వ్యవసాయ పంటలు

Inter-Crops with Cow-based Liquids: గో ఆధారిత ద్రవాలతో అంతర పంటల సాగు.!

1
Inter-Crops with Cow-based Liquids
Inter-Crops with Cow-based Liquids

Inter-Crops with Cow-based Liquids: పది ఎకరాల మెట్ట వ్యవసాయం. దానిలో సాగవుతున్నవన్నీ విలువైన పంటలే. ఏ పంటకూ రసాయన ఎరువుల వాడకం లేదు. క్రిమిసంహారక మందుల పిచికారీ అసలుండదు. సేంద్రియ ఆధారితమైన ఆ వ్యవసాయంలో కూలీల ఖర్చు కూడా చాలా తక్కువ. పండిన పంటను సేకరించుకోటానికి మాత్రమే కూలీలు అవసరం. బాల్యం నుంచి వ్యవసాయంలో పెరిగిన ఉప్పలపాటి చక్రపాణి, పదేళ్ల క్రితమే సేంద్రియ వ్యవసాయం ప్రారంభించారు. ప్రాథమిక దశలో సేంద్రియ వ్యవసాయంలో దిగుబడులు తగ్గుతాయన్న వాదన సరికాదని రుజువు చేస్తున్నారు.

చక్రపాణి జన్మస్థలం ప్రకాశం జిల్లా కోనంగి. వీరి తండ్రి ఆ గ్రామ మునసబుగా కొనసాగుతూ స్వంత వ్యవసాయం కొనసాగిస్తుండేవారు. చక్రపాణి చదువు కొనసాగిస్తూనే వ్యవసాయంపై మక్కువ పెంచుకొని, అరక దున్నటం ప్రారంభించారు. ఉద్యోగ అవకాశాలు అంది వచ్చినా వాటిని కాదని వ్యవసాయమే వృత్తిగా స్వీకరించారు. తన జన్మస్థలమైన ప్రాంతంలో నీటి వసతి తక్కువ. ఏడాది పొడవునా పంటలు పండిరచటానికి నీటివసతి వుండేది కాదు. పశ్చిమగోదావరి జిల్లా, పెదవేగి మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో 1977లో పది ఎకరాల మెట్టభూమిని కొనుగోలు చేసి, వ్యవసాయం ప్రారంభించారు. కొబ్బరి, నిమ్మ, కోకో లాంటి పంటలు సాగు ప్రారంభించారు.

ప్రారంభంలో మంచి దిగుబడులు సాధించినా ఆదాయం అంతంత మాత్రంగా వుండేది. పండిన పంటకు మంచి ధర లభించేది కాదు. వ్యవసాయంకు స్వస్తి చెప్పి, ఇతర వ్యాపకాల వైపు మళ్ళాలనుకుంటున్న సమయంలో సేంద్రియ వ్యవసాయం వెలుగులోకి వచ్చింది. 2010లో సేంద్రియ వ్యవసాయం ప్రారంభించారు. నాలుగు ఆవులను కొని గోఆధారిత వ్యవసాయం మొదలెట్టారు. ఆవుల మల, మూత్రాల ఆధారంగా పంచగవ్య, జీవామృతం లాంటివి తయారు చేయించి, వాటినే తన తోటలకు ఎరువుగా ఉపయోగించేవారు.

ఆవులు మలమూత్రాలు పైర్లు పెంచటానికి మాత్రమే పరిమితం కాలేదు. మంచి పాల దిగుబడినిస్తూ, పాల పోటీల్లో కూడా బహుమతులు అందుకుంటూ చక్రపాణి మంచి పశుపోషకుడుగా గుర్తింపు తెచ్చాయి. ఆవులు పెట్టిన కోడెదూడలు మంచి ధరకు అమ్ముడవుతూ ఆదాయం ఇచ్చేవి. ఆవుల మల మూత్రాలు ఎరువులుగా ఉపయోగపడటం, కోడెదూడల వల్ల మంచి ఆదాయం సమకూరటం, పాల పోటీల్లో బహుమతులు అందుకోవటం వంటి వల్ల చక్రపాణి మంచి పశుపోషకుడిగా గుర్తింపు పొందారు.

