పట్టుసాగు

పట్టుపురుగుల పెంపకం – సస్యరక్షణ

0

రకాల ఎంపిక:

పట్టుపురుగుల్లో అనేక రకాలైన రకాలు ఉన్నప్పటికీ అధిక నాణ్యత, దిగుబడిలో భాగంగా వాతావరణానికి సరిపడే రకాలను కాలానుగుణంగా ఎంపిక చేయాలి. పట్టుపురుగుల పెంపకానికి అనువుగా ఉన్న కాలంలో ( సెప్టెంబరు నుంచి ఫిబ్రవరి వరకు) బైవోల్టీన్ రకాలైన డబుల్ హైబ్రీడ్ లేదా సి.ఎస్.ఆర్. రకాలను ఎంపిక చేయాలి. ఆననుకూల పరిస్దితుల్లో క్ధిక దిగుబడినిచ్చే పిబి రకాలు మేలైనవి, పట్టుపురుగుల పెంపకంలో సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన ఉంది, వసతి సదుపాయాలున్న రైతులు సంవత్సరం పొడవునా అధిక దిగుబడినిచ్చే బైవోల్టీన్ రకాలను పెంచవచ్చు.

వాతావరణం:

పట్టుపురుగులు శీతల రక్తజీవులు అందువల్ల వాతావరణంలోని మార్పులు వాటిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తాయి. ఉష్ణోగ్రత, తేమ, గాలి, వెలుతురు పట్టుపురుగుల్లో సరైన పద్ధతిలో జీవనచర్యలు కొనసాగడానికి తోడ్పడుతాయి. అందువల్ల చల్లని, అనుకూలమైన వాతావరణం కల్పించాలి. చాకీ దశలో 26 -28 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, 80 –90 శతం తేమ, చివరి దశ పురుగులకు 24-26 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, 70-80 శాతం తేమ కల్పించాలి. స్వచ్చమైన గాలి, వెలుతురు ఉండేలా చర్యలు చేపట్టాలి.

పట్టు పురుగుల ప్రత్యక పెంపకం గది:

పట్టుపురుగులు పెంచేందుకు ప్రత్యేకమైన పెంపకపు గది (రేరింగ్ షెడ్) ఉండాలి. చల్లగా ఉంది, గాలి వెలుతురు బాగా వచ్చేలా కిటికీలు, వెంటిలేటర్లు నిర్మించాలి. ఉత్తర – దక్షిణ దిశగా కట్టిన మందమైన మట్టిగోడలు, గడ్డి లేదా చిన్న పెంకులతో కప్పిన ఇల్లుపెంపకానికి అనువుగా ఉంటాయి. గదిలోపల ఉష్ణోగ్రతను తగ్గించేందుకు గది నాలుగు  వైపులా వరండాను నిర్మించాలి. గది వెడల్పు పొడవు కంటే తక్కువగా ఉండాలి. ఊజి ఈగను అరికట్టడానికి కిటికీలు, వెంటిలేటర్లకు నైలాను వల అమర్చాలి. తూర్పు – పడమర దిశలో గృహాలను నిర్మిస్తే సూర్యరశ్మి ప్రభావం తక్కువగా వుండి పురుగులకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. లోపల ఉష్ణోగ్రతను తగ్గించేందుకు గది బయట, పైకప్పు మీద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి.

రోగకారక క్రిమి నిర్మూలన (డిసిన్ ఫెక్షన్):

పట్టుపురుగుల పెంపకంలో ప్రధానంగా రోగకారక క్రిమినిర్మూలన పద్ధతులు పంట దిగుబడి పై అధిక ప్రభావం చూపుతాయి. పురుగుల పెంపక గృహాల్లో, పరిసరాల్లో ఉండే రోగకారక హానికర సూక్ష్మజీవులను రసాయనాలతో నిర్మూలించడాన్ని డిసిన్ ఫెక్షన్ అంటారు. పెంపక గదుల్లో పరిశుభ్రతను పాటించడం ద్వారా పురుగులకు వ్యాధులు సోకకుండా పట్టుగూళ్ల ఉత్పాదకతను పెంచుకోవచ్చు, బ్లీచింగ్ పొడి, క్లోరిన్ డై ఆక్సైడ్, సెరిగోల్డ్, సెరికాల్ తదితర మందులను ఉపయోగించి పెంపక వాతావరణాన్ని, పరికరాలను రోగకారక వ్యాధినిర్మూలన చేయవచ్చు.

