Water Management Techniques – వరి: నీరు ఇంకని నల్ల రేగడి, ఒండ్రు నేలలు వరి సాగుకు అనుకూలం. వర పూర్తి పంట కాలంలో సుమారుగా 1100-1250 మిలీమీటర్ల నీరు అవసరమవుతుంది. పంటకు ఉపయోగించే మొత్తం నీటిలో 3% లేదా 40 మి.లీ. నర్సరీ కి 16% లేదా 200 మి.లీ. నేలను దమ్ము చేయడానికి మరియు 80% లేదా 1000 మి.లీ. పైరుకు నీటిపారుదలగా ఉపయోగిస్తారు. నాట్లు వేయడానికి 15 రోజుల ముందే పొలాన్ని దమ్ము చేయుట ప్రారంభించి 2-3 దఫాలుగా మురగ దమ్ము చేసుకోవాలి.
నాట్లు వేసేటప్పుడు పొలంలో నీరు పలుచగా ఉండాలి. ఎండలు ఎక్కువగా ఉంటే ఉడ్చిన వెంటనే 5 సెం.మీ. వరకు నీరు నిలవగట్టాలి. మూన తిరిగిన రోజు నుండి పైరు దొబ్బు చేయటం పూర్తి అయ్యేవరకు పొలంలో పలుచగా అంటే 2-3 సెం.మీ. లోతు వరకు నీరుండాలి. నిరు ఎక్కువగా ఉంటే పైరు బాగా దొబ్బు చేయదు. చిరుపోట్ట దశనుండి గింజ గట్టి పడేవరకు 5 సెం.మీ. లోతు వరకు నీరుండాలి. కోతకు 10 రోజుల ముందుగా నీటిని నెమ్మదిగా తగ్గించి ఆరబెట్టాలి.
జొన్న: ఖరీఫ్ జోన్నకు నీరు కట్టాల్సిన అవసరం లేదు. రబీ జొన్నలో పూత మరియు గింజ పాలు పోసుకొనే సమయంలో నీరు పెడితే గింజలు బాగా నిండి అధిక దిగుబడులు పొందవచ్చును.
మొక్కజొన్న: మొక్కజొన్నకు సుమారుగా 500-600 మి.మీ. నీరు అవసరమవుతుంది. ముఖ్యంగా పూతకు ముందు, పూత దశలో మరియు గింజ పాలు పోసుకొనే దశలో బాగా నీరు పెట్టాలి. 30-40 రోజులలోపు ఉన్న లేత పైరుకు అధిక నీరు హానికరం. విత్తిన తర్వాత చేలో నీరు నిలుస్తే విత్తనం మొలకెత్తదు. పంట కాలంలో 6-8 నీటి తడులు అవసరం. విత్తేటప్పుడు, విత్తిన 15 రోజులకు, 30-35 రోజులకు, పూత దశలో, పూత వచ్చిన 15 రోజులకు మరియు గింజ పాలు పోసుకొనే దశలో నీటి తడులను తప్పకుండా ఇవ్వాలి.
Also Read: మిద్దెతోట పెంపకం మరియు యాజమాన్య పద్ధతులు.!
ప్రత్తి: ప్రత్తికి సుమారుగా 550-600 మి.మీ. నీరు అవసరమవుతుంది. ప్రత్తి పైరు ఎక్కువ నీటిని తట్టుకోలేదు కాబట్టి భూమిలో వున్న తేమశాతాన్ని బట్టి 20-25 రోజులకోసారి నీరు పెట్టాలి. పూత దశలో మరియు కాయ తయారగు దశలో భూమిలో తగినంత తేమ శాతం ఉండేలా చూసుకోవాలి. ఖరీఫ్ లో 2-3 తడులు, రబీలో ఆరు తడులు అవసరం ఉంటుంది.
