ఈ నెల పంట

వంగ పంటను ఆశించే పురుగులు-నివారణ పద్ధతులు

0

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పండించే కూరగాయ పంటల్లో వంగ పంట చాలా ముఖ్యమైనది. ఈ వంగ పంటను వివిధ కాలాల్లో, వర్షాకాలంలో, శీతాకాలంలో అలాగే వేసవికాలంలో కూడా పండించవచ్చు. వేసవికాపుగా వంగ పంటను జనవరి రెండవ పక్షం నుండి ఫిభ్రవరి మొదటి పక్షం వరకు నారు కోసం విత్తుకోవచ్చు. ౩౦-35 రోజు నారును నాటుకోవాలి. వేసవికాలం నారును ఫిభ్రవరి, మార్చి మొదటివారంలో నాటవచ్చు. వంగ పంటకు బాగా నీరు ఇంకే నేల ఒక మాదిరి నుండి హెచ్చు సారవంతమైన నేల ఈ పంట సాగుకు అనుకూలంగా ఉండును. వేసవిలో వంగ పంటను వివిధ రకాల పురుగు ఆశించి నష్టం చేసి దిగుబడిని ప్రభావితం చేస్తాయి. వాటి గురించి కింద వివరించడం జరిగింది.

మొవ్వు, కాయ తొలుచు పురుగు :

ఇది వంగ పంటను ఆశించి నష్టం కలిగించే చాలా ప్రధానమైనది. ఇది వంగ పంటతోపాటు కాకర, బంగాళదుంపను కూడా ఆశించి నష్టం చేస్తాయి. ఈ మొవ్వు మరియు కాయతొలుచు పురుగు యొక్క తల్లి రెక్క పురుగు గుడ్లని ఒక్కొక్కటిగా ఆకు, మొవ్వు మరియు పూల మొగ్గ మీద పెడతాయి. అప్పుడప్పుడూ వంకాయ మీద కూడా గుడ్లని పెట్టడం జరుగుతుంది. ఈ గుడ్ల నుండి వారం నుండి పది రోజుల లోపు పిల్ల పురుగులు బయటికి వస్తాయి. ఈ పురుగు యొక్క పెరిగిన లార్వాలు లేత గులాబి రంగులో ఉంటాయి.

ఈ పురుగు వంగ పంట నాటిన ౩౦-40 రోజు నుండి పంటను ఆశించి నష్టాన్ని కలిగించవచ్చు. చిన్న మొక్క దశలో లార్వాలు ఆకు కాండంలోనికి పెద్ద ఆకు మధ్య ఈనెల్లోకి, లేత మొవ్వులోనికి తొలచి చొచ్చుకుపోతాయి. అందువల్ల మొక్క ఆకు, మొవ్వు వడలి ఎండిపోతుంది. పూ మొగ్గలు , కాయలు ఏర్పడిన తరువాత వాటిని కూడా లార్వాలు తొలచి, లోపలి పదార్థాన్ని తిని నష్టాన్ని కలుగచేస్తాయి. ఆశించిన పూ మొగ్గలు , చిన్నగా ఉన్న కాయలు రాలిపోతాయి. ఈ పురుగు ఆశించిన కాయపై గుండ్రని రంధ్రాలు , రంధ్రాల చుట్టూ విసర్జించిన విసర్జక పదార్థం కనిపిస్తుంది. ఈ పురుగు వల్ల కొమ్మ చివర్లు పెరుగుదల ఆగిపోతుంది. ఆశించిన కాయలు వంకర్లు తిరిగిపోతాయి.

నివారణ :
పంట తొలిదశలో ఈ పురుగు ఆశించిన కొమ్మ చివర్లు తుంచి నాశనం చేయాలి. లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసి ఈ పురుగు యొక్క ఉనికిని, తీవ్రతను గమనించవచ్చు. రసాయనిక మందులైన కార్బరిల్‌ 3గ్రా. లేదా ప్రొఫినోఫాస్‌ 2 మి.లీ. లేదా సైపర్‌మెత్రిన్‌ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో కాయలు కోసిన తరువాత పిచికారి చేయాలి. కార్బరిల్‌ మందును ఎక్కువ సార్లు పిచికారి చేసినట్లయితే నల్లి తీవ్రత ఎక్కువవుతుంది, కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

అక్షింతల పురుగు :

