మత్స్య పరిశ్రమ

Pond Water Quality Management: చెరువు నీటి నాణ్యత – యాజమాన్య పద్ధతులు

2
Pond Water Quality Management
Pond Water Quality Check

Pond Water Quality Management: జాతీయ మత్స్య అభివృద్ధి మండలి (ఎన్ ఎఫ్ డి బి) సహకారంతో చేపల పెంపకం, మత్స్య మంత్రిత్వ శాఖ, పశుసంవర్థక, పాడి పరిశ్రమ ల శాఖ ప్రతి సంవత్సరం జూలై 10న జాతీయ చేపల రైతుల దినోత్సవాన్ని జరుపుకుంటుంది. స్థిరమైన నిల్వలు మరియు ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థలను నిర్ధారించడానికి దేశం మత్స్య వనరులను నిర్వహించే విధానం లో మార్పులపై దృష్టిని ఆకర్షించడం ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యం. చేపల పెంపకంలో చేప రైతులు, ఆక్వాప్రెన్యూర్లు, ఫిషర్ ఫోక్ లు, భాగస్వాములు మరియు చేపల పెంపకంలో వారి సహకారం కోసం ఇంకా ఎవరు సంబంధం కలిగి ఉన్నారో వారిని గౌరవించడానికి ప్రతి సంవత్సరం. ఈ రోజుని నిర్వహించడం జరుగుతుంది.

1957 జూలై 10న భారతీయ ప్రధాన చేపల (ఐ ఎమ్ సి) పెంపకంలో ప్రేరిత సంతానోత్పత్తి సాంకేతికపరిజ్ఞానాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు డాక్టర్ కెహెచ్ అలికున్హి మరియు డాక్టర్ హెచ్.ఎల్. చౌధురిలను స్మరించుకుంటూ ఈ రోజును వార్షికంగా స్మరించుకుంటారు.  10.07.2023 తేదీన దేశవ్యాప్తంగా 66వ జాతీయ చేపల రైతుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

దేశంలో నీలి విప్లవం ద్వారా మత్స్య రంగాన్ని మార్చడంలో మరియు ఆర్థిక విప్లవం తీసుకురావడంలో భారత ప్రభుత్వం ముందంజలో ఉంది. ఉత్పత్తి మరియు ఉత్పాదకతను పెంపొందించడం, నాణ్యతను మెరుగుపరచడం మరియు వ్యర్థాలను తగ్గించడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచాలని రంగం ఊహించింది. కేంద్ర ప్రాయోజిత పథకం “బ్లూ రెవల్యూషన్” – 2016లో ప్రారంభించబడిన మత్స్య సంపద సమీకృత అభివృద్ధి మరియు నిర్వహణను పరిగణనలోకి తీసుకుని, 2020లో గౌరవప్రదమైన ప్రధాన మంత్రి “ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజనను ప్రారంభించారు.

(PMMSY) బడ్జెట్ రూ. ఐదేళ్ల కాలానికి 20,050 కోట్లు. PMMSY చేపల ఉత్పత్తిని 2024-25 నాటికి ప్రస్తుత 13.76 MMT నుండి 22 MMT సాధించడం మరియు ఈ రంగం ద్వారా దాదాపు 55 లక్షల మందికి అదనపు ఉపాధి అవకాశాలను కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది.

జాతీయ మత్స్య రైతు దినోత్సవం (జూలై 10)లో భాగంగా మన తెలంగాణ మత్స్వ రైతులు చెరువు నీటి నాణ్యత – యాజమాన్య పద్ధతుల గురించి క్లుప్తంగా తెలుసుకొని భవిష్యతులో అధిక లాభాలను పొదుతారని ఆకాంక్షిస్తూ ఈ చిన్న ప్రయత్నం చేయడం జరిగింది.

చెరువు నీటి నాణ్యత – యాజమాన్య పద్ధతులు
రైతులు చేపడుతున్న విస్తృత పెంపకం, పాక్షిక సాంద్ర పెంపకంలో రొయ్యలు, చేపల ఆరోగ్యాన్ని, పెరుగుదలను, ఉత్పత్తిని ప్రభావితం చేసేది చెరువునీటి నాణ్యతే కాబట్టి నీటి యాజమాన్యం పట్ల ప్రత్యేకశ్రద్ధ వహించాల్సి ఉంది.

