Protection of Fruit Crops from Rain : భారత దేశ వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి లెక్కల ప్రకారం మన దేశంలో 2020 – 21 సంవత్సరంలో పండ్ల తోటలు 6,914 హెక్టార్లలో సాగు చేయబడగా, 1,03,027 మిలియన్ టన్నుల ఉత్పత్తి మరియు ఒక హెక్టారుకు 14.90 మెట్రిక్ టన్నుల ఉత్పాదకత సాధించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ వారి లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే 2020 – 21 సంవత్సరంలో 4,24,287 ఎకరాలలో పండ్ల తోటలు సాగుచేయబడగా, పండ్ల ఉత్పత్తి 23,89,184.54 మెట్రిక్ టన్నులు సాధించడం జరిగింది. అయితే పండ్ల దిగుబడి తగ్గడానికి తోటలలో ఆశించే రకరకాల కీటకాలు, పురుగులు మరియు వివిధ రకాల తెగుళ్ళతో పాటు భారీ వర్షాలు మరియు అకాల వర్షాలు కూడా కారణమవుతున్నాయి. భారీ వర్షాలు వివిధ రకాల తోటలలో మొక్క యొక్క వివిధ దశలలో నష్టం కలుగజేసే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు పాటించినట్లయితే కొంత మేర నష్టాన్ని నివారించవచ్చు.
అధిక వర్షాలు పడినప్పుడు సాధారణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
- వీలైనంత త్వరగా చేలల్లో అధికంగా ఉన్న నీటిని తీసివేయాలి.
- పంట ఎదుగుదలకు తోడ్పడే విధంగా బూస్టర్ డోస్ ఎరువులను వేసుకోవాలి.
- అధిక తేమ వలన ఉధృతి పెరిగే అవకాశం గల తెగుళ్లు మరియు పురుగుల నివారణ చర్యలు చేపట్టాలి.
- లేత తోటలలో చనిపోయిన మొక్కలను తీసివేసి క్రొత్త మొక్కలను నాటుకోవాలి.
- వర్షాలు తగ్గగానే వీలైనంత త్వరగా చెట్ల మధ్య దున్నడం వలన తేమ త్వరగా ఆరి చెట్లు కోలుకుంటాయి.అధిక వర్షాలకు వేళ్ళతో సహా ఒరిగిన చెట్లను లేపి నిలబెట్టి, మట్టిని ఎగదోసి ఊతమివ్వాలి.
మామిడి :
- ఒరిగిన / పడిపోయిన చిన్న చెట్లను లేపి మట్టిని ఎగదోయాలి.
- విరిగిన కొమ్మలను కత్తిరించి, పై భాగాన బోర్డో పేస్ట్ లేదా కాపర్ ఆక్సీ క్లోరైడ్‌ను పూతగా పూయాలి.
- విరిగిన కొమ్మలను కత్తిరించి, పై భాగాన బోర్డో పేస్ట్ లేదా కాపర్ ఆక్సీ క్లోరైడ్‌ను పూతగా పూయాలి.
- చెట్టు ఒక్కటికి 500 గ్రా. యూరియా, 417 గ్రా. మ్యూరేట్ ఆఫ్ పోటాష్ మరియు 25 కిలోల పశువుల ఎరువులను వేయాలి.
- వేర్లను తెగుళ్లు నుండి కాపాడడానికి కాపర్ ఆక్సీ క్లోరైడ్‌ను 3 గ్రా./ లీ. చొప్పున మొదళ్ళ వద్ద తడపాలి.
- పక్షి కన్ను తెగులు మరియు పండు కుళ్ళు వంటి తెగుళ్ళ నివారణకు కార్బండిజమ్ 1 గ్రా. లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
- పురుగుల నివారణకు డైమిథోయేట్ 2 మి.లీ.లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
- చెట్లు త్వరగా కోలుకోవడానికి పొటాషియం నైట్రేట్ 10 గ్రా. మరియు బోరాక్స్ 1.25 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
- తోటలలో పిందె రాలుడు నివారణకు ప్లానోఫిక్స్ 20 పి.పి.ఎం. (2 గ్రా./100 లీ.) చొప్పున పిచికారీ చేయాలి.
- కోతకు సిద్ధంగా ఉన్న పండ్లను వీలైనంత త్వరగా కోసుకోవాలి. రాలిన పండ్లను వెంటనే ఏరి శుభ్రం చేసి మార్కెట్‌కు పంపాలి లేదా విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసుకోవాలి.
అరటి :
- తోటలలో నిల్వ ఉన్న నీటిని వీలైనంత త్వరగా బయటకు వెళ్లదీయాలి.
- విరిగిన చెట్లను రెండు పిలకలు వదలి కోసివేయాలి.
- అరటి చెట్లు 4 రోజుల కంటే ఎక్కువ నీటి ముంపుకు గురైతే ఏ వయసు తోటలలోనైన తిరిగి కోలుకోవడం కష్టం.
