Drum Seeder Machines: మారుతున్న వాతావరణ పరిస్థితులకనుగుణంగా రైతులు కొత్త ఆలోచనలతో వ్యవసాయ సాగు విధానాల్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ డిప్యూటీ మేనేజర్ ఆర్ హరిబాబు అన్నారు. జులై 17 వ తేదీన వివిధ గ్రామాల్లో ఫెర్టి కం సీడ్ డ్రిల్ యంత్రం మరియు డ్రం సీడర్ యంత్రం ద్వారా సాగవుతున్న వరి సాగు ప్రదర్శన క్షేత్రాలను సందర్శించిన తరువాత ఆయన మాట్లడుతూ …… వాతావరణం లో వస్తున్న మార్పుల వలన జూలై మూడో వారం వస్తున్నా అవసరమైన మేరకు వర్షాలు పడకపోవడంతో రైతన్నల్లో ఆందోళన కలుగుతున్నదన్నారు . మన పూర్వీకులు చెప్పిన ”ఆరుద్రలో అట్టెడు చల్లితే పుట్టెడు పండుతాయని” ఆశ్లేషలో వరి ఊడ్పు ఆరింతలవుతుందనే సామెతలకు ఇప్పటి పరిస్థితులకు పొంతన లేకుండా ఉంది.

Seed Drum
దీని కారణం మానవ కార్యకలాపాల వలన భూమిపై పచ్చదనాన్ని నాశనం చేయడం ద్వారా వాతావరణంలో ఉష్ణోగ్రతలో పెరగడమే కారణం. రైతులు ముందస్తుగా మేలుకొని మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వేసవి దుక్కులు చేసుకోవాలని రైతులకు సూచించారు. వర్షాకాలం ఆరంభం నుండి తక్కువ నీటి వినియోగంతో పంటలు పండించడంగా ఆరుతడి విధానాలైన ఎరువు మరియు విత్తనం ఒకేసారి వేసే యంత్రాన్ని ఉపయోగించి వరి సాగుచేయడం అన్ని విధాల లాభదాయకం. దీనివలన సగం విత్తనాలు ఆదా అవటంతో పాటు నారు పోసి, పొలం దమ్ము చేసి, నాట్లు వేసే పద్ధతి ఉండదు కాబట్టి కూలీల ఖర్చు కూడా సుమారు 5,000 రూపాయల వరకు ఆదా అవుతుంది.
Also Read: Umran Regi Pandu: లాభాలు కురిపిస్తున్న ఉమ్రాన్ రేగు పండు సాగు

Drum Seeder Machines
డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఏరియా మేనేజర్ పి. తవిటినాయుడు మాట్లాడుతూ జూలై మాసంలో వర్షాలు అడపాదడపా కురిసినట్లయితే డ్రం సీడర్ పద్ధతిలో వరి సాగు చేయడంపై రైతులకు అవగాహన కలిగించారు. ఈ తడి ఎద పద్ధతిలో ఈ విధానం చాలా సులువైనదే కాక రైతులు పెట్టుబడి ఖర్చులు ఆదా చేసుకోవచ్చునన్నారు. చక్కగా దమ్ము పట్టి చదును చేసిన పొలంలో ముందుగా నానబెట్టిన వరి విత్తనాలతో నింపిన డ్రం సీడర్ కేవలం ఒక గంటలో ఒక రైతు ఒక ఎకరా పొలంలో విత్తనాలు నాటుకోవచ్చునన్నారు.

Drum Seeder Usage
వరుసల్లో విత్తనాలు వేయడం వలన చీడపీడల ఉధృతి కూడా తక్కువగా ఉంటుంది. పంట కూడా సాధారణ పద్ధతి కంటే పది రోజులు ముందుగా కోతకు వస్తుంది అని అన్నారు. డ్రం సీడర్ యంత్రాలు కావలసిన రైతులకు తమ సంస్థ ద్వారా 50% రాయితీపై యంత్రాలు అందిస్తామని ఈ అవకాశాన్ని రైతు సోదరులు వినియోగించుకోవాలని దీని వలన రబీ కాలంలో మొక్కజొన్న పంట ముందస్తుగా పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉందన్నారు.
Also Read: AP Speaker Tammineni Seetharam: పంటకు గరిష్ట మద్దతు ధర అందిస్తున్నది వైసీపీ సర్కార్ లోనే.!