Paddy Plantation: వ్యవసాయ యంత్రాల వాడకంలో చాలా మంది రైతులు వెనుకబడి ఉన్నారు ఇందుకు కారణం సరి అయన అవగాహన లేకపోవడం మరియు కొత్త పద్ధతులను అలవరుచుకొలేకపోవటమే. వరి సాగులో యాంత్రీకరణ వినియోగం పెరిగితే కూలీల అవసరం కూడా చాలా తగ్గుతుంది తద్వారా పెరుగుతున్న కూలీల కొరత నుండి బయట పడవచ్చు. వరినాట్లును సకాలంలో వేసినపుడే మనకి అధిక దిగుబడులు వస్తాయి. రైతులు వరి నారును నారుమడి నుండి తీసి తమ యొక్క ప్రధాన పొలంలో వరినాట్లు వేయడం శ్రమతో కూడుకున్నది మరియు మండుటెండలో బురదలో చేయవలసిన పని.
మారుతున్న జీవన శైలితో పాటు తగ్గుతున్న వ్యవసాయ కూలీల సంఖ్య వలన వరినాట్లు నాటేటువంటి పనులను చెయ్యడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఇందుకు ప్రత్యామ్నాయంగా వరినాటు యంత్రాలు మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి ఎప్పటినుంచో ఉన్నపటికీ వీటి యొక్క వాడకం మన రాష్ట్రంలో అంతగా రైతు ఆదరణ పొందలేదు , కానీ ఇప్పుడు వరినాటు యంత్రం వాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. నారు పెంచడం ఈ వరి నాటు యెంత్రములోని ముఖ్యమైన ప్రక్రియ. ప్రత్యేక ట్రేలలో సరైన పద్ధతుల ద్వారా పెంచిన నారు మాత్రమే యంత్రం ద్వారా నాటేందుకు వీలవుతుంది.
వరినాటు యంత్రాల రకాలు
ఆరు లేదా ఎనిమిది వరుసలలో వరిని నాటే యంత్రాలు – ఈ యంత్రాలు ద్వారా ఎన్ని మొక్కలు ఎంత లోతులో ఎంత దూరంలో నాటాలి అనే వాటినిపైన నియంత్రణ ఉండడం వలన పొలంలో మనకు అవసరం మేరకు మొక్కలను నాటుకోవచ్చును. ఈ యంత్రాలను మన దేశమునకు జపాన్, చైనా ,కొరియా వంటి దేశాల నుండి దిగుమతి అవతున్నయి. ఈ యంత్రాలు పెట్రోలు లేదా డీజిల్ ఇందన సహాయంతో 15 – 21 అశ్వ శక్తి సామర్థ్యంతో నడుస్తాయి . ఒక గంటకు 4 నుండి 6 లీటర్లు వరకు ఇంధన వినియోగం ఉంటుంది. ఇందులో వరుసకు వరుసకు మధ్య 30 సెం.మీ దూరం ఉంచుకుంటూ , మొక్కల మధ్య 12 నుంచి 21 సెంటీమీటరు దూరం వరకు వేసుకొడానికి వీలుగా ఉంటుంది. పొలంలో లోతును కూడా ఈ యంత్రాలతో నియంత్రించుకోవచ్చు.
యంజి శక్తి చైనా యంత్రము – ఇది ఒకేసారి 8 సాళ్ళలో వరినాట్లు వేసే యంత్రము. ఈ యంత్రము 4 అశ్వ శక్తి సామర్ధ్యము గల డీజిలు ఇంజను సహాయంతో పని చేస్తుంది. ఈ యంత్రము యొక్క బరువు సుమారు 320 కిలోలు వరకు ఉంటుంది. ఈ 8 సాళ్ళ వరినాట్ల యంత్రమును ఉపయోగించి ఒక ఎకరాను 1-2 గంటల వ్యవధి లోనే నాటు కోవచ్చును. ఒక రోజుకు 3 నుండి 4 ఎకరాలు నాట్లు వేయడానికి వీలవుతుంది. దీని ఖరీదు సుమారుగా రెండు మూడు లక్షల నుండి మొదలు అవుతున్నాయి. నారుమడిలో ప్లాస్టిక్ షీట్ను పరిచి దానిపై మెత్తని రాళ్ళు లేని మట్టిని పలుచను పొరలా వేసి దానిపైన మొలకెత్తిన వరి విత్తనాలను జల్లుకొని, వాటిపై పలుచగా నీటితో తడపుకొడం వలన నారును పెంచుకోవచ్చును.
ఈ పద్దతి లో పెరిగిన 15-20 రోజుల వయసు కలిగిన నారును ట్రే కొలతలకు సమానముగా కత్తిరించుకోవలి. ముందుగా రైతులు పొలాన్ని బాగా దమ్ముచేసుకొని ఆ తరువాత చదును చేసుకొని పొలాన్ని ఆరబెట్టుకోవలి , ఈ ప్రక్రియ యంత్రం ద్వారా నాటేందుకు చాలా ముఖ్యమైనది. వీటితోపాటుగా నాటేముందు పలుచగా నీరు పెట్టడం వలన యంత్రంతో నాటడం సులువుగా జరుగుతుంది. సాళ్ళలోనీ వరుసకు వరుసకు మధ్య 23.8 సెం.మీ. దూరం ఉంచుకుంటూ , ఒకే వరుసలోని దుబ్బుకు దుబ్బుకు మధ్య 14 లేదా 17 సెం.మీ. దూరం తో వేసుకొనవచ్చును.