నీటి నాణ్యతను ప్రభావితం చేసే కారణాలు :
నీటి నాణ్యత అంటే….. : చేపలు, రొయ్యలు పెరిగే చెరువు భౌతిక, రసాయనిక, జీవ సంబంధ కారణాల వల్ల హెచ్చుతగ్గులను బట్టి నీటి నాణ్యత క్షీణించడం లేక మెరుగుపడటం జరుగుతుంది.

చెరువు అడుగుభాగం:
చెరువు మట్టి నీటిని నియంత్రిస్తుంది. మట్టి స్వభావం ఆమ్లమైతే చెరువులో నీరు ఆమ్లజనితమై ఉంటుంది. క్షారమైతే క్షారగుణం కలిగి ఉంటుంది. దీనిని గమనించి ఆమ్లమైతే సున్నం, క్షారమైతే జిప్సం వాడాలి.

నీటి రంగు: చెరువులోకి తీసుకునే నీరు కాలుష్యరహితంగా, సహజసిద్ధంగా, స్వచ్ఛంగా ఉండాలి. నలుపు, ఎరుపు, పసుపు రంగులలో ఉండకూడదు. వృక్షప్లవకాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆకుపచ్చరంగు, జంతు ప్లవకాలు అధికంగా ఉంటే గోధుమరంగు, మట్టి రేణువుల వల్ల బురదరంగు వస్తుంది. బురద రంగు శ్రేయస్కరం కాదు. బంగారు ఆకుపచ్చరంగు చాలా మంచిది.

నీటి ఉష్ణోగ్రత: చేపలు, రొయ్యలు శీతల రక్తజంతువులు. నీటి ఉష్ణోగ్రతతో పాటు వాటి శరీర ఉష్ణోగ్రతలు మార్పు చెందుతాయి. వాటి ఆహార వినియోగం, జీర్ణక్రియ, శోషణం వంటి జీవరసాయనిక చర్యలపై ఉష్ణోగ్రత ప్రభావాన్ని చూపుతుంది. నీటి ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ నీటిలో కరిగే ప్రాణవాయువు పరిమాణం తగ్గిపోతుంది. పగలు ముఖ్యంగా వేసవిలో చెరువుపై పొరలలో నీరు అధిక ఉష్ణోగ్రతకు వేడెక్కి తేలికకావడం వల్ల తక్కువ ఉష్ణోగ్రత ఉన్న కింది నీటి పొరలతో కలవదు. నీటి ఉష్ణోగ్రతలో హఠాత్తుగా 5డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ తేడాతో నీటి పొరలలో మార్పులు సంభవిస్తే చేపలు, రొయ్యలు తట్టులేక చనిపోతాయి. నీటి ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తగ్గితే ఆహారం తినడం మందగిస్తుంది. చేపల చెరువుల్లో నీటి లోతు 6 నుంచి 8 అడుగులు, రొయ్యల చెరువులో 3 నుండి 4 అడుగులు లోతు ఉండాలి.

నీటి మందం:
నీటిలో తేలియాడుతున్న వ్యర్థపదార్థాలు, మట్టిరేణువుల వల్ల, మిగిలిపోయిన మేతవల్ల నీటి టర్బిడిటీ ఏర్పడుతుంది. నీటి టర్బిడిటీని సెచీడిస్క్ అనే సాధనంతో కొలుస్తారు. 30 నుంచి 40 సెంటీమీటర్ల నీటి మందం అభిలషణీయం. 40 సెంటీమీటర్ల కంటే ఎక్కువైతే నీటికలుపు మొక్కలు పెరిగి నీటి నాణ్యత తగ్గిపోతుంది. మట్టిరేణువులు, మిగిలిపోయిన మేతల వల్ల నీరు బురదరంగు, బురద ఎరుపురంగులోకి మారి చెరువులో ప్రాణవాయువు స్థాయిని ప్రమాదస్థితికి తగ్గిస్తుంది. దీనివల్ల శ్వాసక్రియకు ఇబ్బంది ఏర్పడుతుంది.

