వ్యవసాయ పంటలు

Foxtail Millet Cultivation: కొర్ర సాగు మేలైన యాజమాన్య పద్దతులు.!

1
Foxtail Millet Cultivation
Foxtail Millet Cultivation

Foxtail Millet Cultivation: చిరుధాన్యపు పంటలలో కొర్ర ప్రధానమైనది మరియు నేటి జీవన శైలిలో పౌష్టికాహారంలో ముఖ్య పాత్రను పోషిస్తుంది. ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో వర్షాధార మెట్టసాగుకు అనుకూలమైన పంట. కొర్ర సాగు వల్ల రైతుకు ఆహార, పోషక మరియు ఆదాయ భద్రతతో పాటు పర్యావరణ సంరక్షణ మరియు వినియోగదారునికి ఆరోగ్య భద్రత కూడా సమకూరుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలు కొర్ర సాగు చేయడంలో ముందంజలో ఉన్నప్పటకీ సరాసరి సగటు దిగుబడి తక్కువగా ఉంది. కావున స్థానికంగా ఉపయోగిస్తున్న సాధారణ రకాలకు బదులుగా నూతన వంగడాలను మరియు మెట్టసాగులో మంచి మెళకువలు పాటిస్తే కొర్రలో అధిక దిగుబడులను మరియు నిఖర ఆదాయం పొందవచ్చు.

నేలలు :
తేలిక నుండి మధ్యరకం నేలలు బాగా అనుకూలమైనవి. మురుగు నీటి పారుదల సౌకర్యం గల నల్లరేగడి నేలలు కూడా అనుకూలం.
నేలల తయారీ : నేలను 2-3 సార్లు మెత్తగా దుక్కి చేసి చదును చేసుకొని విత్తటానికి నేలను సిద్ధం చేసుకోవాలి.

విత్తే సమయం : సాధారణంగా కొర్రను వర్షధారపు పంటగా జూన్‌, జూలై మాసంలో విత్తుకోవచ్చు. కాని ఖరీఫ్‌ వర్షాలు ఆలస్యంగా కురిసినప్పుడు కొర్ర ఒక ప్రత్యామ్నాయ పంటగా ఆగష్టు రెండవ పక్షంలో కూడా విత్తుకొని మంచి దిగుబడులు పొందవచ్చు. వేసవి పంటగా అయితే జనవరి మాసంలో విత్తుకోవచ్చు.

విత్తన మోతాదు :
సరాసరి ఒక ఎకరాకు వరుసల్లో నాటడానికి 2 కిలోల విత్తనము మరియు వెదజల్లుటకు 4-7 కిలోల విత్తనము సరిపోతుంది. విత్తనం చల్లిన తరువాత బల్లతోగాని, చెట్టుకొమ్మతోగాని, నేలను చదును చేయాలి. లేనిచో విత్తనానికి తగినంత తేమ లభించక మొలకశాతం తగ్గుతుంది.

విత్తన శుద్ధి :
కిలో విత్తనానికి 3 గ్రా. థైరామ్‌ లేదా మాంకోజెబ్‌ లేదా 2 గ్రా. ట్రైసైక్లోజోల్‌తో విత్తనశుద్ధి చేసుకొన్నట్లయితే విత్తనాల ద్వారా సంక్రమించే శిలీంద్రాలు రాకుండా కాపాడుకోవచ్చు మరియు లేత దశలో మొక్కలను తెగులు బారినుండి కాపాడుకోవచ్చు.

విత్తే పద్ధతి :
వరుసలకు మధ్య 22.5 సెం.మీ., మొక్కల మధ్య 7.5 సెం.మీ. దూరం ఉండేటట్లు సుమారు 2.0 సెం.మీ. లోతులో విత్తనం గొర్రుతో విత్తుకోవాలి. లోతులో పడిన విత్తనం మొలకెత్తకుండా కుళ్ళి చనిపోతుంది. అవసరం మేరకు విత్తిన రెండు వారాల లోపు ఒత్తు మొక్కలను తీసి, లేనిచోట నాటుకోవాలి. ఎకరాకు 2 లక్షల 37 వేల మొక్కలు ఉండేటట్లు చూసుకోవాలి.