- ఒకవేళ కోలుకున్న తక్కువ ఎదుగుదల మరియు దిగుబడులు వస్తాయి.
- నీటి ముంపులో తోట 2 రోజులు ఉన్నట్లయితే వీలైనంత త్వరగా నీరు తీసివేసి, తోటలను ఆరేలా చేసి చెట్టు ఒక్కింటికి 100 గ్రా. యూరియా, 80 గ్రా. పోటాష్ ఎరువులను వేసుకోవాలి.
- 3 నెలల వయస్సు కన్నా తక్కువ వయస్సు గల ఉన్న మొక్కలు 3 అడుగుల లోతు నీటిలో మునిగిపోతే నేల ఆరిన వెంటనే మరలా కొత్త పిలకలను నాటుకోవాలి.
- గొర్రుతో అంతర సేద్యం చేసి మొక్కకు 100 గ్రా. యూరియా మరియు 80 గ్రా. మ్యూరేట్ ఆఫ్ పోటాష్ ను 2-3 సార్లు 20-25 రోజుల కాలవ్యవధిలో వేయాలి.
- ఆకులు, గెలలపై పొటాషియం నైట్రేట్ (13-0-45 (ముల్టి – కె)) 5 గ్రా./ లీటరు నీటికి చొప్పున వారం రోజుల వ్యవధిలో 3 నుండి 4 సార్లు పిచికారీ చేయాలి.
- సగం తయారైన గెల ( 75% లోపు పక్వానికి వచ్చిన గెల) లను ఎండిన అరటి ఆకులతో కప్పి ఉంచి 15 రోజుల లోపు కోసి మార్కెట్ చేసుకోవాలి.
- వెదురు బొంగులతో ఊతమిచ్చి, మొక్కలు పడిపోకుండా చూసుకోవాలి.దుంపకుళ్ళు నివారణకు కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రా. / లీటరు నీటికి కలిపి లేదా బోర్డో మిశ్రమం 1 శాతం మొక్క చుట్టూ తడిచేటట్లుగా నేలలో పోయాలి. సిగటోక ఆకు మచ్చ తెగులును అరికట్టుటకు ప్రొపికోనజోల్ 1 మి.లీ. లేదా మాంకోజెబ్ 2.5 గ్రా. / లీటరు నీటికి (1-2 సార్లు వారం రోజుల వ్యవధిలో) పిచికారీ చేయాలి.
బొప్పాయి :
- మొక్క మొదళ్ళ దగ్గర ఉన్న నీటిని తీసివేయాలి.
- మెటలాక్జిల్ ఎంజెడ్ 3 గ్రా. లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. / లీటరు నీటికి కలిపి మొదళ్ళ దగ్గర పోయాలి.
- సూక్ష్మపోషకాల మిశ్రమాన్ని 5 గ్రా. / లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
- కోతకు తయారై ఉన్న కాయలను మార్కెట్ కు తరలించాలి.పండు కుళ్ళు నివారణకు హెక్సాకోనజోల్ 2 మి.లీ. లేదా డైఫెన్ కొనజోల్ 0.5 మి.లీ. ం 0.5 మి.లీ. (స్టికర్) జిగురు మందును కలిపి పిచికారీ చేయాలి.
బత్తాయి మరియు నిమ్మ :
- తోటలలో ఉన్న నీటిని తీసివేసి, పళ్ళాలలో తిరగవేసి వేరు వ్యవస్థకు ఎండ తగిలేలా చేయాలి.
- పడిపోయిన చెట్లను యథాస్థితికి తెచ్చి, ఊతమిచ్చి కట్టాలి. బయటకు వచ్చిన వేళ్ళపై మట్టిని కప్పి గట్టిగ అదమాలి.
- విరిగిన కొమ్మలను కత్తిరించి, పై భాగాన బోర్డో మిశ్రమం పోయాలి.
- 8 సంవత్సరాలు పైబడి, కాపు కాస్తున్న తోటలలో చెట్టుకు 500 గ్రా. యూరియా మరియు 750 గ్రా. పోటాష్ ను వేసుకోవాలి.
- చెట్టు మోదళ్ళ దగ్గర 1 శాతం బోర్డో మిశ్రమం లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. / లీ. నీటికి పోయాలి.
- తోటల్లో కాపు ఉన్నట్లయితే ప్లానోఫిక్స్ 2.5 మి.లీ./ 10 లీటర్ల నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసి పిందె / పండు రాలడాన్ని నివారించుకోవాలి.బెంజైల్ అడినైన్ ఏ 50 పి.పి.ఎమ్ పిచికారీ చేయాలి (తద్వారా పత్ర రంధ్రాలు తెరుచుకొని భాస్పోత్సేకం అధికమై నేలలోని అధిక తేమను నివారించుకోవచ్చు).
జామ :
- అధిక నీటిని తీసివేసి గొర్రుతో దున్నకం చేపట్టి, తేలికగా చెట్టు చుట్టూ త్రవ్వి, పాదులు తయారు చేసుకోవాలి.
