ఆరోగ్యం / జీవన విధానం

నేరేడు పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

0

Jamun Fruit Benefits : నేరేడు (ఇండియన్ బ్లాక్ బెర్రీ) పండ్లలో మంచి ఔషధ,పోషక విలువలున్నాయి.
సాంప్రదాయ వైద్యంలో నేరేడు పండ్లు, ఆకులు, విత్తనాలు, బెరడు అన్ని భాగాలను ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు. బెరడులో టానిన్లు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి.

ఇది దీర్ఘకాలంగా అస్ట్రింజెంట్ గా ఉపయోగపడుతుంది. విత్తనాలలో గ్లైకోసైడ్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కల్గి యాంటీ ఇన్ ఫ్లమేటరీగా పనిచేస్తుంది. నేరేడు పండ్ల విత్తనాలు, గుజ్జు డయాబెటిక్ రోగులలో వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.
* రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడం, న్యూరోపతితో సహా డయాబెటిక్ సమస్యలను ఆలస్యం చేయడం, శుక్లాలు నియంత్రణకు ఎక్కువగా వాడుతారు. నేరేడు చెట్టు అన్ని భాగాలను ఔషధంగా ఉపయోగించవచ్చు. రోజుకు 1-3 గ్రా. నేరేడు గింజల పొడిని సగటు మోతాదుగా వాడుకోవచ్చు. అదనంగా పండిన పండ్ల రసం 0.5-2 స్పూన్లు (2.5-10 మి.లీ.) మొత్తంలో రోజూ కనీసం మూడు సార్లు తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించవచ్చని శాస్త్రీయంగా కూడా నిరూపించారు. నేరేడు ఇన్ ఫ్లమేషన్, అల్సర్ చికిత్సలో బాగా పని చేస్తుందని శాస్త్రీయంగా నిరూపించారు. రేడియోప్రొటెక్టివ్, యాంటీనియోప్లాస్టిక్ లక్షణాలు కల్గి ఉండటమే గాక ఈ పండులో అంథోసైనిన్స్, గ్లూకోసైడ్స్, ఎల్లాజిక్ యాసిడ్, క్వెర్సెటిన్, కెమ్ఫెరోల్ వంటివి పుష్కలంగా ఉంటాయి. పండిన పండ్లతో ఆరోగ్య పానీయాలు, స్క్వాష్, జెల్లీ, వైన్ వంటి పదార్థాలు తయారు చేసుకోవచ్చు.
 ఆరోగ్య ప్రయోజనాలు:


నేరేడు పండ్లు సహజ రక్త శుద్ధిగా పనిచేస్థాయి. వీటిలో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది బ్లడ్ ప్యూరిఫయర్ గా పనిచేస్తుంది. ఆక్సిజనేటెడ్ రక్తాన్ని మొత్తం శరీరానికి రవాణా చేయడానికి సహాయపడుతుంది.
* కళ్ళు, చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడే ఎ , సి విటమిన్లు
నేరేడు పండులో ఎక్కువగా ఉంటాయి. దీని అస్ట్రింజెంట్ గుణం జిడ్డుగల
చర్మాన్ని తాజాగా, మృదువుగా, మొటిమలు లేకుండా ఉంచేలా చేస్తుంది.
* జీర్ణక్రియ లేదా జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలున్నవారు నేరేడు పండ్లు తీసుకోవచ్చు.దీనిలోని శీతలీకరణ గుణం సరైన జీర్ణరుగ్మతను నయం చేయడానికి సహాయపడుతుంది.
* నేరేడు పండ్లలో ఆక్సాలిక్ ఆమ్లం, గ్యాలిక్ ఆమ్లం, మాలిక్ ఆమ్లం, టానిన్స్ మొదలైనవి ఎక్కువగా ఉంటాయి. దీనికి  ఇన్ఫెక్షన్ లేకుండా చేసే సామర్థ్యం కల్గి ఉంటుంది. అంతేకాక యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలను కల్గి ఉండడం వల్ల అంటువ్యాధులను కూడా నివారిస్తుంది. దంతాలు, చిగుళ్ళను వివిధ ఇన్ఫెక్షన్ల నుంచి నివారిస్తుంది.
* గుండె రుగ్మతల నివారణకు: నేరేడులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, రక్తపోటు, ఇతర హృదయ సంబంధిత వ్యాధులను నివారించడానికి
ఉపయోగపడుతుంది.
*  రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడే లక్షణాలు ఉన్నందున మధుమేహంతో బాధపడే వారికి నేరేడు పండు చాలా మంచిది.

నేరేడు పండ్లలో పోషకాలు:
100 గ్రాముల నేరేడు పండ్లలో శక్తి 235 కిలో జౌల్స్, మాంసకృత్తులు 0.82 గ్రా., కొవ్వు 0.17 గ్రా.,పీచు పదార్థం 3.07 గ్రా.,పిండిపదార్థాలు 12.30 గ్రా.చొప్పున ఉంటాయి.అలాగే విటమిన్ బి1 (0.02 మి. గ్రా.), విటమిన్ బి2  (0.02 మి. గ్రా.), విటమిన్ బి3 (0.14 మి. గ్రా.), విటమిన్ బి5  (0.31మి. గ్రా.), విటమిన్ బి6  (0.03 మి. గ్రా.), విటమిన్ బి7 (2.57 మి. గ్రా.),
విటమిన్ బి9 (7.63 మైక్రో గ్రా.) చొప్పున ఉంటాయి.
విటమిన్ సి (16.47 మి. గ్రా.), కెరోటినాయిడ్స్ (66.50 మైక్రో. గ్రా.),
విటమిన్ డి2 (0.82 మైక్రో. గ్రా.), ఇనుము (0.33 మి.గ్రా.), జింక్ (0.06 మి. గ్రా.),
పొటాషియం (103 మి. గ్రా.), సోడియం (2.67 మి. గ్రా.), కాల్షియం (25.36 మి. గ్రా.), మెగ్నీషియం (27.97 మి. గ్రా.), ఫాస్పరస్ (9.60 మి. గ్రా.), కాపర్ (0.02 మి. గ్రా.) వంటి విటమిన్లు,ఖనిజ లవణాలు లభిస్తాయి.
మూలం : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్, హైదరాబాద్

బి. నవ్య, డా. కిరణ్ పిల్లి, డా. వినోద్ కుమార్ ,
డా. ఎ. శ్రీనివాస్, కృషివిజ్ఞానకేంద్రం, రామగిరిఖిల్లా, పెద్దపల్లిజిల్లా

Leave Your Comments

జూలై 6 నుంచి 10  వరకు అనంతపురం, కర్నూల్ జిల్లాల రైతులకు సేద్య సూచనలు

Previous article

వచ్చే మూడు నెలల్లో రైతు సంక్షేమానికి రూ. 50 వేల కోట్ల నుంచి 60 వేల కోట్లు

Next article

You may also like