Modern Agricultural Equipment – 1. గుంటక: దున్నిన పొలాన్ని దంతులతో బాగా పొడిచేసి, తరువాత పొడి మట్టి లోపలి నేల ఎత్తు పల్లాలను సరిచేసి సమతలం పొందడానికి ఈ గుంటక వాడుతారు. ఇందులో ఒక బ్లేడును చట్రానికి అమర్చి పొలంలోని పై మట్టి క్రింద భాగంలో దాగి ఉన్న ఎత్తు పల్లాలను లేకుండా చెక్కి చదును చేయడానికి సమర్థవంతంగా వాడవచ్చును. అదే కాకుండా ఏదయినా కలుపు మొక్కలు మొదలగు వాటిని వేళ్ళతో సహా తీసేందుకు కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ గుంటకను వాడి నేలపై భాగమే కాకుండా మట్టి క్రింద ఎత్తు పల్లాలను సరిచేయడం వలన సాగు నీటిని పొలంలో సమానంగా అన్ని దిక్కులకు ప్రవహింప చేయవచ్చును. ఇలా సరి చేసిన నేలలో సాగు నీటిని నిర్వాహణ వలన సుమారు 30 శాతము నీటిని ఆదాచేయవచ్చునని పరిశోధనల ద్వారా నిరూపించబడినది.
1. బోదె నాగలి : దున్ని చదును చేసిన పొలంలో బోదెలు వేయడానికి ఈ పరికరాన్ని చాలా సమర్థవంతంగా ఉపయోగించవచ్చును. ఈ బోదెలను వేయడానికి రూపొందించిన పరికరానికి అమర్చిన రెండు పలకలు ముందుకు నడిపేటప్పుడు ముందరి వెడల్పాటి ముఖంద్వారా మట్టిని పలక మధ్య నెట్టి చివరిగా అమర్చబడ్డ తక్కువపాటి ద్వారం గుండానొక్కడం ద్వారా బోదెలను రూపొందించేందుకు ఉపయోగపడుతుంది. ఇది ట్రాక్టరుతో నడిపే నాగళ్ళ ద్వారా ఒకే సారి రెండు లేదా మూడు బోదెలను రూపొందించవచ్చును. వీటి మధ్య దూరాన్ని మూడు నుంచి ఐదు అడుగుల వరకు మార్చుకునే వీలుంటుంది
1. కాల్వలు తీసే పరికరం : ఈ పరికరంలో నేలదున్ని చదును చేసిన తరువాత నేల ఉపరితలంలో కాలువలు చేసేందుకు వాడుతారు. ఒక కర్రు మద్యలో అమర్చబడి రెండువైపులా రెక్కలను అమర్చి వాడేందుకు వీలుగా చేతి పిడిని (ఎడ్లతో నడిపే వాటికి) పొందు పరచి ఉంటారు. చదును చేసిన పొలంలో ఈ పరికరాన్ని వాడడం ద్వారా కర్రు నేల లోపలికి పోయి రెండు రెక్కల ద్వారా వచ్చే మట్టిని సమానంగా ఇరువైపులా తోయడం వలన పొలంలో కాల్వ ఏర్పడుతుంది. ఈ విధంగా సాగు నీటిని ప్రవహింపచేసేందుకు పొలంలో కాలువ చేసి నీటిని కట్టడం ద్వారా నీటి ఆదా జరగడమే కాక, సాగు పొలంలో అన్ని ప్రాంతాలకు నీరు సక్రమంగా అందేట్లు చేయవచ్చును.
విత్తేందుకు అనువైన పరికరాలు –
ఫెస్ఫోనాగలి: అంటే మమూలు చెక్క / ఇనుప నాగలికి రెండు జట్టిగాలను (గరాటులను) ప అమర్చి దాని నుండి నాగలి వెనుక భాగంలో నాగలి చేసిన సాళ్ళలో విత్తనం మరియు ఎరువు విడివిడిగా ఎరువు పడేట్లు గొట్టాలను అమర్చబడి ఉంటుంది. ఈ విత్తే నాగలి నడిపే రైతుతో బాటు, విత్తనాన్ని మరియు ఎరువును వాటికి నిర్దేశించబడిన జడ్జిగాలలో వేయడానికి ప్రత్యేకించి కూలీలు కావాలి. ఇంతేకాకుండా సాలుకు సాలుకు మధ్య దూరం సమానంగా పొలమంతా పొందాలంటే పని నైపుణ్యత గల కూలీతో బాటు సాలు చక్కగా వేయగల మచ్చిక చేయబడ్డ ఎడ్లు ఎంతయినా అవసరం.