గుడ్లను పొదిగించటం:

పట్టు వంగడాలను చల్లని వాతావరణంలో మాత్రమే సేకరించి రవాణా చేయాలి. గుడ్లను పొదిగించడానికి అవసరమైన వాతావరణ పరిస్థితులు అనగా 24 – 25 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత, 80-85 శాతం తేమగల వాతావరణంలో గుడ్లను పొదిగించాలి. గుడ్లు నల్లచుక్క లేదా నీలిరంగు దశకు చేరుకున్న తర్వాత పట్టుగుడ్లను రోగరహితం చేసి నల్లని పలుచని బట్టను చుట్టూ కప్పి ఉంచాలి.  ఇలా చేస్తే పట్టుపురుగులు గుడ్లనుంచి అన్ని ఒకేసారి చాకీ కావటమే కాకుండా, రోగరహితం చేయడం వల్ల చాకీ దశలోను, పెద్ద పురుగులకు రోగాలు ఆశించవు.

చాకీ పురుగుల పెంపకం:

పట్టు పురుగుల జీవిత చక్రంలో లార్వాదశ 23-25 రోజులుంటుంది. 5 దశలుగా లార్వాదశ ఉంటుంది. మొదటి రెండు దశల పురుగులను “చాకీ పురుగులు” అని, చివరి రెండుదశలను (4, 5 దశలు) పెద్ద పట్టుపురుగులు అని మూడో దశ పురుగులను మధ్యస్థ దశగా వ్యవహరిస్తారు. చాకీ పట్టుపురుగుల పెంపకంలో తీసుకున్న యాజమాన్య పద్దతుల ద్వారానే నాణ్యమైన పట్టుగూళ్ల దిగుబడి లభిస్తుంది. చాకీ పట్టుపురుగులకు మెత్తని, రసభరితమైన పోషకాలు సమృద్ధిగా ఉండే మల్బరీ ఆకులను ఆహారంగా వేయాలి. సంప్రదాయ పద్ధతిలో రైతులు పట్టుగుడ్లను “గ్రైనేజ్” ల నుంచి తెచ్చి పొదిగించి తద్వారా వచ్చిన పురుగులకు మర్బరీ ఆకును మేతగా వేసి పెంచేవారు. ఇటీవల పద్ధతులు మొదటి రెండు దశల పట్టు పురుగులను చాకీ నిర్వహణ కేంద్రాలు, రెండో జ్వరంలో వున్నా పురుగులను వాణిజ్య చాకీ కేంద్రాల నుంచి తెచ్చి పెంచుతున్నారు. పట్టుగుడ్లకు బదులుగా చాకీ పురుగులను చాకీ నిర్వహణ కేంద్రాల నుంచి తెచ్చి పెంచేందుకు అధికారులు ప్రోత్సహిస్తున్నారు.

పెద్ద పురుగుల పెంపకం:

చివరి దశ పట్టు పురుగుల పెంపకాన్ని పెద్ద పురుగుల పెంపకం అంటారు. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే  చాకీ పురుగులు, చివరి దశ పురుగులకు రోగాలు రావు. పంట విజయవంతం అవుతుంది. 24-28 డిగ్రీల ఉష్ణోగ్రత, 70-75 శాతం తేమ వాతావరణంలో పెద్ద పట్టుపురుగులు అత్యంత ఆరోగ్యంగా పెరుగుతాయి. పెద్ద పురుగులను కొమ్మమేత పద్ధతి ద్వారా పెంచితే అధిక ప్రయోజనాలు ఉంటాయి.

100 పట్టుగుడ్ల (బైవోల్టీన్) పెంపకానికి సుమారు 800 చ. అ. స్థలం కావాలి. మొదటి దశలో మొదట 6 చ. అ. , రెండో దశలో మొదట 30 చ. అ. , చివరి దశలో 72 చ. అ. , మూడో దశలో మొదట 72చ. అ. , చివరి దశలో 210 చ. అ. , నాలుగో దశలో మొదట 210 చ. అ., చివరి దశలో 390 చ. అ. , ఐదో దశలో మొదట 390 చ. అ. , చివరి దశలో 8000 చ. అ. స్థలం కావాలి.

