ఉద్యానశోభ

Plant Protection Measures in Jasmine : మల్లెలో సస్యరక్షణా చర్యలు

0

డా. ఎస్‌. మానస (శాస్త్రవేత్త-ఉద్యాన విభాగం),
డా. ఎ. వీరయ్య (ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌),
డా. వి. శిల్పకళ (శాస్త్రవేత్త-సస్యరక్షణ విభాగం),
డా. స్వామి చైతన్య (వాతావరణ విభాగం) కృషి విజ్ఞాన కేంద్రం, ఊటుకూరు

రాష్ట్రంలో 6,996 హెక్టార్లలో సాగు చేయబడుతూ 41,976 టన్నుల దిగుబడినిచ్చే మల్లె, 12-15 సంవత్సరాలు కాపు ఇచ్చే బహువార్షిక పంట. వేసవిలో మల్లెకు అధిక డిమాండ్‌ ఉంటుంది. మల్లెలను విడి పూలుగా, అలంకరణలో, ఇంట్లో పెరిగే మొక్కగా, మరియు కట్‌ ఫ్లవర్స్‌ కోసం విస్తృతంగా సాగు చేస్తారు. కాస్మటిక్స్‌, పెర్ఫ్యూమ్‌ పరిశ్రమ వంటి పారిశ్రామిక అవసరాల కోసం మల్లెను వాణిజ్యపరంగా పండిస్తారు. ఇది వివాహాలు, మతపరమైన వేడుకలు మరియు పండుగల సందర్భాలలో అధికంగా ఉపయోగించబడుతుంది. దేవాలయాల ప్రవేశ ద్వారాల చుట్టూ, ప్రధాన రహదారులపై మరియు ప్రధాన వ్యాపార ప్రాంతాలలో విరివిగా వీటిని ఉపయోగిస్తారు.
పురుగులు :
మొగ్గ తొలుచు పురుగు, ఎర్ర నల్లి, వికసించే మొగ్గ యొక్క మిడ్జ్‌, ఆకు ముడత పురుగులు మల్లె తోటను ఆశిస్తాయి కాని మొగ్గ తొలుచు పురుగు మరియు వికసించే మొగ్గ యొక్క మిడ్జ్‌ ప్రధాన ఆర్థిక ప్రాముఖ్యతను పొందుతాయి, ఎందుకంటే అవి మొగ్గలకు అధిక నష్టాన్ని కలిగిస్తాయి.
మొగ్గతొలుచు పురుగు :
మల్లెలో ప్రధాన సమస్య. పురుగు యొక్క లార్వా, పువ్వు / మొగ్గల్లోనికి చొచ్చుకొనిపోయి పూల భాగాలను తినివేస్తూ తీవ్రదశలో మొగ్గలన్నింటిని ఒక దగ్గరికి చేర్చి ముడుచుకుపోయేటట్లు చేస్తుంది. చిన్న గొంగళి పురుగులు పువ్వు మొగ్గపై రంధ్రాలు చేస్తుంది, మొగ్గ యొక్క అంతర్గత భాగాల్ని తిని వేస్తుంది. పువ్వు యొక్క ఆకర్షక పత్రావళి పై వృత్తాకార రంధ్రం ఉద్భవించి, సొరంగాలు ఇతర మొగ్గల్లోకి వెళ్లేలా చేస్తుంది. పువ్వులు వైలెట్‌ రంగులో మారి రాలి పడిపోతాయి. వీటి కోశస్త దశ నేలలో ఉంటుంది. నివారణకుగాను వేప నూనె 5 మి.లీ./ లీ. లేదా బి.టి. 2 మి.లీ. / లీ. లేదా కొరాజెన్‌ 0.3 మి.లీ./ లీ లేదా ఫురక్రోన్‌ 2 మి.లీ./ లీ. లేదా మలాథియాన్‌ లేక క్వినాల్‌ ఫాస్‌ లీటరు నీటికి 2 మి.లీ. మందును కలిపి చెట్లపై పిచికారీ చేయాలి. ఎకరాకు 5 హెలీల్యూర్‌ లింగాకర్షక బుట్టలను అక్కడక్కడా ఏర్పాటు చేసుకోవాలి.