2010లో గోఆధారిత వ్యవసాయం ప్రారంభించి సాగు ఖర్చును గణనీయంగా తగ్గించుకున్నారు చక్రపాణి. గోఆధారిత లేదా సేంద్రియ సాగు వల్ల ప్రారంభంలో దిగుబడులు నామమాత్రంగా వుంటాయనే ప్రచారం ఆ రోజుల్లో జరిగేది. ఆ ప్రచారం నిజం కాదని నిరూపించే ప్రయత్నం చేశారు, ఫలితం సాధించారు. రసాయనాల వాడకం పూర్తిగా తగ్గించి, పంచగవ్య, జీవామృతం లాంటి వాటితోనే తోటలు పెంచుతు వర్మి కంపోస్టు (వానపాముల ఎరువు), ఆముదం పిండి, వేపపిండి లాంటివి రెండేళ్ళ పాటు వాడారు.

గోఆధారిత ద్రవాలు, వర్మి కంపోస్టు, ఆముదంపిండి, వేపపిండివి రెండేళ్లపాటు క్రమం తప్పకుండా వాడటం వల్ల, భూసారం పెరిగింది. చెట్ల పెరుగుదల, దిగుబడి ఆశాజనకంగా వుండటంతో, మూడవ ఏట నుంచి వాటి వాడకం ఆపేసి కేవలం పంచగవ్య, జీవామృతములకే పరిమితమయ్యారు. పశువుల ఎరువుల వల్ల భూములు సారవంతమవుతాయన్న విషయం నిజమైనా, కాలక్రమంలో పశుసంతతి తగ్గి, పశువుల ఎరువు కొరత ఏర్పడిరది. వీటిని అధిగమించటం కోసం ఆవులను పెంచటం ప్రారంభించారు. వాటి ద్వారా ఇతరత్రా ఆదాయం కూడా సమకూర్చుకుంటున్నారు.

Also Read: అధిక సాంద్రత పద్ధతిలో ప్రత్తి సాగు విధానం.!

Inter-Crops with Cow-based Liquids

Inter-Crops with Cow-based Liquids

నిమ్మ, కోకో తోట తొలగింపు:
కొబ్బరి, పామాయిల్‌లో అంతరపంటగా వున్న నిమ్మ, కోకోలను పూర్తిగా తొలగించారు. నిమ్మకాయల దిగుబడి ఆశాజనకంగా వున్నప్పటికీ వాటికి సరైన ధర వచ్చే వరకూ నిల్వ వుంచటం సాధ్యం కావటం లేదు. కొద్దిరోజులకే నిమ్మకాయలు కుళ్ళిపోతున్నాయి. అందువల్ల నిమ్మచెట్లను పూర్తిగా తీసేశారు. కోకో దిగుబడితో మంచి ధర కూడా లభిస్తుంది. ఇటీవలి కాలంలో కొబ్బరి, వక్క చెట్ల మధ్య మిరియం నాటారు. కోకో చెట్ల నీడ ఎక్కువై మంచి ధర పలికే మిరియం మొక్కలు పెరగటం కుంటుపడిరది. మిరియానికి మంచి ధర రావటమే కాక, సేంద్రియ విధానంలో పెరిగిన మిరియం కిలో 500 రూపాయలకు మించి ధర లభిస్తున్నందున మిరియం ఆదాయం బాగున్నందున కోకోను పూర్తిగా తొలగించి – కొబ్బరి, వక్క, పామాయిల్‌, అరటి లాంటి దీర్ఘకాలిక పంటలకే పరిమితం చేశారు. ఆరు ఎకరాల్లో కొబ్బరి, నాలుగు ఎకరాల్లో పామాయిల్‌ ప్రధాన పంటలుగా వుంచి, స్వల్పకాలిక అంతరపంటల సాగు చేయటానికి ఉపక్రమించారు చక్రపాణి.

