Soil Testing Significance: రైతులు పంటలు పండించడానికి ఆనవాలు భూమి. పంట పెరుగుదలకు కావలసిన అన్ని రకాల స్థూల, సూక్ష్మ పోషకాలు కొద్దిపాటి పరిమాణంలో భూమిలో ఉంటాయి. గత కొన్ని సంవత్సరాలుగా రైతులు అధిక దిగుబడులను ఆశించి విచ్చలవిడిగా మోతాదుకు మించి అధిక గాఢత కల్గిన రసాయనిక ఎరువుల వాడకం వల్ల భూమిలో సహజంగా ఉండే పోషకాల సమతుల్యత క్షీణిస్తున్నది. రైతులు భూసార పరీక్షలు చేయించుకోకుండా రసాయనిక ఎరువులు తరచుగా వాడటం వల్ల భూమిలో సేంద్రియ కర్బనం శాతం తగ్గి, మిగతా పోషక విలువలు కూడా తగ్గుతున్నాయి. దీనివల్ల సాగు భూములు నిస్సారమై నేల కాలుష్యం, వాతావరణ కాలుష్యం, రైతుల పెట్టుబడులు గణనీయంగా పెరగడం తద్వారా పంట దిగుబడి తగ్గే అవకాశాలున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు భూసార పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. ఈ విధంగా భూసార పరీక్షలు చేయించడం వల్ల పొలాల్లో లోపించిన పోషక పదార్థాల విలువలు తెలుసుకొని సరైన మోతాదులో పోషకాలు (ఎరువులు) వేయుటకు మంచి అవకాశం ఏర్పడుతుంది.
భూసార పరీక్షలో అన్నిటికన్నా ముందు తెలుసుకోవలసిన విషయం మట్టి నమూనాలు సేకరించడం. మట్టి నమూనాను సేకరించినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లేనియెడల భూసార పరీక్ష దానికి అనుగుణంగా చేసిన ఎరువుల సిఫార్సులు వ్యర్థము అవుతాయి.
Also Read: Grambharati Kisan Expo 2023: గ్రామభారతి కిసాన్ ఎక్స్‌పో 2023 కి స్వాగతం
భూసార పరీక్ష నమూనా సేకరణ విధానం మరియు తీసుకోవలసిన జాగ్రత్తలు :
. పొలంలో ప ఆకారంలో 15 సెం.మీ. వరకు పారతో గుంట తీసి అందులో పై పొర నుంచి క్రింది వరకు ఒక పక్కగా మట్టిని సేకరించాలి..
. ఈ విధంగా ఎకరా విస్తీర్ణంలో 8-10 చోట్ల జిగ్ జాగ్ పద్ధతిలో సేకరించిన మట్టిని ఒక దగ్గరకు చేర్చి బాగా కలిపి 4 భాగాలుగా చేయాలి. అందులో ఎదుటి భాగాలు తీసుకొని మిగితా భాగాలను తీసేయాలి. ఈ విధంగా అరకిలో వచ్చే వరకు చేయాలి.
. ఇలా సేకరించిన మట్టిలో పంట వేర్ల మొదళ్ళు, రాళ్లు లేనట్లుగా చూసుకొని నీడలో ఆరనివ్వాలి.
. మట్టి సేకరణకు మరియు ఆరబెట్టి నమూనా తయారు చేయుటకు రసాయనిక/ సేంద్రియ ఎరువుల సంచులను వాడరాదు. శుభ్రమైన గోతాము లేదా ప్లాస్టిక్ షీట్‌ను వాడాలి.
. మట్టి నమూనా కొరకు పొలంలో మట్టిని త్రవ్వి సేకరించినప్పుడు గట్ల దగ్గరలోనూ మరియు పంట కాల్వలలోనూ మట్టిని తీసుకోరాదు.
. చెట్ల క్రిందనున్న పొలం భాగం నుంచి మట్టిని సేకరించి రాదు.
. ఎరువు (పశువుల పేడ/ కంపోస్టు వర్మి కంపోస్టు /పచ్చిరొట్ట మొదలైనవి) కుప్పలు వేసి ఉంచిన చోట మట్టిని సేకరించ రాదు.ఎప్పుడూ నీరు నిలబడే పల్లపు స్థలంలో మట్టిని సేకరించి రాదు..
