పశుపోషణ

Dog Bite Precautions: పిచ్చి కుక్క కరిస్తే ఏం చేయాలి?

2
Dog Bite Precautions
Dog Bite

Dog Bite Precautions: ప్రాణాంతకమైన రేబీస్‌ (పిచ్చి) వ్యాధి సూక్ష్మాతి సూక్ష్మక్రిమి (వైరస్‌) ద్వారా వ్యాపిస్తుంది. ఇది జూనోటిక్‌ వ్యాధి. ఈ వ్యాధి ముఖ్యంగా కుక్కకాటు ద్వారా మాత్రమే మనుషులకు కానీ, ఇతర పశువులకు కానీ సోకుతుంది. ఒకసారి రోగలక్షణాలు కనిపిస్తే ఈ వ్యాధికి వైద్యం లేదన్న విషయం అందరికీ తెలిసినప్పటికీ ఈ వ్యాధిపై చాలా మందికి ముఖ్యంగా వ్యాధి నివారణ మరియు పిచ్చికుక్క కరిచిన పిదప ఏం చేయాలి అనే విషయంపై సరైన అవగాహన లేదు. సాధారణంగా కుక్క కరిస్తే చాలు పిచ్చిలేస్తుందేమో అని భయపడుతుంటారు. అంతేకాక రకరకాల అనుమానలతో విపరీతమైన మానసిక ఆందోళనకు కూడా గురవుతూ ఉంటారు. ఈ వ్యాధిపై పూర్తిస్థాయి అవగాహన కల్పించుకోవడం ప్రతి ఒక్కరికి చాలా అవసరం.

1. రేబీస్‌ వ్యాధి ఎలా సోకుతుంది?
పశువుల నుండి మనుషులకి వ్యాపించే ఈ రేబీస్‌ వ్యాధి ప్రధానంగా లాలాజలం ద్వారా మాత్రమే సోకుతుంది. అది కూడా కరవడం లేదా కాటు పడిన చర్మం మీద కానీ, పగిలిన మ్యూకస్‌ పొరల మీద కానీ, రేబీస్‌ వ్యాధి సోకిన పశువుల లాలాజలం పడినప్పుడు మాత్రమే ర్యాబిస్‌ వ్యాధి సోకే అవకాశం ఉంది. పిచ్చికుక్క మాత్రమే కాకుండా రేబీస్‌ వ్యాధి సోకిన పిల్లి లేదా కోతి లేదా ఎలుక లాలాజలం ద్వారా కూడా ఈ వ్యాధి సోకుతుంది. గమనించాల్సిన విషయమేమిటంటే రేబీస్‌ వ్యాధి సోకిన జంతువుల లాలాజలం కరవబడిన వ్యక్తి రక్తంలోకి చేరినప్పుడు మాత్రమే వ్యాధి సోకుతుంది.

2. ఎటువంటి కుక్క కరిచినా రేబీస్‌ వ్యాధి సోకుతుందా?
జ: రేబీస్‌ వ్యాధి సోకిన కుక్క కరిస్తేనే రేబీస్‌వ్యాధి సోకుతుంది. మంచికుక్క (రేబీస్‌ వ్యాధి సోకని కుక్క) కరిస్తే రేబీస్‌ వ్యాధి సోకదు.

Also Read: కూరగాయల సాగులో నారుమడుల యాజమాన్యం.!

Dog Bite Precautions

Dog Bite Precautions

3. రేబీస్‌ వ్యాధి సోకిన కుక్క కరిస్తే ఏం చేయాలి?
జ: రేబీస్‌ వ్యాధి సోకిన కుక్క కరిచిన వెంటనే ఆ వ్యాధి కారక వైరస్‌, కరువబడిన వ్యక్తి శరీరంలోకి పూర్తిగా ప్రవేశించకుండా క్రింద తెలిపిన మూడురకాల చర్యలు వెంటనే చేపట్టాలి. ఈ విషయంపై భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖవారు స్పష్టమైన నిర్ధేశకాలను ఇవ్వడం జరిగింది.