గొర్రు : ఇది పూర్తిగా ఇనుము ఎడ్ల సహాయంతో విత్తే యంత్రము ఇనుములేదా చెక్కతో చేయబడి, మేడికి ఇరువైపులా రెండు జడ్జిగాలను బట్టీలతో అమర్చి ఉంటారు. ఎరువు మరియు విత్తనం వేర్వేరుగా పడేందుకు వీలుగా కర్రులకు ఇరువైపులా రెండు గొట్టాలను అమర్చి ప్లాస్టిక్ గొట్టాల ద్వారా జడ్డిగాలకు కలుపబడి ఉంటుంది. లాగే ఎద్దుల శక్తి మరియు సమర్ధతను, బట్టి మూడు నుండి ఎనిమిది కర్రులను అమరుస్తారు.
ఈ కుల / చెక్కల సంఖ్యను బట్టి జడ్జిగాల సందుల సంఖ్య నిర్ధారించబడుతుంది. ఈ రెండు జడ్జిగాల నుండి అమర్చబడ్డ చెక్కలకు గొట్టాల ద్వారా ఎరువును మరియు విత్తనాన్ని చేరుస్తుంది. ఉదాహరణకు 4 చెక్కల గొర్రు నందు జడ్డిగాలకు 4 గొట్టాలను అమర్చేందుకు వీలుగా 4 రంద్రాలు చేసి ఉంటాయి. ఈ చెక్కల సంఖ్య పెరిగే దానిని బట్టి గొర్రుద్వారా విత్తే విస్తీర్ణము పెరుగుతుంది. దీనిని వాడి సుమారు రోజుకు రెండు నుండి నాలుగు ఎకరాలు విత్తవచ్చును.
క్రీడా విత్తేనాగలి : ఈ విత్తేపరికరం కేంద్ర మెట్ట వ్యవసాయ పరిశోధనా కేంద్రం వారిచే రూపొందించబడినది. దీనిలో గొర్రు లాగా విత్తేందుకు కూలీలు అవసరం లేకుండా తనంతటతానే నిర్దేశించబడిన విత్తనాన్ని మరియు ఎరువును నియంత్రించేందుకు ఒక పళ్ళ చక్రాన్ని వాలుగా రూపొందించుటచే విత్తనం ఒకొక్కటిగా పడేందుకు వీలుంది. దీనిని ముఖ్యంగా వేరుశనగలాంటి మెత్తటి విత్తనాన్ని సైతం అతి తక్కువ రాపిడికి గురి అయ్యే విధంగా నిర్మించబడినది. ఈ విత్తే పరికరం ట్రాక్టరు లేదా ఎడ్ల ద్వారా నడిపేందుకు వీలుగా తయారు చేసారు. ట్రాక్టరుతో విత్తే యంత్రంలో 9 లేదా 11 సాళ్ళు ఒకే మారు విత్తే విధంగా కర్రులు ఉండటంవల్ల గంటకు ఒకటిన్నర నుండి రెండు ఎకరాలు విత్తేందుకు వీలవుతుంది. అదే ఎడ్లతో నడిపే యంత్రంలో 3 సాళ్ళు విత్తేందుకు వీలుగా 3 కర్రులు కలిగి ప్రత్యేకించి విత్తనం డబ్బాలు అమర్చారు. దీనితో గంటకు 1/2 నుండి 1 ఎకరము వరకు విత్తడానికి వీలవుతుంది. దీని ఖరీదు సుమారు రూ. 40,000/- మరియు రూ.60,000/- ఉంటుంది.
