Irrigation System: తోట మొత్తానికి నేలంతా నీరు పారించటం ఈ పద్ధతిలో నీరు ఎక్కువ మొత్తంలో వృధా అవుతుంది. తోటలో మొక్కలకి లేదా చెట్లకి నీరు ఇవ్వడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. తోటలో ఉన్న చెట్లకి నీరు ఇవ్వాలి అని తోట మొత్తం నీరు ఇస్తే ఎక్కువ శాతం నీరు వృధా అవుతుంది. ఉన్న నీటి వనరులని ఎక్కువ రోజులు వాడుకోలేము.
1. తోటంతా సమానంగా తడిచే అవకాశం తక్కువ. నేల సరియైన చదునుగా లేకుంటే పల్లంలో నీరు ఎక్కువగా, ఎత్తిన ప్రాంతాలలో నేల సరిగా తడవదు. తోట మొత్తం సమానంగా నీరు ఇస్తే నేలలో నీరు ఎక్కువగా ఆవిరి అవుతుంది. అప్పుడు కలుపు సమస్య కూడా ఎక్కువవుతుంది.
2. మడి పద్ధతి : తోటను చిన్న మళ్ళుగా విభజించి ఒక్కొక్క మడిని వరుసగా తడుపుతారు. ఒక్కో మడిలో 4-6 చెట్లు ఉంటాయి. దీని వలన నీరు చాలా వరకు వృధా జరగదు.
3. బేసిన్ పద్ధతి : ప్రతి చెట్టూ చుట్టూ గుండ్రంగా లేదా చదరంగా గట్టువేసి లోపలి భాగాన్ని చదును చేస్తారు. చెట్టు మొదల నుండి గట్టువరకు ఏటవాలు ఉండేటట్లు చేయటం వలన నీరు నేరుగా చెట్టు మొదలకు వస్తుంది. ఈ పద్ధతిలో నీటి కాలువలు చెట్ల వరుసల మధ్య చేసి, చిన్న కాలువ ద్వారా చెట్టుకు నీరు పారిస్తారు. చెట్టు పెరిగే కొద్ది నీటి పళ్లెం పరిమాణం పెంచాలి. పూర్తిగా ఎదిగిన చెట్టుకు కనీసం 5-6 అడుగుల వరకు నీటి పళ్లెం తయారు చేయాలి. ఈ పద్ధతిలో నీరు ఎక్కువ మొత్తంలో ఆదా అవుతుంది. చెట్టు మొదలలో శిలీంధ్ర సమస్య తగ్గును, కలుపు సమస్య కూడా తగ్గుతుంది.
4. చాళ్ళ పద్ధతి (ఫర్రో పద్ధతి) : చెట్ల వరుసల మధ్య నాగలితో 15-20 సెంటి మీటర్ల లోతుతో చాళ్ళు ఏర్పాటు చేసి నీరు పారించాలి. చిన్న చెట్లకు ఒక చళ్ళు ఉంటే సరిపోతుంది. ఎదిగిన చెట్లకు చాళ్ల సంఖ్య పెంచాలి. చాళ్ళలో నీరు కొన్ని గంటల వరకు నిలిచేలా నీరు ఇవ్వాలి. ఈ పద్ధతిలో నీరు ఆదా అయి కలుపు పెరుగుదల తక్కువ ఉంటుంది. ఈ పద్ధతి బరువైన నల్ల రేగడి నేలలకు అనుకూలం. ఇసుక నేలలకు పనికిరాదు.
5. డబుల్ రింగు పద్ధతి : బేసిస్ పద్ధతిలో ఒక గట్టు చెట్టుకు దూరంలో ఏర్పాటు చేస్తే, ఈ పద్ధతిలో చెట్టుకు అరడుగు దూరంలో ఇంకో గట్టు రింగు మాదిరిగా మట్టితో వేయాలి. అంటే రెండరింగుల మధ్య ఉన్న ఖాళీలో నీరు పారించి నిలిచేలా చేస్తారు. నీరు చెట్టు మొదలకు అస్సలు తాకదు. నిమ్మ, నారింజ, బత్తాయి తోటలలో ఈ పద్ధతిని తప్పనిసరిగా పాటించాలి. లేకుంటే గమ్మోసిస్ తెగులు ఆశిస్తుంది. ఈ పద్ధతి బేసిన్ పద్ధతికంటే మంచిది. నీరు ఆదా ఎక్కువ, కలుపు సమస్య తక్కువ ఉంటుంది.