ఆకు గూడు పురుగు, తుట్టె పురుగులను కూడా ఇవే విధానాలను వాడి నియంత్రించుకోవచ్చు. దీంతో పాటుగా బ్రహ్మాస్త్రం లేదా ఆవుపేడ, మూత్రం, ఇంగువ కలిపిన ద్రావణాన్ని కూడా ఉపయోగించవచ్చు.
మొగ్గ ఈగ :
నీడ ఎక్కువగా ఉండే తేలికపాటి భూముల్లో ఈ సమస్య ఎక్కువ. పిల్ల పురుగులు మొగ్గ అడుగుభాగంలో చేరి నష్టపరుస్తాయి. పురుగు ఆశించిన మొగ్గలు ఎరుపు, నీలం రంగులోకి మారి, ఆకృతి కోల్పోయి, రాలిపోతాయి. ఎకరాకు 1 దీపపు ఎరను వాడుకోవడం, ఎండోసల్ఫాన్‌ లేదా మలాథియాన్‌ 2 మి.లీ/లీ. పిచికారీ చేసుకోవాలి.

Also read: కోళ్ల ఫారం ఏర్పాటుకు రూ.50 లక్షలు ఇస్తున్న కేంద్రం.!

ఎర్ర నల్లి :
ఈ పురుగు ఉధృతి పొడి వాతావరణంలో ఎక్కువగా ఉంటుంది. పురుగులు ఆకు, మొగ్గల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం వలన ఆకులు, మొగ్గలు పసుపు రంగుకు మారి రాలిపోతాయి. నివారణకుగాను ప్రోపార్గైట్‌ 1.5 మి.లీ./లీ. లేదా వావిలాకు కషాయం లేదా గంధకపు పొడిని ఎకరాకు 8-10 కిలోల చొప్పున చల్లుకోవాలి.
తామర పురుగు :
ఆకు అడుగుభాగంలో గుంపులుగా చేరి, ఆకులతో పాటు మొగ్గల రసం పీలుస్తాయి. మొగ్గల రంగు మారిపోయి, ఎండి రాలిపోతాయి. ఫిప్రోనిల్‌ 2 మీ.లీ./లీ. కలిపి ఆకు అడుగుభాగం తడిచేలా పిచికారీ చేసుకోవాలి.
ఆకు మచ్చ తెగులు :
ఆగస్టు నుంచి నవంబరు వరకు, ముఖ్యంగా వర్షాలుపడే సమయంలో ఈ తెగులును ఎక్కువగా గమనించవచ్చు. తెగులు ఆశించిన ఆకులచివరిభాగం ముడుచుకుపోయి గిడసబారి పోతుంది. ఆకుపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. తీవ్రదశలో కొమ్మలపై విస్తరించి 50 శాతం వరకు దిగుబడి తగ్గుతుంది. దీని నివారణకు కాపర్‌ ఆక్సీ క్లోరైడ్‌/మాంకోజెబ్‌3 గ్రా./లీ. లేదా కార్బండిజమ్‌ 1గ్రా./లీ. నెల రోజుల వ్యవధితో మార్చి మార్చి పిచికారీ చేసుకోవాలి.
ఎండు తెగులు :
తెగులు తొలిదశలో మొక్క క్రింద భాగం ఆకులు ఎండిపోతాయి. అటు పిమ్మట పైభాగాన వున్న ఆకులు కూడా ఎండి రాలిపోతాయి. తీవ్ర దశలో మొక్కంతా ఎండి చనిపోతుంది. మొక్కవేర్లు నల్లగా మారి ఉంటాయి. గుండుమల్లెలో ఎక్కువగా కనిపించే ఈ తెగులు నివారణకు మొక్కల చుట్టూ కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ 3 గ్రా. / బావిస్టిన్‌ 1 గ్రా. లీటరు నీటిలో కలిపి భూమిని తడపాలి. మొక్క నీటి ఎద్దడికి గురికాకుండా తగిన మోతాదులో నీటి తడులను ఇవ్వాలి.
ఫిల్లోడి :
తెల్ల దోమ ద్వారా వ్యాపించే ఈ వైరస్‌ సోకిన మొక్కల ఆకులు చిన్నగా మారిపోయి, పొదలాగా అవుతుంది. పూలు ఆకుపచ్చ రంగులో ఉండి, పూర్తిగా విచ్చుకోవు. నివారణకు టెట్రాసైక్లిన్‌ హైడ్రోక్లోరైడ్‌ 1 గ్రా. 4 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆరోగ్యకరమైన కొమ్మ కత్తిరింపులు లేదా అంట్లను మాత్రమే నాటుకోవాలి.

Leave Your Comments

Sugarcane Coating – Pros and Cons : చెరకులో పూత – అనుకూల, ప్రతికూల అంశాలు

Previous article

Damages due to excessive use of urea in crops : పంటల్లో అధిక మోతాదులో యురియా వాడడం వల్ల కలిగే నష్టాలు

Next article

You may also like