Also Read: పనస పండు మరియు విత్తనాలతో విలువ ఆధారిత ఉత్పత్తులు

Foxtail Millet Cultivation

Foxtail Millet Cultivation

ఎరువులు :
ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు వేసి ఆఖరి దుక్కిలో కలియదున్నాలి. ఎకరానికి 50 కిలోల సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌ ఆఖరి దుక్కిలో వేయాలి. అలాగే 16 కిలోల యూరియాను విత్తనాలను విత్తే సమయంలో, 36 కిలోల యూరియాను 25-30 రోజుల తరువాత వేసినచో పంటకు కావలసిన నత్రజని, భాస్వరము అందుతాయి.

అంతర పంటలు :
కొర్ర : కంది / సోయాచిక్కుడు- 5:1, కొర్ర : వేరుశనగ – 2:1 నిష్పత్తి.

కలుపు నివారణ, అంతర కృషి :
విత్తిన రెండు వారాల లోపుగా ఒత్తు మొక్కలను తీసివేయాలి. విత్తిన 30 రోజుల వరకు పంట పొలంలో కలుపు మొక్కలు లేకుండా చూడాలి లేదా ఐసోప్రోటూరోన్‌ 400 గ్రాములను 200 లీటరు నీటికి కలిపి విత్తిన వెంటనే లేదా 2 రోజుల లోపల తడిపై పిచికారి చేయాలి.

నీటి యాజమాన్యం :
కొర్ర వర్షాధారపు పంట అయినప్పటికీ, బెట్ట సమయంలో / వేసవి సాగులో 2-3 తేలికపాటి తడులు ఇవ్వాలి, పంట పిలకలు వేసే దశలో (విత్తిన 30-35 రోజుల తరువాత) గింజ గట్టిపడే దశలో (విత్తిన 55-60 రోజులలో) నీటి తడి ఇచ్చినప్పుడు అధిక దిగుబడులు సాధించవచ్చు.

సస్యరక్షణ :
కాండం తొలుచు పురుగు : ఈ పురుగు కాండాన్ని తొలచటం వలన మొక్కలు సరిగా ఎదగక చనిపోతాయి. దీని నివారణకు కార్బోఫ్యూరాన్‌ 3 జి గుళికలు ఎకరానికి 8 కిలోలు చొప్పున నీటి తడి ముందు వేసినచో మంచి ఫలితం ఉంటుంది. లేదా థయోడికార్బ్‌ 1 గ్రా. లేదా క్లోరాంట్రినిలిప్రోల్‌ 18.5% ఎస్‌.సి. 0.3 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

ఆర్మీ వార్మ్‌ :
దీని లద్దె పురుగులు మొక్కలు పెరిగే దశలో ఆకులను, వెన్నులను కొరికి తినివేస్తాయి. దీని నివారణకు ఇమామెక్టిన్‌ బెంజోయేట్‌ 5% ఎస్‌.జి. 0.4 గ్రా. లేదా స్పైనోసాడ్‌ 45% ఎస్‌.సి. 0.3 మి.లీ. లేదా క్లోరాంట్రినిలిప్రోల్‌ 18.5% ఎస్‌.సి. 0.3 మి.లీ. లేదా సైనిటోరమ్‌ 11.7% ఎస్‌.సి. 0.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

తుప్పు తెగులు :
ఈ తెగులు ఒక రకమైన శిలీంధ్రం వలన కలుగుతుంది. ఆకుల రెండు వైపులా గోధుమ రంగు కలిగిన చిన్న, చిన్న ఉబ్బెత్తు మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు ఆకుతొడిమ మరియు కాండం మీద కూడా ఏర్పడతాయి. ఈ మచ్చలు ఎక్కువైన ఎడల ఆకులు ఎండిపోతాయి. దీని నివారణకు లీటరు నీటికి 2.5 గ్రా. మాంకోజెట్‌ కలిపి పైరు పై తెగులు కనిపించిన వెంటనే పిచికారి చేయాలి.

