ఈ నెల పంటచీడపీడల యాజమాన్యం

Sesame Seeds: వేసవికి అనువైన నువ్వుల రకాలు – సాగు యాజమాన్యం

0
Sesame Seeds
Sesame Seeds

Sesame Seeds: తక్కువ సమయంలో, తక్కవ వనరులతో అధిక నికర లాభాన్ని ఆర్జించేందుకు నువ్వుల పంట ఉపకరిస్తుంది. ఖరీఫ్ వర్షాధారంగా, రబీలో నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో పండింస్తారు. ముఖ్యంగా ఏపిలో కోస్తా, రాయలసీమ జిల్లాలు, తెలంగాణలోని ఉత్తర, దక్షిణ జిల్లాల్లో నువ్వును సాగుచేస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడినిచ్చే పంటగా నువ్వులను చెప్పుకోవచ్చు. నువ్వు పంట ఉత్తర తెలంగాణ ప్రాంత జిల్లాలలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయబడుతుంది.

Sesame Seeds

Sesame Seeds

నువ్వుల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు

ప్రతి రోజూ నువ్వులని ఆహారంలో భాగంగా చేసుకుంటే అధిక కొలెస్ట్రాల్, అధిక ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలకు చెక్ పెట్టవచ్చు.
నువ్వుల నూనెలో ప్రత్యేకంగా విటమిన్ కె, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ డి, విటమిన్ ఇ మరియు ఫాస్ఫరస్లను సమృద్ధిగా కలిగి ఉంటుంది
నువ్వుల్లో ఉండే సెలీనియం, థైరాయిడ్ పేషెంట్లకు మేలు చేస్తుంది.

రైతులు ప్రధానంగా పాటించవలసిన పద్దతులేమనగా

రైతులు నువ్వుల పంటను సాగు చేసేటపుడు మేలైన రకాల ఎంపిక, సరైన సమయంలో విత్తటం, సమయానుకూలంగా చేపట్టే యాజమాన్యంపైనే నువ్వు దిగుబడి ఆధారపడి వుంటుంది.
అనువైన రకాలు, వాటి వివరాలు
అధిక దిగుబడి సాధించాలంటే అనువైన రకాల ఎంపిక చాలా అవసరం.
అనువైన రకాలు
విడుదలైన సంవత్సరం
గింజ రకం
దిగుబడి
కాలపరిమితి
నూనెశాతం
గుణగణాలు
హిమ
2006
తెల్లగింజ రకం కాయలు పొడుగ్గా ఉంటాయి
1000-1050 క్వి /హె
వేసవి 80-85 రోజులు
46-48%

వెర్రి తెగులును తట్టుకుంటుంది. ఎగుమతి ప్రాధాన్యత కలదు.
రాజేశ్వరి
1988
తెల్లగింజ రకం
800 క్వి /హె
వేసవి 85-90 రోజులు
50%

కాండం కుళ్ళు, బూడిద తెగుళ్ళను తట్టుకుంటుంది.
జగిత్యాల తిల్-1 (జె.సి.యస్ 1020)
2019
జడ కాతతో కూడిన తెల్లగింజ రకం
1050-1100 క్వి /హె
వేసవి 85-90 రోజలు
46-49%

ఆల్టర్నేరియా తెగుళ్ళను, బూడిద తెగుళ్ళను తట్టుకుంటుంది.
జగిత్యాల తిల్-2 (జె.సి.యస్ 2454)
2021
తెల్లగింజ రకం
970- 1030 క్వి /హె
వేసవి 90-95 రోజులు
46-49%

ఆల్టర్నేరియా తెగుళ్ళను కొంత వరకు తట్టుకుంటుంది. బెట్టను కొంతవరకు తట్టుకుంటుంది.

