Centre To Purchase 6 Lakh metric Tonnes Of Paddy From Telangana తెలంగాణ వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొద్దిరోజులుగా మాటల యుద్ధం కొనసాగుతున్నది. యాసంగి పంటను సేకరించేది లేదని కేంద్రం స్పష్టమైన వైఖరితో ముందుకు వెళ్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై పోరాటం చేస్తుంది. అందులో భాగంగా తెలంగాణ మంత్రులు, ఎంపీలు ఢిల్లీ పర్యటన చేపట్టి పలుమార్లు కేంద్రం మంత్రులతో భేటీలు నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి ఎటువంటి స్పష్టత రానటువంటి పరిస్థితి. కాగా.. నేడు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ధాన్యం సేకరణపై సమాచారం అందించింది.
ఖరీఫ్ సీజన్ కు సంబంధించి అదనపు ధాన్యాన్ని సేకరించేందుకు కేంద్రం సిద్ధమైంది. మరో 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేంద్రం స్వీకరించేందుకు సిద్ధమైనట్లు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపింది. గతంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. సర్కారు విజ్ఞప్తితో ఇప్పుడు.. మరో ఆరు లక్షల టన్నులు అదనంగా తీసుకోనుంది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ జైప్రకాష్ లేఖ రాశారు. ఇక కేంద్రం కోసం 68.65 లక్షల వరి ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించనుంది రాష్ట్ర ప్రభుత్వం. Telangana Paddy Procurement