Mulberry Cultivation: వ్యవసాయ అనుబంధరంగమైన పట్టు పురుగుల పెంపకం ఇటీవలి కాలంలో ఎందరో రైతులకు ఉపాధిగా మారింది. స్వల్ప కాలంలోనే పెట్టుబడులు చేతికి రావడం, ప్రభుత్వ రాయితీలు లభించడంతో అధిక శాతం రైతులు పట్టు పురుగుల పెంపకానికి ముందుకు వస్తున్నారు. పట్టు పురుగుల పెంపకంలో కీలక దశ చాకీ పురుగుల దశ.
పట్టు పురుగుల పెంపకంలో మొదటి దశ అయిన ఈ చాకీ పురుగుల పెంపకంలో ఎంత శ్రద్ధ వహిస్తే తదుపరి దిగుబడులు అంత బాగుంటాయి. 2 వ దశ నుంచి అందించే మేతల విషయంలోనూ పెంపకదారులు శ్రద్ధ వహించాలి. వర్షాకాలంలో పట్టు పురుగులకు ఎక్కువగా గ్రాస్సేరీ , ఫ్లాచేరి అనే వ్యాధులు సోకి పట్టు పురుగులు చనిపోయెలా చేస్తాయి. కాబట్టి చాకీ పురుగుల దశ నుంచి పట్టు పురుగుల పెంపకంలో కొద్ది పాటి మెళకువలు పాటిస్తే మంచి దిగుబడులు పొందే అవకాశం కలదు.
పట్టు పురుగుల పెంపకంలో చాకీ దశ అనేది చాలా కీలక దశ. పట్టు పురుగుల మొదటి, రెండు దశలను చాకీ పురుగులు అంటారు. వీటిని చాలా జాగ్రత్తగా పెంచుకోవాల్సి ఉంటుంది
ఉష్ణోగ్రత మరియు తేమ శాతం:
వీటికి వాతావరణంలో 28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, 90% గాలీలో తేమ అవసరం.
పట్టు గ్రుడ్లను ఉత్పత్తి కేంద్రాల నుంచి తీసుకురావడానికి ముందు పట్టు రైతులు చేయవలసిన పనులు:
ఈ పట్టు గ్రుడ్లను తెచ్చే ముందు చాకీ షేడ్స్ ని, పరికరాలను వ్యాధి నిరోధక మందులతో డిసిన్ఫెక్ట్ చేయాలి. 2% బ్లీచింగ్ ద్రావణంతో చాకీ షేడ్స్ , పరికరాలు కడుక్కోవాలి. ఆ తర్వాత చాకీ షేడ్స్ , పరికరాలు హస్త్రా ద్రావణంతో కడుక్కోవాలి. చాకీ షేడ్స్ చూట్టు 5% బ్లీచింగ్ పొడిని 2-3 రోజులకు ఒకసారి చల్లాలి.
పట్టు గ్రుడ్లను ఉత్పత్తి కేంద్రాల నుంచి తీసుకువచ్చిన తరువాత పట్టు రైతులు చేయవలసిన పనులు :
పట్టు గ్రుడ్లను తీసుకువచ్చిన తరువాత వాటిని పొదిగించాలి. పట్టు గ్రుడ్లు తెచ్చిన వెంటనే వాటిని 3×2 అడుగులు సైజ్ ఉండే తట్టలలో వుంచి, గదిలో 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, 90% తేమ ఉండేటట్లు ఏర్పాటు చేసుకొని ఆ గ్రుడ్లను పొదిగించాలి. ఈ విధంగా చేస్తే 10-12 రోజులకు పగులుతాయి. ఇంకొక పద్దతి బ్లాక్ బోక్సింగ్ ఈ పద్దతిలో పట్టు పురుగులు 2 రోజులకు పగులుతాయి అనగా నల్లని కాగితం లేదా నల్లని క్లాత్ కప్పి చీకటి కల్పించాలి.
ఈ విధంగా బ్లాక్ బోక్సింగ్ తాయారు చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల పట్టు గ్రుడ్లు అన్ని ఒకేసారి పగిలి బయటకు వచ్చే అవకాశం కలదు.గ్రుడ్లు పగిలే రోజు గ్రుడ్ల పై వున్న నల్లని కాగితం లేదా క్లాత్ ని తీసివేసి ఉదయం 6-10 గంటల వరకు కాంతివంతమైన వెలుతూరు సోకే ఏర్పాటు చేసుకోవాలి. అన్ని లార్వాలు ఓకే సారి బయటకు వచ్చే అవకాశం కలదు.బయటకు వచ్చిన లార్వాలపైన నైలాన్ వల పరచి 0.5×0.5 cm పరిమాణంలో కత్తిరించిన ఆకులను ఒక పొరగా చల్లాలి.
ఒక గంట తరువాత ఈ లార్వాలన్ని ఆకుల పై భాగానికి వస్తాయి. వాటిని పురుగులు పెంచే తట్టలలోకి మార్చి తగినంత స్థల అవకాశం కల్పించి, రెరీంగ్ పెట్టే ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి రోజు తగినంత సైజ్ లో మల్బరీ ఆకులను కత్తిరించి రోజుకు రెండు సార్లు వాటికి ఆహారంగా ఇస్తూ ఉండాలి. మోల్ట్ ఆగిపోయిన వెంటనే వాటిపై సున్నం పొడి చల్లాలి. ఆ విధంగా చల్లడం వలన పెట్టే అంతా డ్రై అయి పురుగులు మోల్ట్ లో ఉన్నప్పుడు ఎటువంటి రోగాలు సోకకుండా ఉంటాయి. ఈ విధంగా చాకీ పురుగులను 3 వ దశ వరకు పెంచి తరువాత వాటిని పెద్ద పురుగులు పెంచే స్టాండ్ లోకి మార్చాలి.
