చీడపీడల యాజమాన్యం

Biological Pest Control: జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా హానికారక పురుగుల నివారణ.!

2
Biological Pest Control
Biological Pest Control Insects

Biological Pest Control: ప్రకృతిలోని పరాన్నజీవులు, బదనికలు మరియు కొన్ని రకాల వైరల్‌, బాక్టీరియల్‌, ఫంగల్‌ వ్యాధులు పంటలపై వచ్చే చీడపురుగులను ఆశించి వాటిని అదుపులో ఉంచటంలో తమ వంతు పాత్రను నిర్వర్తిస్తూ ఉంటాయి. ఇటువంటి సహజ శత్రువులను సస్యరక్షణలో ఒక అంశంగా వినియోగించుకొంటూ చీడపీడల ఉదృతిని తగ్గించుకోవటాన్ని జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా సస్యరక్షణ చేసుకోవటం అని చెప్పవచ్చు.

పరాన్న జీవులనుపయోగించి చీడపురుగులను నియంత్రించటం :

. ప్రతి పురుగు జీవిత చరిత్ర, గ్రుడ్డుదశ, గొంగళి పురుగు దశ, కోశస్థదశ (నిద్రావస్థ దశ) మరియు రెక్కల పురుగుదశ నాలుగు దశలలో పూర్తి అవుతుంది.

. చీడపురుగు యొక్క గ్రుడ్ల మీద పరాన్న జీవుల దాడి వలన గొంగళి పురుగు దశ రాకుండ నాశనమై, అందులోనుండి పరాన్న జీవులు ఉత్పత్తి అవుతాయి. వీటిని గ్రుడ్డు పరాన్నజీవులుగా వ్యవహరిస్తారు.

. గ్రుడ్డు దశను నశింపచేసే పరాన్న జీవుల్లో ముఖ్యమైనది ట్రైకోగ్రామా గ్రుడ్డు పరాన్నజీవి, ఇది వివిధ రకాల పంటలలో పలురకాల పురుగులపై గ్రుడ్డు దశలో ఆశించి వాటిని నాశనం చేస్తుంది.

. ట్రైకోకార్డు’లుగా వ్యవహరించబడే పరాన్న జీవులు ఆశించిన గ్రుడ్ల కార్డులను రైతు సోదరులు పంట పొలాలలో ఆకు అడుగు భాగంలో అమర్చుకొన్నట్లయితే, ఆశించిన ఫలితాలను పొందవచ్చు.
పరాన్నజీవులను రైతులు తమంత తాము కూడా ఈ క్రింది విధానం ద్వారా పెంపొందించుకోవచ్చు.

. ‘‘టైకోగ్రామా ఖిలోనిస్‌’’ పరాన్నజీవి గుడ్లను ట్రైకోకార్డుల రూపంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, అనకాపల్లిలోని బయోలాజికల్‌ కంట్రోల్‌ లేబోరేటరీ వారు ఉత్పత్తి చేసి రైతులకు సరఫరా చేస్తున్నారు.

. బాగా ఎండిన మొక్కజొన్నలు లేదా జొన్నలు మరపట్టించి పిండిని ఆరబెట్టాలి. ప్రత్యేకంగా తయారుచేయబడిన చెక్క డబ్బాలు లేక ప్లాస్టిక్‌ బేసిన్లో ఆరపెట్టిన పిండిని వేయాలి.

. బియ్యపు పురుగు గ్రుడ్లను పిండి మీద జల్లి మూతపెట్టాలి. గాలి సోకటానికి వీలుగా రంధ్రాలుండే మూతలను డబ్బాలను మూయటానికి వాడాలి. ప్లాస్టిక్‌ బేసిన్‌ అయితే పల్చటి గుడ్డను మూతగా ఉపయోగించాలి.

. సుమారు 40 రోజుల తరువాత వీటి నుండి దక్కల పురుగులు బయటకు రావటం మొదలవుతుంది. ప్రతి రోజు ఈ పురుగులను సేకరించి గ్రుడ్లను పెట్టటానికి జల్లెడ అమర్చిన గరాటునందు వేయాలి.

. తల్లి పురుగులు పెట్టిన గ్రుడ్లను తీసికొని శుభ్రంచేసి, సన్నటి అల్లెడ ద్వారా జల్లించి వాలుగా ఉన్న పేపరు పైన క్రిందకు జారవిడిచి ఆ విధంగా వచ్చే మంచి గుడ్లను వేరు చేయాలి.

