Drum Seeder: ఇరు తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుత పరిస్థితులలో వరి విస్తీర్ణం పెరుగుతున్న నేపథ్యంలో, నార్లు పోసి, నాట్లు వేయడం అనేది రోజురోజుకి కూలీల కొరతతో, పెరిగిన కూలీల ఖర్చు వలన రైతుకు సాగు ఖర్చులు పెరుగుతుండటం అనేది జరుగుతుంది. అదేవిధంగా కొన్ని సందర్భాలలో చీడపీడలు లేదా వాతావరణంలో వస్తున్న మార్పుల దృష్ట్యా సరైన దిగుబడులు రాక, సాగు ఖర్చు పెరిగి నికర ఆదాయం తగ్గుతుంది. ఈ పరిస్థితులలో వరిని సాంప్రదాయ నాటు పద్దతిలో కాకుండా ప్రత్యమ్నాయ పద్ధతులైన నేరుగా వరి విత్తన పద్ధ్దతి వైపు ఎక్కువ మంది రైతులు మొగ్గు చూపిస్తున్నట్లు గమనించడం జరుగుతుంది. ఈ సందర్భంలో, ప్రస్తుత వానాకాలంలో దమ్ములో నేరుగా వరి విత్తే పద్ధ్దతులలో డ్రమ్ సీడర్ ద్వారా వరిని విత్తుకున్నట్లయితే కూలీల కొరతను అధికమించడంతో పాటు పంటకాలాన్ని 7-10 రోజులు తగ్గి, సాగు ఖర్చును తగ్గించుకొని నికర ఆదాయాన్ని పెంచుకునే వీలుంటుంది.
డ్రమ్ సీడర్ సాగులో పాటించాల్సిన మెళకువలు :
. సాధారణ వరి సాగు చేసే అన్ని నేలలు డ్రమ్ సీడర్‌కి అనుకూలం. సాధారణ పద్దతిలో వరి నాటే పరిస్థితులలో, భూమిని తయారు చేసుకునేలాగా ఇక్కడ కూడా భూమిని అదేవిధంగా తయారు చేసుకుని వీలైనంత వరకు చదునుగా ఉండేలా చూసుకోవాలి. రైతులు ఇప్పుడున్న సమయం బట్టి తమకు అనువైన రకాలను సాగుచేసుకోవచ్చు.
. ఈ డ్రమ్ సీడర్‌కు 8 వరుసల్లో రంధ్రాలు ఉండి, రెండు వరుసల మధ్య దూరం 20 సెం.మీ లేదా 25 సెం.మీ.ల దూరంలో గింజలు పడే విధంగా పరికరాలు మార్కెట్ లో లభ్యమవుతున్నాయి.
. వరిలో విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్ళ నివారణకు తడి పద్దతి ద్వారా విత్తన శుద్ధి చేయాలి. తడి పద్ధతిలో ఒక గ్రాము కార్బండిజమ్ లీటరు నీటిలో, కిలో విత్తనం చొప్పున కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి.
Also Read: Lantana Camara Health Benefits: అత్త కోడళ్ల చెట్టు… ఈ చెట్టు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి…
. ఈ పద్ధతిలో రకాన్ని బట్టి, సుమారు 8-12 కిలోలు విత్తనం అవసరమవుతుంది. విత్తనాన్ని 24 గంటలు నానబెట్టి, 12 నుంచి 24 గంటలు మండెకట్టిన తర్వాత విత్తనాల ముక్కు పగిలి తెల్లమోను వస్తుంది. ఈ గింజలను డ్రమ్ సీడర్ లో 3/4 వంతు డ్రమ్‌లలో నింపి పొలంలో లాగితే 8 వరుసల్లో 20 సెం.మీ./25 సెం.మీ. దూరంలో కుదురుకు 3-4 గింజలు రాలుతాయి.
. ఒక ఎకరం డ్రమ్ సీడర్ తో విత్తడానికి సాధారణంగా 2 గంటలు సరిపోతుంది. ఒక్క రోజులో డ్రమ్ సీడర్ ద్వారా 3-4 ఎకరాలు విత్తుకోవచ్చు.
. ఈ పద్దతిలో సాధారణ పద్ధతిలాగా ఎరువుల మోతాదు సరిపోతుంది. కాకపొతే, దమ్ములో నత్రజని ఎరువులు వేయకుండా కేవలం సిఫారసు చేసిన మోతాదులో భాస్వరం ఎరువు మరియు మరియు సగం పొటాష్ ఎరువులు వేయాలి. నత్రజని ఎరువులను మూడు భాగాలుగా చేసి, విత్తనం వేసిన 20 రోజులకు 40 రోజులకు, 60 రోజులకు వేసుకోవాలి. మూడో దఫా నత్రజని ఎరువు వేసే సమయంలో, మిగిలిన సగం పొటాష్ ఎరువును వేసుకోవాలి.
. నేరుగా వరి విత్తిన పొలంలో, డ్రమ్ సీడర్ లాగిన 3 లేదా 4 వ రోజు, 80-100 గ్రా. పైరజో సల్ఫ్యూరాన్ ఇథైల్ కలుపు మందును ఎకరం పొలంలో పిచికారీ చేసుకోవాలి.
. విత్తిన 15-20 రోజుల దశలో, కలుపు ఉంటే వెడల్పాటి ఆకు మరియు గడ్డిజాతి నివారణకు ఒక ఎకరానికి ట్రయఫామోన్ G ఇథాక్సీ సల్ఫ్యూరాన్ 90 గ్రా. లేదా పెనాక్సులమ్ G సైహాలోఫాప్ బ్యుటైల్ 800 మి.లీ. లేదా బిస్ పైరిబాక్ సోడియం 100-120 మి.లీ. లాంటి మందులను 2-3 ఆకుల దశలో ఉన్నప్పుడు పిచికారీ చేసుకోవాలి. వరుసలలో ఉన్న కలుపును అంతరకృషి అనగా వీడర్స్ ద్వారా సమర్ధవంతంగా నివారించుకోవచ్చు.
. ఈ పద్ధతిలో సాగు చేసిన వరి 7-10 రోజుల ముందుగా కోతకు రావడంతో పాటుగా విత్తన మోతాదు, నారు పెంచడానికి, నారు తీయడానికి, నాటు వేయడానికి అవసరమయ్యే ఖర్చులు చాలా వరకు తగ్గుతాయి.
Also Read: Ashwagandha: ఒత్తిడి మరియు టెన్షన్ ను తగ్గించే అతి గొప్ప ఔషధం – అశ్వగంధ