Agri Robotics: కాలం మారుతుంది అందుకు అనుగుణంగా వ్యవసాయంలోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కష్టపడి పండించడం అనేది పాత పద్దతి. స్మార్ట్ వ్యవసాయం చేస్తూ లాభాలు పొందాలన్నది నేటి రైతులు ఆలోచన. సాంకేతికత సాయంతో వ్యవసాయ రంగంలోనూ వినూత్న మార్పులు వస్తున్నాయి. కూలీల అవసరాన్ని తగ్గించే అధునాతన యంత్రాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఆస్ట్రేలియాలో కొందరు నిపుణులు తయారు చేసిన రోబో యంత్రాలు మరింత ఆకట్టుకుంటున్నాయి. మనుషుల నియంత్రణ లేకుండానే పనిచేసే రోబోలు ప్రస్తుతం వ్యవసాయానికి అవసరమని వారు భావిస్తున్నారు.
విత్తనాలు నాటడం నుండి పంట చేతికి వచ్చే వరకు నేడు ఎన్నో రకాల యంత్రాలను వాడుతున్నారు. అయితే ఆ యంత్రాలను మనుషులు ఆపరేట్ చేయడం ఒక ఎత్తైతే… ఇక ఆ యంత్రాలు కూడా వాటికవే సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ పని చేస్తే ఎలా ఉంటుంది?. ఇదే ఆలోచన ఆస్ట్రేలియాలోని కొందరు రైతులకు వచ్చింది. ఆటోనమస్ అగ్రి మిషన్స్ ను వారు తయారు చేస్తున్నారు. వ్యవసాయంలో భాగంగా గోధుమలు, సెనగలు, బార్లీ వంటి పంటలను పండిస్తున్నారు. ప్రస్తుతం వాడుతున్న యంత్రాల వల్ల నష్టపోతున్నట్టు భావించి స్వామ్ ఫామ్ అనే టెక్ కంపెనీని ప్రారంభించారు. 7 టన్నుల నుంచి 27 టన్నుల వరకు బరువున్న స్ప్రేయింగ్ యంత్రాలను వాడటం ద్వారా పొలం బాగా దెబ్బతింటుంది. అందువల్ల ఆ యంత్రాల బరువు తగ్గించేందుకు ఆ రైతులు ప్రయత్నం మొదలుపెట్టారు.
టెక్నలాజిని వాడుకోవడం ద్వారా రసాయనాల వినియోగం కూడా తగ్గుతుందని భావించారు. పొలంలో పని చేసే ఆ యంత్రాలు వాటికవే నిర్ణయాలు తీసుకునేలా రూపొందిస్తున్నారు. 75hp డీజీల్ ఇంజిన్, 2 వేల కిలోల బరువున్న క్రాప్ ప్రొటెక్ట్ మిషన్ ను మనుషులు కంట్రోల్ చేయాల్సిన అవసరం లేకుండా ఆ మిషన్ సొంతంగా పొలంలో ఉన్న కలుపుమొక్కలను తీసివేస్తుంది. ఆ మిషన్ కు అత్యంత ఆధునిక కెమెరాలను అమర్చారు. పొలంలో తిరుగుతున్నప్పుడు ఆ కెమెరాలు కలుపు మొక్కలను గుర్తిస్తాయి. అదేవిధంగా ఆ కలుపు మొక్కలను చంపే రసాయనాలను పిచికారీ చేస్తాయి.
ఒక్కో పంటకు ఒక్కో రకం రోబో మిషన్ ను తయారు చేస్తున్నారు. కాయలు కోయడం, పత్తి విత్తనాలు నాటడం, గ్రాస్ లెవెల్ చేయడం ఇలా భిన్నమైన పనులకు భిన్నమైన యంత్రాలను తయారు చేస్తూ స్మార్ట్ వ్యవసాయానికి తోడ్పడుతున్నారు. కంప్యూటర్ విజన్ అనే టెక్నాలజీ ఆధారంగా ఆ మిషన్లు పనిచేస్తాయని అంటున్నారు స్వామ్ ఫామ్ కో ఫౌండర్ బేట్. చెట్టు, లేదా మొక్కను చూసి వాటికవే నిర్ణయాలు తీసుకుంటాయి. లేటెస్ట్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తూ రసాయనాల వాడకాన్ని తగ్గించాలన్నదే వీరి లక్ష్యం.