అగ్గి తెగులు :
ఎదిగిన మొక్కల ఆకులపై నూలు కండె ఆకారంలో మచ్చలు ఏర్పడతాయి, ఇవి ఆకులు అంతటా వ్యాపించి ఆకులు ఎండి రాలిపోతాయి. కంకి కాడపై మచ్చలు ఏర్పడినప్పుడు కాడ విరిగి, కంకిలో తాలు గింజలు ఏర్పడతాయి. దీని నివారణకు కాప్టాన్‌ లేక థైరామ్‌ (3 గ్రా./ కిలో విత్తనాలకు) కలిపి విత్తనశుద్ధి చేయాలి లీటరు. నీటికి కార్బెండిజమ్‌ 1 గ్రా. లేదా ట్రైసైక్లోజోల్‌ 0.6 గ్రా./లీటరు లేదా మాంకోజెబ్‌ 2.5 గ్రా. ఒక లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి.

వెర్రికంకి తెగులు :
తేమతో కూడిన వాతావరణంలో ఆకుల అడుగువైపున బూజులాంటి శిలీంధ్రం పెరుగుదల కనిపిస్తుంది. అట్టి ఆకులు ఎండి పీలికలుగా కనిపిస్తాయి. మొవ్వులోని ఆకులు సరిగా విచ్చుకోవు. మొక్క నుండి బయటకు వచ్చిన కంకులు గింజల ప్రదేశంలో ఆకుపచ్చని ఆకుల మాదిరిగా మారి కనిపిస్తాయి. దీని నివారణకు 3 గ్రా. థైరామ్‌ లేదా 3 గ్రా. కాప్టాన్‌ లేదా 3 గ్రా. మెటలాక్సిల్‌ కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేయాలి. మెటలాక్సిల్‌ 1 గ్రా. లేదా మాంకోజెబ్‌ 2.5 గ్రా. లీటరు నీటికి కలిపి పంటపై పిచికారి చేయాలి.

పంట కోత, నూర్పిడి మరియు నిల్వ చేయటం :
పంట కోతకు వచ్చినప్పుడు కంకులలోని గింజ క్రింది భాగమును గమనించినట్లయితే ఒక చిన్న చుక్క కనిపిస్తుంది. మొక్కలలోని అధిక భాగం ఆకులు పసుపు వర్ణంలోకి మారి ఎండిపోయినట్లు కనిపిస్తుంది. కంకులను కోసి వేసిన ఒక వారం తర్వాత ఎండు మొక్కలను లేదా కట్టెను కోసి కుప్ప వేసుకొని పశుగ్రాసంగా వాడుకోవచ్చు. పంట కోసిన తర్వాత కొర్ర కంకులను 4-5 రోజులు ఆరబెట్టి గింజలను కంకుల నుంచి నూర్పిడి చేసే యంత్రం ద్వారా లేదా కర్రలతో కొట్టి గాని లేదా పశువులు/ ట్రాక్టరు నడపడం ద్వారా గాని గింజలను వేరే చేస్తారు. తర్వాత తూర్పార పట్టి గింజలను, పొట్టు, దుమ్ము, మట్టి వంటివి లేకుండా శుభ్రపరచాలి. ఈవిధంగా వచ్చిన ధాన్యం దీర్ఘకాలికంగా (6 నెలలు పైగా) నిల్వ చేసుకోవాలంటే గింజలోని తేమను 13-14 శాతం వచ్చే వరకు ఎండబెట్టిన తర్వాత గోనె సంచులలో నిల్వ చేసుకోవాలి.

Also Read: వర్షాభావ పరిస్థితుల్లో వివిధ పంటల్లో చేపట్టవలసిన మేలైన యాజమాన్య పద్దతులు.!

Leave Your Comments

Jackfruit Based Value Added Products: పనస పండు మరియు విత్తనాలతో విలువ ఆధారిత ఉత్పత్తులు

Previous article

Milk Related Problems in Cattle: పశువుల్లో పాల సంబంధిత సమస్యలు మరియు చికిత్స

Next article

You may also like