ఈ నెల పంట

విత్తన శుద్ధితో పంట దిగుబడులు వృద్ధి

0

నాణ్యమైన విత్తనాల ఎంపిక ఎంత ముఖ్యమో శుద్ధి చేసిన విత్తనాన్ని నాటుకోవడం కూడా అంతే ముఖ్యం. విత్తనశుద్ధి వల్ల విత్తనం మరియు నేల ద్వారా వచ్చే పురుగులు మరియు తెగుళ్ళ నుండి పంటను కాపాడుకోవచ్చు. కాబట్టి కనిపించని శిలీంద్రాల బారి నుంచి విత్తనాలను రక్షించుకోవాలంటే విత్తనశుద్ధి ఆవశ్యకత ఎంతో ఉంది. దీనివల్ల మొలక శాతం ఎక్కువ ఉంటుంది మరియు మొక్కల సంఖ్య కూడా పెరిగి మంచి దిగుబడిని సాధించవచ్చు. విత్తన శుద్ధి  విత్తనానికి రక్షణ కవచంలా పనిచేయడంతో పాటు మొక్క ఆరోగ్యంగా పెరిగి , తొలిదశలో పురుగు మరియు తెగుళ్ళను  ఆరికట్టి , తర్వాత దశలో పిచికారి మందులు మరియు కూలీల పై పెట్టె ఖర్చును తగ్గించుకోడానికి తోడ్పడుతుంది. పురుగు లేదా తెగుళు సోకిన తరువాత పిచికారి చేసే మందులకు అయ్యే ఖర్చులో 10% మాత్రమే విత్తనశుద్ధి కి అవుతుంది.

విత్తనశుద్ధి చేసేటప్పుడు ముందుగా కీటకనాశిని మందులతో శుద్ధి చేసి తర్వాత నీడలో ఆరబెట్టి శిలీంధ్రనాశిని మందులతో  శుద్ధి చేసి చివరిగా జీవ రసాయన మందులు లేక జీవన ఎరువులతో  విత్తన శుద్ధి చేసుకుని నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి.

వివిధ రకాల పంటలలో విత్తనశుద్ధి చేసే విధానం:

ప్రత్తి : మార్కెట్లో ముందుగానే విత్తనశుద్ధి చేసిన విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి విత్తుకునే  గంట ముందు జీవ శిలీంధ్ర నాశిని మందు ట్రైకోడెర్మా విరిడి లేదా సూడోమోనాస్ ఫ్లోరిసేన్స్ మందును కేజీ విత్తనానికి 10 గ్రా. చొప్పున కలిపి విత్తనశుద్ధి చేయటం ద్వారా వేరు కుళ్లు, కాండం కుళ్ళు మరియు వడలు తెగులు నుండి పంటను కాపాడుకోవచ్చు

సోయా చిక్కుడు:  కిలో విత్తనానికి ముందుగా 1.0 గ్రా. కార్బండిజమ్ మందుతో తర్వాత 1.5 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ 48 ఎఫ్.ఎస్ మందు తో విత్తనశుద్ధి చేయాలి. అటు తర్వాత ప్రతి 10 కిలోల విత్తనానికి 200 గ్రా. రైజోబియం జపానికం కల్చరును తగినంత నీటితో దానికి కొంత జిగురును  కలిపి విత్తనానికి పట్టించి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి.

కందులు: కిలో విత్తనానికి మొదట 2.0 గ్రా. కార్బండిజమ్ తో  శుద్ధి చేసి 24 గంటల తర్వాత ట్రైకోడెర్మా విరిడి తో శుద్ధి చేసి ఆరబెట్టిన తర్వాత చివరగా 200 గ్రా. రైజోబియం కల్చర్ ను ఎకరాకు సరిపోయే విత్తనానికి కలిపి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి.

పెసర, మినుము: కిలో విత్తనానికి ముందుగా 1.5 మి.లీ.  ఇమిడాక్లోప్రిడ్ 48 ఎఫ్.ఎస్ మందు తో విత్తనశుద్ధి చేయటంవలన 15 రోజుల వరకు రసం పీల్చే పురుగులు అదుపులో ఉంటాయి.ఆ తర్వాత 8 నుండి 10 గ్రా. ట్రైకోడెర్మా విరిడితో శుద్ధి చేసుకుని విత్తుకోవాలి.

నువ్వులు: కిలో విత్తనానికి 3.0 గ్రా. మాంకోజెబ్ తో విత్తనాన్ని శుద్ధి చేయాలి.  తర్వాత ఇమిడాక్లోప్రిడ్ 2.0 మీ.లీ. కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేయడం ద్వారా పంట తొలి దశలో రసం పీల్చే పురుగుల బారి నుండి కాపాడవచ్చు.

వేరుశనగ: కిలో విత్తనానికి 1 గ్రా. టెబ్యుకొనజోల్ 2 డి. ఎస్ లేదా 3 గ్రా. మాంకోజెబ్ 3 గ్రా. పొడి మందు పట్టించాలి. వేరు కుళ్ళు, కాండం కుళ్ళు మరియు మొదలు కుళ్ళు తెగుళ్ళు ఎక్కువగా ఆశించే పరిస్థితులలో కిలో విత్తనానికి 10 గ్రా. ట్రైకోడెర్మా విరిడితో శుద్ధి చేసుకోవాలి. వేరు పురుగు ఉధృతి ఎక్కువగా ఉండే ప్రాంతాలలో 6.5 మీ.లీ. క్లోరిపైరిఫాస్ తో విత్తనశుద్ధి చేసుకోవాలి.