. ఈ గ్రుడ్లలో కొన్నిటిని పరాన్న జీవులను పెంచటానికి, మరికొన్నిటిని పిండిపురుగులను పెంచటానికి ఉపయోగించాలి. గ్రుడ్లను జిగురు రాసిన కార్డు (15 I 5 సెం.మీ.) ల పైన చల్లి అతికించి ఆరిన తరువాత గాజు గొట్టాల్లో ఉంచాలి.

. ట్రైకోగ్రామ్మా పరాన్న జీవులను ఈ కార్డున్న గాజు గొట్టాల్లో వదిలి దూది బిరడాతో మూయాలి. పరాన్న జీవులకు ఆహారంగా తేనెను గాజు కాగితంపైన బొట్లు బొట్లుగా ఉంచి గాజు గొట్టాల్లో ఉంచాలి.

. ఒక రోజు తరువాత గ్రుడ్లున్న కార్డును తీసి వేరొక గాజు గొట్టంలో ఉంచి దూది బిరడాతో మూయాలి. నాల్గవ రోజునకు పరాన్నజీవి గల గ్రుడ్లు నలుపు రంగును మారతాయి. 8`9 రోజుల్లో ఈ ట్రైకోకార్డుల నుండి ట్రైకోగ్రామా పురుగులు బయటకు వస్తాయి.

. ఈ పరాన్నజీవిని పంట పొలాల్లో వాడుకోవాలి అనుకొన్నప్పుడు రెండు రోజులు ముందు అనగా 7వ రోజున ట్రెకోకార్డును చిన్నచిన్న ముక్కలుగా చేసి పంట పొలాల్లో 5 మీటర్లకు ఒకటి చొప్పున ఆకు అడుగు భాగాన పిన్‌ చేయాలి. ట్రైకోగ్రామా పరాన్న జీవులు మరుసటి రోజునే బయటకు వచ్చి హానికారక పురుగుల గ్రుడ్లను వెతికి ఆశించి నాశనం చేస్తాయి.

. వరిపైరు నాటిన 20 రోజుల నుంచి పైరును పరిశీలిస్తూ ఉండాలి. కాండం తొలుచు పురుగు గుడ్లను ఆకు చివర్లలో, ఆకుముడత పురుగు గుడ్లు ఆకు ఈనె వెంబడి ఉంటాయి. అకులమీద గుడ్లు లేదా పైరులో రెక్కల పురుగులు కనిపించిన వెంటనే పరాన్నజీవి గ్రుడ్లను పైరులో వదలాలి. వరిలో చీడపురుగుల నివారణకు ఎకరానికి 40 వేల ట్రైకోగ్రామా గ్రుడ్లు కావాలి. ఒక్కో టైకోకార్డు మీద 20 వేల గ్రుడ్లు ఉంటాయి. రెండు ట్రైకోకార్డులను 16 చిన్నముక్కలుగా చేసుకొని ఆకుల అడుగు భాగాన ఎండ ప్రత్యక్షంగా పడకుండా పిన్నింగ్‌ చేయాలి.

ఈ విధంగా అమర్చిన 2-3 రోజుల్లో ట్రైకోకార్డుల్లోని గ్రుడ్ల నుండి ట్రైకోగ్రామా పరాన్నజీవులు బయటకు వస్తాయి. ఇవి పైరుకు హాని కలిగించే పురుగుల గ్రుడ్లను వెదికి వాటి నుండి రసం పీల్చి చంపివేసి, పరాన్నజీవులు అభివృద్ధి చెందుతాయి. ఈ విధంగా ట్రైకోగ్రామా కార్డులను వారం పది రోజుల వ్యవధిలో 3 నుండి 6 సార్లు పొలంలో వరి నాటిన 30 రోజుల నుండి 60 రోజుల మధ్య కాలంలో వరి పొలంలో అమర్చినట్లయితే కాండం తొలుచు పురుగు, ఆకుముడత పురుగు పూర్తిగా నివారించవచ్చు. వరిలో కాండం తొలుచు పురుగు నివారణకు జపానికము, ఆకుముడత పురుగు నివారణకు ట్రైకోగ్రామా ఖిలోనిస్‌ను ఉపయోగించాలి.

. మొక్కజొన్న పంటనాశించు కాండం తొలుచు పురుగు నివారణకు ట్రైకోగ్రామా కార్డులను విత్తిన 15 రోజుల నుండి ఎకరం పొలంలో 40 వేల ట్రైకోగ్రామా ఖిలోనిస్‌ పరాన్నజీవి గ్రుడ్లను వారం పది రోజుల వ్యవధిలో 3 సార్లు పెట్టినట్లయితే కాండం తొలుచు పురుగును నివారించవచ్చు.