రసాయనిక కారకాలు

నీటి ఉప్పదనం (సెలనిటీ): నీటిలో కరిగిన మొత్తం అయానుల సాంద్రతను నీటి ఉప్పదనం అంటారు. సముద్రపు నీటి ఉప్పదనం 30-35 పిపిటిలు అంటే ఒక లీటరు నీటిలో 30-35 గ్రాములు ఉప్పు ఉంటుంది. రొయ్యలు, చేపలు పెరుగుదలను నియంత్రించేది నీటి ఉప్పదనమే. నిరంతరం నీటి ఉప్పదనంలో మార్పులు జరుగుతుంటే చేపలు, రొయ్యలు అనుగుణంగా సర్దుబాటు కావడానికి ఎక్కువ శక్తి, ఖర్చు కావడం వల్ల వాటి పెరుగుదల మందగిస్తుంది. వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతకు నీరు ఆవిరికావడం వల్ల నీటిలో ఉప్పదనం పెరుగుతుంది. వర్షాకాలంలో నీటి ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. మంచినీటి చెరువులో ‘0’ నుంచి ‘3’ పిపిటి ల వరకూ చేపలు, రొయ్యలు పెరుగుదల ఉంటుంది. 7పిపిటి ఉంటే చేపలు, రొయ్యలు చనిపోతాయి.

ప్రాణవాయువు:
నీటిలో కరిగిన ప్రాణవాయువు ఏ సమయంలోనైనా చెరువులో ఖర్చయ్యే ప్రాణవాయువు కంటే, ఉత్పత్తి అయ్యే ప్రాణవాయువు అధికంగా ఉండాలి. పగలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా వృక్ష ప్లవకాలచే ప్రాణవాయువు ఉత్పత్తి, జీవుల శ్వాసక్రియలో ఖర్చు ఒకే సమయంలో జరుగుతుంది. కాని రాత్రి సమయంలో ప్రాణవాయువు ఖర్చు మాత్రమే అవుతుంది. ఉత్పత్తి ఉండదు. ప్లవకాల సాంద్రత మోతాదుకన్నా ఎక్కువైతే (30 నుండి 40 సెంటీమీటర్ల టర్బిటిటీ) తెల్లవారుజామున ప్రాణవాయువు శాతం కనిష్టస్థాయికి చేరి కార్బన్ డైయాక్సైడ్ వాయువు పెరగడం వల్ల రొయ్యలు ఒత్తిడికి గురై వ్యాధిగ్రస్తం చెందుతాయి. వరుసగా కొన్ని రోజులు మబ్బులు కమ్మినప్పుడు ప్రాణవాయువు శాతం తగ్గుతుంది. అప్పుడు తగు నివారణ చర్యలు చేపట్టాలి.

చెరువులో ప్రాణవాయువు లోపించినప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్తలు : నీటి వసతి ఉంటే నీటి మార్పిడిని 5 నుంచి 10 శాతం చేయాలి. కృత్రిమంగా ఏరియేటర్స్ అమర్చడం ద్వారా ప్రాణవాయువు రోజంతా సమృద్ధిగా అందేలా చూడాలి. ఏరియేటర్స్, బ్లోయర్స్, ఎయిర్ టోస్, స్ప్రింక్లర్లు, పెడల్వీలీ వినియోగించాలి.. అలా కాకుంటే చెరువులో నీటిని యంత్రాల ద్వారా అదే చెరువులో పడేటట్లు చేయాలి. తాత్కాలికంగా కాల్షియం పెరాక్సైడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్ ని తెల్లవారుజామున వాడి లోపాన్ని నియంత్రించాలి.

నీటి క్షారత్వం (ఆల్కనిటీ):
నీటిలో ఉండే మొత్తం క్షారపదార్థాల సాంద్రతను ఆ నీటి క్షారత్వం (ఆల్కనిటీ) అంటారు. కార్బొనేట్, బైకార్బొనేట్ అయానుల వల్ల నీటి క్షారత్వం ఏర్పడుతుంది. తక్కువస్థాయిలో మొత్తం క్షారత్వం ఉంటే నీటిలో కన్నా మధ్యలో అధికస్థాయి నిలువ ఉండే నీటిలో ఉదయం సమయంలో నీటి ఉదజని సూచిక విలువ హెచ్చుగా ఉంటుంది. కాని మధ్యాహ్నం పెద్ద తేడా ఉండదు. నీటి మొత్తం క్షారత్వం 20కి మరీ తక్కువగానూ, 200 పిపియం కి మరీ ఎక్కువగానూ ఉంటే వృక్షప్లవకాలు పెరుగుదలకు సరిపడేంత బొగ్గుపులుసు వాయువు నీటిలో లభించదు. కావల్సిన పరిమాణం 25-150 పిపిఎం.