పురుగుల జ్వరంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

రేరింగ్ బెడ్ లో కొన్ని పురుగులలో జ్వరానికి పోయే లక్షణాలు కన్పించగానే రేరింగ్ బెడ్ లను శుభ్రపరిచి, పురుగులకు పడకల్లో ఎక్కువ స్థలం కల్పించాలి. అన్ని పురుగులు జ్వరానికి వెళ్ళడం గమనించిన తర్వాత పురుగుల పడకల్లో కాల్చిన సున్నం చల్లాలి. దీంతో పడకల్లో పొడి వాతావరణం ఉండి, పురుగులన్నీ ఒకేసారి జ్వరంలో నుంచి బయటకు వస్తాయి. పట్టు పురుగులు జ్వరంలో ఉన్నప్పుడు మేత వేయకుండా, 24- 25 డిగ్రీల ఉష్ణోగ్రత, 65- 70 శాతం తేమ వాతావరణాన్ని కల్పించాలి. 95 శాతం పురుగులు జ్వరం నుంచి లేచిన తర్వాత మొదటి మేత వేయాలి. మేత వేసే అరగంట ముందు పడకల్లో రోగనిరోధకాలైన విజేత, శక్తి తదితర మందులను చల్లాలి.

పక్వానికి వచ్చిన పురుగులను చంద్రికల్లో వేయటం:

నాలుగో జ్వరం నుంచి లేచిన తర్వాత కాలాన్ని బట్టి పట్టుపురుగులు 6-8 రోజులకు పక్వతకు వస్తాయి. ఆహారం తినకుండా, పారదర్శకంగా కన్పించే చివరి దశ పురుగులను పక్వానికి వచ్చినవిగా గుర్తించాలి. ఈ దశలో పురుగుల శరీరాలు కుంచించుకొని పోయి, తలను పైకెత్తి అంచుల వెంబడి తిరుగుతూ పట్టుగూళ్ళు అల్లుటకు అనువైన స్థలం కోసం వెతుకుతుంటాయి. అల్లిక సమయంలో 24-25 డిగ్రీల ఉష్ణోగ్రత, 60-65 శాతం తేమ వాతావరణం కల్పించాలి. అల్లిక సమయంలో తక్కువ వెలుతురు అందించాలి.

గూళ్లు అల్లడం మొదలు పెట్టిన నాటి నుంచి సంకరజాతి (సిబి) అయితే 5వ రోజు, బైవోల్టీన్ వంగడాలైతే 6వ రోజు గూళ్లను చంద్రికల నుంచి విడిపించాలి. గూళ్లను చంద్రకల నుంచి ప్యూపాకు నష్టం రాకుండా జాగ్రత్తగా విడదీయాలి. ఈ గూళ్లను చంద్రికల నుంచి విడిపించిన తర్వాత దోషపూరిత గూళ్లను తొలగించి గోనెసంచుల్లో వదులుగా నింపాలి. ఈ పట్టుగూళ్లను చల్లని వాతావరణంలో మార్కెట్ కు తరలించాలి.

ఆదాయ వ్యయాలు:

ఎకరా మల్బరీ తోటలో ఏడాదిలో మొత్తం 1500 సిబి గుడ్లు 1250 బైవోల్టీన్ గుడ్లను పెంచవచ్చు. నీటివసతి కింద నారు మొక్కల ద్వారా పెంచిన మల్బరీలో ఆదాయ వ్యయాలు..

ఇటీవల ఎంతోమంది యువత కార్పోరేట్ స్ధాయిలో పట్టు పరిశ్రమను చేపట్టి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ నెలనెలా ఆదాయం పొందుతున్నారు. ప్రభుత్వ రాయితీలను పరిగణలోకి తీసుకోకుండా ఆదాయ వివరాలను లెక్కించాం. పట్టు పరిశ్రమలో కూలీల సహాయం లేకుండా సొంతంగా చేసుకుంటే ఆదాయం మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. మార్కెట్ లో పట్టుగూళ్లకు ఇంకా ఎక్కువ ధరలు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

Leave Your Comments

యేటా కొత్త పంటలు వేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న రైతు లింగయ్య

Previous article

పండ్ల తోటల్లో బోరాన్ లోపం ఏర్పడటానికి కారణాలు..

Next article

You may also like