గుజరాత్ విత్తేయంత్రము : ఈ విత్తేయంత్రంలో విత్తనం డబ్బానుండి ఒక చిన్నపాటి దోనెలోకి పడి వాటి నుండి కప్పులతో కలిగిన చక్రం తిరగడం ద్వారా పై విత్తనం ఏవిధమైన రాపిడిగాని ఒత్తిడిగాని లేకుండా విత్తనాన్ని కర్రులలో అమర్చబడిన గొట్టాలకు చేరుస్తుంది. గట్టి విత్తనం లేదా చిన్న విత్తనం లేదా పెద్ద విత్తనం అయినా విత్తవచ్చును. ట్రాక్టరుతో అయితే గంటకు 1-2 ఎకరములు సులభంగా విత్తవచ్చును. దీని ఖరీదు సుమారు రూ.38,000/- ఉంటుంది. అదే రాళ్లు పొదిగి ఉన్న పొలాలలో వాడేందుకు వీలుగా స్ప్రింగ్ కర్రులు కలిగిన విత్తేయంత్రాన్ని వాడవలసి ఉంటుంది దీని ధర సుమారు రూ.50,000/-. ఈ యంత్రం ఎడ్లతో నడిపేందుకు వీలుగా కూడా రూపొందించబడి ఉంది. దీనితో అయితే గంటకు 1/2 నుండి 1 ఎకరం వరకు విత్త వచ్చును. దీని ధర రూ.12,000/-
పూటర్ ఫీడ్ విత్తే యంత్రము :
ఈ విత్తే యంత్రములో విత్తనం డబ్బా క్రింద బాగాన కర్రుల సంఖ్యను బట్టి విడివిడిగా ప్లూటడ్ వీళ్ళను (గుండ్రటి స్థూపాకారపు చక్రాన్ని) ఉపరితలంలో గాడీలుగా చేసినటువంటి చక్రాలను ఒక పొడవాటి కడ్డీపై అమర్చబడి ఉంటుంది. విత్తే యంత్రం గ్రౌండ్విల్ నుండి వచ్చే త్రిప్పే శక్తిని ఈ కడ్డీని త్రిప్పేవిధంగా ఇనుప చైనద్వారా కలుపబడి ఉంటుంది. ఈ గాడీ చక్రం విత్తనం డబ్బాలో తెరువబడిన ఎడాన్ని బట్టి విత్తే విత్తనం మోతాదు ఆధారపడి ఉంటుంది. ఇదే పరికరాన్ని అతి చిన్న విత్తనాన్ని విత్తేందుకు వీలుగా అడుగు భాగంలో అమర్చిన మీటను ఉపయోగించి వాటి మధ్య దూరాన్ని తగ్గించి విత్తవచ్చును.
ఈ యంత్రాన్ని వరి, గోధుమ పంట ధాన్యాలను సమర్థవంతంగా వాడవచ్చును. కాకపోతే ఈ యంత్రం ద్వారా విత్తినపుడు మనకు కావలసిన సాళ్ళ దూరాన్ని పొందేలా రూపొందించేందుకు వీలవుతుంది కానీ, గింజకు గింజకు మధ్య నిర్దేశించిన ఎడమ పొందడానికి వీలుకాదు. కాబట్టి ఈ విత్తేయంత్రాన్ని అన్ని పంటలకు అనగా మొక్కకూ, మొక్కకూ మధ్య దూరం ఉండవలసిన పంటలకు ఉపయోగించలేము.
జీరో టిల్ డ్రిల్ :
ఇది కూడా విత్తనాన్ని విత్తేందుకు ఉపయోగపడే యంత్రము. అనగా నల్లరేగడి నేలలో మొదటి పంటను కోసేసిన తరువాత రెండోపంటను విత్తేందుకు, నేలను దున్నినట్లయితే పెద్ద పెద్ద మట్టిగడ్డలు ఏర్పడి తిరిగి సాగు చేయాల్సివస్తుంది. ఇలా చేయడానికి సమయం ఉండకపోవడమేకాక ఎక్కువ శ్రమపడ వలసి వస్తుంది. ఇలాంటి నేలలో పంటకోసిన వెంటనే, దున్న కుండానే విత్తనాన్ని విత్తడం ఎంతయినా అవసరం.
కాకపోతే మొదటి పంటకు తప్పనిసరిగా దుక్కిని దున్ని సాగు చేయడం ఎంతయినా అవసరం ఇలా ఒకే విత్తేయంత్రము పలు రకాల విత్తనాన్ని విత్తడమే కాకుండా పలు మోతాదులలో నిర్దేశించడానికి వీలయిన అమరికలు కలిగి బహు సమర్థవంతంగా పని చేయగలిగిన యంత్రము. దీనిలో ముఖ్యంగా గోధుమ, మొక్కజొన్న, శెనగ మొదలగు విత్తనాలను చాలా సమర్ధవంతంగా విత్తవచ్చును.
విత్తే యంత్రము :
మన దేశంలో చిన్న సన్నకారు రైతులు 80 శాతం ఉండటం అందరికీ తెలిసిన విషయమే. ఇందువలన వ్యవసాయ యాంత్రీకరణలో చేతి పనిముట్లు మరియు చేతి యంత్రాల ప్రాముఖ్యత తప్పకుండా ఉంటుంది. అంతేకాక గ్రామాలలో క్షీణించిన పశుసంపద, కూలీల కొరత ఎక్కువ కావడం వలన రైతే తన పొలంలో సులువుగా వాడేందుకు వీలుగా, నడిచేటప్పుడు అమర్చబడిన లాంగ్ హ్యాండిల్‌ను తోస్తు విత్తేందుకు వీలుగా ఈ యంత్రం రూపొందించబడినది.