నీటి కఠినత్వం (హార్డ్నేస్):
నీటిలో కాల్షియం మెగ్నీషియం లోహ అయానులు సాంద్రతను ఆ నీటి కఠినత్వం (హార్ట్నెస్) గా పేర్కొంటారు. సాధారణంగా నీటిలో మొత్తం క్షారత్వం, కఠినత్వం విలువలు సమానంగా ఉంటాయి. నీటి క్షారత్వం విలువ హెచ్చుగానూ, కఠినత్వం తక్కువగానూ ఉంటే కిరణజన్య సంయోగక్రియ వేగంగా జరిగితే నీటి ఉదజని సూచిక హెచ్చుస్థాయిలో చేరుతుంది.

అమ్మోనియా:
రొయ్యలు, చేపలు విసర్జించే మలపదార్ధాలు, చనిపోయిన ప్లాంక్టాన్, మిగిలిపోయిన మేతలు, ఎరువుల వాడకాలు చెరువులో అమ్మోనియా ఉత్పత్తికి కారణాలు. అయనీకరణం మధ్యాహ్నం ఎక్కువగానూ, రాత్రిళ్ళు తక్కువగానూ ఉంటుంది. తక్కువ ప్రాణవాయువు ఉన్నప్పుడు అయానీకరణం చెందని అమ్మెనియా ప్రమాదకరం. కృత్రిమ ఆహారాన్ని క్రమబద్దీకరించి ప్లవకాల సాంద్రతను తాత్కాలికంగా నియంత్రించడం, ‘హెల్త్’ స్టోన్(జియోలైట్), ఏరియేటర్లను వాడి అమ్మోనియా సాంద్రతను తగ్గించుకోవాలి.

నైట్రేట్:
చెరువు మట్టిలో గాలి లభించనిస్థితిలో నైట్రేట్గా మారుతుంది. చేప శరీరంలో నైట్రేట్ సాంద్రత పెరిగినప్పుడు రక్తంలో హీమోగ్లోబిన్ తో చర్యనొంది మీథియో గ్లోబిన్ అనే పదార్ధం ఏర్పడుతుంది. దీనినే బ్రౌన్ బ్లడ్ వ్యాధి అంటారు. ఈ వ్యాధి సోకిన చేపల మొప్పల రంగుమారి ప్రాణవాయువును సరఫరా చేసే శక్తి తగ్గిపోతుంది. తద్వారా చేపలు చనిపోతాయి. నీటి ఉదజని సూచిక తగ్గేకొలది. నైట్రేట్ హాని తీవ్రత పెరుగుతుంది. సాధారణ ఉప్పు ఎకరానికి 30 నుంచి 50 కిలోలు నీటిలో కలిపి చెరువు అంతా చల్లి నైట్రేట్ తీవ్రత తగ్గించుకోవచ్చు.

హైడ్రోజన్ సల్ఫేడ్:
గాలి లభ్యంగాని స్థితిలో చెరువు అడుగు భాగంలో కొన్ని గంధక సంబంధ పదార్ధాలపై సూక్ష్మజీవుల చర్య వల్ల ఈ విషవాయువు జనిస్తుంది. చెరువునీటిలో ఏ స్థాయి లోనైనా ఈ వాయువు సాంద్రత అవాంఛనీయం. ఉదజని సూచిక తగ్గేకొద్దీ అయనీకరణ చెందని హైడ్రోజన్ సల్ఫైడ్ తీవ్రత పెరుగుతుంది. కిందినీటిని మార్చడం, లేక అగ్రిసున్నం, లేక హెల్త్ స్టోన్ వేసి హాని తీవ్రతను తగ్గించవచ్చు.

మిథేన్:
మిథేన్ వాయువు చెరువులో సేంద్రియ పదార్థాలుగా విభజించని స్థితిలో కుళ్ళుతున్నప్పుడు మిథేన్ వాయువు జనించి నీటి పై భాగానికి బుడగలుగా వస్తాయి. ఇలాంటప్పుడు హెల్త్ స్టోన్ వినియోగించాలి.

Also Read: Coleus Cultivation: కోలియస్‌ దుంప సాగు.!

Pond Water Quality Management

Pond Water Quality Management

పోషక పదార్థాలు (న్యూట్రీషన్స్) :
చెరువులో నేల, నీరు, సేంద్రీయ, రసాయన ఎరువులు, సున్నం, మేతలు, కొత్త నీరు ద్వారా వాటికి పోషకపదార్థాలు లభిస్తాయి. రసాయన, సేంద్రియ ఎరువులు నెలసరి దఫాలవారీగా వాడాలి.