. మొక్కజొన్నను ఇటీవల ఆశించిన కత్తెర పురుగు నివారణకు ట్రైకోగ్రామా ఫ్రీటియోసం పరాన్నజీవిని ఎకరానికి 50 వేల గ్రుడ్లను మొక్కజొన్న విత్తిన 15 రోజుల నుండి రెండు సార్లు 16 రోజుల వ్యవధిలో వదలాలి.

. చెరకు పంటలో పీకపురుగు, కాండం తొలుచు పురుగులను ట్రైకోగ్రామా ఖిలోనిస్‌ పరాన్నజీవి సమర్థవంతంగా నివారిస్తుంది. చెట్లు నాటిన నెల రోజుల నుండి 7-10 రోజుల వ్యవధిలో 6-8 సార్లు ఎకరాకు 20 వేల ట్రైకోగ్రామా ఖిలోనిస్‌ పరాన్నజీవులను వదలాలి, చెరకు పంటలో కాండం తొలుచు పురుగు నివారణకు చెరకు నాటిన 120 రోజుల నుండి 2-4 సార్లు ఎకరాకు 20 వేల ట్రైకోగ్రామా ఖిలోనిస్‌ పరాన్న జీవులను 7-10 రోజుల వ్యవధిలో వదలాలి. అధిక ఉష్ణోగ్రతలు నమోదైన నెలలలో (ఏప్రిల్‌-జూన్‌) ట్రైకోగ్రామా ఖిలోనిస్‌ అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే పరాన్న జీవులను చెరకు పంటలో ఎకరాకు 20 వేల పరాన్న జీవులను 8 సార్లు, 7-10 రోజుల వ్యవధిలో చెరకు నాటిన 30 రోజుల నుండి మరియు 4 సార్లు, కణుపులు ఏర్పడే దశలో వదలాలి.

. ప్రత్తి పంటల మీద వచ్చే శనగపచ్చ పురుగు, గులాబీ రంగు కాయ తొలుచు పురుగులను ట్రైకోగ్రామా ఖిలోనిస్‌ గుడ్డు పరాన్న జీవులను ఎకరానికి 60 వేలు చొప్పున విత్తిన 45 రోజుల నుండి 7-10 రోజుల వ్యవధిలో 4 నుండి 6 సార్లు పెట్టి పూర్తిగా నివారించుకోవచ్చు. వేరుశనగ పంట నాశించు ఆకుముడత పురుగును ట్రైకోగ్రామా ఖిలోనిస్‌ పరాన్న జీవులు 20 వేలు ఉన్న ట్రెకోకార్డును విత్తిన 30 రోజుల నుండి 7-10 రోజుల వ్యవధిలో 3 నుండి 6 సార్లు పెట్టి నివారించవచ్చు,

. టమాట, వంగ, బెండ మొదలైన కూరగాయ పంటల మీద వచ్చే కాండం తొలుచు పురుగు, కాయ తొలుచు పురుగు, శనగపచ్చ పురుగులను 20 వేల గ్రుడ్లు ఉన్న ట్రైకోకార్డును ఎకరానికి చొప్పున పూత సమయం నుండి 7-10 రోజుల వ్యవధిలో 3 నుండి 6 సార్లు పెట్టి పూర్తిగా నివారించవచ్చు.

బాక్టీరియాలను ఉపయోగించి చీడపురుగులను నియంత్రించటం:

. చీడపురుగు బ్యాక్టీరియాను నోటి ద్వారా తీసుకున్నప్పుడు మాత్రమే రోగానికి గురి అవుతుంది. బ్యాక్టీరియా చీడపురుగు శరీరంలోనికి ప్రవేశించినప్పటి నుండి 7 గంటలలోపు రోగలక్షణాలు కనబడతాయి. పురుగు పక్షవాతానికి గురి అవుతుంది. శరీరం మెత్తగా మారి ఎండిపోతుంది. శరీరం లోపల ద్రవం నల్లగా మారి చెడువాసన వస్తుంది. ఒక్కోసారి శరీరంలోని ద్రవం పాల మాదిరి బయటకు వస్తుంది.