నేల తయారీ: మురుగు నీరు నిలువని తేలికైన నేలలు శ్రేష్ఠం. నీరు నిలిచే ఆమ్ల, క్షార గుణాలు కల నేలలు పనికిరావు. చదునుగా ఉన్న పొలాన్ని పొడిదుక్కి చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. పొడి దుక్కిలో విత్తనాలు బాగా మొలకెత్తుతాయి. నీటి వసతి ఉన్న పొలాలను ఎంచుకోవడం వల్ల పంట వివిధ కీలక దశలలో బెట్టకు గురి కాకుండా చూడవచ్చు. నేలను 2-4 సార్లు మెత్తగా దున్ని, రెండు సార్లు గుంటక తోలి, చదును చేయాలి.
విత్తన సేకరణ: విత్తనాన్ని వ్యవసాయ పరిశోధనా స్థానములు/ తెలంగాణ సీడ్స్/ యస్. యస్.పి నమ్మకమైన రైతుల నుండి మాత్రమే సేకరించాలి. విత్తన మొలకశాతం కనీసం 80% పైగా వుండాలి.
విత్తు సమయం: వేసవి (జనవరి 2వ పక్షం నుండి ఫిబ్రవరిమొదటి పక్షం) వరకు విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.
విత్తే పద్ధతి మరియు విత్తనమోతాదు: ఎకరాకు 2.5 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తనానికి మూడింతల ఇసుక కలిపి గొర్రుతో వరుసల్లో విత్తుకోవాలి. వరుసల మధ్య 30 సెం.మీ. (12 అంగుళాలు) మరియు మొక్కల మధ్య 15 సెం.మీ (6 అంగుళాలు) దూరం ఉండేలా విత్తుకోవాలి. రైతు స్థాయిలో పొడి దుక్కిలో విత్తనాన్ని సమానంగా చల్లుకొని గొర్రు తొలుకుంటారు.
విత్తనశుద్ది: పంట తొలిదశలో రసం పీల్చే పురుగుల బారి నుండి కాపాడడానికి ఇమిడాక్లోప్రిడ్ 2.0 మి.లీ. కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేసుకోవాలి. నేల నుండి సంక్రమించు తెగుళ్ళను నివారించుటకు కిలో విత్తనానికి 3 గ్రా॥ మాంకోజెబ్ కలిపి విత్తనశుద్ది చేయాలి.
నువ్వులు విత్తడం ఒక ఎత్తైతే ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం కూడా అంతే ముఖ్యం.
ఎరువులు: భూసార పరీక్ష ఫలితాలను దృష్టిలో ఉంచుకొని, ఎరువుల మోతాదును నిర్ణయించుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు, 16 కిలోల నత్రజని, 8 కిలోల పొటాష్ మరియు 8 కిలోల భాస్వరాన్నిచ్చే ఎరువులు వేసుకోవాలి. ఈ ఎరువులను యూరియా, డిఎపి, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో వేసుకున్నట్లయితే ఎకరానికి 32 కిలోల యూరియా, 18 కిలోల డిఎపి మరియు 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అవసరం అవుతుంది. విత్తిన 30 రోజుల తర్వాత పై పాటుగా 18 కిలోల యూరియా అందజేయాలి.
కలుపు నివారణ, అంతరకృషి: విత్తిన 15- 20 రోజులకు అదనపు మొక్కలను మరియు కలుపు మొక్కలు తొలగించి పలుచగా చేయాలి. 30-35 రోజులప్పుడు గొర్రు తో అంతర్ కృషి చేసుకోవాలి
నీటి యాజమాన్యం (వేసవి): విత్తిన వెంటనే పలుచటి తడి ఇవ్వాలి. పూత, కాయ అభివృద్ధి మరియు గింజ కట్టు దశల్లో తడులు ఇవ్వాలి. నువ్వులు సాగు చేసే నేలలో తేమ ఎక్కువ ఉన్న పరిస్థితులలో మొక్కల శాఖీయోత్పత్తి మాత్రమే జరిగి ఆకులు, కొమ్మలు ఎక్కువగా వచ్చి పూత మరియు కాయ రాకుండా నిలిచిపోవటం జరుగుతుంది. కావున ఈ పంట సాగు చేసేటప్పుడు ఎక్కువ మోతాదులో నీరు అందజేయకూడదు.
చీడపీడల యాజమాన్యం
ఆకుముడత మరియు కాయ తొలుచు పురుగు: మొగ్గ ఏర్పడే దశలో మొగ్గలను, పూతను, కాయల్లోని లేత గింజలను తింటూ పంటకు నష్టం చేస్తాయి.
నివారణ: ప్రొఫెనోఫాస్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.
వెర్రి తెగులు (ఫిల్లోడి): తెగులు సోకిన మొక్కల్లో ఆకులు చిన్నవై పువ్వులోని భాగాలన్ని ఆకుల మాదిరిగా మారిపోయి కాయలు ఏర్పడవు. మొక్కల ఎదుగుదల తగ్గి పైభాగంలో చిన్న చిన్న గుబురుగా ఉండి వెర్రితల మాదిరిగా ఉంటుంది. ఈ తెగులు దీపపు పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది.
నివారణ: తెగులు కనిపించిన వెంటనే తెగులు సోకిన మొక్కలను పీకి తగులబెట్టాలి.
పైరుపై ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసి దీపపు పురుగులను అరికట్టాలి.
బూడిద తెగులు: లేత ఆకులపై తెల్లని బూడిద పొడి మచ్చలు ఏర్పడుతాయి. తెగులు ఆశించిన ఆకులు మాడి రాలి పోతాయి.
నివారణ: నీటిలో కరిగే గంధకపు పొడి 3 గ్రా. లీటరు నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి
పంటకోత: ఆకులు పసుపు రంగుకు మారి రాలటం ప్రారంభమయినపుడు, 75% కాయలు లేత పసుపు వర్ణానికి వచ్చినపుడు పైరు కోయాలి. కోసిన పంటను కట్టలుగా కట్టి తలక్రిందులుగా నిలబెట్టాలి. 5-6 రోజులు ఎండిన తర్వాత కట్టెలతో కొట్టి నూర్పిడి చేయాలి
నిల్వ చేయటం: గింజల్లో తేమ 8 శాతానికి తగ్గే వరకు ఎండలో ఆరబెట్టాలి. గోనె సంచుల్లో నిల్వ చేయాలి. చదలు ఉంచిన సంచులపై మలాథియాన్ పొడిని చల్లాలి. పురుగు పట్టకుండా అప్పుడప్పుడు ఎండలో అరబెట్టాలి.

Leave Your Comments

Vineyard: ద్రాక్ష తోటల్లో సస్యరక్షణ చర్యలు

Previous article

Tomato Cultivation: టమాటా నారుమడి పెంపకం మరియు ఎరువుల యాజమాన్యం

Next article

You may also like