వంగతో పాటు బీర, సొర, బంగాళదుంప, టమాటను కూడా ఆశిస్తాయి. ఈ పెంకు పురుగు గుండ్రంగా ఉండి లేత గోధుమ రంగులో న్లటి మచ్చలు కలిగి ఉంటాయి. తల్లి పెంకు పురుగు పసుపు పచ్చని పొడుగాటి గుండ్రని గుంపుగా ఆకు అడుగుభాగంలో పెట్టడం జరుగుతుంది. గుడ్ల నుండి వెలువడిన పిల్ల పురుగు పసుపు పచ్చ రంగులో ఉండి శరీరం అంతా ముళ్ళను కలిగి ఉంటుంది. ఈ అక్షింతల పురుగు యొక్క పిల్ల, పెద్ద పెంకు పురుగు గీకి తిని నష్టాన్ని కలిగిస్తాయి. ఈ పురుగు పత్రహరితాన్ని గీకి తినడం వల్ల ఈనెలు వాటి శాఖలు మాత్రమే మిగిలి, దూరం నుంచి నష్ట లణాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ పురుగు ఆశించిన మొక్క ఆకు భాగాలు ఎండి రాలిపోవడం వల్ల ఆకుపై రంధ్రాలు ఏర్పడును. కాయపై కూడా ఈ పురుగును గమనించవచ్చును.

నివారణ :

  • పురుగు యొక్క గుడ్లని, జల్లెడాకును, పిల్ల, పెద్ద పెంకు పురుగును సేకరించి నాశనం చేయాలి.
  • వేప సంబంధిత మందులైనటువంటి వేపనూనె, వేప కషాయం పిచికారి చేసినట్లయితే గుడ్లను, పిల్ల పురుగును నివారించవచ్చు.
  • రసాయనిక మందులో కార్బరిల్‌ 3 లేదా డైక్లోరోవాస్‌ 1 మి.లీ. లేదా క్వినాల్‌ఫాస్‌ 2 మి.లీ. లేదా ప్రొఫినోఫాస్‌ 2 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి మొక్క మీద పిచికారి చేసినట్లయితే ఈ పురుగును సమర్థవంతంగా నివారించవచ్చు. పురుగు మందు పిచికారి చేసిన వెంటనే కాయలు కోయకూడదు.

తెల్ల దోమ :

ఇవి మొక్క నుండి రసం పీల్చి నష్టం కలిగిస్తాయి. వీటి పిల్ల పురుగు పసుపు ఆకుపచ్చ రంగులో కోడిగుడ్డు ఆకారంలో ఉంటాయి. పెద్ద తెల్ల దోమలు ఎర్రకళ్ళతో, పసుపు పచ్చని శరీరం, తెల్లని రెక్కతో ఉంటాయి. ఇది వంగను పండించే అన్ని ప్రాంతాల్లో ఆశించి నష్టాన్ని కలిగిస్తుంది. పిల్ల, పెద్ద పురుగు ఆకు అడుగు భాగం నుండి రసాన్ని పీల్చడం వల్ల మొక్కలు పసుపు పచ్చగా మారి ఎండిపోయి, గిడసబారిపోతాయి. ఈ పురుగు ఒకరకమైన తేనె లాంటి పదార్ధం విసర్జించడం వల్ల మొక్కపై నల్లని బూజులాంటి శిలీంధ్రం వ్యాపించును. అందువల్ల పరోక్షంగా ఈ పురుగు వల్ల కిరణజన్య సంయోగక్రియ తగ్గి దిగుబడు తగ్గిపోవును.

నివారణ :

  •  రసాయనేతర పద్ధతి అయినటువంటి జిగురు పూసిన పసుపు రంగు పళ్ళాలు లేదా డబ్బా ఉంచినట్లయితే తెల్ల దోమలు పసుపు రంగుకి ఆకర్షితమై జిగురుకు అంటుకుపోతాయి.
  • సింథటిక్‌ పైరిత్రాయిడ్‌ మందు ఎక్కువగా వాడినట్లయితే వీటి ఉధృతి ఎక్కువగును.
  • ట్రైజోఫాస్‌ 2.5 మి.లీ. లేదా ఎసిఫేట్‌ 1.5 గ్రా. లేదా డైమిథోయేట్‌ 2 మి.లీ. ఒక లీటరు నీటిని కలిపి పిచికారి చేసి ఈ తెల్ల దోమను సమర్థవంతంగా నివారించవచ్చు.
  • పురుగు మందును పిచికారి చేసిన తరువాత వెంటనే కాయలు కోయరాదు.
Leave Your Comments

శనగలో కలుపు యాజమాన్యం

Previous article

తోటకూర సాగు -యాజమాన్య పద్ధతులు

Next article

You may also like