Sericulture: వ్యవసాయంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు వ్యవసాయం అంటే వరి, గోధుమ, పత్తి, మిర్చి తదితర పంటలను వ్యవసాయంలో భాగంగా చూసేవారు. కానీ ప్రస్తుతం వ్యవసాయం దాని అనుబంధ రంగాలపై ఆధారపడి రైతులు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే వరి, గోధుమ, మిర్చి ఇతర పంటలతో పోల్చితే పశుపోషణ, పట్టు సాగు, ఆక్వా తదితర రంగాలు రైతులకు అధిక ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నాయి. ఇక రైతులు కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయ అనుబంధ రంగాలవైపు అడుగులేస్తున్నారు.
భారతీయ వస్త్ర పరిశ్రమలో అధిక నాణ్యమైన ప్రకృతి సిద్ధంగా లభించే పట్టు వస్త్రానికి మంచి డిమాండ్ ఉంది. అయితే మన దేశంలోనే కాకుండా ప్రపంచ మార్కెట్లో పట్టుకు ప్రాముఖ్యత సంతరించుకుంది. అందులో భాగంగానే పట్టుని ఉత్పత్తి చేయడంలో చైనా మొదటి స్థానంలో ఉండగా, భారత దేశం రెండో స్థానంలో ఉంది. కాగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో ముఖ్యమైన పట్టు పురుగుల పెంపకంను భారతదేశంలో దాదాపు 27 రాష్ట్రాల్లో రెండున్నర లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో మల్బరీ తోటలు సాగు చేస్తూ, పట్టు పురుగుల పెంపకంను కుటీర పరిశ్రమగా చేపట్టి లక్షల కుటుంబాలు జీవనోపాధిని పొందు తున్నాయి.
నీటి వసతి వున్న ప్రాంతాలకు అనుకూలమైన మల్బరీ రకాలు వి1, ఎస్36, ఎస్30, ఆర్.ఎఫ్.ఎస్-175 ఉన్నాయి. ఇక నీటి వసతి లేని ప్రాంతాలకు అనుకూలమైన మల్బరీ రకాలలో ఎమ్.జి.ఎస్.-2, ఎస్-13, ఆర్.సి-1, ఆర్.సి-2.
నీటి వసతి వున్న ప్రాంతాలకు అనుకూలమైన మల్బరీ రకాలు:
వి1 : తెలంగాణలో ఎక్కువ విస్తిర్ణంలో సాగు అవుతుంది. దీని ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఎకరాకు 24 టన్నులు / ఎకరాకు / సం. దిగుబడి వస్తుంది. ఎస్36 : కొమ్మలు నిటారుగా పెరిగి, ముదురు ఆకు పచ్చరంగు కల్గిన ఆకులు ఉంటాయి. ఎకరాకు 16 ట/ఎ/సం. దిగుబడి లభిస్తుంది.ఎస్30 రకం ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఆకులు చాకి మరియు పెద్ద పురుగుల పెంపకానికి అనువైనవి. దిగుబడి 16 ట/ఎ/సం. వస్తుంది. ఆర్.ఎఫ్.ఎస్-175 రకం ఎక్కువ తేమ శాతం కలిగి, ఎక్కువ సమయం తేమను నిల్పుకునే శక్తి ఉంటుంది. దిగుబడి 18 ట/ఎ/సం. వస్తుంది.
నీటి వసతి లేని ప్రాంతాలకు అనుకూలమైన మల్బరీ రకాలు:
ఎమ్.జి.ఎస్.-2 రకం 2015 సంవత్సరములో విడుదలైన నూతన వంగడము. ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతున్న రకం ఇది. దిగుబడి 22.7 ట/ఎ/సం. వస్తుంది. ఎస్-13 రకం ఎర్రనేలలకు సరైంది. దిగుబడి ఒక ఎకరానికి 5.2-6.4 టన్నులు/ఎకరాకు/సం. వస్తుంది. ఆర్.సి-1 రకానికి చెందిన మల్బరీ నీటి లభ్యత 50 శాతము తక్కువైనా తట్టుకోగలదు. అదేవిధంగా 50 శాతం వరకు ఎరువులు తగ్గించిన కూడా తట్టుకొని 9-10 టన్నుల ఆకూ దిగుబడిని ఒక ఎకరాణికిస్తుంది. ఆర్.సి-2 రకానికి చెందిన మల్బరీ తక్కువ నీటి వసతి గల ప్రాంతాలకు అనువైనది ఆకు దిగుబడి 8- 9 టన్నులు/ఎకరాకు/సం. వస్తుంది.
Also Read: పట్టుపురుగుల పెంపకం – సస్యరక్షణ
పట్టు సాగు ప్రక్రియ:
పట్టు ఉత్పత్తి అవ్వాలంటే ముందుగా మల్బరీని సాగు చెయ్యాలి. ఎకరానికి దాదాపుగా పదివేల మల్బరీ మొక్కలను నాటాలి. మొక్కలు నాటే ముందు 1-2 సార్లు దున్నాలి. తరువాత బోదెలు వేసుకోవాలి. పశువుల ఎరువు 10-20 ట/ఎకరాకు వేసినట్లయితే మంచి దిగుబడి వస్తుంది. మల్బరీ ఆకును ఆహారంగా తీసుకుని పట్టు పురుగులు 21 రోజుల్లో గుడ్లను పెడతాయి. పట్టు పురుగుల పెంపకానికి 50 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు గల షెడ్ నిర్మించుకోవాలి. ఈ సాగుకు ఎటువంటి ఎరువులు అవసరం ఉండదు. కాగా పట్టు సాగు పంట సంవత్సరానికి ఐదు పంటలు తీసే అవకాశం ఉంది.
చిన్న వయస్సు పట్టు పురుగులను ప్రయివేటు మార్కెట్లో కొనుగోలు చేసుకోవచ్చు. దీంతో రైతులకు 7 నుంచి 8 రోజుల పాటు మల్బరీ ఆకు వేసి మేపాల్సిన పని తగ్గుతుంది. 15 రోజులకే గూళ్లు తయారవుతాయి. కాగా పట్టు పురుగుల పెంపకానికి ప్రధానంగా ఆహారమైన మల్బరీ పంటను అన్ని నేలల్లో పెంచవచ్చు. తేలికపాటి ఎర్ర నేలలైతే బాగా పెరుగుతాయి. చౌడు భూములు పనికిరావు. 15 రోజుల కోసారి నీటి తడులు అందించాలి.
Also Read: మల్బరీ పంట సాగులో మెళుకువలు