Ex CM Rosaiah Passed Away ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కన్నుమూశారు(88). గత కొద్దిరోజులుగా రోశయ్య అనారోగ్యంతో బాధపడుతున్నారు. బీపీ డౌన్ కావడంతో నిన్న శనివారం కుటుంబ సభ్యులు బంజారాహిల్స్ లోని స్టార్ ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిశీలించిన వైద్యులు మార్గ మధ్యంలోనే చనిపోయినట్లు నిర్ధారించారు. కాంగ్రెస్‌లో కీలక నేతగా ఎదిగిన రోశయ్య, దాదాపు ఆరు దశాబ్దాల పాటు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు.
1933, జూలై 4న గుంటూరు జిల్లాలో వేమూరు గ్రామములో ఆదెమ్మ, సుబ్బయ్య దంపతులకు జన్మించిన రోశయ్య. గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ లో ఎన్నో కీలక పదవులు చేపట్టారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వములో రోడ్డు రహదార్లు శాఖ, రవాణ శాఖల మంత్రిగా పనిచేశారు.
1978లో రవాణా, R&B మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోశయ్య 1980లో రవాణా, గృహ నిర్మాణ మంత్రిగా పదవి చేపట్టారు. 1982లో హోంమంత్రిగా పని చేశారు. 1989లో ఆర్థిక, రవాణా, విద్యుత్ శాఖ మంత్రిగా, 1990లో ఆర్థిక, ఆరోగ్య, విద్యా, విద్యుత్ శాఖ మంత్రిగా, 1994 నుంచి 1996వరకు ఏపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. 2004లో ఆర్థిక, శాసనసభా వ్యవహారాల మంత్రిగా, 2007లో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు రోశయ్య. 2009 సెప్టెంబర్ 3 నుంచి 2010 నవంబర్ 24 వరకు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా పని చేశారు. 2011 ఆగస్టు 31 నుంచి 2016 ఆగస్టు 30 వరకు తమిళనాడు గవర్నర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. 2014 జూన్ 28 నుంచి 2014 ఆగస్టు 31 వరకు కర్ణాటక గవర్నర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు.
రోశయ్య మృతి పట్ల రాజకీయ నాయకులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మిత్రుడిని కోల్పోయామంటూ సోషల్ మీడియాలో సంతాపం తెలియజేస్తున్నారు. అలాగే ఏరువాక మాస పత్రిక సంస్థ తరుపున వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. Rosaiah Passed Away