స్వల్పకాలిక అంతరపంటలు :
కొబ్బరి తోటలో వక్కను అంతర పంటగా పెంచుతున్నారు. తొలిదశలో నాటిన వక్క చెట్లకు కాపు వచ్చాయి. పూర్తి స్థాయి దిగుబడి, ఆదాయం అంచనాకు రావటానికి ఇంకో ఏడాది పట్టవచ్చు. కొబ్బరి, వక్క చెట్ల మొదళ్ళలో మిరియం మొక్కలు నాటించారు. వాటి పెరుగుదల ఆశాజనకంగా వుండటమే కాక మంచి దిగుబడి నిస్తున్నాయి. మంచి ధర కూడా లభిస్తుంన్నందున తన అంతర పంటల ప్రయోగం సత్ఫలితాలను ఇస్తున్నాయని చెపుతున్నారు. పామాయిల్‌ తోటలో అరటి అంతరపంటగా నాటారు. ఇక అరటి విషయం ఆలోచించనక్కర్లేదు. ప్రతిరోజూ దానికి డిమాండ్‌.

పామాయిల్‌ వల్ల గాని, అరటి వల్ల గాని ఆదాయం రాదనే భయం లేదంటున్నారు. కొబ్బరి, వక్క చెట్ల మధ్య అల్లం, పసుపు లాంటి సుగంధ పంటలు నాటి పరిశీలన చేస్తున్నారు. అంతరపంటలుగా అల్లం, పసుపు నాటినా వాటి దిగుబడులు ఆశాజనకంగా వున్నాయంటున్నారు. అర ఎకరంలో నాటిన పసుపును అమ్మకం చేయకుండా విత్తనంగా వినియోగించుకుంటున్నారు. అంతరపంటగా దిగుబడినిచ్చిన అల్లంను ఉడకబెట్టి శొంఠిగా మార్చి అమ్మటం వల్ల మంచి ధర వచ్చినట్లు వివరిస్తున్నారు చక్రపాణి. ఇవి మాత్రమే కాకుండా వివిధ రకాల కూరగాయలు తన తోటల్లో పండిస్తూ అవకాశం వున్నంత వరకూ ఆదాయం సమకూర్చుకుంటున్నారు.

గోఆధారిత ద్రవాలు తయారీ:
పంచగవ్య, జీవామృతం లాంటి వాటిని వాడే చాలామంది కొనుగోలు చేసి మరీ వాడుతుంటారు. చక్రపాణి అందుకు విరుద్ధం. పామాయిల్‌ తోటలోని షెడ్‌లో ఆవులు, గిత్తలు కలిపి 10కి పైగా వున్నాయి. వాటి ద్వారా లభించే మలమూత్రములను ద్రవంగా మార్చటానికి 15,000 లీటర్ల ట్యాంకును నిర్మించారు. ఆ మలమూత్రాలు చిలకరించటానికి ఒక యంత్రం బిగించారు. మలమూత్రాలతో పాటు అందుబాటులో ఉండే వ్యర్థ పదార్థాలను, బెల్లం, అరటిపళ్ళు కూడా ట్యాంకులో వేసి, చిలకరించి మంచి ద్రవపదార్థంగా మార్చి చెట్లకు అందిస్తున్నారు. జీవామృతంగా మారాక ట్యాంకులో చేరిన వ్యర్థాలను తొలగించి, చెట్లకు అందిస్తున్నారు. ఇది చెట్లకు పోయటం చాల సులభంగా కనిపిస్తుంది. తోటలో అక్కడక్కడ ఇనుప పైపులు ఏర్పాటు చేశారు. వీటికి రబ్బరు పైపులు అమర్చారు. పైపు వదిలిన వెంటనే ద్రవం పారుదల ప్రారంభమవుతుంది.

