Water Testing: సాధారణంగా రైతులు భూసార పరీక్ష చేపించుకొని దానికి అనుగుణంగా పంటలు సాగు చేస్తుంటారు. కాని నేలతో పాటు నీరు కూడా పంట సాగుకు అనువుగా ఉంటేనే పంట ఎదుగుదల బాగుండి మంచి దిగుబడులు పొందవచ్చు. పూర్వం నీటి లభ్యత అధికంగా ఉండడం వల్ల భూమి పై పొరల్లోనే నీరు లభించేది. ఈ నీరు నాణ్యమైనది కావడం వల్ల పంట సాగుకు అనుకూలంగా ఉండేది. కావున రైతులు ఎలాంటి అనుమానం లేకుండా నిర్భయంగా సాగునీటిని వాడుతుండేవారు. కాని నానాటికి నీటి లభ్యత తగ్గిపోతుండడం వల్ల భూమిలో పొరల్లోని నీరు సాగుకు వాడుతున్నారు.
ఆ నీటిలో లవణాలు అధికంగా ఉండి భూమిలోని పొరల నుండి నీటిని తోడటం వలన ఎక్కువ లవణాలు నేల ఉపరితలం పైకి చేరి పంట ఎదుగుదలకు అదే విధంగా నేలకు కూడా హాని కలిగిస్తున్నాయి. దీని వలన పంటలు సరిగా ఎదగకపోవడమే కాకుండా, నేలలు కూడా బాగు చేసేందుకు వీలుపడని రీతిలో చెడిపోయేందుకు ఆస్కారముంటుంది. ఇటువంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడకుండా కొత్తగా తవ్విన బోరు బావుల నీరు, నర్సరీల కొరకు వేరే ప్రాంతం నుండి తెప్పించే నీటిని మొదట పరీక్ష చేసి ఆ తరువాత వాడుకోవడం మంచిది. కావున రైతులు సాగుచేసే పంట నుండి అధిక దిగుబడులు సాధించాలంటే భూసార పరీక్షతో పాటు నీటి పరీక్ష కూడా చేపించుకోవాలి.
నమూనా సేకరణ :
భూసార పరీక్ష కొరకు మట్టినమూన సేకరణకు ఏ విధంగా అయితే ఒక పద్ధతి ఉంటుందో నీటి పరీక్ష కొరకు నీటి నమూనా సేకరణకి కూడా ఒక శాస్త్రీయ పద్ధతి ఉంటుంది. ఈ విధంగా నీటిని సేకరించినట్లయితే సరైన ఫలితాలను పొందగలరు. భూసార పరీక్ష కొరకు నమూనాలు సేకరించేటప్పుడు సేద్య పంటలకు మరియు ఉద్యాన పంటలకు ఏ విధంగా అయితే వేరు వేరు పద్దతులుంటాయో, అదే విధంగా నీటి పరీక్ష కొరకు బావుల్లో, చెరువుల్లో, కాలువల్లో, పరిశ్రమల నుండి వదిలిన నీటిని సేకరించేటప్పుడు కూడా వేరు వేరు పద్ధతులు ఉంటాయి. కావున రైతులు ఇక్కడ తెలిపిన విధంగా మాత్రమే నీటిని సేకరించాల్సి ఉంటుంది.
బోరు బావి నుండి నీటి నమూనా సేకరణ : పొలంలోని బోరు బావి నీటి పంపులో సుమారుగా 20 నుండి 30 నిమిషాల పాటు బయటకు వదిలిపెట్టిన తరువాత ప్లాస్టిక్ సీసాలో సుమారుగా అర లీటరు నీటిని తీసుకోవాలి.
కాలువలు లేదా చెరువుల నుండి నీటి నమూనా సేకరణ :
కాలువలు లేదా చెరువుల నుండి నీటి నమూనాను సేకరించేటప్పుడు ఒక పెద్ద కర్రకు చిన్న బకెట్ను కట్టి ఒడ్డుకు దూరంగా నీటిని తీయాలి. ఈ నీటితో సీసాను 2 నుండి 3 సార్లు బాగా కడిగి ఆ తరువాత నమూనాతో నింపాలి.
పరిశ్రమల నుండి వదిలిన నీటి పరీక్షకు నమూనా సేకరణ :
ఒక్కోసారి పరిశ్రమల నుండి విడిచిపెట్టిన నీటిని కూడా పరీక్ష చేయవలసి ఉంటుంది. అలాంటప్పుడు పరిశ్రమల నుండి నీరు పొలంలోకి ప్రవేశించే స్థలం వద్ద నీటి నమూనాను తీయాలి. అలాగే పరిశ్రమల ఆవరణ నుండి బయటికి వచ్చే చోటు నుండి కూడా నమూనా తీయాలి. ఇలా రెండు ప్రాంతాల నుండి తీసిన నమూనాను పరీక్షకు పంపితే రెండిరటి నీటి నాణ్యత పోలిక లేదా వ్యత్యాసాన్ని గమనించవచ్చు.
Also Read: Integrated Water Resources Management: నీటి పారుదల శాఖ- సమికృత నీటి నిర్వహణలు
జాగ్రత్తలు :
1. రైతులు వీలైనంత వరకు గాజు సీస కాకుండా ప్లాస్టిక్ సీసాను వాడడం మంచిది
2. నీటి సేకరణ కొరకు మందు సీసాలను వాడరాదు.
3. నీటి సేకరణకు ఎరువుల డబ్బాలు లేదా పురుగులు మరియు తెగుళ్ళ మందుల డబ్బాలు వాడకూడదు.
4. నీటి నమూనాను సేకరించుటకు ముందు అదే నీటితో సీసాను 3`4 సార్లు కడిగి ఆ తరువాత నీటి నమూనాతో నింపుకోవాలి.
5. సీసాను గాలి లేకుండా పూర్తిగా నింపి మూత సరిగా బిగించాలి.
6. నమూనా సేకరించిన 6 గంటల లోపే దగ్గరలోని భూసార పరీక్ష కేంద్రానికి పంపాలి.
ఈ విధంగా జాగ్రత్తలు తీసుకొని సేకరించిన నీటిని రైతు పేరు, సర్వే నెంబరు, గ్రామం, మండలము, బోరు లేక కాలువ లేక చెరువు వివరాలు తదితర విషయాలతో పరీక్ష కేంద్రానికి పంపాలి.
నీటి పరీక్ష కేంద్రాలు
జిల్లా పరిశోధనా కేంద్రం/వ్యవసాయ కళాశాల/కృషి విజ్ఞాన కేంద్రం ఫోన్.నెం.
1 చిత్తూరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, తిరుపతి 0877-2248704
2 నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, నంద్యాల 08514-242296
3 గుంటూరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, లాం, గుంటూరు 0863-2524053
4 విశాఖపట్నం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, అనకాపల్లి 08924-223370
5 పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, మారుటేరు 08819-246283
6 అనంతపురం వ్యవసాయ పరిశోధనా స్థానం, అనంతపురం 9989625222
7 వై.ఎస్.ఆర్ కడప జిల్లా వ్యవసాయ పరిశోధనా స్థానం, ఊటుకూరు 08562-231150
8 నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం, నెల్లూరు 9989623828
9 బాపట్ల ఉప్పు నీటి పరిశోధనా స్థానం, బాపట్ల 08643-225098
10 ప్రకాశం కృషి విజ్ఞాన కేంద్రం, దర్శి 9989623827
Also Read: Gogu Cultivation: గోగు పంటసాగులో సిరులేనంట.!