. బాసిల్లస్‌ తురిన్‌ జెనిసిస్‌ (బీ.టీ.) అనే బాక్టీరియా మందులు ద్రవ రూపంలోను, పొడి రూపంలోను డైపెల్‌, బయోలెప్‌, బయెబిట్‌, అగ్రీ, హాల్ట్‌, బయోఆస్క్‌, డెల్ఫిన్‌ అనే వివిధ పేర్లతో లభ్యమవుతున్నాయి. వీటిని ఎకరాకు 400 గ్రాములు లేదా 400 మి.లీ. లీటరు మందును 200 లీటర్ల నీటిలో కలిపి (2 మి.లీ./లీటరు), 2-3 సార్లు సాయంత్రపు వేళలో పిచికారీ చేస్తే, చీడపురుగులు వ్యాధికి గురై చనిపోతాయి.

. ప్రత్తి, కంది, శనగ, కూరగాయల మీద వచ్చే శనగపచ్చ పురుగు, పొగాకు లద్దెపురుగు కత్తెర పురుగులను వీటి వాడకం ద్వారా నివారించవచ్చు. మొక్కజొన్న నాశించు కత్తెర పురుగును కూడా బీ.టీ.వి (ఐ.సి.ఎ.ఆర్‌.-ఎస్‌.బి.ఎ.ఐ.ఆర్‌., బి.టి.జి.) పిచికారి చేసి నియంత్రించవచ్చు.

శిలీంధ్రాలను ఉపయోగించి చీడపురుగులను నియంత్రించుట:

. శిలీంధ్రాలు పురుగు శరీరంపై దాడి చేసి లోపలికి ప్రవేశిస్తాయి. శిలీంధ్రపు రకాన్ని బట్టి పురుగు శరీరంపై తెలుపు, నలుపు లేదా రంగులలో బూజు పదార్ధం ఏర్పడుతుంది. ఈ శిలీంధ్రపు బూజు పురుగు శరీరం లోపల బయటా కూడా ఏర్పడుతుంది. దీని వలన పురుగు శరీరం గట్టిగా అవుతుంది. శిలీంధ్రాలలో ఫంగస్‌ వ్యాధి. కలుగజేసే మందులు కొన్ని పొడి రూపంలో లభ్యమవుతున్నాయి.

. మెటారైజియమ్‌ ఎనైసోపియాను ఉపయోగించి వేరుశనగ, చెరకు వంటి పంటల నాశించే వేరుపురుగు, కొబ్బరినాశించు ముక్కు పురుగును నివారించవచ్చును. అంతేకాకుండా వివిధ పంటలు నాశించు చెదలు నియంత్రణకు జీవకీటక నాశనిలు ఉత్తమ సాధనం.

. మెటారైజియమ్‌ ఎనైసోస్లియానుపయోగించి కొబ్బరిపై వచ్చే ముక్కుపురుగు (రైనోసరస్‌), వేరుశనగపై వచ్చే వేరుపురుగును నివారించవచ్చు.

. బెవేరియా బాసియానా వరి మరియు ప్రత్తి పంటలలో రసం పీల్చు పురుగుల కోసం, వర్జిసిలీనియం ద్రాక్షలో పిండి పురుగులను నివారించుకోవటానికి వాడుకోవచ్చు. మోటారైజియమ్‌ ఎనైసోఫియా (ఐ.సి.ఎ.ఆర్‌.ఎస్‌.బి.ఎ.ఐ.ఆర్‌., ఎమ్‌.ఎ. 35) మరియు బెవేరియా బాసియానా (ఐ.సి.ఎ.ఆర్‌.ఎన్‌.బి.ఎ.ఐ.ఆర్‌., బి.బి. 45)ను ఉపయోగించి మొక్కజొన్న పంటలో కత్తెరపురుగును నివారించవచ్చు.

. ఈ ఫంగస్‌ వ్యాధి కలుగ చేసే జీవరసాయనాలు సాధారణంగా పొడి రూపంలో లభ్యమవుతాయి. వీటిని వాడుకుంటూ పురుగు ఉధృతిని తగ్గించుకోవటానికి 5 గ్రా. లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి, 2-3 సార్లు చేసుకోవాలి.

. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, అనకాపల్లిలో బయోలాజికల్‌ కంట్రోలు లేబొరేటరీ వారు మెటారైజియమ్‌ ఎనైసోప్లియే మరియు బెవేరియ బేసియానా కల్చర్ను ఉత్పత్తి చేసి, రైతులకు సరఫరా చేస్తున్నారు.

