ఉద్యానశోభ

Chrysanthemum Cultivation: చామంతి సాగులో మెళకువలు

2
Chrysanthemum
Chrysanthemum

Chrysanthemum Cultivation: తెలుగురాష్ట్రాలలో సాగు చేసే పూల పంటల్లో ముఖ్యమైనది చామంతి. ఈ పూలను వివిధ రకాల పూజా కార్యక్రమాలకు, పండుగలు, శుభకార్యాలలో అలంకరణలకు, దండలు, బొకేల తయారికీ మరియు కట్‌ ఫ్లవర్‌గా ఉపయోగిస్తుంటారు. చామంతి శీతాకాలపు పంట. ఆరుబయట పెంచే చామంతి సెప్టెంబర్‌ చివరి నుండి మార్చి మాసం వరకు లభ్యమవుతుంది. సాగులో ఉన్న చామంతి రకాలను నక్షత్ర చామంతి (చిట్టి చామంతి), పట్నం చామంతి (మద్యస్థపూలు) మరియు పెద్ద సైజు పూలు కలిగినవిగా విభజించవచ్చు.

రకాలు :
చామంతి వివిధ రకాల ఆకారాలు, రంగులలో లభ్యమవుతాయి. మన రాష్ట్రంలో ముఖ్యంగా సాగయ్యేవి తెలుపు, పసుపు మరియు ఎరుపు రకాలు.

Chrysanthemum Flowers

Chrysanthemum Flowers

తెలుపు రకాలు :
అర్క చంద్రిక, అర్క చంద్రకాంత్‌, పూర్ణిమ, డాలర్‌ వైట్‌, బగ్గి, రత్తాం సెలక్షన్‌, చందమామ వైట్‌, బాల్‌ వైట్‌, సుగంధ వైట్‌, పేపర్‌ వైట్‌, క్రీమ్‌ వైట్‌, రాజా వైట్‌, స్టార్‌ వైట్‌.

Chamanti Cultivation

Chamanti Cultivation

పసుపు రకాలు :
అర్క ఎల్లో గోల్డ్‌, కో-వన్‌, రాయచూర్‌ బసంతి, పూనం, సుగంధ ఎల్లో, బాల్‌ ఎల్లో, సెంట్‌ ఎల్లో, ఎన్‌ బి ఆర్‌ ఐ ఇండియానా, గౌరీ, అర్కా స్వర్ణ.

Chrysanthemum Flower Varieties

Chrysanthemum Flower Varieties

ఎరుపు రకాలు : రెడ్‌ గోల్డ్‌, కో-2, పంజాబ్‌ గోల్డ్‌, అగ్నిశిక

తెలంగాణలో చామంతి సాగు విధానం...

Red – Chrysanthemum

గులాబీ రకాలు : పంకజ్‌, నీలిమ, ఆర్కా పింక్‌ స్టార్‌

Chrysanthemum Flower

Chrysanthemum Flower

చామంతి మొక్కల ప్రవర్ధనం : శాఖీయకొమ్మ కత్తిరింపులు మరియు పిలకల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. పూలకోతలు పూర్తయిన తర్వాత ఫిబ్రవరి-మార్చి నెలలనందు మొక్కల నుండి పిలకలను కత్తిరించి నారుమడిలో నాటుకోవాలి.

కొమ్మ కత్తిరింపులు :
ఏపుగా పెరుగుతున్న కొమ్మలను 10 సెం .మీ పొడవు ఉండేలా కత్తిరించి నేరుగా లేదా కొమ్మలను 50 పిపియం ఇండోల్‌ బ్యూటరిక్‌ ఆమ్లం (ఏ.బి.ఐ) ద్రావణంలో ముంచి నారు మడులలో గాని, కోకోపీట్‌ నింపిన ప్రోట్రేలలో కాని నాటుకోవాలి.
కొమ్మలనుండి వేర్లు రావడానికి 15-20 రోజుల సమయం పడుతుంది. పిలకల ద్వారా కన్నా కొమ్మల ద్వారా ప్రవర్ధనం చేసిన మొక్కలు త్వరగా పెరిగి పూల దిగుబడి ఎక్కువగా వుంటుంది.