6. బిందు నీటి సేద్యం: ఈ పద్ధతిలో రంద్రాలున్న పైపులను నేలలోపల 30-40 మీటర్ల లోతులో లేదా నేలపై కాని అమర్చి పైప్ ద్వారా నీరు పారిస్తారు. అయితే నీరు ఇవ్వటానికి నీటి ట్యాంకు ఎత్తైన ప్రదేశాలలో ఏర్పాటు చేయాలి. గురుత్వాకర్షణ బిందు లేదా సరయిన నీటి ఒత్తిడిని కల్గించి నీరు పారేలా చేయాలి. అవసరమైనంత నీరు పంటకి లేదా తోటకి పారించి, నీరు ఇవ్వడం ఆపి వేయాలి. ఈ పద్ధతిలో 60-75% నీరు ఆదా అవుతుంది. అధిక పి. హెచ్ వున్నా నీటిని కూడా సరిగా వాడుకోవచ్చు. కలుపు సమస్య తక్కువ, ఈ పద్ధతిలో నీటి ద్వారానే మొక్కకు కావాల్సిన పోషకాలు కూడా అందచేయవచ్చు. దీనిలో ముఖ్య సమస్య మొదట్లో పెట్టుబడి ఎక్కువ, పొలంలో ఎలుకల నుండి పైపులను రక్షించుకోవాలి..
7. తుంపర్ల సేద్యం (స్ప్రింక్లర్ ఇరిగేషన్) : ఎత్తైన ప్రదేశంలో నీటి ట్యాంకులను ఏర్పాటు చేసి, లేదా ఒత్తిడితో నీటిని సన్నటి ప్లాస్టిక్ పైపుల ద్వారా వర్షపు జల్లుగా నీరు మొక్కలపై పడేలా స్ప్రింక్లర్ ద్వారా విడుదల చేయాలి. పంటను, నేల స్వభావం, ఋతువులను బట్టి స్ప్రింక్లర్ నంబరు మారుతూ ఉంటుంది.
Also Read: Different Types of Water Soil: నేలలో ఉండే నీళ్లు ఎన్ని రకాలు ఉంటాయి?
ఈ పద్ధతిలో నీటి పారుదల వల్ల వచ్చే లాభాలు :
1. ఎత్తు పల్లాలు లేకుండా పొలం అంతా సమానంగా నీరు అందించవచ్చు.
2. నీటి వృధా తక్కువ.
3. కూలి ఖర్చులు తక్కువ.
4. వేసవిలో సాయంత్రం వేళలో మొక్కలకు తగినంత చల్లదనం కల్గిస్తాయి.
నష్టాలు:
1. మొదట్లో పెట్టుబడి ఎక్కువ
2. నీటి ఆవిరి ద్వారా నీటి నష్టం ఎక్కువ.
3. ఎండ తీవ్రత సమయంలో నీరు ఇవ్వడం వలన చీడపీడలు/ఆకు మచ్చలు ఆశించటం ఎక్కువవుతుంది.
4. పూత సమయంలో నీరు చల్లటం ద్వారా పరాగసంపర్యం సరిగా జరుగక పూత రాలును/ పిందె పట్టడం తగ్గుతంది. పూత సమయంలో మొక్కలపై నీరు చల్లరాదు. బాగా ఎండ ఉన్నప్పుడు కూడా నీరు చల్లరాదు.
8. మట్టి కుండలు పాతి నీరు ఇవ్వడం : ఈ పద్ధతి ఇరిగేషన్ వంటిదే కానీ తక్కువ ఖర్చుతో దీనిని ఏర్పాటు చేసుకోవచ్చు. చెట్టుకు రెండు వైపులా కావలసిన సంఖ్యలో కుండలను 15-20 లీ. నీరు ఉండే కుండలు భూమిలో పాతాలి. పాత్రలోనికి ముందు, కుండ అడుగు భాగంలో 3-5 సన్నని రంధ్రాలు చేయాలి. దానికి నూలు వస్త్రంతో చేసిన వత్తిని ఈ రంధ్రంలో దూర్చి , తర్వాత కుండను మూతి మాత్రం నేలపై కనిపించేలా నేలలో పాతాలి. కుండను నీటితో నింపి, మట్టి మూకుడుతో మూయాలి. కుండలో నీరు తగ్గిపోయినప్పుడు మళ్ళీ నింపుతూ ఉండాలి. నీరు తక్కువ ఉన్న రైతులు ఈ పద్దతి పాటించటం ద్వారా నీరు ఆదా చేసుకోవచ్చు. ఈ పద్ధతి పాటించటం ద్వారా నీరు ఆదా చేసుకోవచ్చు. ఈ పద్ధతి పండ్ల చెట్లకే కాక, దొండ, కాకర, సొర, దోస వంటి పాదులకు కూడా వాడుకోవచ్చు.
Also Read: Soil Acid Neutralizer: నేలల్లో రకాలు, యాసిడిక్, క్షారత్వపు నేలలను న్యూట్రల్ నేలలుగా మార్చడం ఎలా?