. 1 కిలో మెటారైజియమ్‌ ఎనైసోషియే (ఐ.సి.ఎ.ఆర్‌.ఎన్‌.బి.ఎ.బి.ఆర్‌. ఎమ్‌. ఎ. 4) కల్చర్ను 100 కిలోల పశువుల ఎరువులో, కలుపుకొని ఎకరం పొలంలో చెరకు నాటే సమయంలో లేదా తొలకరి వర్షాలు పడినప్పుడు కాలువల్లో వేయుట వలన వేరు పురుగును, చెదలను నివారించవచ్చు.

. వేరుశనగను ఆశించు వేరు పురుగు నివారణకు విత్తే సమయంలో ఒక ఎకరా పొలంకి 4 కిలోల మెటారైజియమ్‌ ఎనైసోసియే కల్చర్ను 100 కిలోల పశువుల ఎరువుతో కలుపుకొని వేయాలి, చెరకు, వేరుశనగ పంటల నాశించు వేరు పురుగును పూర్తిగా నివారించవచ్చు.

. కొబ్బరిని ఆశించే సర్పిలాకార తెల్లదోమ నివారణకు, ఎంటమోఫాథోజెనిక్‌ శిలీంధ్రం, ఐసోరియ ప్యూమోసోరోసే (1ఐ10 స్పోర్సు/మి.లీ.) 5 గ్రా. లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చేసి నివారించవచ్చు.

Also Read: భూసార పరీక్ష కొరకు మట్టి నమూనా సేకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

Biological Pest Control

Biological Pest Control

వైరస్‌ని ఉపయోగించి చీడపురుగులను నియంత్రించటం :
శనగపచ్చ పురుగు, ఆముదం మీద వచ్చే నామాల పురుగు, లద్దె పురుగు, కత్తెర పురుగులను నివారించటానికి న్యూక్లియర్‌ పాలిహెడ్రోసిస్‌ వైరస్‌ ద్రావణాన్ని ఉపయోగిస్తున్నారు.

న్యూక్లియార్‌ హెడ్రోసిస్‌ వైరస్‌ (ఎన్‌.పి.వి.) ద్రావణ తయారీ :
దీనిని రెండు విధాలుగా తయారు చేసుకోవచ్చు.
1. శాస్త్రీయంగా ఎక్కువ మోతాదులో తయారుచేయటం,
2. రైతులు స్వయంగా తయారు చేసుకోవటం.

1. శాస్త్రీయంగా ఎన్‌.పి.వి. ద్రావణ తయారీ :

. ఎన్‌.పి.వి. ద్రావణం తయారు చేయటానికి 7-8 రోజుల వయస్సుగల పొగాకు లద్దెపురుగు లేక 5-7 రోజుల వయస్సుగల శనగపచ్చ పురుగు లార్వాలను ఎన్నుకొని వాటిని 8 గంటల పాటు ఆహారం లేకుండా ఉంచాలి.

. పొగాకు లద్దెపురుగు లార్వాలకు వైరస్‌ వ్యాధి సోకించుటకు ఆముదం ఆకులను ఎస్‌.పి.వి. ద్రావణంలో 15-20 నిమిషాలు ముంచి ఆకులు ఆరాక వాటిని ఒక 4-5 లోతైన, 12 వెడల్పాటి, ప్లాస్టిక్‌ పాత్రలో ఉంచి 50`70 లార్వాలను ఆకులపై వదలాలి.

. శనగపచ్చ పురుగు లార్వాలకు వ్యాధిసోకించేందుకు మూడవ దశకు చేరిన లార్వాలను విడివిడిగా చిన్న ఖాళీ సీసాల్లో వుంచాలి. వాటికి నీటిలో నానిన శనగ గింజలను వైరస్‌ ద్రావణంలో ముంచి రోజుకు ఒకటి లేదా రెండు గింజలను ఆహారంగా ఇవ్వాలి. వైరస్‌ కలిగిన ఆహారాన్ని లార్వాలకు రెండురోజులు పెట్టి ఆ తరువాత వైరస్‌ లేని ఆహారాన్నివ్వాలి. వైరస్‌ కలిగిన ఆహారం తిన్న 4 లేక 5 రోజులకు లార్వాలకు వైరస్‌ వ్యాధి సోకి 7 లేక 8. రోజులకు చనిపోవటం జరుగుతుంది.