. పొలంలో వాలు ఎక్కువగా ఉన్నప్పుడు, దానిని ఎత్తు, పల్లపు ప్రాంతాలుగా విభజించి వేరువేరుగా మట్టి నమూనాలను సేకరించాలి. అటువంటి సందర్భాల్లో కూడా, పైన తెలిపిన జాగ్రత్తలు పాటించవలెను.
. పొలంలో అక్కడక్కడా చౌడు ప్రాంతంగా ఉన్నట్లు అనుమానం కలిగితే అక్కడి నుంచి ప్రత్యేకంగా నమూనాను తీసి వేరుగా చౌడు లక్షణాల పరీక్ష కొరకు పంపాలి. అంతేగాని అటువంటి మట్టిని బాగుగా ఉన్న ఇతర ప్రాంతపు మట్టితో కలపరాదు.
. పండ్లతోటలకు అనువైన నేలలను గుర్తించినప్పుడు గాని, పండ్ల చెట్లకు ఏమైనా పోషక పదార్థాలు మరియు ఇతర సమస్యలు గుర్తింపు కొరకు మట్టి నమూనా ఈ క్రింది విధంగా తీసుకోవాలి.
. మట్టి నమూనా కొరకు గుంట తవ్వుతున్నప్పుడు ఏవైనా గట్టి పొరలు ఉన్నట్లయితే వాటి లోతు మరియు వాటి లక్షణాల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
. సాధారణంగా పంటను బట్టి 3 నుంచి 6 (1-2 మీటర్ల ) అడుగుల లోతు గుంట త్రవ్వి ప్రతి అడుగుకు కొంత మట్టిని సేకరించి భూసార పరీక్షకు పంపాలి.
. మట్టి నమూనాలు తీయునప్పుడు క్రింది లోతు నుంచి మొదటి మట్టి నమూనా తీయాలి. ఆ తరువాత పై పొరల నుండి మట్టిని సేకరిస్తే పై మట్టి క్రింది మట్టితో కలవదు.
. పండ్ల తోటల విషయములో ఇలాంటి నమూనా సేకరణ 2-4 చోట్ల నుంచి చేస్తే చాలా మంచిది.
. ఇటువంటి నమూనాలను పరీక్ష కొరకు పంపునపుడు ‘‘పండ్లతోటలకు అనువైన పరీక్షల కొరకు’’ అని తెలియజేయాలి.
నమూనాగా సేకరించిన మట్టిని బాగా నీడలో గాలికి ఆరిన తరువాత మంచి ప్లాస్టిక్ బ్యాగులో గాని, గుడ్డ సంచిలో గాని నింపి, తమకు సమీపంలోని వ్యవసాయ శాఖకు సంబంధించిన భూసార పరీక్ష కేంద్రానికి ఈ క్రింది సమాచారంతో పంపాలి.
1. రైతు పేరు, సర్వే నెంబరు, గ్రామం, మండలం
2. కావలసిన పరీక్ష (భూసార /చౌడు/ పండ్ల తోట ఎంపికకు)
3. ఇంతకు ముందు పంట, దానికి వాడిన ఎరువులు
4. వేయబోవు పంట
సాధారణంగా రైతులు కాగితంలో పైన తెలిపిన విషయాలను వ్రాసి మట్టి నమూనా తో పాటు సంచిలో వేసి భూసార పరీక్షా కేంద్రానికి పంపుతారు. దీనితో పాటు, మరొక కాగితం పై ఇదే విషయాలు వ్రాసి పైన జత చేసి పంపితే బాగుంటుంది. అదే విధంగా వివరాలు రాయడానికి పెన్సిల్ వాడితే మేలు. ప్రస్తుతం రైతులు మట్టి నమూనా సేకరించడానికి అనుకూల సమయం ఆసన్నమైంది. కనుక ప్రతి ఒక్కరు భూసార పరీక్షలు చేసుకొని నేల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అధిక దిగుబడులు సాధించగలరు.
Also Read: Asparagus Benefits: వేసవి కాలంలో మంచి ఆరోగ్యం మీ సొంతం కావాలనుకుంటే ఇది తప్పక తినాల్సిందే!