ఆంధ్రా వ్యవసాయం

Uppalapadu Bird Sanctuary: ఉప్పలపాడు కేంద్రంగా పక్షుల సంరక్షణ కేంద్రం.!

2
Uppalapadu Bird Sanctuary
Uppalapadu Bird Sanctuary

Uppalapadu Bird Sanctuary: గుంటూరుజిల్లా ఉప్పలపాడు పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది పక్షుల సంరక్షణ కేంద్రం. ఉప్పలపాడు పక్షుల కేంద్రానికి 18 దేశాల నుంచి వేలాది పక్షులు ఏటా వస్తుంటాయి. ఉప్పలపాడు పక్షుల కేంద్రానికి ఖండాలు దాటుకుని విదేశీ పక్షులు వలస వస్తూ ఉంటాయి. ఈపక్షుల కేంద్రం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు పొందింది. అయితే ఇందుకు తగ్గట్లు ఏర్పాట్లు లేకపోవడంతో పర్యాటకుల సంఖ్య మాత్రం పదుల సంఖ్యలో ఉంటోంది. ఆంధ్రప‌దేశ్ రాజ‌ధాని ప్రాంతానికి చేరువ‌లో, గుంటూరు నగరానికి శివార్లలో ఉంటుంది ఉప్పల‌పాడు గ్రామం. ఈగ్రామంలోని మంచినీటి చెరువును ఒక‌ప్పుడు గ్రామ అవ‌స‌రాల‌కు వినియోగించేవారు. అయితే, వివిధ ర‌కాల వ‌ల‌స ప‌క్షులు సీజ‌న్ల వారీగా ఇక్కడికి వస్తుండటంతో ఆ చెరువు ఇప్పుడు ప‌క్షుల‌ సంరక్షణ కేంద్రంగా మార్చారు. ఉప్పులపాడుకే విదేశీ పక్షులు ఎందుకు తరలి వస్తున్నాయి, ఈ పక్షుల కేంద్రం విశిష్ఠతలు తెలుసుకుందాం.

ఇక్కడకు విదేశీ పక్షుల రాక

ఆస్ట్రేలియా, సైబీరియా, ద‌క్షిణాఫ్రికా, శ్రీలంక‌, నేపాల్ వంటి దేశాల‌తో పాటు హిమాల‌యాల నుంచి కూడా వేలాది ప‌క్షులు ఆయా కాలాల్లో వ‌ల‌స వ‌స్తూ ఉంటాయి. దీంతో ఉప్పల‌పాడు ఎప్పుడూ ప‌క్షుల సంద‌డితో కళకళలాడుతోంది. ఉప్పులపాడు చెరువు మధ్యలో లంకల మాదిరి మట్టి దిబ్బలు ఇక్కడి ప్రత్యేకత. ఈ మట్టి దిబ్బలపై తుమ్మ చెట్లు ఏపుగా పెరిగి పక్షుల ఆవాసానికి అనుకూలంగా ఉంటుంది. వేలాది పక్షుల నివాసాలు ఏర్పాటు చేసుకోవడంతోపాటు, వాటి సంతానాన్ని కూడా వృద్ధి చేసుకుంటూ ఉంటాయి. ఈ పక్షల కిలకిల రావాలు వినేందుకు ఏటా పర్యాటకులు కూడా వస్తుంటారు.ఉప్పల‌పాడుకి చాలాకాలంగా ప‌క్షులు వ‌స్తున్నప్పటికీ, దాదాపు 50 ఏళ్లుగా పెద్ద సంఖ్య‌లో రావ‌డం తాము గుర్తించామని స్థానికులు చెబుతున్నారు.

Also Read: Harvest Home Foods: ఇంటి పంట లోగిళ్లకి అందమే కాదు ఆరోగ్యం కూడా.!

