Safflower Cultivation: కుసుమ మన రాష్ట్రంలో సుమారు 15,000 – 20,000 ఎకరాల్లో నల్లరేగడి నేలలందు వర్షాధారపు యాసంగి పంటగా రంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో సాగు చేయబడుతున్నది. వర్షాభావ పరిస్థితుల్లో ఖరీఫ్ పంటలు దెబ్బతిని నష్టపోతే, కుసుమ మంచి ప్రత్యామ్నాయ పంట. కొద్దిపాటి క్షారత్వం గల సమస్యాత్మక భూముల్లో కుసుమను లాభదాయకంగా పండించవచ్చు. మన రాష్ట్రంలో గత దశాబ్ద కాలంగా కుసుమ పంట విస్తీర్ణం తగ్గడానికి ప్రధాన కారణం కోత సమయంలో ఈ పంటలో ముళ్ళ వల్ల కూలీలు విముఖత చూపడం అని గమనించడం జరిగినది.
నేలలు: నీరు నిలువని, బరువైన, తేమను నిల్పుకోనే నల్లరేగడి మరియు నీటి వసతి గల ఎర్ర గరప నేలలు ఈ పంట సాగుకు మిక్కిలి అనుకూలం. మ్యాజేరియం ఎండుతెగులు ఎక్కువగా ఆశించే అవకాశం వున్నందున ఆమ్లత్వం గల భూములు పనికిరావు. అయితే కొద్దిపాటి క్షారత్వాన్ని కుసుమ పంట తట్టుకుంటుంది.
Also Read: Safflower Cultivation: కుసుమ సాగు యాజమాన్య పద్దతులు
నేల తయారీ: యాసంగిలో ఏక పంటగా వేసుకునేటప్పుడు నాగలితోగాని, ట్రాక్టర్ గాని లోతుగా దున్నుకొని, ఆ తరువాత రెండు మూడు సార్లు గుంటకను తోలు కున్నట్లయితే కలుపును నివారించుకోవడమే కాకుండా, భూమిలోని తేమను సంరక్షించుకోవచ్చు. కుసుమను స్వల్పకాలిక ఖరీఫ్ అపరాల తరువాత వేసుకునేటప్పుడు, ఖరీఫ్ పంటను కోసిన తరువాత పైపైన రెండుసార్లు గుంటకను తొలి కలుపు లేకుండా చూసుకోవాలి.
నీటి యాజమాన్యం: బరువైన నేలల్లో పంటకు నీటి తడి ఇవ్వవలసిన అవసరం లేదు. తేలిక నేలల్లో ఒకటి, రెండు నీటి తడులు అవసరం. రకాన్ని బట్టి మరియు నేలల్లో తేమను బట్టి కుసుమలో పూత 65 నుండి 75 రోజులకు వస్తుంది. వర్షాభావ పరిస్థితులలో కీలక దశలయినటువంటి కాండం సాగే దశ (30-35 రోజులలో) లేక పూతదశ (65 నుండి 75 రోజులకు) లలో ఒక తడి కట్టినట్లయితే దిగుబడులు 40-60% పెరిగే అవకాశం వుంటుంది.
కలుపు నివారణ,అంతరకృషి: విత్తిన 20-35 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తిన 25 రోజులకు మరియు 45-60 రోజులకు దంతులు తోలి అంతరకృషి చేసుకోవాలి. దీని వలన కలుపును నివారించడమే కాకుండా భూమిలోని తేమను సంరక్షించుకోవచ్చు. విత్తిన వెంటనే పెండిమిథాలిన్ 30% ఎకరాకు లీటరు చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారి చేయాలి.
Also Read: Benefits of Safflower Farming: కుసుమ తో ఆరోగ్య ప్రయోజనాలెన్నో