Social Media in Agriculture: మారుతున్న టెక్నాలజిని అందిపుచ్చుకోవడం లో యువతదే పై చెయ్యి అని అనడంలో ఎటువంటి సందేహం లేదు.. కానీ, అదంతా ఒక్కప్పటి మాట. మేము దేనికి తీసుపోము అని గ్రామీణ రైతులు టెక్నాలజిని ఒడిసి పట్టుకుంటున్నారు. తగ్గేదెలే అంటూ గ్రామీణ రైతులు సైతం నేడు సాంకేతను వ్యవసాయంలో భాగం చేసుకుంటున్నారు. సకాలంలో ఎటువంటి పంటలు సాగుచేయాలి, ఎలాంటి విత్తనాలు వేయాలి, ఎటువంటి ఎరువులు వాడాలి, పొలం గట్టుపై ఉండి పంటలకు పిచికారి ఎలా చెయ్యాలి, వ్యవసాయ నిపుణులు ఏం సూచిస్తున్నారు, శాస్త్ర వేత్తలు ఏం చెబుతున్నారు ఇలా ఒకటేమిటి.. సంప్రదాయ సాగు నుంచి ఇజ్రాయెల్ వ్యవసాయం వరకు ప్రతిదీ ఇంటి దగ్గర నుండి చేసేస్తున్నారు. చేలకు ఎటువంటి తెగులు సోకిన చిటికెలో దానికి సంబందించిన నివారణ, మందులను తెలుసుకుంటున్నాడు రైతు. అవును ఇవన్నీ క్షణాల్లో ఎలా తెలుసుకుంటున్నాడని అనుకుంటున్నారా..? వీటన్నిటికీ ఒకటే మార్గం.. అదే “సోషల్ మీడియా”. ఫేస్ బుక్, యూట్యూబ్, వాట్సప్, ఇన్ స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఇలా అన్నింటిలోను వ్యవసాయంకి సంబంధించిన మెళుకువలను తెలుసుకుంటున్నాడు. వీటి ద్వారానే వ్యవసాయంలో తలపండిపోతున్నడు.
అయితే పట్టణాలకు ఏ మాత్రం తీసిపోకుండా గ్రామీణ ప్రాంతాల్లోకి కూడా 4G సేవలు వచ్చాయి. దీని ద్వారా గ్రామాల్లో స్మార్ట్ ఫోన్స్ వినియోగం బాగా పెరిగింది. ఈ క్రమంలోనే రైతులను నూతన సాంకేతికత ఆకర్షించింది. దీనిని సద్వినియోగం చేసుకుంటూ యువ రైతులు కూడా అడుగులు ముందుకి వేశారు. ఫేస్ బుక్, యూట్యూబ్, వాట్సప్, ఇన్ స్టాగ్రామ్, టెలిగ్రామ్ ద్వారా నూతన వ్యవసాయ పద్ధతులను చూసి అవలంబిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో విస్తరిస్తున్న వరి పంట సాగు వెద పద్ధతి రాష్ట్రంలోకి వచ్చింది సోషల్ మీడియా ద్వారా అని అనడంలో ఎటువంటి సందేహం లేదు.
Also Read: టెక్కీ టూ అభినవ్ కిసాన్ పురస్కారం.. సక్సెస్ స్టోరీ
అంతేకాకుండా అన్ని అప్లికేషన్స్ తెలుగులోకి రావడంతో రైతులు నూతన సాంకేతిక పద్ధతి అందిపుచ్చుకోవడం చాలా సులభతరం అయ్యింది. దీంతో పాటుగా వాట్సాప్ లో రైతుల కోసం పలురకాల గ్రూపులు ఏర్పడ్డాయి. కొంతమంది రైతులు స్వయంగా తమ పంట వివరాలను ఫోటోలు తీసి గ్రూపులో పెట్టడం.. పంటకు సంబంధించిన సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవడం వంటివి చేస్తున్నారు. ఇలా చాలా గ్రామాల్లో, మండలాల్లో వ్యవసాయ సమాచార గ్రూపులు ఏర్పాటుచేసుకుని సమాచార మార్పిడి చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
ప్రస్తుతం రైతులు సాంకేతికత వినియోగిస్తూ చేస్తున్న వ్యవసాయం ఎక్కువగా.. సేంద్రియ, ప్రకృతి వ్యవసాయమే. వ్యవసాయం అంతా ప్రస్తుతం రసాయనిక ఎరువులుమయం అయిపోయిన నేపథ్యంలో రైతులు చాలా వరకు సేంద్రియ పంటలపైనే ఆశక్తి కనబరుస్తున్నారు. పంటపొలాలకు పిచికారి చేయడం కోసం డ్రోన్లను వినియోగించే కొత్త సాంకేతికత రైతులు వాడుతున్నారు. అంతేకాకుండా అధికారులు రైతుల కోసం ఇంటర్వ్యూలు చేసి యూట్యూబ్ లో పెడుతున్నారు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలతో వారం వారం జూమ్ మీటింగ్స్ ని కూడా నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం ఉన్నపరిస్థితుల్లో ఫేస్ బుక్, యూట్యూబ్, వాట్సప్, ఇన్ స్టాగ్రామ్, టెలిగ్రామ్ యాప్స్ ఎంతో మేలు చేస్తూ సమాచార కేంద్రాలుగా అటు రైతులకు ఇటు అధికారులకు వారధిగా నిలుస్తున్నాయి. ఇప్పుడున్న యువ రైతులు 90% సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటూ సాగుబడి చేస్తున్నారు. రైతులు సాంకేతికను వినియోగించుకోవడానికి సామాజిక మాధ్యమాలు అనేవి సోపానాలుగా నిలిచాయనడంలో ఎటువంటి సందేహం లేదు.
Also Read: రైతు బంధు ఓ గేమ్ ఛేంజర్- నిరంజన్ రెడ్డి