శనగ: కిలో విత్తనానికి ముందుగా 2.5 గ్రా. కార్బెండజిం తో విత్తనశుద్ది చేయాలి. ఎండు తెగులు సమస్యాత్మక భూముల్లో ట్రైకోడర్మా విరిడి 8 గ్రా. కిలో విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. శనగను మొదటిసారి పొలంలో సాగు చేసినప్పుడు రైజోబియం కల్చరును విత్తనానికి పట్టించాలి (200 గ్రా. రైజోబియం మిశ్రమ౦ + ౩౦౦ మీ.లీ. నీరు + 10% బెల్లం మిశ్రమం 8 కిలోల విత్తనాలకు సరిపోతుంది).

వరి: పొడి విత్తనశుద్ధిలో కేజీ విత్తనానికి 3 గ్రా. కార్బెండజిం ను కలిపి 24 గంటల తర్వాత నారుమడిలో చల్లుకోవాలి. అదే దమ్ము చేసిన నారుమడి అయితే లీటరు నీటికి 1 గ్రా. కార్బెండజిం  మందు కలిపిన ద్రావణంలో విత్తనాలను 24 గంటలు నానబెట్టి మండె కట్టుకొని దమ్ము నారుమడిలో చల్లుకోవాలి.

జొన్న: మొవ్వు ఈగ బారి నుండి పంటను రక్షించుకోవడానికి ఒక కిలో విత్తనానికి 3 గ్రా. థయోమిథాక్సామ్ 30% ఎఫ్.ఎస్ లేదా 12 మీ.లీ. ఇమిడాక్లోప్రిడ్ 48 ఎఫ్.ఎస్ కలిపి విత్తన శుద్ధి చేయాలి.

మొక్కజొన్న: కిలో విత్తనానికి 3 గ్రా. మాంకోజెబ్ మందు తో విత్తనశుద్ధి చేసుకున్నట్లయితే మొదటిదశలో వచ్చే తెగుళ్ల నుండి కాపాడుకోవచ్చు. బూజు తెగులు ఆశించే ప్రాంతాలలో 1 కిలో విత్తనానికి 4 గ్రాముల  మెటలాక్సిల్ తో విత్తన శుద్ధి చేసుకొని విత్తుకోవాలి.

పసుపు: ముఖ్యంగా దుంప పుచ్చు, దుంప కుళ్ళు తెగులు విత్తనాల ద్వారా వ్యాపిస్తాయి. కాబట్టి పసుపు విత్తనాన్ని కనుక శుద్ధి చేసుకున్నట్లయితే చాలా వరకు వీటిని తొలిదశలోనే తగ్గించవచ్చు. విత్తనశుద్ధి కొరకు ఒక కడాయిలో లీటరు నీటికి 2 మీ.లీ. రిడోమిల్ ఎం. జెడ్ + 2 మీ.లీ. క్లోరిపైరిఫాస్ లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.8 మి.లీ చొప్పున కలిపి ద్రావణాన్ని తయారు చేసుకొని అందులో ఒంటి కన్ను ముచ్చేలను ౩౦ నిముషాలు నానబెట్టుకొని బయటకు తీసి   జీవరసాయన మందు అయిన ట్రైకోడెర్మా విరిడి శిలీంధ్ర నాశిని తో దుంపలను శుద్ధి చేసుకుంటే దుంప కుళ్లు తెగులు ఉధృతిని చాలా వరకు తగ్గించవచ్చు.

చెకు: కాటుక, ఆకుమాడు మరియు గడ్డి దుబ్బు తెగుళ్లను నివారించడానికి  ముచ్చెలను వేడి నీటిలో 52o సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద 30 నిమిషాలు లేదా తేమ తో మిళితమైన వేడి గాలిలో 54o సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద 2 గంటలు ఉంచి శుద్ధి చేయాలి. లేవదీ తోటల పెంపకానికి విత్తనశుద్ధి చేసిన విత్తనాన్ని మాత్రమే వాడుకోవాలి.

ఆముదం: వడలు తెగుళు ఉన్న ప్రాంతాలలో కిలో విత్తనానికి 3 గ్రా. కార్బెండజిం లేదా 10 గ్రా. ల ట్రైకోడర్మా విరిడితో  విత్తనశుద్ధి చేయాలి.

కూరగాయలు: కూరగాయ పంటలలో నారుకుళ్ళు, కాండం కుళ్ళు మరియు వేరు కుళ్లు తెగుళ్ళను నివారించడానికి, నారు శుద్ధి కొరకు ట్రైకోడెర్మా విరిడి మందు  పొడి 8 గ్రాములు చొప్పున లీటర్ నీటికి కలిపి , నారును 20 నిమిషాలు ఉంచి ప్రధాన పొలంలో నాటుకోవాలి.

ఎ. రమాదేవి, కె. మమత,  వై. ప్రవీణ్ కుమార్, యం. సునీల్ కుమార్,

జి. శివచరణ్, యం. రఘువీర్ మరియు పి. జగన్మోహన్ రావు

కృషి విజ్ఞాన కేంద్రం, ఆదిలాబాద్, 9989623829

Leave Your Comments

వ్యవసాయ అధికారులతో నిర్వహించిన కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

Previous article

ఏరువాక పౌర్ణమి

Next article

You may also like