. ఈ విధంగా వ్యాధి సోకి చనిపోయిన 200 లార్వాలను మంచి నీరుగల పాత్రలో వేసి వారం రోజులపాటు ఉంచాలి. ఈ విధంగా చేయటంవలన వైరస్‌ సోకిన లార్వాలు కుళ్ళి పాత్ర అడుగుభాగానికి చేరుతాయి. వైరస్‌ కణాలు ఉన్న ద్రావకాన్ని మిక్సీలో వేసి రెండు మూడు నిమిషాలు త్రిప్పి వడపోయాలి. ఈ విధంగా వడకట్టిన ద్రావణానికి మంచినీరు కలిపి 7 రోజులు చల్లని ప్రదేశంలో నిల్వ వుంచాలి. ఆ తరువాత పైన తేలిన తెట్టును తీసివేసి అడుగుభాగంలో వున్న చిక్కటి పదార్థానికి మరి కొంచెం మంచి నీటిని కలిపి 500 ఆర్‌.పి.ఎం. వద్ద 5 నిమిషాలపాటు సెంట్రీప్యూజ్‌ చేయాలి.

. పైన తేలిన తేటను వేరే గాజు గొట్టంలోకి మార్చి దానిని సెంట్రీఫ్యూజ్లో వుంచి 2500 ఆర్‌.పి.ఎమ్‌. వద్ద 15-20 నిమిషాలపాటు సెంట్రీఫ్యూజ్‌ చేసి గొట్టం అడుగుభాగాన చేరిన వైరస్‌ను తీసుకొని గాజుసీసాల్లో నింపి ఫ్రిజ్లో భద్రపరచుకొని పైరుపై పురుగు కనిపించినప్పుడు ఈ ద్రావకాన్ని తగిన మోతాదులో నీరు కలుపుకుంటూ ఉపయోగించాలి.

2. రైతులు స్వయంగా తయారు చేసుకోవటం :

. రైతులు పొలంలో వైరస్‌ వ్యాధి సోకి తలక్రిందులుగా వేలాదుతున్న శనగపచ్చ పురుగు మరియు పొగాకు లద్దె పురుగు లార్వాలను సేకరించుకోవాలి. ఈ లార్వాలను ఒక పాత్రలోనికి తీసుకొని మంచి నీళ్ళు కలిపి మెత్తగా నూరి ద్రావణం తయారు చేసి పలుచని గుడ్డు ద్వారా వడపోయాలి.

. 200 వ్యాధిసోకిన పురుగుల నుండి వచ్చిన ద్రావణానికి 200 లీ. నీటిని 1 కిలో బెల్లం మరియు 100 మి.లీ. టీపాల్‌ లేదా రాబిన్‌ బ్లూ, చేర్చి ఎకరం పొలంలో పిచికారీ చేయాలి. టీఫాల్‌ లేదా రాబిస్తూ అందుబాటులో లేని పరిస్థితులలో తేలికపాటి సబ్బు ద్రావణాన్ని కూడా ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు.

. పైరులో అమర్చిన లింగాకర్షక బుట్టలోనికి 8-10 రెక్కల పురుగులు ఆకర్షించబడిన రెండు వారంలో గాని లేక పైరుపై పురుగు గ్రుడ్లను గమనించటం జరిగిన వారం రోజుల్లో వైరస్‌ ద్రావణాన్ని పైరుపై పిచికారి చేయాలి.

ఎన్‌.పి.వి. వ్యాధి సోకిన లార్వా లక్షణాలు :

. ఎన్‌.పి.వి. వ్యాధి సోకిన పురుగులు మెత్తబడి నల్లగా మారతాయి. పురుగు శరీర అడుగుభాగం గులాబీ రంగులోకి మారుతుంది. ఇవి మొక్కల పై భాగానికి పాకి పై నుండి క్రిందకు వేలాడుతూ చనిపోతాయి లేదా ఆకుల మీద నల్లగా కరుచుకు పోయినట్లుంటాయి.

. వ్యాధిసోకిన పురుగు చర్మాన్ని తాకినట్లయితే వదులుగా వుండి చర్మం పగిలి శరీరం నుండి తెల్లని ద్రవం బయటకొస్తుంది.

ఎన్‌.పి.వి. ద్రావణం ఉపయోగించే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు:

. ఎన్‌.పి.వి. ద్రావణాన్ని మొక్క అంతటా సమంగా తడిచేట్లు పిచికారీ చేయాలి. పిచికారీ చేసేప్పుడు మధ్యమధ్యలో ద్రావణాన్ని కర్రతో బాగా కలపాలి. సాయంత్రం వేళలో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మాత్రమే పిచికారీ చేయాలి.