Uppalapadu Bird Sanctuary

Uppalapadu Bird Sanctuary

వేస‌విలో ఆస్ట్రేలియా నుంచి ప‌క్షులు

ఉప్పల‌పాడు వ‌ల‌స ప‌క్షుల సంర‌క్షణ కేంద్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అట‌వీశాఖ వ‌న్యప్రాణి విభాగం ప‌రిధిలో ఉంది.ఇక్కడికి మొత్తం 30 ర‌కాల విదేశీ ప‌క్షులు వ‌స్తుంటాయి. సీజ‌నల్‌గా వ‌స్తాయి. వేస‌విలో ఆస్ట్రేలియా నుంచి ప‌క్షులు వ‌స్తాయి. శీతాకాలంలో సైబీరియా నుంచి, చైనా నుంచి కూడా ప‌క్షులు వ‌స్తాయి. ఆగ‌స్టులో ద‌క్షిణాఫ్రికా నుంచి ప‌క్షులు వ‌స్తాయి. వలస పక్షులతో పాటు ప‌లు స్థానిక జాతుల‌కు చెందిన పక్షులు కూడా ఈప్రాంతంలో ద‌ర్శన‌మిస్తాయి. అయితే అరుదుగా క‌నిపించే వ‌ల‌స ప‌క్షుల‌ను చూడ‌డానికి ప‌ర్యాట‌కులు పెద్ద సంఖ్యలో వస్తుంటాయి.విదేశీ వ‌ల‌స ప‌క్షుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నా, చాలినన్ని ఏర్పాట్లు లేవనే విమర్శలు వస్తున్నాయి.

ప‌ర్యాట‌కులు, ప‌క్షుల‌ను వీక్షించటానికి ట‌వ‌ర్ కూడా నిర్మించారు. ఉప్పల‌పాడుకు వచ్చే వలస పక్షుల్లో చైనా, నేపాల్, హిమాల‌యాల నుంచి పెలికాన్స్, సైబీరియా నుంచి పెయింటెడ్ స్టార్క్స్, శ్రీలంక నుంచి ఓపెన్ బీల్ స్టార్క్స్, ద‌క్షిణాఫ్రికా నుంచి వైట్ ఐబిస్ పక్షులు పెద్ద సంఖ్య‌లో వ‌స్తుంటాయి. డార్ట‌ర్ స్నేక్ పక్షులు కూడా ఏడాది పొడ‌వునా ద‌ర్శన‌మిస్తాయి.

విదేశీ పక్షులు వేల సంఖ్యలో తరలిరావడానికి ముఖ్యంగా ఆయా దేశాల్లో వాతావరణ పరిస్థితులే ప్రధాన కారణం. చైనా, రష్యా, సైబీరియాల్లో భారీగా మంచుకురిసే సమయంలో పక్షులకు ఆహారం దొరకదు. వాటి జీవనం కూడా దుర్భలంగా మారుతుంది. అందుకే అన‌నుకూల వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు ఉన్నప్పుడు త‌మ‌కు సౌకర్యంగా ఉన్న ప్రాంతాల‌కు ఎంత దూర‌మ‌యినా వ‌ల‌స‌లు పోతుంటాయి. ప్రధానంగా ఆహారం కోసం, వాతావరణ ప్రతికూలతల నుంచి కాపాడుకునేందుకు, సంతానోత్పత్తి కోసం వందల నుంచి వేల కిలోమీటర్ల దూరం వ‌ల‌స పోతుంటాయి. ఈ పక్షుల వలసలు చలికాలంలో శీతల ప్రాంతమైన ఉత్తరం నుంచి ఉష్ణ ప్రాంతమైన దక్షిణం వైపుగా సాగుతుంటాయి.

సరైన సౌకర్యాలు లేకపోవడం

ఏపీలో కొల్లేరు, నేలపట్టు, ఉప్పలపాడు కేంద్రాలకు వేల సంఖ్యలో వేల మైళ్ల దూరం నుంచి ప్రయాణం చేసి వలస పక్షలు వస్తుంటాయి. అయితే ఇక్కడ సరైన సౌకర్యాలు లేవు. కొందరు వేటగాళ్లు కూడా పక్షులను వేటాడుకుని తింటున్నారు. ఇక్కడి పరిస్థితులు గడ్డుగా మారడంతో ఏటా వందల సంఖ్యలో పక్షులు చనిపోతున్నాయి. విదేశీ పక్షలు పంటలను ముట్టుకోవు. కేవలం చేపలను ఆహారంగా తీసుకుంటాయి. దీంతో రైతులు కూడా విదేశీ పక్షులను ఆహ్వానిస్తున్నారు. ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని సౌకర్యాలు మెరుగు పరిస్తే అటు విదేశీ అతిధులకు, పర్యాటకులకు అనుకూలంగా ఉంటుంది.

Also Read: Kanakambaram Farmers: శ్రావణమాసంలో లాభాలు పొందుతున్న కనకాబంరం రైతులు.!

Leave Your Comments

Harvest Home Foods: ఇంటి పంట లోగిళ్లకి అందమే కాదు ఆరోగ్యం కూడా.!

Previous article

Weed Management in Paddy: వరిలో ప్రధాన సమస్యగా మారిన కలుపు.!

Next article

You may also like