు రావటానికి ఎన్నో మార్గాలున్నాయి. పశువులు, కుక్కలు, కోళ్లు, పక్షులను పెంచేవారు, జంతు ప్రయోగశాలలు, వ్యాధి నిర్ధారణ కేంద్రాల్లో పనిచేసేవారు, పశువైద్యశాల సిబ్బంది, చర్మం, తోళ్ల పరిశ్రమల్లో, ధాన్యపు గిడ్డంగుల్లో పనిచేసే వారు ఈ జోనోటిక్‌ వ్యాధులకు వేగంగా గురవుతుంటారు. ఆయా జంతువులు, పక్షుల్లో ఉండే బ్యాక్టీరియా, వైరస్‌, ప్రొటోజోవా, ఫంగస్‌, క్లామిడే వంటి జీవులవల్ల ఈ జూనోటిక్‌ వ్యాధులు వస్తాయి, గాలి, నీరు, ఆహారం, జంతు ఉత్పత్తులను వినియోగించడం ద్వారా ఈ వ్యాధులు సంక్రమిస్తాయి. వ్యక్తుల వయసు, ఆరోగ్య పరిస్థితి, శరీరంలోని వ్యాధి నిరోధకశక్తి వంటి అంశాలను అనుసరించి ఈ వ్యాధులు సోకడం, వాటి తీవ్రత, అవి కలిగించే హాని ఆధారపడి ఉంటాయి. అలాగే వ్యాధి కారకం మనిషికి ఎంత హాని అనేది వాటి జాతిపైన ఆధారపడి ఉంటుంది.

వరల్డ్‌ జునోసిస్‌ డే సందర్భంగా జూనోటిక్‌ వ్యాధుల గురించి, వాటి వల్ల వచ్చే ప్రమాదాలు మరియు వాటి నివారణా చర్యల గురించి కెవికె శాస్త్రవేత్తలు ఈ విధంగా వివరిస్తున్నారు.

Also Read: Backyard Fruit Plants: ఇంటి పెరట్లో ఎలాంటి పండ్ల మొక్కలు వేసుకోవాలి.!

Zoonotic Diseases

Zoonotic Diseases

ప్రపంచాన్ని వనికించిన ముఖ్యమైన జూనోటిక్‌ వ్యాధులు :

రేబిస్‌ వ్యాధి:
విశ్వాసానికి మారుపేరు కుక్క అని పేర్కొంటారు. పెంపుడు జంతువు కనపరిచే విశ్వాసం దాని పట్ల మనం ఏర్పరుచుకునే ఆత్మీయత మనకు ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుంది. మనిషి, జంతువు మధ్య ఇలాంటి బంధం ఏర్పడితే అది కలకాలం కొనసాగుతుంది. ఈ బంధం వెనుక ప్రాణాలను హరించే అంటు రోగాల ప్రమాదం కూడా పొంచి ఉంది. ఈ నేపథ్యంలో వాటిపై ప్రేమ పెంచుకోవడం ఎంత అవసరమో అందుకు తగు జాగ్రత్తలు కూడా అంతే అవసరం. పెంపుడు జంతువులన్నింటికన్నా ప్రథమ స్థానంలో కుక్క ఉన్నప్పటికీ వాటి వల్ల వచ్చే రేబిస్‌ వ్యాధి కూడా అంతటి భయంకరమైనదే.

రేబిస్‌ (పిచ్చి కుక్క వ్యాధి) అనేది అత్యంత ప్రమాదకరమైన ప్రాణాంతకరమైన వ్యాధి. పిచ్చి కుక్క కాటు వల్ల ఈ వ్యాధి కలుగుతుంది. మూగజీవాల ద్వారా మనుషులకు సోకే ప్రాణాంతకమైన వ్యాధుల్లో ఇది అత్యంత భయంకరమైన వ్యాధి. తోడేళ్లు, నక్కలు, ముంగీసులల్లో ఈ వ్యాధికారక క్రిములు ఎప్పుడూ ఉంటాయి. వ్యాధికారిక కుక్క మనుషులను కరిచినప్పుడు వారం నుండి సంవత్సరంలో ఎప్పుడైనా ఈ రేబిస్‌ వ్యాధి బయటపడుతుంది.

