Farmers need to grow alternative crops కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన నేపథ్యంలో గతంలో లాగా రాష్ట్ర వ్యవసాయ చట్టం నిబంధనల ప్రకారం వ్యవసాయ మార్కెట్లను మరింత పటిష్టం చేయాలన్నారు తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. మార్కెటింగ్, ఉద్యాన శాఖ, వేర్ హౌసింగ్, మార్క్ ఫెడ్, హాకా సంస్థలపై హిమాయత్ నగర్ మార్కెటింగ్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy ) మాట్లాడుతూ…
వ్యవసాయం లేకుంటే భారతదేశమే లేదు. రైతుల శ్రేయస్సు కోసం పంటలకు మద్దతుధరపై కేంద్రం చట్టం చేయాలన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. వ్యవసాయ మార్కెట్లలో మార్కెట్ ఫీజు పకడ్భంధీగా వసూలు చేయాలి .. చెక్ పోస్టులు అన్నింటినీ బలోపేతం చేయలని అన్నారు. రాబోయే కాలంలో వచ్చే వ్యవసాయ ఉత్పత్తుల నేపథ్యంలో మార్కెట్లలో వసతులు సమకూర్చాలి .. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి. యాసంగిలో పంటల మార్పిడి పెద్ద ఎత్తున జరగాలి. పప్పుగింజలు, నూనెగింజలు అధికంగా సాగు చేయాలని మార్కెట్ రీసెర్చ్ & అనాలసిస్ వింగ్ కు సూచించారు. కోహెడలో అంతర్జాతీయ స్థాయి వసతులతో మార్కెట్ ఏర్పాటు జరగనున్నది .. డీపీఆర్ రాగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదంతో చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కొల్లాపూర్ లో మామిడి మార్కెట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. జగిత్యాల మామిడి ముంబయికి వెళ్తుంది. కొల్లాపూర్ మామిడికి అక్కడే మార్కెట్ ఏర్పాటు చేస్తే హైదరాబాద్ మార్కెట్ మీద వత్తిడి తగ్గుతుందని అభిప్రాయపడ్డారు నిరంజన్ రెడ్డి. హైదరాబాద్ మార్కెట్ కు వచ్చేది ప్రధానంగా దక్షిణ తెలంగాణ మామిడి అని, అందులో ముఖ్యంగా కొల్లాపూర్ మామిడేనని తెలిపారు. ఉద్యాన పంటల అమ్మకాలలో రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలి ..దీనిపై వివిధ రాష్ట్రాల మార్కెట్లను అధ్యయనం చేసి రైతులకు లాభం కలిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు మంత్రి. Telangana Agriculture
రైతు వేదికలలో రైతులకు సమగ్ర సమాచారం అందుబాటులో ఉంచడం జరిగిందని, వరంగల్, ఖమ్మంలలో మిరప ట్రేడింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అదేవిధంగా యాసంగి సాగుకు సరిపడా ఎరువుల సన్నద్దతపై సమీక్ష నిర్వహించాల్సి ఉందని అన్నారు. క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్న ఎరువుల వివరాలు, ముఖ్యంగా డీఎపి, కాంప్లెక్స్ ఎరువుల వివరాలు ప్రతి రోజూ తెప్పించుకుని మానిటరింగ్ చేయాలని సూచించారు. Farmers need to grow alternative crops
వివిధ ప్రభుత్వ గురుకులాలు, పాఠశాలలకు నిత్యావసర వస్తువుల సరఫరా దిశగా హాకా ఆలోచించాలి .. ఈ దిశగా వెంటనే దృష్టి సారించి నివేదిక తయారు చేసి ఇవ్వండని సంబంధిత అధికారులను ఆదేశించారు మంత్రి. ఏడాదికి 20 వేల మెట్రిక్ టన్నుల శ్రీ గంధానికి Sandalwood అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ ఉంది .. శ్రీగంధం సాగు వైపు రైతులను ప్రోత్సహించాలి .. శ్రీ గంధం అమ్ముకునేందుకు అటవీ నిబంధనలు సరళతరం చేయాలని సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నాలుగు వేల ఎకరాలలో శ్రీగంధం సాగవుతుంది. ఇది ప్రతి ఏటా పెరుగుతున్నదని తెలిపారు మంత్రి నిరంజన్ రెడ్డి.
పట్టణప్రాంతాల చుట్టూ కూరగాయల సాగు పెంపుపై దృష్టి సారించాలి. వేర్ హౌసింగ్ గోదాముల నిర్మాణం వేగవంతం చేయాలి. ఏ ఇబ్బందులున్నా వెంటనే నా దృష్టికి తీసుకురావాలని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.