Telangana Paddy Procurement వరి ధాన్యం కొనుగోలుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రం ప్రభుత్వానికి కొంత కాలంగా మటల యుద్ధం కొనసాగుతుంది. యాసంగి పంట కొనుగోలుపై మొదలైన ఈ రగడ ఢిల్లీ స్థాయిలో చర్చనీయాంశమైంది. యాసంగి పంటను కొనుగోలు చేసే ప్రసక్తే లేదంటూ కేంద్రం చెప్తుండగా.. ధాన్యం కొనుగోలు ప్రక్రియ కేంద్రం బాధ్యత, కేంద్రమే కొనుగోలు చేయాలని రాష్ట్ర నాయకత్వం డిమాండ్ చేస్తుంది. అందులో భాగంగా సీఎం కేసీఆర్ తో సహా రాష్ట్ర యంత్రంగా ఢిల్లీ పర్యటన చేపట్టింది. తదనంతరం తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు, తెరాస ఎంపీలు కేంద్రం పెద్దలతో భేటీ అయ్యారు. అయితే ఇదంతా పక్కనపెడితే తాజాగా కేంద్రం తెలంగాణపై ప్రశంసలు కురిపించింది.
వరి ధాన్యం సేకరణలో తెలంగాణ మరియు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ప్రశంసించింది. 2020-2021ఖరీఫ్‌లో దేశవ్యాప్తంగా 894.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. అయితే గత ఏడాదితో పోల్చితే ప్రస్తుతం ధాన్యం సేకరణ 15 శాతం పెరిగింది. గతం కంటే ఎక్కువ ధాన్యం సేకరించిన రాష్ట్రాల్లో తెలంగాణతో పాటు పంజాబ్, బిహార్, గుజరాత్, జార్ఖండ్, కేరళ, మధ్యప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్‌లు రాష్ట్రాలు ఉన్నాయి. ఈ మేరకు 1.31కోట్ల మంది రైతులకు కనీస మద్ధతు ధరతో రూ.1,68,849కోట్ల మేర లబ్ది జరిగింది. 2021-22లో దేశవ్యాప్తంగా బుధవారం వరకు 472.47లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగినట్లు కేంద్రం పేర్కొంది. Telangana Paddy Procurement 2021-22
కాగా.. తెలంగాణ మంత్రుల ఢిల్లీ పర్యటన తర్వాత కేంద్రం తెలంగాణపై సానుకూలంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తుంది. ముందు నుంచి చెప్తున్నట్టుగా మిగులు బియ్యాన్ని కొనలేమని, ఇప్పటికే అనుకున్నదానికంటే ఎక్కువే కొనుగోలు చేశామని చెప్పిన కేంద్రం తాజాగా తెలంగాణ నుంచి మరో 6 లక్షల టన్నుల బియ్యాన్ని కొంటామంటూ తెలంగాణ వ్యవసాయ శాఖకు లేఖ రాసింది. ఇక ప్రస్తుతం తెలంగాణ వరి సేకరణలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. Telangana Agriculture