దొమ్మ రోగం /ఆంత్రాక్స్‌ వ్యాధి:
జూనోటిక్‌ వ్యాధుల్లో ఆంథ్రాక్స్‌ ప్రాణాంతకమైనది. ఈ వ్యాధి స్పోర్స్‌ ఉన్న పచ్చిగడ్డి ద్వారా పశువులకు సంక్రమిస్తుంది, గాలి ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. ఉన్ని తోళ్ల పరిశ్రమలో పనిచేసే వారికి ఈ వ్యాధి విపరీతంగా సంక్రమిస్తుంది, మనుషుల్లో చర్మంతో పాటు పేగులు, ఊపిరితిత్తులకు సోకే ఈ వ్యాధి అత్యంత ప్రమాదం.

వ్యాధిని నివారించాలంటే ఆంత్రాక్స్‌ వ్యాధి గుర్తించిన ఆరు కిలోమీటర్ల పరిధిలో ఐదేళ్ల పాటు నిర్ణీత గడువులో వ్యాధి నిరోధక టీకాలు చేయించాలి. మనుషుల్లో వ్యాధి సోకినట్లు అనిపిస్తే అవసరమయిన పరీక్షలు చేయించి అత్యవసర చికిత్స అందించాలి.

మెదడు వాపు వ్యాధి :
మెదడు వాపుని ఆంగ్ల భాషలో ఎన్సేఫలైటిస్‌ అని పిలుస్తారు. ఇది సాధారఇంగా వైరస్‌ వల్ల వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా దీనిలో అనేక రకాలను గుర్తించారు. భారతదేశంలో జపనీస్‌ ఎన్సేఫలైటిస్‌ వైరస్‌ వల్ల మెదడు వాపు వ్యాధి వస్తుంది. ఈ వైరస్‌లు పక్షులు, పందులు, ఎలుక లాంటి వాటిలో ఉంటాయి. ఈ జీవులు వైరస్లకు ఆశ్రయంగా పని చేస్తాయి. వీటి నుంచి క్యూలెక్స్‌ దోమకాటు ద్వారా మానవులలోకి ప్రవేశిస్తాయి. ఎందరో చిన్న పిల్లలు ఈ వ్యాధి వల్ల మరణిస్తున్నారు. తల నొప్పి, జ్వరం, మెదడు సక్రమంగా పని చేయక ఒక వైపు పక్షవాతం కలగడం, మూర్చరావడం లాంటివి ఈ వ్యాధి లక్షణాలు.

మ్యాడ్‌ కౌ వ్యాధి :
దీనిని ఆహారం వల్ల కలిగే రోగం మరియు వ్యవహారికంగా విషవ్యాధి అంటారు. కలుషితమైన ఆహారం తినడం వల్ల ఇది సంభవిస్తుంది. ఒకప్పుడు ఇంగ్లండ్లో ఈ వ్యాధి వల్ల విఫరీతమైన జననష్టం జరిగింది. మ్యాడ్‌కౌ డీసీజ్‌ గతంలో యూరప్‌ దేశాలను వణికించిన మహామ్మారి. గొడ్డు మాంసం, బీఫ్‌ ద్వారా ఈ వ్యాధి మనిషి మెదడుకు వ్యాపిస్తుంది. దీంతో వ్యాధి సోకిన వ్యక్తి వ్యవహారశైలిలో తీవ్రమైన మార్పుచోటు చేసుకుంటుంది. ఒక రకంగా మానసిక రోగిగా మారిపోతాడు, జ్ఞాపకశక్తి కోల్పోవడం, శారీరకంగా నీరిసించిపోవడం, పొంతన లేకుండా మాట్లాడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ కారణంగా అప్పట్లో యూరప్‌ ప్రజలు లక్షలాదిగా గోవులను బందించారు. చాలా సంవత్సరాలపాటు గొడ్డు మాంసానికి దూరంగా ఉన్నారు.