. సూర్యరశ్మిగల సమయంలో పిచికారి చేసినట్లయితే సూర్యరశ్మిలో ఉన్న అతి నీలలోహిత కిరణాలు వైరస్‌ సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. ఎన్‌.పి.వి. ద్రావణం పిచికారీ చేసే ముందు మాత్రమే నీటితో కలిపి తయారు చేసుకోవాలి. నిల్వ వుంచిన ద్రావణాన్ని పిచికారీ చేస్తే వైరస్‌ సామర్థ్యం తగ్గుతుంది. అవసరాన్ని బట్టి 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకోవచ్చు.

కీటకనాశని నులి పురుగులు (ఈ.పి.ఎస్‌.) :
. కీటకాలను ఆశించే నులిపురుగులను కూడా జీవ రసాయనాలుగా సస్యరక్షణలో వినియోగించవచ్చు. హెటిరోరాబ్జయిటిస్‌, స్టీనర్సీమా వంటి నులి పురుగులు కీటక నాశనులుగా హానికర పురుగుల ఉధృతిని తగ్గించడంలో ఉపయోగపడతాయని పరిశోధనల్లో తేలింది.

. ఈ కీటక నాశన సులిపురుగులను రైతాంగానికి అందుబాటులోకి ఐ.సి.ఎ.ఆర్‌. – ఎన్‌.బి.ఎ.ఐ.ఆర్‌., బెంగుళూరు వారు ఉత్పత్తి చేస్తున్నారు మరియు మార్కెట్లో లభ్యమవుతున్నాయి.

. కీటక నాశక నులిపురుగులైన హెటిరోరాబ్జయిటిస్‌ ఇండికాను 5 కిలోల పొడి మందును 60 కిలోల తడి ఇసుకలో కలిపి ఎకరం పొలంలో చెరుకు నాటిన సమయంలో గాని, తొలకరి వర్షాలు పడిన వెంటనే గాని సాళ్లలో వేసుకున్నట్లయితే వేరుపురుగును పూర్తిగా నివారించవచ్చు.

. కీటక, నాశని నులిపురుగులైన హెటిరోరాక్టయిటిస్‌ ఇండికా (ఐ.సి.ఏ.ఆర్‌. ఎన్‌.బి.ఎ.ఐ.ఆర్‌, ఎమ్‌.ఎ.35) ను 4 కిలోలు/ 200 లీటర్ల నీటిలో కలిపి మొక్కజొన్నను ఆశించు కత్తెరపురుగును అరికట్టవచ్చు..

. పైన చెప్పుకొన్న ఈ పరాన్న జీవులు మరియు జీవ రసాయనాలు రైతు సోదరులకు లభ్యం చేయాలన్న ఉద్దేశ్యంతో వ్యవసాయ శాఖ అధ్వర్యంలో 20 జీవనియంత్రణ ఉత్పత్తి కేంద్రాలు నెలకొల్పబడ్డాయి. ఇవి ఇబ్రహీంపట్నం (విజయవాడ), గుంటూరు, కాకినాడ, నిడదవోలు, ఒంగోలు, నెల్లూరు, నంద్యాల, కడప, అనంతపూర్‌, విజయనగరం మరియు విశాఖపట్నం పట్టణాల్లో నెలకొల్పబడి ఆయా ప్రాంత రైతులకు జీవనియంత్రణ ఉత్పత్తులను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు విక్రయిస్తున్నాయి.

. ఆచార్య ఎన్‌.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క జీవనియంత్రణ ప్రయోగశాల, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, అనకాపల్లి నుండి ఈ కేంద్రాలకు సాంకేతికపరంగా సలహాలందిస్తూ జీవనియంత్రణ సాధనాలు ఉత్పత్తి చేయటానికి అవసరమైన ఇనాక్యులమ్‌ కల్చరు (మూల పదార్థాలు) ప్రతి పంటకాలంలో అందిస్తూ జీవనియంత్రణ పద్ధతుల ప్రాచుర్యానికి దోహదం చేస్తున్నది.

జీవ నియంత్రణ పద్ధతుల వినియోగంలో జాగ్రత్తలు :

1. ట్రైకోగ్రామా గ్రుద్దు పరాన్న జీవిని పొలంలో వదిలే ముందు నష్టపరిచే పురుగు గ్రుడ్డు దశలో ఉన్నదీ, లేనిదీ గమనించి వదలాలి.