ఇలా విత్తడంలో నిర్ధిష్టమైన విత్తనానికి మధ్య దూరం పాటించడం జరుగుతుంది. దీనికి ఉన్న ఇనుప క్లిప్పులు భూమి లోపలకు 2.5-5 సెం.మీ. లోతుకు మాత్రమే ప్రవేశించి, నిర్దేశించిన విత్తనాల సంఖ్య (ఒకటి లేదా రెండు లేదా మూడు) మాత్రమే విత్తడం జరుగుతుంది. రైతులు వర్షం పడిన వెంటనే రైతు కూలీల కోసం సమయాన్ని వృధా చేయకుండా విత్తనాన్ని తన పొలంలో విత్తుకోవచ్చును. దీని ఖరీదు రూ. 8500/- రోజుకి 1-1 1/2 ఎకరం వరకు విత్తుకోవచ్చును.
మిని ట్రాక్టరుతో నడుపబడే ‘‘బహుళ ప్రయోజనాల యంత్రము’’ :
ఈ యంత్రపు పట్టీని చిన్న రైతుకు ఉపయోగకరంగా ఉండేందుకు రూపొందించబడిరది. ఈ యంత్రం పంట విత్తనాన్ని మరియు రసాయన ఎరువులను విత్తడం, పంటకు రసాయన మందును పిచికారి చేయడం, పంట సాళ్ళలో కలుపును తీయడంతో బాటు, సాళ్ళ మధ్య నేలను గుల్లబార్చడం వంటి పనులను సమర్ధవంతంగా నిర్వర్ధించడానికి సహాయపడుతుంది.
1. విత్తేందుకు అమరిక : విత్తనాన్ని మరియు రసాయన ఎరువులను విత్తేందుకు వీలుగా ట్రఫ్పీడ్ మీటరింగ్ కొలిచి నిర్దిష్టమైన విత్తన మోతాదును విత్తేందుకు పరికరం అమర్చబడినది. దీని ద్వారా నిర్ధేశించిన సాళ్ళ దూరంలో నిర్దేశించిన విత్తన మోతాదును విత్తవచ్చును.
2. సాళ్ళ మధ్య అంతరకృషి చేయడానికి అమరిక : ఈ యంత్రం ద్వారా అంతరకృషి సులువుగా చేయవచ్చును. ట్రాక్టరు పి.టి.ఒ. నుండి శక్తిని పొంది సాళ్ళ మధ్య దూరంలో నిర్దిష్టమైన వేగంతో వంపు కర్రులు తిరుగడం వలన కలుపు మొక్కల నిర్మూలన గావించడమే కాక నేలను గుల్ల బారుస్తుంది. ఇలా గుల్లబార్చిన పొలంలో వర్షం పడినపుడు లేదా నీటి తడులు అందించినప్పుడు, మొక్కలు నీటిని బాగా సంగ్రహించి పంట దిగుబడి పెరగడానికి తోడ్పడుతుంది.
3. పిచికారీ చేసే యంత్రముగా : ఈ రసాయనాల పిచికారీకి ట్రాక్టరుకు పంపును అమర్చడం జరిగింది. ఇది మిని ట్రాక్టరు పి.టి.ఒ. ద్వారా శక్తిని పొంది పంపును నడుపుతుంది. దీని ద్వారా 6 నుండి 12 నాజిల్స్ వాడి పిచికారి చేయవచ్చును. ఈ రసాయన మందును నిల్వ చేయడానికి 200 లీ. ప్లాస్టిక్ డ్రమ్ అమర్చబడి ఉండును.
4. రవాణా సాధనంగా :
ఈ యంత్రంతో రసాయన మందులు చల్లేటప్పుడు మినహా మిగిలిన పనులకు వాడునపుడు పైభాగాన్ని బండి లాగా వాడవచ్చును. దీని ద్వారా విత్తనాలు, మందులు, పరికరాలు మొదలుకొని ధాన్యం, పండ్లు, కూరగాయలు మొదలగునవి సమర్ధవంతంగా ఇంటికి చేర్చవచ్చును. ఇలా ఈ బహుళ ప్రయోజనాల యంత్రాల పట్టీని వాడి రైతాంగం లాభం పొందవచ్చును. ఈ పరికరం ఖరీదు సుమారు ఒక లక్ష రూపాయలు అవుతుంది.