నేలలు :
సేంద్రియం పదార్థం అధికంగా ఉండే ఒండ్రు నేలలు మరియు ఎర్రగరపనేలలు అత్యంత అనుకూలం. నల్లరేగడి నేలల్లో తేమ ఎక్కువగా ఉన్నట్లైతే వేరుకుల్లు అధికంగా ఆశించే అవకాశం ఉంటుంది. ఉదజని సూచిక 6-7 మధ్య ఉండాలి. మురుగు నీటి పారుదల సరిగా లేనిచో మొక్కలు చనిపోతాయి.

వాతావరణం:
చామంతి పూలు పూసేటప్పుడు తక్కువ ఉష్ణోగ్రతలు మరియు తేమ ఎక్కువగా ఉండే వాతావరణం అనుకూలం చామంతి శీతాకాలపు పంట, పగటి సమయం తక్కువగా మరియు రాత్రి సమయం ఎక్కువగా ఉండే కాలంలో మాత్రమే పుష్పిస్తాయి. పగటి సమయం ఎక్కువగా ఉన్నప్పుడు చామంతి మొక్కలు శాఖీయంగా మాత్రమే పెరుగుతాయి.

నాటే సమయం :
జూన్‌, జూలై నుండి ఆగస్టు వరకు నాటుకోవచ్చు. మార్కెట్‌ను, పండుగల సీజన్ను దృష్టిలో ఉంచుకొని ఒకేసారి నాటుకోకుండా 15-20 రోజుల వ్యవధిలో రెండు – మూడు దఫాలుగా నాటితే పూలను ఎక్కువకాలం పొందే అవకాశం ఉంటుంది.

నాటే దూరం : చిన్న పూల రకాలైన నక్షత్ర చామంతి 30I30 సెం.మీ. దూరంలో నాటుకోవాలి. ఇవి ఎకరాకు 40,000 నుండి 45,000 మొక్కలు అవసరమవుతాయి.
పెద్ద పూల రకాలను 90I60 సెం.మీ లేదా 90I75 సెం.మీ దూరంలో నాటుకోవాలి. ఇవి ఎకరాకు 6,000 నుండి 7,000 మొక్కలు అవసరమవుతాయి.

Also Read: ఘనంగా జరిగిన రెండవ రోజు విస్తరణ విద్యా సంస్థ వజ్రోత్సవాలు.!

ఎరువుల యాజమాన్యం : ప్రధాన పొలంలో మొక్కలు నాటే ముందు 10 టన్నుల పశువుల ఎరువు, 60-80 కిలోల నత్రజని, 30-40 కిలోల భాస్వరం మరియు 60-80 కిలోల పొటాష్‌ నిచ్చే ఎరువులను వేసుకోవాలి. మొక్కుల ఎదుగుదల దశలో ప్రతి 20 రోజులకు ఒకసారి సూక్ష్మపోషక మిశ్రమాలను స్ప్రే చేసినట్లయితే దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. (లేదా) 0.25% జింక్‌ సల్ఫేట్‌ మెగ్నీషియం సల్ఫేట్ను పైపాటుగా పిచికారి చేయాలి.

నీటియాజమాన్యం :
వాతావరణాన్ని బట్టి నేల తీరును బట్టి ఇవ్వాలి. మొదటి నెలలో వారానికి 2-3 సార్లు వారానికొక సారి నీటి తడి ఇవ్వాలి.

తలలు తుంచడం (పించింగ్‌) :
నారు నాటిన నాలుగు వారాల తర్వాత చామంతి మొక్కల తలలు తుంచివేయాలి.

పొడవైన పూల కాడతో పూలు పొందాలనుకొన్న మొక్కరు ఈ కత్తిరింపు సరిపోతుంది. విడి పూలు మాత్రం సేకరించాలనుకొంటే పక్క కొమ్మలను మళ్ళీ కత్తిరిస్తే ఒక్కో మొక్కకు 20 – 30 పూలు పొందవచ్చు. ఒకవేళ శీతాకాలం ఆరంభంలోనే పూలను సేకరిస్తే మొక్కలను వెనుకకు కత్తిరించి ఎరువులు వేసుకొంటే 30 రోజులలో మొక్కలు మళ్ళీ పెరిగి పూతకొస్తాయి.