ప్లవకాలు (ప్లాంక్టాన్) :
వృక్షప్లవకాలు, జంతు ప్లవకాలు. ఇవి ప్రాణ వాయువుని . నీటిలో విడుదల చేసి బొగ్గుపులుసు వాయువును నియంత్రిస్తుంది. నీటిని మందం చేకూర్చడం వల్ల సూర్యరశ్మి చెరువు అడుగుభాగాన్ని తాకదు. నీటిలో కలుపుమొక్కలు జనించవు. రొయ్యలకు, చేపలకు పోషక విలువలు అందిస్తుంది. రోగ నిరోధకశక్తి పెంచుతాయి. నీటిలో పోషకాలను బట్టి వీటి పెరుగుదల ఉంటుంది.

బాక్టీరియా :
మంచి బాక్టీరియాలు చెరువు అడుగుభాగంలో అవసరం. బాక్టీరియా, చెరువు అడుగుభాగాన కుళ్ళిన సేంద్రియ పదార్థాలను (ఏరోబిక్ కండిషన్)లో పోషక పదార్ధాలుగా ఆక్సిడైజ్ చేస్తాయి. విషవాయువులైన అమ్మోనియా, నైట్రేట్లను విషరహితంగా ఆక్సిడైజ్ చేస్తాయి. రొయ్యలు, చేపలు చెరువుల్లో హానికరమైన బాక్టీరియాలు ఎక్కువైతే శానిటైజర్స్ వాడాలి. ప్రోబియోటిక్స్ అనుకూల బాక్టీరియాలు వృద్ధిచేసుకోవాలి.

పెంపక కాలంలో నీటి మార్పిడి:
చెరువు నీరు మరీ చిక్కగా (గరిష్ఠ మోతాదు ప్లాంక్టాన్) గాని లేక విష వాయువుల సాంద్రత ఎక్కువైతే బయటి స్వచ్ఛమైన నీటిని తీసుకుంటే చెరువునీటి మామూలు స్థాయికి చేరతాయి. నీటి రంగునుబట్టి మార్చాలి. ప్రాణవాయువు సాంద్రతను బట్టి, చెరువులో నురుగ ఏర్పడినప్పుడు నీటిని మార్చాలి. ఎక్కువగా నీటి మార్పిడి చేస్తే చెరువులోని పోషకపదార్థాల శాతం తగ్గి ప్లవకాలు వృద్ధికుంటుపడుతుంది. అవసరం మేరకే నీటిని మార్చాలి. వీలైనంత వరకూ చెరువు నీటిని శుద్ధి చేసుకోవాలి.

తీసుకునే నీరు:
కాలుష్యం, మట్టి రేణువులు తేలియాడే నీటిని తీసుకోరాదు. అత్యవసర సమయంలోనే నీటిని తీసుకోవాలి. అది కూడా 10 నుంచి 15 శాతం మాత్రమే నీటి మార్పిడి చేయాలి. అనవసరంగా నీటి మార్పుడి చేస్తే బయటి వ్యాధులను చెరువులోకి తెచ్చుకున్నట్లు అవుతుంది.

‘సున్నం’ వినియోగం:
సున్నం వినియోగం వల్ల నీటిలో కాల్షియం అయానుల శాతం పెరిగి రొయ్యలు గుల్ల విడిచిన సందర్భంలో గట్టిపడుటకు, చేపల శరీరంలో పొలుసులు, రెక్కలు, వెన్నుముక గట్టిపడుటకు ఉపయోగపడుతుంది. చెరువునీరు, మట్టిలో ఉదజని సూచికను తగిన ప్రమాణంలో పెంచుతుంది. సున్నం వాడిన రెండు రోజుల తర్వాత ఎరువులు వాడితే ఫాస్పరస్, నత్రజని పోషక పదార్థాలు త్వరగా ప్లాంక్టాన్ ఉత్పత్తికి ఉపయోగపడి తద్వారా రొయ్య, చేపల రోగనిరోధక శక్తి పెరిగి మేతల ఖర్చు తగ్గుతుంది. బహుళ ప్రయోజనాలు ఉన్న సున్నం ఎకరానికి 20 నుంచి 30 కిలోల చొప్పున నెలకు ఒకసారి విధిగా వాడాలి. సున్నం సర్వరోగ నివారణి. చెరువు అడుగుభాగాన్ని శుద్ధి చేస్తుంది.