బర్డ్‌ ఫ్లూ వ్యాధి :
ఈ వ్యాధి ఏవిఎన్‌ ఇన్ఫ్లుఎంజా అనే సూక్ష్మ క్రిముల వల్ల వస్తుంది. ఇది గాలి ద్వారా చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి వచ్చినపుడు కోళ్లు చాలా ఎక్కువగా చనిపోతాయి. ఈ వ్యాధితో ఉన్న కోళ్ల మాంసం, రెట్టల ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. ఈ వ్యాధి ఎక్కువగా చలికాలంలో వస్తుంది.

టీబీ :
దీనిని ట్యూబర్క్యులోసిస్‌ అంటారు. ఇది బ్యాక్టీరియా ద్వారా మనుషులకు, పశువులకు సంక్రమిస్తుంది. దీనివల్ల ప్రతి సంవత్సరం అనేక మంది చనిపోతున్నారు. టీబీతో ఉన్న పశువుల పాలు బాగా మరిగించకుండా తాగినట్లు అయితే మనుషులకు, చిన్న పిల్లలకు ఈ వ్యాధి సంక్రమిస్తుంది.

బ్రూసెల్లోసిస్‌ :
బ్రూసెల్లోసిస్‌ వ్యాధి సోకిన పశువుల, జీవాల, కుక్కల ప్రసవ ద్రవాలు మరియు దూడల, మేకల, గొర్రె పిల్లల, కుక్కపిల్లలకు జన్మనిచ్చే సమయంలో యోని స్రావాలను తాకినప్పుడు ఈ వ్యాధి మనుషులకు వ్యాపిస్తుంది.
ఈ వ్యాధి సోకిన గేదె పాలు బాగా వేడి చేయకుండా తాగినట్లయితే మనుషుల్లో ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఉంటుంది, ఇలాంటి పాలతో తయారు చేసిన స్వీట్లు తిన్నా మరియు అపరిశుభ్రమైన పాలు, గుడ్లు, మాంసం వల్ల కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వ్యాధి సోకినప్పుడు పురుషుల్లో అయితే మోకాళ్ళ నొప్పులు, వృషణాల వాపు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి, మహిళల్లో అబార్షన్లు, నీరసం, మోకాళ్ల నొప్పులు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

లెఫ్టోస్పైరోసిస్‌ :
ఈ వ్యాధి ఎలుకలు, కుక్కల ద్వారా సంక్రమిస్తుంది. ఈ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించి తగిన చికిత్స అందించకపోతే ప్రాణాంతకంగా మారుతుంది. ఇది శరీరంలో మూత్రపిండాలు, కాలేయం వంటి కీలక అవయవాల పనితీరును దెబ్బతీసి, మల్టీ ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌తో ప్రాణాలు తీసే చాలా తీవ్రమైన వ్యాధి.
ఇవే కాకుండా సాల్మోనెల్లోసిస్‌ (కర్ర కోత పనిచేసే వారికి, సరిగా ఉడకని గుడ్లు, మాంసం తినడం వల్ల), గ్లాండర్స్‌, అన్కైలోస్టామియాసిస్‌, హైడటియోసిస్‌, ఎలర్జీ, ఎగ్జిమా అమీబియాసిస్‌, బాలంటిడియాసిస్‌, టాక్సోప్లాస్మా, కుక్క పిల్లలతో  ఆడేవారికి టాక్సోకార్యాసిస్‌, కుక్కలు, లేగ దూడల ద్వారా గజ్జి, చర్మ వ్యాధులు, ఎలుకల వల్ల ప్లేగు వ్యాధి, పంది మాంసం వల్ల టీనియా సోలియం, గొర్రెల మేకల కాపరులకు గజ్జి, దురదలు, కోళ్ళ ద్వారా రాణికేట్‌, మాంసపు పరిశ్రమంలోని కూలీలకు క్యూ ఫీవర్‌ వంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉంది.
కావున తగిన జాగ్రత్తలు పాటిస్తే ఇటువంటి జూనోటిక్‌ వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు.