శనగ: పంటకు సుమారుగా 350 మి.మీ. నీరు అవసరం ఉంటుంది. నల్ల రేగడి నేలల్లో నిలువ ఉండే తేమను ఉపయోగించుకుంటూ శీతాకాలంలోని మంచులో మొక్కలు పెరుగుతాయి. నేలలోని తేమను ఉపయోగించుకుంటూ శీతాకాలంలోని మంచులో మొక్కలు పెరుగుతాయి. నేలలోని తేమను బట్టి ఒకటి లేదా రెండు తేలిక పాటి తడులు ఇవ్వాలి. పంట కొమ్మలు వేసే దశలో (విత్తిన 30-35 రోజుల తరువాత ), గింజ గట్టి పడే దశలో (విత్తిన 55-60 రోజుల తరువాత) నీటి తడులిస్తే మంచి దిగుబడులను పొందవచ్చును.
వేరుశనగ: వేరుశనగ 450-600 మి.మీ. నీరు అవసరమవుతుంది. తేలిక నేలల్లో 8-9 తడులు పెడితే సరిపోతుంది. రబీ వేరుశనగలో నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. ఉడదిగే దశ నుండి కాయ అభివృధి చెందే దశ వరకు నీటి ఎద్దడి మరియు బెట్ట పరిస్థితులు లేకుండా జాగ్రతలు వహించాలి. విత్తేముందు నేల బాగా తడిచేటట్లు నీరు పెట్టి తగినంత తేమ ఉన్నప్పుడు విత్తనం వేయాలి.
రెండవ తడిని విత్తిన 20-25 రోజులకు ఒకసారి పూత వచ్చేటందుకు ఇవ్వాలి. తర్వాత తడులు నేల లక్షణం, బంకమట్టి శాతాన్ని అనుసరించి 7-10 రోజుల వ్యవధిలో పెట్టాలి. ఆఖరి తడి పంటకోతకు 15 రోజలు ముందు ఇవ్వాలి. డ్రిప్ పద్ధతిలో సాగు చేయునప్పుడు 90 x 90 సెం.మీ. దూరంలో డ్రిప్పర్లు ఏర్పాటు చేసుకొని, కాయ ఏర్పడే దశ వరకు ప్రతి 3 రోజులకు ఒకసారి 10 మి.మీ. నీరు ఇవ్వాలి. ఆ తరువాత ప్రతి రెండు రోజులకు ఒక తడి 10 మి.మీ. చొప్పున ఇవ్వాలి.
ప్రొద్దుతిరుగుడు: నేల స్వభావాన్ని బట్టి ఎర్రనేలల్లో 8-10 రోజుల వ్యవధిలో, నల్లరేగడి నేలల్లో 15 రోజుల వ్యవధిలో తడులు పెట్టాలి. మొగ్గ తొడుగు దశ, పూవు వికసించే దశ మరియు గింజ కట్టే దశ నీటి తడులకు కీలకమైనది. ఈ దశల్లో పంట బెట్టకు గురికాకుండా చూసుకోవాలి. నీటి లభ్యత తక్కువగా ఉన్నట్లయితే సాలు మార్చి సాలు పద్ధతిలో నీరుపెట్టాలి. దీనివలననీటి వినియోగ సామర్థ్యం పెరుగుటయే కాకుండా స్క్లిరోషియం వడలు తెగులు వ్యాప్తిని కూడా అరికట్టవచ్చును.
చెఱకు: ఈ పంటకు సుమారుగా1900-2700 మి.మీ. నీరు అవసరమవుతుంది. పంట మొదటి నాలుగు నెలల్లో (బాల్య దశ ) ఆరు రోజులకొకసారి, పక్వదశలో మూడు వారాలకొకసారి నీరు పెట్టాలి. మరియు నీటి ఎద్దడి పరిస్థితుల్లో చెఱకు నాటిన ౩వ రోజున 1.25 టన్నుల చొప్పున చెఱకు చెత్త కప్పటం ద్వారా భూమిలోని తేమ త్వరగా కోల్పోకుండా నివారించడంతో పాటు కలుపు, పీక పురుగు ఉధృతిని తగ్గించవచ్చును. బిందు సేద్య పధ్ధతి అవలంబించడం వలన పరిమితి నీటి వనరులను పొదుపుగా వాడుకోవచ్చును.
Also Read: నిమ్మ పూత దశలో పాటించవలసిన మెళకువలు.!