Soil Health Conservation Methods: ప్రపంచీకరణ నేపధ్యంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పంట ఉత్పత్తులను సాధించుట కొరకు రైతు సోదరులు రసాయన ఎరువులు, రసాయన పురుగు మందులు, తెగుళ్ళు, కలుపు మందులను వాడటం ద్వారా నేల సారవంతం కోల్పోయి నేలకు ఉన్న సహజ గుణాలు, నేల ఆరోగ్యంపై దృష్ప్రభావాన్ని చూపిస్తున్నాయి. పంటకు కావాలసిన ముఖ్యమైన అన్ని పోషకాలు సహజ సిద్ధంగా నేలలోనే లభ్యమవుతాయి. ఈ పోషకాలు పంటకు లభించడం అనేది నేల భౌతిక, రసాయన లక్షణాలపై, నేలలోని సూక్ష్మజీవులు జరిపే చర్యలపై, ముఖ్యంగా అన్నింటికన్నా వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
నేల ఆరోగ్యాన్ని పరిరక్షణ చేసుకోవాలంటే కొన్ని యాజమాన్య పద్ధతులను పాటించవలసిన అవసరం ఎంతగానో ఉంది అని గుర్తించుకోవాలి. నేల కాలుష్యాన్ని గురిచేసే ప్రధాన అంశాలపై అవగాహన ఏర్పరచుకోవడం.
Also Read: Soil Testing: భూసార పరీక్ష గురించి సందేహాలు- సలహాలు.!
. నేలకోత
. నేల ఎండి పోయి ఎడారీకరణ చెందుట
. ఎక్కువ కాలం నీరు నిల్వ ఉండుట
. వ్యవసాయంలో వాడే రసాయన పురుగుమందులు, తెగుళ్ళమందులు కలుపు మందుల ప్రభావం.
. గృహ, నివాస భవనాల నుండి వెలువడే వ్యర్థాల ప్రభావము.
. భారలోహల వల్ల నేల ఆరోగ్యం దెబ్బతినుట వంటి విషయాలపై అవగాహన (పట్టణీకరణ, పారిశ్రామికీకరణ జరిగే ప్రదేశాల్లో అవసరం).
సాధారణంగా నేల ఆరోగ్యము అనేది నేలయొక్క జీవవైవిధ్యము పై ఆధారపడి ఉంటుంది. దీనితో పాటుగా నేలను (మట్టిని ) కప్పి ఉంచడం (మట్టిని నిర్వాహణ), తక్కువ లోతుల్లో దుక్కులు దున్నటం, నేలలో లభించి ఉన్న సేంద్రీయ కర్భన శాతాన్ని పెంపొందించటం కొరకు.
నేలలోని కోటాను కోట్ల సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుటకు ఎరువులు, జీవ సంబంధిత పురుగు మందులు (జీవనియంత్రకాలను వాడటం), పచ్చిరొట్ట ఎరువులు (ఆకుసహిత వచ్చిరొట్ట ఎరువులు ఉదా:- కానుగ, మొక్క సహిత పచ్చిరొట్ట ఎరువులు ఉదా:- జీలుగ, జనుము, పిల్లి పెసర,పెసర, మినుము, సూక్ష్మజీవ సంబంధిత జీవన ఎరువులపై అవగాహన ఏర్పరచుకొని పంటలలో వాడటం పంటల మార్పిడి మరియు ప్రధాన పంటలలో అంతర పంటలుగా పప్పుధాన్య పంటలను వేసుకోవడం ద్వారా నేలకొతకు గురికాకుండా నేలలో పొషకాల సమతుల్యతను కాపాడుకోవచ్చును.
నేల ఆరోగ్యం కాపాడే యాజమాన్య పద్దతులు:
1. నేలను కప్పిఉంచుట: నేలపై లేదా భూమిపై పంట వ్యర్థ పదార్థాలను / అవశేషాలను కప్పిఉంచుట వల్ల వాతావరణ పరిస్థితుల నుండి నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
2. పంట మార్పిడి: నేలను సారవంతంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సూక్ష్మజీవుల పాత్ర ఎంతో ముఖ్యమైనది. పంట మార్పిడి అనగా ఒక పంట తర్వాత మరొక పంటను సాగుచేయటం ద్వారా తెగుళ్ళు, కీటకాలకు ఆవాస యోగ్యమైన మొక్కలను లభ్యత లేకుండా చేయటం ద్వారా నేల ద్వారా సంక్రమించే తెగుళ్ళు, కీటకాలు నిరోధించబడతాయి.
3. తక్కువ లోతుల్లో దుక్కి దున్నట: తక్కువ లోతుల్లో దుక్కి చేయడం ద్వారా నేల తక్కువ కొతకు గురై సూక్ష్మజీవుల సంఖ్య పై తక్కవ ప్రభావం చూపిస్తుంది. నేలను అవసరం మేరకు (2సార్లు) తక్కువ లోతు (15 సెం.మీ దాటకుండా దుక్కి చేసుకోవాలి) ల్లో దుక్కి దున్నుకోవాలి.
4. సేంద్రియ ఎరువుల వాడకము:- నేల సారవంతంగా ఉండాలంటే సేంద్రియ ఉత్పాదకాలైనటువంటి మాగిన పశువుల ఎరువు / వానపాముల ఎరువు, వేపపిండి, కొళ్ళ ఎరువు, బయోడైనమిక్ కంపోస్ట్, ద్రవరూప సేంద్రియ ఎరువులను వాడటం ద్వారానేలలోని, జంతు, సూక్ష్మజీవులకు ఆహారంగా, పోషకాలను అందించి నేల ఆరోగ్యాన్ని కాపాడుటలలో సేంద్రియ ఎరువులు ఎంతగానో ఉపయోగకారిగా తోడ్పడుతాయి.