ఊతమివ్వడం :
చామంతి మొక్కలు పూలు పూసేటప్పుడు బరువుకి వంగి పోకుండా వెదురు కర్రలను అక్కడక్కడా పాతి జి.ఐ వైర్‌తో మొక్కలకు ఇరువైపుల కట్టుకోవాలి. దీనివల్ల మొక్కలు వంగిపోకుండా ఉండడమే కాకుండా, గాలి వెలుతురు సక్రమంగా ప్రసరిస్తుంది మరియు చీడపీడల ఉధృతి కూడా తగ్గుతుంది.

హారోన్ల వాడకం :
100 పీపీయం (100 మిగ్రా లీటరు నీటిలో) నాఫ్తలిన్‌ ఎసిటిక్‌ ఆమ్లాన్ని మొగ్గదశ కంటే ముందుగా పిచికారి చేసినచో పూతను కొంత ఆలస్యం చేయవచ్చు. 100-150 పిపియం జిబ్బరిల్లిక్‌ ఆమ్లాన్ని పిచికారి చేస్తే 15-20 రోజుల్లో త్వరగా పూతకు వస్తుంది.

సస్యరక్షణ :
పచ్చ పురుగు మరియు పొగాకు లద్దెపురుగు :
ఈ గొంగళి పురుగులు ఆకులను, పువ్వులను మరియు మొగ్గలను ఆశించి తీవ్రంగా నష్టపరుస్తాయి.
నివారణ : థయోడికార్బ్‌1 గ్రా. లేదా క్లోరాంట్రానిలిపోల్‌ 0.3 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

తామర పురుగులు :
ఇవి ఆకులు కాండం పైన గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీల్చివేయడం వలన ఆకులు ముడతలు పడి ఎండిపోతాయి పూలు కూడా వాడిపోయి రాలిపోతాయి.
నివారణ : స్పైనోసాడ్‌ 0.25 మి.లీ. నీటికి లేదా ఫిప్రోనిల్‌ 2 మి.లీ. నీటికి కలిపి పిచికారి చేయాలి.

పేను బంక :
ఈ పురుగుల యొక్క అన్ని దశలు పుష్పాల్ని మరియు మొగ్గల్ని ఆశించి తీవ్రంగా నష్ట పరుస్తాయి.
నివారణ : ఎసిటామిప్రిడ్‌ 0.15-0.2 గ్రా. లేదా పైరిప్రాక్సిఫెన్‌ 1.5 లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

తెగుళ్లు :

ఆకు మచ్చ తెగులు : నల్లటి లోతైన గుండ్రటి మచ్చలు ఆరులపైన. ఏర్పడటం వలన ఆకులు ఎండిపోయి రాలిపోతాయి.
నివారణ : క్లోరోదాలోనిల్‌ 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మాంకోజెబ్‌ 2-2.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

Chrysanthemum Cultivation

Chrysanthemum Cultivation – Insects

వేరుకుళ్ళు తెగులు :
వర్షాలు అధికంగా ఉన్నప్పుడు ఈ తెగులు ఉదృతి ఎక్కువగా ఉంటుంది. మొక్కలు అకస్మాత్తుగా వడలిపోతాయి. ఆకులు ఎండిపోయి, రాలిపోతాయి.
నివారణ : కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ 3 గ్రా. లీటరు నీటికి కలిపి మొక్క మొదళ్ళ వద్ద పోయాలి. 2 కిలోల ట్రైకోడెర్మా విరిడిని 90 కిలోల పశువుల ఎరువు 10 కిలోల వేప పండితో కలుపుకొని శిలీంధ్రపు బూజు ఉత్పత్తి చెందిన తర్వాత ఆఖరి దుక్కిలో వేయాలి.

మొజాయిక్‌ తెగులు : ఆకుల ఈనెలు, ఆకుపచ్చగా ఉండి, ఈనెల మధ్య భాగం లేత పసుపుపచ్చ రంగులోకి మారి, చెట్లు తక్కువ ఎత్తులో పెరిగి పూలు సరిగా పూయవు.
నివారణ :
1. వైరస్‌ రహిత కొమ్మ కత్తిరింపుల ద్వారా తీసుకున్న నారుని మాత్రమే నాటుకోవాలి.
2. రసం పీల్చే పురుగుల ఉధృతి నుంచి పంటను కాపాడుకోవాలి
3. పొలంలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. ఇవి వ్యాధిని వ్యాప్తి చెందించే కీటకాలకు ఆవాసాలుగా ఉంటాయి. కావున ఎప్పటికప్పుడు కలుపును నివారించుకోవాలి.