Also Read: Tomato Price: కిలో టమాట 50 రూపాయలకే .. 103 మార్కెట్లలో అందుబాటులోకి తీసుకొచ్చిన ఏపీ ప్రభుత్వం
వర్షాకాలంలో మల్బరీ ఆకులను ఎప్పుడు కోసుకోవాలి?
వర్షాకాలంలో ఆకులపై తడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వర్షం లేని సమయంలో ఆకులను కోసుకొని నిల్వ చేసుకోవాలి. రోజంతా వర్షం పడేలా ఉంటే ఒక మేతకు ముందుగానే ఆకులను కోసి నిటారుగా షేడ్ లో పెట్టుకొని ఆరబెట్టుకోవాలి.
ముఖ్యంగా పెద్ద పురుగులకు 24-26 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత,70% గాలిలో తేమ అవసరం.
ఈ పురుగులపై ప్రతి సారి మేత వేసే ముందు సున్నం పొడిని చల్లితే అక్కడ ఉన్న తేమ శాతం తగ్గి పెంపకానికి అనువుగా ఉంటుంది. దాని వలన ఎటువంటి రోగాలు సంక్రమించే అవకాశం ఉండదు.4 వ దశ నుంచి లేసిన తరువాత ఒక్క సారి మాత్రమే ఈ పట్టు పురుగుల పడకలను శుభ్రం చేయాలి. చదరపు అడుగు బెడ్ విస్తీర్ణంలో 70-100 పురుగులు మాత్రమే ఉండేలా చూసుకోవాలి. వర్షా కాలంలో పట్టు పురుగులకు సోకే గ్రాస్సేరీ, ఫ్లాచేరి అనే వ్యాధులు గురించి తెలుసుకుందాం. ఈ వర్షా కాలంలో తేమ ఎక్కువగా ఉండటం వలన, తడి ఆకు తినడం వల్ల ముఖ్యంగా గ్రాస్సేరీ, ఫ్లాచేరి అనే వ్యాధులు వచ్చే అవకాశం కలదు.
గ్రాస్సేరీ:
దీనినే పాల రోగం అని కూడా అంటారు. ఇది వైరస్ వలన వస్తుంది. పురుగు శరీరం లోపల అంతా కూడా పాలలా తెల్లగా అయి, పురుగు అంచులకు అంటే అరల అంచులకు వస్తుంది, ఆహారం తీసుకోదు, అంచులకు వచ్చి క్రింద పడిపోతది. ఇది ఎక్కువగా ఉష్ణోగ్రతలో హెచ్చు తగ్గులు వలన గాని,తడి ఆకు ఎక్కువగా తినడం వలన గాని ఈ రోగం వస్తుంది.
ఫ్లాచేరి:
ఈ ఫ్లాచేరి అనేది ఆకు నాణ్యత లేకుండా తడి ఆకు తినడం వల్ల, నిరసించి , నోటి నుండి ద్రవం వచ్చి పురుగు కుసించుకుపోయి చనిపోతుంది. సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోయిన ఈ ఫ్లాచేరి అనే వ్యాధి వచ్చే అవకాశం కలదు.
గ్రాస్సేరీ, ఫ్లాచేరి రోగాలు సోకిన పురుగులను బెడ్ నుండి వేరుచేసి మిగిలిన బెడ్ లో సున్నం పొడిని చల్లి అక్కడ నుండి వ్యాప్తి చెందకుండా చేయవచ్చు. చంద్రిక మీద మోల్టింగ్ చేసే విధానంలో కొన్ని మెళకువలు పాటించాలి. ముందుగా ఒక 25% పురుగులు పక్వానికి వచ్చి గూడు కట్టే సమయంలో వాటిని ఎరి వెదురు చంద్రికలపై గాని, ప్లాస్టిక్ నేత్రిలపై గాని,వేయాలి. అరలలో మిగిలి ఉన్న పురుగులపై ప్లాస్టిక్ నెత్రి లు పరచాలి. అప్పుడు ఆ పురుగులు దాని మీదకు చేరి గూళ్ళు కట్టుకుంటాయి. 2 రోజులలో గూళ్ళు కడతాయి. ఆ 2 రోజులు పొడి వాతావరణం కల్పించాలి. అవసరమైతే ఫ్యాన్స్ కూడా వేసుకోవాలి.
మార్కెట్ కు తీసుకువెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
మనం గూళ్ళు నేత్రి నుంచి వేరు పరచి మార్కెట్ కు తీసుకువెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వర్షం లేని సమయంలో మాత్రమే ఈ గూళ్ళును మార్కెట్ కు తీసుకెళ్లాలి. ఈ విధంగా పట్టు పురుగులు మొదట పెట్టినప్పటి నుండి మార్కెట్ కు గూళ్ళు తీసుకువెళ్ళే వరకు ప్రతి దశలో కూడా ఈ జాగ్రత్తలు పాటిస్తే వర్షా కాలంలో కూడా మంచి లాభాలు పొందవచ్చు.
Also Read: Wheat Rava Idli Recipe: బరువు తగ్గడానికి సహాయపడే గోధుమరవ్వ ఇడ్లినీ అరగంటలో తయారు చేసేద్దామా .!