1 (ఎ): కుక్క కరిచిన చోట ఏర్పడిన పుండును వెంటనే బట్టలుతికే సబ్బుతో శుభ్రం చేయాలి. కనీసంగా 15 నిముషాల వరకు పారే నీటితో (నల్లా కింద) కడగాలి. ఎంత ఎక్కువగా కడగగలిగితే అంత ఎక్కువగా ప్రమాదం నుండి తప్పించుకోవచ్చు.
(బి) : తదుపరి పోవిడోన్‌ అయోడిన్‌ ని పుండుపై పెట్టాలి.
(సి) : కుక్కకరిచిన చోట కారంపొడి కానీ, నూనె కానీ, పసుపు కానీ, ఉప్పు కానీ ఇతర చెట్ల మందులు కానీ పెట్టకూడదు.
(డి) : కరిచిన చోట ఎటువంటి బ్యాండెజీ (కట్లు) వేయకూడదు.
(ఇ) : ఒట్టిచేతితో పుండును తాకకూడదు.

2. పైన తెలిపిన ప్రాథమిక జాగ్రత్తలు తీసుకున్న వెంటనే వైద్యాధికారిని కలవాలి. వైద్యాధికారి సూచన మేరకు కుక్క కాటు తీవ్రతను బట్టి రేబీస్‌ ఇమ్యూనోగ్లోబులిన్స్‌ ఇప్పించుకోవాలి. అలాగే క్రింద సూచించిన మాదిరి టీకాలు కూడా ఇప్పించుకోవాల్సి ఉంటుంది.

3 (ఎ) : గతంలో రేబిస్‌ టీకా ఇప్పించుకున్నప్పటికీ పిచ్చికుక్క కరిస్తే కుక్క కరిచిన మొదటి 24 గంటలలోపు మొదటిటీకా మరియు మూడవరోజు రెండవటీకా (మొత్తం రెండు టీకాలు) తప్పని సరిగా ఇప్పించుకోవాలి.
(బి) : గతంలో రేబిస్‌ టీకా ఇప్పించుకోనట్లయితే రేబీస్‌ ఇమ్యూనోగ్లోబులిన్స్‌  తో పాటుగా మొదటిరోజు, మూడవరోజు, ఏడవరోజు, ఇరవై ఎనిమిదవ రోజు (0`3`7`28) మొత్తం నాలుగు టీకాలు తప్పనిసరిగా ఇప్పించుకోవాలి.
పైన తెలిపిన నిర్ధేశకాలను సరిగ్గా పాటించినట్లయితే పిచ్చివ్యాధిని పూర్తిగా అరికట్టవచ్చు.

గమనిక: రేబీస్‌ వ్యాధిని నూటికి నూరు శాతం నివారించవచ్చు. కుక్కలతో కానీ, పిల్లులతో కానీ సాన్నిహిత్యంగా ఉండేవారుకానీ, వాటిని పెంచుకునేవారు కానీ తప్పనిసరిగ్గా రేబీస్‌ టీకా ఇప్పించుకోవాలి. అలాగే వారి పెంపుడు కుక్కలకు, పిల్లులకు కూడా ప్రతీసంవత్సరం రేబీస్‌ టీకా ఇప్పించుకున్నట్లయితే అనుకోకుండా వేరే ఏదైనా పిచ్చికుక్క కాటుకు తాము కానీ, తమ పెంపుడు జంతువులు కానీ గురయినట్లయితే ఎటువంటి భయాందోళనలకు లోనవ్వాల్సిన అవసరం ఉండదు.

Also Read: మామిడిలో కోత అనంతరం చేపట్టవలసిన కీలక పద్ధతులు.!

Leave Your Comments

Vegetable Cultivation: కూరగాయల సాగులో నారుమడుల యాజమాన్యం.!

Previous article

Doubling of Farmers Income: రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయుటకు చేపట్టాల్సిన వ్యూహాత్మక చర్యలు.!

Next article

You may also like