Emerging Zoonotic Diseases

Emerging Zoonotic Diseases

జూనోటిక్‌ వ్యాధులు రాకుండా తీసుకొవాల్సిన జాగ్రత్తలు :
వ్యాధి సోకిన జంతువులు, కోళ్ల మాంసం తినకూడదు. పూర్తిగా ఉడికిన మాంసాన్నిమాత్రమే తినాలి. సరిగా ఉడకని గుడ్లను తినకూడదు. చెడిపోయిన అపరిశుభ్రమైన పాలు, మాంసం, గుడ్లు తినకూడదు. వ్యాధి సోకిన పశువుల పాలను సేవించకూడదు. పాలను భాగా మరిగించి తాగాలి.
పాడి పశువులను, జంతువులను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. పశువులు, జంతువులు, పక్షులు, కోళ్లకు కాలానుగుణంగా ఇవ్వాల్సిన వ్యాధి నిరోధక టీకాలను తప్పనిసరిగా చేయించాలి. పాలను క్షేత్ర స్థాయిలో తప్పనిసరిగా ప్రాధమికంగా పరిక్షించాలి మరియు పాల ఉత్పత్తిలో పరిశుభ్రత పాటించాలి.
పశువులు, జంతువులు, పక్షుల కొనుగోలు, అమ్మకాల కేంద్రాల్లో డాక్టర్‌ సర్టిఫికెట్‌ తీసుకునే విధానం సక్రమంగా అమలు చేయాలి.

. పోస్టుమార్టం పరీక్షలు విధిగా నిర్వహించాలి. జంతువుల ఆరోగ్యంపైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలి. మృతిచెందిన జంతువుల కళేబరాలను లోతైన గోతిలో సున్నం చల్లి పూడ్చిపెట్టాలి.

. ఆంథ్రాక్స్‌, గ్లాండర్స్‌ వంటి వ్యాధుల గురించి రైతులకు, ప్రజలకు అవగాహన కల్పించాలి.

. ఊరికి దూరంగా 3 లేదా 4 కిలో మీటర్ల దూరంలో పరిశుభ్రమైన వాతావరణంలో పందులు పెంచాలి.

. జంతు ఆవాసాలను అప్పుడప్పుడూ క్రిమిసంహారకాలతో శుభ్రం చేయాలి.

. జంతువులకు విధిగా నట్టల నివారణ చేయాలి. పౌల్ట్రీ ఫారాలు, జంతు ప్రదర్శన శాలలు, సర్కస్‌ కంపెనీల్లో పనిచేసే వారు, డైరీ పారాల్లో పనిచేసే వారు, పశుపోషకులు, జంతుప్రేమికులు వ్యక్తిగత పరిశుభ్రతపై ఎక్కువ శ్రద్ధ చూపాలి వీలు అయితే మాస్క్‌ ధరించడం శ్రేయష్కరం.

. చిన్నపిల్లలు కుక్కలతో ఆడుకునేటప్పుడు నోటిలో చేతులు పెట్టకుండా తల్లిదండ్రులు జాగ్రత్తపడాలి. కుక్కలను పెంచేవారు, పశువైద్య సిబ్బంది ఏంటీ ర్యాబిస్‌ టీకాను ముందుగానే వేయించుకోవాలి. పెంపుడు కుక్కలకు తప్పనిసరిగా ఏంటీ ర్యాబిస్‌ టీకాను వేయించాలి. పశుసంవర్ధకశాఖ, ఆరోగ్య శాఖ, పంచాయితీ, మున్సిపల్‌ అధికారులు ర్యాబిస్‌ నివారణకు సంయుక్త కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలి. స్వచ్చంద సంస్థలు జూనోటిక్‌ వ్యాధుల ప్రచారం, నివారణ ఇలా సమిష్టి కృషితో పాటు క్రియాశీలక పాత్రను వహించాల్సి ఉంది.

Also Read: Seafood Industry: ప్రమాదంలో సీఫుడ్‌ పరిశ్రమ.!

Leave Your Comments

Seafood Industry: ప్రమాదంలో సీఫుడ్‌ పరిశ్రమ.!

Previous article

Modern Agricultural Equipment: ఆధునిక వ్యవసాయ పరికరాలు.!

Next article

You may also like