మనిషి పైపు చివరను చెట్టు మొదట్లో వుంచి అవసరం మేరకు చెట్టుకు అందాక, మారొక చెట్టుకు మార్చుకుంటూ పోతాడు. ఒక మనిషి, ఒకరోజులో ఒక ఎకరం, ఒకటిన్నర ఎకరం పొలంలోని చెట్లకు జీవామృతం అందించే వెసులుబాటు విధానం వల్ల వుంది. కొబ్బరిచెట్టుకు 15 నుంచి 20 లీటర్లు, పామాయిల్‌ చెట్టుకు 40 నుంచి 50 లీటర్లు, వక్కచెట్టుకు సుమారుగా పది లీటర్లు చొప్పున అందిస్తూ మనిషి ముందుకు నడుస్తూటాడు. జీవామృతం ఈ విధంగా 15 రోజులకోసారి అందిస్తున్నారు. వర్షాకాలం, శీతాకాలంలో మాత్రమే ఈ విధంగా జీవటమృతం అందించి, వేసవికాలంలో ఆపివేస్తారు. నెలకోసారి పంచగవ్య అందిస్తున్నారు. పంచగవ్య, జీవమృతంలే వాడటం వల్ల కొబ్బరికాయల దిగుబడి పెరగటమే కాక, కొబ్బరిలో నాణ్యత అధికమైంది. ఒక్కో కొబ్బరికాయ 12 రూపాయలకు అమ్ముడవుతుంది. పామాయిల్‌ గెలల బరువు పెరిగింది. సరాసరి దిగుబడి పెరిగింది.

కూలీల ఖర్చు గణనీయంగా తగ్గింది :
ప్రస్తుత పరిస్థితుల్లో కూలీల కొరత అధికంగా ఉంది. ఎక్కువ కూలీ చెల్లించినా మనుషులు అందుబాటులో లేక చాలామంది రైతుల పొలాల్లో పనులు కుంటుపడటం సహజమైంది. చక్రపాణి అవలంబిస్తున్న విధానాల వల్ల కూలీల అవసరం వుండటం లేదు. అరటి గెలలు, పామాయిల్‌ గెలల కోత సమయంలో మాత్రం మనుష్యులు అవసరమవుతున్నారు. కొబ్బరి, వక్క, మిరియం లాంటి వాటి కోత, సేకరణకు ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం లేదు. కొబ్బరి, వక్క కాయలు రాలి చెట్ల క్రింద నెలరోజులున్నా ఏ నష్టమూ వుండదు. మిరియం కూడా వారం, పదిరోజులకు ఒకసారి ఏరిస్తే సరిపోతుంది. అందువల్ల కూలీల కోసం పెద్దగా హైరానా పడకుండా, కూలీలు అందుబాటులో వున్నప్పుడే కొబ్బరి, వక్క, మిరియం లాంటివి ఏరించి, కూలీల ఖర్చును కూడా అదుపులో వుంచుకుంటున్నారు.

కలుపుతీత ప్రసక్తే లేదు :
ఏ రైతు, ఏ ప్రాంతంలో, ఏ పైరు సాగు చేసినా కలుపు బెడద తప్పక వుంటుంది. చక్రపాణికి చెందిన పదెకరాలలోని వివిధ పంటల్లో కలుపు ప్రసక్తే వుండదు. అందుకోసం మనుష్యులను కూడా ఏర్పాటు చేయరు. కలుపు నివారణ కోసం మందుల పిచికారీ అవసరం లేదు. ఏ చెట్టు మధ్య కలుపు మొలకెత్తినా అది అలాగే చచ్చిపోవాలి, గడ్డిగా మారిపోవాలి, కుళ్ళిపోయి ఎరువుగా మారి, భూమి సారవంతం కావటానికి ఉపయోగపడాలి. ఇంకో విషయం – కలుపు ఎండి, కుళ్ళి, భూమిలో కలిసినప్పుడు వానపాములు ఎక్కువగా పుట్టుకొస్తుంటాయి. వానపాముల వల్ల భూమి గుల్లబారి మొక్కల వ్రేళ్ళు భూమి లోపలి పొరల్లోకి చొచ్చుకుపోతుందన్న విషయం తెలిసిందే కదా!

Also Read:  పండ్ల తోటల్లో చేపట్టవలసిన పనులు, సూచనలు.!

Leave Your Comments

M.S. Swaminathan: స్వామినాథన్ కు భారతరత్న అవార్డు ఇవ్వాలి – మంత్రి

Previous article

Fish Farming Techniques: చేప పిల్లల పెంపకంలో పాటించవలసిన మెళకువలు.!

Next article

You may also like