వ్యవసాయ పంటలు

Cotton Cultivation: అధిక సాంద్రత పద్ధతిలో ప్రత్తి సాగు విధానం.!

2
Cotton Cultivation
Cotton Cultivation

Cotton Cultivation: ఈ సంవత్సరం ఋతుపవనాల రాక ఆలస్యమవడంతో ఆశించిన మేర వర్షాలు కురవట్లేదు. ఈ పరిస్థితులలో రైతు సోదరులు ప్రత్తి పంటను జూలై 20వ తేదీ వరకు విత్తుకోవచ్చు. సాధారణంగా తేలిక నేలల్లో 50-60 మి.మీ., బరువు నేలల్లో 60-75 మి.మీ. వర్షపాతము నమోదు అయిన తర్వాత మాత్రమే ప్రత్తిని విత్తుకోవాలి. లేదా నేల 15 సెంటీ మీటర్ల లోతు వరకు తడిసిన తర్వాత మంచి తేమలో ప్రత్తిని విత్తుకొంటే, భూమిలో వేడి తగ్గి, మొలక శాతం బాగుంటుంది.

అధిక సాంద్రత ప్రత్తి సాగు అనగా సాధారణ ప్రత్తి సాగుకు భిన్నంగా మొక్కల మధ్య మరియు వరుసల మధ్య దూరం తగ్గించి ఎకరాకు ఎక్కువ మొక్కలు వచ్చే విధంగా నాటుకోవడం. సాధారణ ప్రత్తి సాగులో వరుసల మధ్య 90 సెం.మీ. మొక్కల మద్య 60 సెం.మీ. (90I60) ఎడం పెట్టినప్పుడు ఎకరానాకి 7,407 మొక్కలు వస్తాయి అయితే అధిక సాంద్రత సాగులో వరుసల మధ్య 80 సెం.మీ., మొక్కల మధ్య 20 సెం.మీ. (80I20) లో విత్తినప్పుడు ఎకరాకు 25,000 మొక్కలు వస్తాయి.

అయితే రైతులు సాధారణ పద్ధతిలో వరుసల మధ్య విత్తే 90 సెం.మీ. అచ్చు మార్చకుండా అంతరకృషికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనుకున్నప్పుడు
. వరుసల మధ్య 90 సెం.మీ., మొక్కల మధ్య 15 సెం.మీ.తో (90I15) విత్తుకుంటే ఎకరాకు 29,629 మొక్కలు వస్తాయి (లేదా)
. వరుసల మద్య 90 సెం.మీ., మొక్కల మధ్య 20 సెం.మీ.తో (90I20) విత్తుకుంటే ఎకరాకు 22, 222 మొక్కలు వస్తాయి (లేదా)
. వరుసల మద్య 90 సెం.మీ., మొక్కల మధ్య 30 సెం.మీ.తో (90I30) విత్తుకుంటే ఎకరాకు 14,814 మొక్కలు వస్తాయి.

Also Read:  పండ్ల తోటల్లో చేపట్టవలసిన పనులు, సూచనలు.!

Cotton Crop

Cotton Crop

ఈ పద్ధతిలో విత్తన మోతాదు ఎకరానికి 3-5 కిలోలు అవసరం అవుతుంది. అయితే ఈ అధిక సాంద్రత ప్రత్తిసాగు వర్షాధార తేలిక నేలలు మరియు భూసారం తక్కువగా ఉండే చల్కా నేలలకు చాలా అనుకూలం ఇలాంటి నేలల్లో మొక్కలు ఎత్తు పెరుగవు. కాబట్టి మొక్కల సంఖ్యను పెంచుకొని దిగుబడి పెంచుకునే అవకాశం ఉంటుంది. అధిక సాంద్రత సాగులో మొక్కకు 8 నుండి 10 కాయలు వచ్చిన, మొక్కల సంఖ్య ఎక్కువగా ఉండటం వలన ఎకరానికి 10-12 క్వింటాళ్ళ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది.

పెరుగుదల నియంత్రణ మందుల వాడకం :
అధిక సాంద్రత సాగులో వర్షాలు అధికంగా వచ్చినప్పుడు మొక్క పెరగకుండా పెరుగుదల నియంత్రించే హార్మోన్‌ రసాయనిక మందులు పిచికారి చేసుకోవాలి. మొక్కల ఎత్తును నియంత్రించడం వలన కణువుల మద్య దూరం తగ్గి, మొక్క గుబురుగా, కాయల సైజు పెరిగే అవకాశం ఉంది. పెరుగుదల నియంత్రించడం వలన మొక్క నుండి ఏర్పడిన పూత అంతా కాయలుగా మారి ప్రత్తి త్వరగా ఒకేసారి తీతకు రావడం వలన పంటకాలం తగ్గుతుంది. పెరుగుదల నియంత్రణకు మెపిక్వాట్‌ క్లోరైడ్‌ ను పంటకాలం 40-45 రోజులప్పుడు (మొదటిసారి) మరియు 60-65 రోజులప్పుడు (రెండవసారి) 0.8 మి.లీ./లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

రసాయనిక ఎరువుల యాజమాన్యం :
ఎకరాకు 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాష్‌ అవసరం, ఈ పోషకాలను ఎరువుల మోతాదులో లెక్కించినప్పుడు 100 కిలోల యూరియా, 150 కిలోల సింగిల్‌ సూపర్‌ ఫాస్పేట్‌, 40 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ చేసుకోవాలి. ఎకరానికి 5 టన్నుల పశువుల ఎరువును చివరి దుక్కిలో వేసుకోవాలి.
ఎరువులు వేసుకునే సమయం చూసుకున్నట్లైతే సిఫారసు చేయబడిన భాస్వరం మొత్తాన్ని అంటే 150 కిలోల సింగిల్‌ సూపర్‌ ఫాస్పేట్‌ ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. సిఫారసు చేయబడిన నత్రజని మరియు పొటాష్‌ రెండు భాగాలుగా చేసుకొని 30- 35 రోజులకు, 70-75 రోజులకు పైపాటుగా వేసుకోవాలి. పైపాటుగా డి.ఎ.పి. (లేదా) 20-20- 20 లాంటి కాంప్లెక్స్‌ ఎరువులను వాడకూడదు.

లాభాలు :
– ప్రస్తుత పరిస్థితులలో ప్రత్తితీత ఖర్చులు పెరగడం వలన అధిక సాంద్రత ప్రతిసాగు యాంత్రీకరణకు అనుకూలం. ప్రత్తి ఏరే యంత్రం ద్వారా ఒకేసారి ప్రత్తి ఏరుకోవచ్చు.
– ఒకేసారి పూత, కాయలు రావడం వలన పంట తొందరగా చేతికి వస్తుంది. గులాబి రంగు పురుగు తాకిడి నుండి బయటపడుతుంది.
– డిసెంబర్‌ లో పంటను తీసేసి రెండవ పంటగా ఆరుతడి పంటలను సాగుచేసుకొని సుస్థిర దిగుబడులు పొందవచ్చును.

Also Read: రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయుటకు చేపట్టాల్సిన వ్యూహాత్మక చర్యలు.!

Leave Your Comments

Tasks for Fruit Orchards: పండ్ల తోటల్లో చేపట్టవలసిన పనులు, సూచనలు.!

Previous article

M.S. Swaminathan: స్వామినాథన్ కు భారతరత్న అవార్డు ఇవ్వాలి – మంత్రి

Next article

You may also like