నీటి నాణ్యతకు: ఏవిధమైన కాలుష్య సంబంధంలేని మట్టి, భౌతిక, రసాయనిక లక్షణాలు అవసరమైన స్థాయిలో ఉండే స్థలాన్ని చెరువు నిర్మాణానికి ఎంచుకోవాలి. కాలుష్య రహితమైన, అనుకూల భౌతిక, రసాయనిక లక్షణాలు కలిగిన నీటిని ఏడాది పొడవునా అందించగలగాలి. చెరువులోకి తాజా నీటిని తీసుకునే తూము (ఇన్లెట్), నీటిని బయటకు పంపే తూము (అవుట్లెట్) ఎదురెదురుగా ఉండాలి. ఒక చెరువులో వాడిన నీరు వేరొక చెరువులో వినియోగించరాదు.

శుద్ధి చేస్తే వాడుకోవచ్చు. నీటి నాణ్యత పాడై రొయ్య, చేప చనిపోయే ప్రమాదం వస్తే బయటి నీరు తోడి మరలా లోన నీరు బయటకు పంపడం ద్వారా హానికర విషవాయువుల సాంద్రతను తగ్గించవచ్చు. సేంద్రియ, రసాయనిక ఎరువులు తక్కువ మోతాదులలో ఎక్కువ దఫాలు వాడాలి. వ్యాధులు సోకని విత్తనాన్ని పెంపకానికి వాడాలి. వెనామీ / టైగర్ రొయ్యలు, స్కాంపీ రొయ్యలు ఒకే చెరువులో పెంచరాదు. వ్యాదులున్న చెరువులో వాడిన వలలు, బక్కెట్లు, పడవలను పొటాషియం పర్మాంగనేట్ లేక బ్లీచింగ్ లో ముంచి వేరు చెరువులలో వాడాలి. అగ్రి సున్నం, ఉప్పును నెలకోసారి వాడాలి. పరాన్నజీవుల గ్రుడ్లు, లార్వాలను చంపేందుకు మేత సంచులు, లేదా చెక్కట్రేలు రెండేసి సెట్లను ఉంచుకోవాలి.

కుళ్ళిన, బూజుపట్టిన కృత్రిమ ఆహారాన్ని వాడరాదు. ప్రతిరోజు ఉదయం వేళల్లో విధిగా చెరువులను పరిశీలించి తద్వారా రొయ్య, చేప ప్రవర్తనలు, నీటి లక్షణాలలో మార్పులను గమనించి ఉపశమన చర్యలు చేపట్టాలి.
ఆక్వాకల్చర్ చెరువు నీటిలో ఆమోదయోగ్యమైన నీటి గుణగణాలు
నీటి గుణగణము (PARAMETER) ఆమోదయోగ్యపరిమాణం (పి.పి.యమ్) (DESIRED CONCENTRATION).
1. నీటిలో కరిగిన ప్రాణవాయువు (Dissolved OXYGEN) 4-15
2. ఉదజని సూచిక (PH) 7-9
3. టర్బిడిటీ (Turbidity) 30-40 సెం.మీ
4. కార్బన్ డైయాక్సైడ్ (Carbon Dioxide) 1-10
5. సెలినిటీ (Salinity) 0.5-2.0 పి.పి.టి. (మంచి నీరు)
5-35 పి.పి.టి. (ఉప్పు నీరు)
6. అమ్మోనియం (Ammonium) < 0.2 – 2
7. అమ్మోనియా (Ammonia) < 0.1
8. నైట్రేట్ (Nitrate) 0.2 – 5
9. నైట్రైట్ (Nitrite) < 0.3
10. హైడ్రోజన్ సల్ఫైడ్ (Hydrogen Sulphide) 0 .01
11 . ఆల్కనిటీ 60 -300 పి పి ఎమ్
12 . హార్డ్నేస్ 20 -150 పి పి ఎమ్

Source: Dr. C.E. Boyd, America

Also Read: Terrarium Plants Cultivation: టెర్రేరియం మొక్కల పెంపకం.!

Leave Your Comments

Coleus Cultivation: కోలియస్‌ దుంప సాగు.!

Previous article

Sugar Mills: చక్కెర కర్మాగారాలకు నష్టాలా? వ్యర్థపదార్థాల ద్వారా వచ్చే ఆదాయం?

Next article

You may also like