నీటి యాజమాన్యం

బిందు పద్ధతిలో పంటల సాగు..

0

భూగర్భ జలాలు అడుగంటిపోయి నీటి ఎద్దడి నెలకొన్న పరిస్థితుల్లో రైతులకు బిందుసేద్యం ప్రయోజనకారిగా ఉంటుంది. ప్రతి మొక్కకు కావాల్సిన నీటిని లీటరల్ పైపుల ద్వారా బొట్లు బొట్లుగా నేల ఉపరితలం మీద లేదా మొక్క వేరు వ్యవస్థకు దగ్గరగా స్వల్ప పరిణామంలో (గంటకు 1-2 లీ.) అందించే విధానాన్ని బిందుసేద్యం గా పరిగణిస్తారు. సంప్రదాయ పద్ధతిలో నీటి వినియోగ సామర్థ్యం 30 – 45 శాతం, తుంపర పద్ధతిలో 55 – 70 శాతం, బిందు పద్ధతిలో 90 – 95 శాతం ఉంటుంది. బిందుసేద్యం వల్ల వివిధ పంటల్లో 21 – 50 వరకు నీరు ఆదా అవుతుంది. మొక్క పెరుగుదలకు అనుగుణంగా వేర్లకు దగ్గరగా నీటిని, రసాయన ఎరువులను సరఫరా చేయటం వల్ల మొక్కలు ఏపుగా ఎదిగి, త్వరగా పక్వానికి వచ్చి అధిక దిగుబడులు,నాణ్యమైన ఉత్పత్తులను పొందవచ్చు. ఇసుక, నల్లరేగడి, లోతు తక్కువ, ఎత్తు పల్లాలుగా వుండే భూములకు, కొండ ప్రాంతాలకు బిందు సేద్య పద్ధతి ఎంతో అనుకూలంగా ఉంటుంది. అవసరాన్ని బట్టి క్రమ పద్ధతిలో నీటిని అందించటం ద్వారా మోటారు తక్కువగా నడిచి 30 -45 శాతం విద్యుత్ ఆదా అవుతుంది. పోషక పదార్థాలను ఫెర్టిగేషన్ ద్వారా నేరుగా మొక్కల వేర్లకు దగ్గరగా అందించటం వల్ల ఎరువుల వినియోగ సామర్థ్యం 80 -90 శాతం పెరుగుతుంది. తద్వారా 20 – 43 శాతం వరకు ఎరువులు ఆదా అవుతాయి. ఎరువులు భూమిలోపలి పొరల్లోకి చొచ్చుకొనిపోవు, నేలను చదును చేయటం, గేట్లను ఏర్పాటు చేయటం, కాలువలను తవ్వటం, బోదెలను ఏర్పాటు చేయటం,నీటిని పారగట్టటం, ఎరువులు చేయటం వంటి పనులుండవు. కాబట్టి వీటికి అయ్యే ఖర్చు తగ్గుతుంది. ఈ పద్ధతిలో పంట వరుసల మధ్యలో తేమ ఉండదు. కాబట్టి కలుపు సమస్య చాలా వరకు తగ్గి నివారణ ఖర్చు ఉండదు. ఉప్పునీటిలో కూడా పంటలను పండించవచ్చు. మొక్కల మొదళ్ల వద్ద మాత్రమే తేమ కలిగి వరుసల మధ్య మట్టి పొడిగా ఉండటం వల్ల పురుగు మందులు పిచికారీ, మొక్కల కత్తిరింపులు, పంట కోత వంటివి సులువుగా చేయవచ్చు. స్ప్రింకర్ల మాదిరిగా కాకుండా నీరు నేరుగా మొదళ్ళ వద్ద అందించటం వల్ల కూడా మొక్కలపై, ఆకులపై తేమ ఉండదు. కాబట్టి చీడపీడల సమస్య చాలా తక్కువగా ఉంటుంది. భూమి కోతకు గురికాదు. తోటల్లో మురుగు నీటి సమస్య తగ్గుతుంది. అన్ని పంటల్లోనూ బిందుసేద్యం విధానాన్ని ఆచరించవచ్చు.

Leave Your Comments

పాలకూర వలన ఆరోగ్య ప్రయోజనాలు..

Previous article

విరిగి కాయల ప్రయోజనాలు ..

Next article

You may also like