5. జీవ నియంత్రకాల వాడకం పంటల సాగులో పంటలను ఆశించే తెగుళ్ళు , కీటకాలను సంహరించుటకు ప్రకృతి సిద్ధంగా ఉన్న పరాన్నజీవులు, బదనికలు, వైరల్, బాక్టీరియల్, శిలీంధ్రసహిత, సూక్ష్మజీవులు తెగుళ్ళును కలుగచేసే శిలీంధ్రలను చీడపురుగులను ఆశించి వాటిని అదుపులో ఉంచుటలో కీలకపాత్ర వహిస్తాయి. వీటిని వాడటం ద్వారా రసాయన మందుల వాడకం తగ్గటమే కాకుండా నేలలోని ఉపయోగపడే, సూక్ష్మజీవుల సంఖ్య కూడా పెరుగుతుంది.
6. పచ్చిరొట్ట ఎరువుల వాడకం: పచ్చి రొట్ట ఎరువులైనటు వంటి అపరాలు (పెసర, మినుము) జీలుగ, జనుము, పిల్లిపెసర లాంటి వాటిని పెంచి భూమిలో కలియ దున్నటం ద్వారా భూసారం పెంచుకోవచ్చును. దాదాపుగా 20`25 శాతం నత్రజని ఆదా చేసుకోవచ్చును. పచ్చి రొట్ట ఎరువులు వాడడం ద్వారా నేల భౌతిక స్వభావం, నేల సారం వృద్ధి చెందు తుంది తద్వారా నేలకు మేలు చేసే సూక్ష్మజీవుల వృద్ధి చెంది మ్కొలకు అవసరమైన పోషకాలు త్వరితగతిన అంది పంట ఉత్పత్తుల నాణ్యత, దిగుబడి పెరుగును, నేల ఆరోగ్యంగా, సారవంతమంగా ఉండి నీరు నిల్వ చేసుకొనే సామర్థ్యం పెంపొందించుకుటుంది.
7. జీవన ఎరువుల వాడకం: జీవన ఎరువులను / మైక్రొబియల్ ఇనాక్యూలెంట్స్ అనేవి పొడి/ ద్రవరూపంలో ఉండే ఉపయోగకరమైన సూక్ష్మజీవులు మొక్క ఎదుగుదలకు, పంట నాణ్యత, దిగుబడి పెంపొందించుటకు తోడ్పడే మొక్క వేరు వ్యవస్థలు జీబించే సూక్ష్మజీవులను జీవన ఎరువులు అంటారు. జీవన ఎరువులను వాడటం ద్వారా రసాయన ఎరువుల వాడకం తగ్గించుకోవచ్చు. క్రమంగా నేల సారవంతముతో పాటుగా నేల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు.
వివిధ పంటలలో జీవన ఎరువుల ఎంపిక వాటి మోతాదు వివరాలు:
జీవన ఎరువు జీవన ఎరువును వాడే పంట జీవన ఎరువు మోతాదు
రైజోబియం పప్పుజాతి పంటలు (క్రింది, పెసర, మినుడు, శనగ, బొబ్బర, సాయాబిన్,వేరుశనగ) విత్తనశుద్ధి ద్వారా కిలో విత్తనానికి 15 నుండి 20 గ్రాముల పొడి రూపంలో జీవన ఎరువును వాడుతాము.
అజటోబ్యాక్టర్ అన్ని వాణిజ్య పంటలు కూరగాయలు పత్తి, పూలు, ఆకుకూరలు
200 గ్రా. / ఎకరానికి
ఎసిటోబ్యాటర్ చెరుకు ,షుగర్ బీట్ 4 కిలోలు/ ఎకరానికి
అజోస్పైరిల్లం వరి , జొన్న, మొక్కజొన్న, ప్రొద్దుతిరుగుడు, కూరగాయలు,అరటి 200 నుండి 400 గ్రాములు / ఎకరానికి
అజోల్లా వరి 100-150కిలోలు /ఎకరానికి
నీలి ఆకుపచ్చనాచు వరి 4 కిలోలు నుండి 6కిలోలు ఎకరానికి
ఫాస్పోబాక్టీరియా
అన్ని రకాల పంటలు
200 -400 గ్రాములు ఎకరానికి
మైకోరైజ మొక్కజొన్న, జొన్న, తృణధాన్యాలు, చిరుదాన్యాలు 200 -400 గ్రా. ఎకరానికి
ఈ రకంగా వివిధ యాజమాన్య పద్ధతుల ద్వారా నేల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చును. ఈ విధంగా రైతు సోదరులు వివిధ నెల ఆరోగ్య సంరక్షణ యాజమాన్య పద్ధతులను పాటించి నాణ్యమైన పంట దిగుబడులను పొందవచ్చును.
ఎ. ఉమారాజశేఖర్ అసిస్టెంట్ ప్రొఫెసర్,
డా. కె. రాజేశ్ అసిస్టెంట్ ప్రొఫెసర్,
డా.డి. కుమారస్వామి, అసిస్టెంట్ ప్రొఫెసర్,
డా. డి. సంపత్, అసిస్టెంట్ ప్రొఫెసర్,
డా.జె. రాజేంధర్, అసిస్టెంట్ ప్రొఫెసర్,
వ్యవసాయ కళాశాల, సిరిసిల్ల వ్యవసాయ స్మూజీవశాస్త్రము.
ఫోన్: 9505939336
Also Read: Green Manure Cultivation: పచ్చి రొట్ట పైర్లసాగుతో భూమికి సారం- రైతుకు లాభం