తెల్ల తుప్పు తెగులు : ఈ తెగులు ఆశించిన మొక్కల ఎదుగుదల తక్కువగా ఉంటుంది. ఆకుల అడుగు భాగాన తెల్లటి ఉబ్బెత్తు మచ్చలు ఏర్పడతాయి.
నివారణ : అజాక్సిస్ట్రోబిన్‌ 1 మి. లీ. లేదా ట్రై ఫ్లాక్సీ స్ట్రోబిన్‌ G టెబ్యుకొనజోల్‌ 0.75 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

చామంతిలో అధిక దిగుబడులు సాధించుటకు పాటించవలసిన అంశాలు:
1. చామంతి సాగుకి ఎంచుకొనేనారు ఎటువంటి చీడపీడలకు గురికాని ఆరోగ్యవంతమైన 30-40 రోజుల వయసు కలిగిన నారుని ఉపయోగించుకోవాలి.
2. చామంతిని వేరే ఇతర పంటలతో పంట మార్పిడి చేసుకోవాలి. దీనివలన వేరు కుళ్ళు బారిన పడకుండా కాపాడుకొని అధిక దిగుబడిని పొందవచ్చు.
3. పించింగ్‌ మరియు లేత మొగ్గలను (డిస్‌ బడ్డింగ్‌ ) వంటి యాజమాన్య పద్ధతులను సకాలంలో చేపట్టి, ముఖ్యంగా పూత సమయంలో మొక్కలను నీటి ఎద్దడికి గురికానివ్వకుండా చూసుకోవాలి.
4. పూత సమయంలో పూల నాణ్యత, దిగుబడిని పెంచుటకు ఎరువులను ముఖ్యంగా పొటాష్‌ ఎరువులు మరియు సూక్ష్మధాతు మిశ్రమాలను మొక్కలకు అందించాలి.
5. మొక్క పెరుగుదలను బట్టి మొక్క పడిపోకుండా వెదురు కర్రలతో ఊతమివ్వాలి.

పూల కోత :
. జూన్‌ జూలైలో నాటిన మొక్కల నుండి 4-5 నెలలకు, పూలరకాలను బట్టి అనగా అక్టోబర్‌- నవంబర్‌లో పూలు కోసుకోవచ్చు. మొదటి కోత నుండి 45 నుండి 60 రోజుల వరకు పూల దిగుబడిని పొందవచ్చు. వారానికి 2-3 సార్లు చొప్పున కోసుకున్న 10-15 సార్లు పూలు కోయవచ్చు.
. పూలని సాయంత్రం లేదా ఉదయం పూట కోసి సంచులలో నింపి దూర ప్రాంతాలకు పంపవచ్చు.
. పూలను సంచులలో నింపేటప్పుడు నీళ్లు చల్ల రాదు
. పూల బుట్టలలో రవాణా చేసినట్లయితే 1-7 కిలోలు, గోనెసంచులలో 30-35 కిలోల వరకు పూలను రవాణా చేయవచ్చు.
దిగుబడి : ఎకరాకు 6-8 టన్నుల పూల దిగుబడిని పొందవచ్చు

సాగు ఖర్చు :
1. నేల తయారీ : 10,000
2. పశువుల ఎరువు: 15,000
3. నారు ఖర్చు : 16,000
4. డ్రిప్పు పరిచినారు నాటినందుకు : 2,500
5. ఎరువులు: 25,000
6. పురుగు మందులు మరియు ఇతర మందులు : 42,000
7. కోత ఖర్చులు: 48,000
8. దిగుబడి: 6 టన్నులు
9. స్థూల ఆదాయం : 3,60,000
10. మొత్తం ఖర్చు: 1,58,000
11.నికర ఆదాయం: 20,1500

Also Read: అమృతాన్ని తలపించే .. రాజానగరం సీతాఫలం.!

Leave Your Comments

Pest of Soybean and Rice: ప్రస్తుత పరిస్థితుల్లో సోయా చిక్కుడు, వరి పంటల్లో వచ్చే తెగుళ్లు.!

Previous article

Shoot And Fruit Borer in Brinjal: వంగలో కొమ్మ మరియు కాయ తొలుచు పురుగు యాజమాన్యం.!

Next article

You may also like