2. లింగాకర్షక బుట్టలు 3-5/ ఎకరానికి చొప్పున అమర్చి నష్టపరిచే పురుగు యొక్క తల్లి పురుగుల ఉనికిని గమనించి ట్రైకోకార్డులను పొలంలో విడుదల చేయాలి..

3. ట్రైకోకార్డులను అమర్చడానికి ముందుగాని, 15 రోజుల వరకు గాని పురుగు మందులను పొలంలో పిచికారి చేయాలి

4. వివిధ పంటలలో సస్యరక్షణకు సిఫారసు చేసిన మోతాదు ప్రకారం తగిన సమయ వ్యవధులలో ట్రైకోకార్డులను విడుదల చేయాలి.

5. సాయంత్రం సమయమున కోకార్డును ఆకు క్రింది భాగంలో అమర్చాలి. (స్టేప్లర్‌ పిన్ను చేయాలి)

6. జీవ నియంత్రణ ఉత్పత్తుల నాణ్యత పరంగా మరియు పర్యావరణ పరంగా రసాయనిక పురుగు మందుల కంటే శ్రేయమైనప్పటికీి వీటి నిల్వ ఉండే సామర్ధ్యం తక్కువని చెప్పుకోవాలి. ఒక్క వైరస్‌ ద్రావకం తప్పించి మిగిలిన జీవ రసాయనాలన్నీ 6 నెలలు నుంచి అధికారికంగా 1 సంవత్సరం కంటే ఎక్కువ నిల్వ ఉండవు. కాబట్టి కొనుగోలు చేసేటప్పుడు గాని వాడుకొనేటప్పుడు గాని వాటి నిల్వ ఉంచే తేదీని పరిశీలించుకొని జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.
పైన తెలిపిన జీవనియంత్రణ సాధనాలే కాకుండా పొగాకు కషాయం, వేపగింజల కషాయాలు మరియు కొన్ని రకాల వృక్షసంబంధిత కషాయాల ద్వారా కూడా చీడపీడలను నివారించుకోవచ్చు.

పొగాకు కషాయం తయారీ :
పొగాకు కషాయం తయారు చేయుటకుగాను 500 గ్రాముల పొగాకును 4-5 లీటర్ల నీటిలో 24 గంటలు నానబెట్టాలి. 320 గ్రాముల బార్‌ సబ్బు పొడిని వేరే పాత్రలో కలియబెట్టి తయారు చేసుకున్న పొగాకు కషాయానికి కలపాలి. ఈ ద్రావణాన్ని 6-7 రెట్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు.

వేపగింజల కషాయం తయారీ :
వేపగింజలను తీసుకొని, పొడిగా చేసి, కిలో పొడిని పలుచని గుడ్డ సంచిలో పోసి, మూతిని కట్టి 20 లీటర్ల నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఇలా నానబెట్టిన సంచిని వీలైనన్నిసార్లు గట్టిగా పిండాలి. అలా చేయటం వలన పొడిలో వున్న అజాడిరెక్టిన్‌ మూలపదార్ధం కషాయంలోకి బాగా వస్తుంది. ఈ విధంగా 5% వేపగింజల కషాయం తయారవుతుంది. ఈ ద్రావణానికి 20 గ్రా. సబ్బుపొడి కలిపి బాగా కరిగించాలి. ఈ కలిపిన కషాయాన్ని పలుచని గుడ్డ ద్వారా వడపోయాలి. లేనట్లయితే కషాయంలో వుండిపోయిన పదార్థాలు స్పేయర్‌ నాజిల్లో చిక్కుకొని పిచికారీకి అంతరాయం కలుగుతుంది. ఈ విధంగా అవసరమైనంత ద్రావణాన్ని తయారు చేసుకొని పిచికారీ చేయవచ్చు.

జీవనియంత్రణ పద్ధతులను పాటించటంవలన వాతావరణ కాలుష్యం తగ్గటం, పర్యావరణ సమతుల్యత పెరగటమే కాకుండా అవశేషరహిత ఉత్పత్తులను సాధించి, ప్రపంచ వాణిజ్య రంగంలో మనదేశ ఉత్పత్తులకు మంచి ధర పలికేటట్లు చూసుకోవచ్చు.

Also Read: మిరప నారుమళ్లు – తీసుకోవలసిన జాగ్రత్తలు.!

Leave Your Comments

Soil Testing Sample: భూసార పరీక్ష కొరకు మట్టి నమూనా సేకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

Previous article

Golden Rice: గోల్డెన్‌ రైస్‌ ప్రాముఖ్యత.!

Next article

You may also like