Drip Irrigation Techniques: డ్రిప్ నీటి పారుదల పరికరాలన్నీ బి.ఐ.ఎస్. లేదా ఐ.ఎస్.ఒ. నాణ్యత ప్రమాణాలు కలిగి ఉండాలి.డ్రిప్ పెట్టుకోవాలంటే ముందు మొత్తం నేల విస్తీర్ణం, నేల స్వభావం మరియు ఏటవాలు, నీటి వసతి మరియు నీటి నాణ్యత పరీక్షఫలితాల వివరాలు, మట్టి పరీక్ష ఫలితాలు, పండించదలచిన పంటలు మరియు ఆ ప్రదేశం యొక్క వాతావరణ పరిస్థితులు తెలుసుకుని ప్రణాళిక తయారు చేసుకోవాలి.ఏదైనా పంటలకు డ్రిప్ పెట్టుకోవాలంటే ఆ పంట యొక్క కీలక దశలో అత్యధిక నీటి అవసరాలు తెలుసుకోవాలి.
డ్రిప్ వ్యవస్థ యొక్క పరిమాణం పొలంలో అన్ని పంటలకు, అన్ని నేలల కీలక దశలలో నీరు సరఫరాచేయగలిగేదిగా ఉండాలి.నేలలు, వాతావరణం, పంటలు మరియు అవసరాన్ని బట్టి డ్రిప్ పరికరాలను ఎంచుకోవాలి.డ్రిప్పర్ రంధ్రాల ద్వారా విడుదల అయ్యే నీరు భూమి మీద ప్రవహించే విధంగా ఉండకూడదు.
డ్రిప్ పైపులలో తగినంత పీడనం ఉండే విధంగా చూడాలి. నీరు ప్రవహించేటప్పుడు డ్రిప్ పరికరాల వల్ల కోల్పోయిన పీడనం తీసివేసిన తరువాత కూడా వ్యవస్థ సక్రమంగా పని చేసేందుకు అవసరమయ్యే పీడనం పైపుల్లో ఉండే విధంగా పంప్‌ను అమర్చుకోవాలి.డ్రిప్ యొక్క అధీకృత ఇంజనీరింగ్ నిపుణుల పర్యవేక్షణలో క్రమబద్ధంగా క్రిప్ పారుదల వ్యవస్థ అమర్చుకోవాలి.
డ్రిప్ పారుదల వ్యవస్థలోని హెడ్ కంట్రోలు, ఫిల్టర్ యూనిట్ల వద్ద కాంక్రీటుతో కూడినటువంటి సిమెంటు ప్లాట్ఫారంను అమర్చుకోవాలి. దీని వలన హెడ్ కంట్రోలుకు దృఢత్వం కలుగటయే కాక వ్యవస్థ యొక్క నిర్వహణకు అనుకూలంగా ఉంటుంది.
Also Read: Irrigation for Plants: మొక్కలకి నీటి పారుదల వేటి పైన ఆధారపడి ఉంటుంది.!

Drip Irrigation Techniques
డ్రిప్ వ్యవస్థ యొక్క ప్రధాన పైపులైను, ఉప ప్రధాన పి.వి.సి. పైపులైన్ల కొరకు భూమిలో గాడులు తీయవలసి ఉంటుంది. ఆ యొక్క గాడిలోతు విధిగా ప్రధానపైపుకయితే 0.75 నుండి 0.9 మీటర్ల లోతు మరియు 0.3 మీటర్ల వెడల్పు, ఉప ప్రధాన పైపులకు 0.6 మీటర్ల లోతు మరియు 0.25 మీటర్ల వెడల్పు ఉండాలి.పి.వి.సి. ప్రధాన మరియు ఉపప్రధాన పైపులు బాటకు ప్రక్కగా వచ్చే విధంగా అమర్చుకోవాలి. ప్రధాన పైపులను గాడిలోనే ఉంచి అతికించాలి. ఉపప్రధాన పైపులు భూమిపై అతికించి తరువాత గాడిలోకి దింపి మట్టి కప్పాలి.
గాడిలో పి.వి.సి పైపు వేసిన తరువాత పైపులకు అమర్చి, ‘ఎల్’ బెండు, టీ, రెడ్యూసర్ల వద్ద ధృఢత్వం కొరకు ప్రక్కలకు సిమెంటు కాంక్రీటు బ్లాకులు అమర్చుకోవాలి.మొత్తం డ్రిప్ వ్యవస్థ అమర్చిన తరువాత పైపుల్లో నీరు వదలి వ్యవస్థ యొక్క పనితనం పరీక్షించాలి.డ్రిప్ వ్యవస్థ నిర్వహణ విధానం, అందులోని భాగాలయిన ఫిల్టర్లను, ఉపప్రధాన పైపులను, లాటరల్స్, డ్రిప్ లైన్లను శుభ్రపరచటం, ఆమ్ల చికిత్స మరియు క్లోరిన్ చికిత్స విధానం, కంట్రోలు వాల్వులు తెరిచే ప్రక్రియ, ఎరువుల ట్యాంక్ ఉపయోగించే విధానం తెలుసుకోవాలి.
ఎరువులను ఫర్టిలైజర్ ట్యాంక్ ద్వారా నీటిలో కరిగించి డ్రిప్ ద్వారా నేరుగా మొక్కలకు ఇవ్వాలి.నీటివసతిని బట్టి (నాణ్యతను ఫిల్టర్‌ను నిర్ణయించుకోవాలి. నీటివసతిగా బోరు ఉన్నట్లయితే డిస్క్రిఫిల్టరు లేదా స్క్రీన్ ఫిల్టరును, బోరునందు వచ్చే నీటిలో అధికంగా సుద్ద, మెత్తటి ఇసుక ఉన్నట్లయితే డిస్క్ఫిల్టర్ పాటు హైడ్రోసైక్లోన్ ఫిల్టర్‌ను మరియు నీటి వసతి బావి అయినట్లయితే గ్రావల్ లేదా శాండ్ ఫిల్టర్‌తో పాటు డిస్క్ లేదా స్క్రీన్ ఫిల్టర్లను ఉపయోగించుకోవాలి.
ఈ ఫిల్టర్లను విధిగా క్రమం తప్పకుండా శుభ్రపరచుకోవాలి.క్రమం తప్పకుండా డ్రిప్పర్లను పరీక్షించుకోవాలి, వాటి ద్వారా సక్రమంగా నీరు విడుదల అవుతున్నదీ. లేనిదీ గమనించాలి.ఒకవేళ డ్రిప్ రంధ్రాలు మూసుకొని పోయి నీరు సక్రమంగా బయటకు విడుదల కానట్లయితే అవసరాన్ని బట్టి ఆమ్ల లేక క్లోరిన్ చికిత్సలు నిర్వహించాలి.
Also Read: Irrigation Methods: వివిధ నీటి పారుదల పద్ధతుల గురించి తెలుసుకోండి.!