- చెట్టు మొదళ్ళ దగ్గర కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రా. / లీ. చొప్పున ద్రావణాన్ని పోయాలి.
- కాయకోత అనంతరం వచ్చే ఆంత్రాక్నోస్ తెగులు నివారణకు కార్బండిజమ్ 1 గ్రా. లీ. నీటికి కలిపి పిచికారీ చేయాలి.
- పొటాషియం నైట్రేట్ 10 గ్రా. /లీ. నీటికి కలిపి పిచికారీ చేయాలి.
- జామలో వడలు తెగులు (విల్ట్) నివారణకు ట్రైకోడెర్మావిరిడి మిశ్రమాన్ని (30 కిలోల పశువుల ఎరువు ం 4 కిలోల వేపపిండి ం 500 గ్రా. ట్రైకోడెర్మావిరిడి / ఒక చెట్టుకు) వేయాలి.
- చౌడు ఉన్నట్లయితే 1 కేజీ జిప్సం ఒక చెట్టుకు వెయ్యాలి.
- కార్బండిజమ్ 1 గ్రా./ లీ. నీటికి కలిపి మొదళ్ళ దగ్గర పిచికారీ చేయాలి.
Also Read: Rain Forecast: పొంచి ఉన్న భారీ వర్షపాత ముప్పు.!
దానిమ్మ :
- తోటలలో అధికంగా ఉన్న నీటిని తీసివేయాలి.
- మొదళ్ళ వద్ద నీటిని తిరగవేయాలి.
- చెట్టు మొదళ్ళను కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రా. / లేదా నీటికి కలిపిన ద్రావణంతో తడిపి వేర్లు తెగుళ్ళకు గురికాకుండా చూడాలి.
- బాక్టీరియా తెగుళ్ళు నివారణకు కాపర్ ఆక్సీ క్లోరైడ్ 30 గ్రా. / 10 లీటర్ల నీటికి మరియు స్ట్రెప్టోసైక్లిన్ 1 గ్రా. / 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి.ఎండిపోయిన మరియు తెగుళ్ళు సోకిన కొమ్మలను కత్తిరించి నాశనం చేయడం ద్వారా బాక్టీరియా తెగుళ్ళ ఉధృతిని తగ్గించి, కత్తిరించిన భాగాలకు బోర్డో పేస్టును పూయాలి.
సపోట :
- అధికంగా ఉన్న నీటిని తీసివేయాలి.
- విరిగిన కొమ్మలను కత్తిరించి, బోర్డో పేస్టును కత్తిరించిన భాగాలకు పూయాలి.
- మొదళ్ళ వద్ద నీటిని తిరగవేయాలి.
- చెట్టుకు 220 గ్రా. యూరియా, 115 గ్రా. పొటాష్ మరియు 13 కిలోల పశువుల ఎరువును వేసుకోవాలి.
- ఆకుమచ్చ తెగులు నివారణకు కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రా. / లీ. చొప్పున చెట్టు మొత్తం తడిచేలా పిచికారీ చేయాలి.
రేగు :
- తోటలలో నిలువ ఉన్న నీటిని బయటకు తీసివేయాలి.
- గొంగళి పురుగుల నివారణకు క్వినాల్ ఫాస్ 2 మి.లీ. / లీ. లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. / లీ.చొప్పున పిచికారీ చేయాలి.
- బూడిద తెగులు నివారణకు డైనోకాప్ 1 మి.లీ. / లేదా ట్రైడిమెఫాన్ 1 మి.లీ./ లీ. 20 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.
- పైన తెలుపబడిన యాజమాన్య పద్థతులు పాటించేటప్పుడు ముఖ్యంగా భారత వాతావరణ శాఖ, న్యూ ఢల్లీి వారి ముందస్తు వాతావరణ సూచనలు అనుసరించినట్లయితే వర్షపు రాకను ముందే పసిగట్టి వేసే ఎరువులు మరియు పిచికారీ చేయబోయే మందులు వృధా కాకుండా నివారించి మట్టి మరియు నీటి కాలుష్యం కాకుండా నివారించవచ్చు. ఈ విధంగా పంటకి సరైన సమయంలో పోషకాలు అందించడం, సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా అనవసరపు ఖర్చును తగ్గించి మంచి లాభాలు పొందవచ్చు.
-డా. వి. చైతన్య, ఉద్యాన శాస్త్రవేత్త.
-డా. హేమంత కుమార్, కార్యక్రమ సమన్వయకర్త.
-డా. నాగరాజు, వ్యవసాయ వాతావరణ శాస్త్రవేత్త .
-డా. డబ్ల్యు. జె. సునీత, గృహ విజ్ఞాన శాస్త్రవేత్త.
-డా. పి.యస్.యమ్. ఫణి శ్రీ, వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్త.
-డా. కె. రవి కుమార్, సస్య రక్షణ శాస్త్రవేత్త.
కెవికె, వైరా, ఖమ్మం .
Also read: Rainfall Impact on Crops: పంటల మీద వర్షపాత ప్రభావం ఎలా ఉంటుంది.!
Must Watch: