వ్యవసాయాధారిత పరిశ్రమలతో పోలిస్తే తక్కువ పెట్టుబడితో స్వల్పకాలంలోనే పట్టుపరిశ్రమతో ఎక్కువ ఆదాయం పొందవచ్చు. ఈ రంగంలో రాణించేందుకు అవసరమైన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని యువత సులభంగా అందిపుచ్చుకోవచ్చు. తగిన ప్రణాళికతో మేలైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే ప్రతి నెలా ఆదాయాన్ని పొందవచ్చు. పట్టుపురుగుల పెంపకంలో అధిక దిగుబడి లాభాలు సాధించేందుకు నాణ్యమైన మల్బరీ ఆకును ఉత్పత్తి చేయాలి. ఈ ఆకుతో పట్టు పురుగులను పెంచి, నాణ్యమైన పట్టుగూళ్ల దిగుబడి పొందవచ్చు. ఆకు నాణ్యత దిగుబడిని మెరుగుపరిచేందుకు నేలల ఎంపిక, తోట నిర్వహణ పద్దతులు, చీడపీడల నుంచి రక్షణ వంటివి ముఖ్యపాత్ర వహిస్తాయి.
నేలల ఎంపిక:
మల్బరీ సాగుకు సారవంతమైన నేల అత్యంత కీలకం. మొక్క పెరుగుదల నేలలోని పోషకాల సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువ పోషకాలు కలిగి, తేమ నిలుపుకుని, గాలి ప్రసరించే నేలలు అనువైనవి. క్షారరహిత ఎర్ర నేలలు, ఇసుక, ఒండ్రు నేలలను ఎంపిక చేసుకోవాలి. మల్బరీని ఒకసారి నాటితే, సుమారు 10-15ఏళ్ల వరకు నాణ్యమైన ఆకు దిగుబడి వస్తుంది. అందువల్ల సారవంతమైన ఆమ్లత్వం(ఉదజని 6.2 నుంచి 6.8) వున్న నేలలను ఎంపిక చేయాలి.
వంగడాల ఎంపిక:
నాణ్యమైన, అధిక దిగుబడినిచ్చే మల్బరీ రకాన్ని సాగుకు ఎంపిక చేయాలి. లోతైన వేరువ్యవస్ద కలిగి, నాణ్యమైన ఆకు దిగుబడినిచ్చే వి1 మల్బరీ వంగడం అనువైనది. చాకీ పట్టుపురుగుల కోసం ఎస్-36 మల్బరీ రకం, జి-2 మల్బరీ రకాలు మేలైనవి. పెద్ద పురుగుల కోసం వి-1,జి-4 రకాలు అనుకూలం. ఇవి అధిక దిగుబడినిస్తాయి. నాటేందుకు సేకరించే కటింగ్ లను 6-12నెలల వయస్సు గల మొక్కల నుంచి మాత్రమే తీసుకోవాలి లేదా నారు మొక్కలను తెచ్చి నాటాలి. వృక్ష పద్ధతిలో పెంచడానికి 7-8 నెలల వయసున్న నారు మొక్కలు అనుకూలం.
మొక్కల మధ్య ఎడం:
మల్బరీ దిగుబడి మొక్కల మధ్య ఎడంపై ఆధారపడి ఉంటుంది. ఎంత ఎక్కువ ఎడం ఉంటే మొక్కలు అంత ఏపుగా, బలంగా పెరిగి అధిక దిగుబడి వస్తుంది. నర్సరీలో 6 నెలలు పెంచిన మొక్కలు నాటేందుకు అనివైనవి. మొక్కకు మొక్కకు వరుసకు వరుసకు మధ్య 3 అడుగుల ఎడంలో లేదా జోడుసాళ్ళ పద్ధతి(ఇండో- జపనీస్ పద్ధతి)(5-3) ఎడంలో మొక్కలు నాటాలి. ఒక ఎకరాలో 2-3 అడుగుల ఎడంతో 4840 మొక్కలు, జోడుసాళ్ళ పద్ధతిలో 5555 మొక్కలు నాటవచ్చు.
నీటి పారుదల:
నాటిన మొక్కలు నిలదొక్కుకునే వరకు 3 రోజులకోసారి నీరు పెట్టాలి. తర్వాత ఇసుక నేలలో 5రోజులకోసారి, నల్లరేగడి, ఒండ్రు మట్టి నేలల్లో 7-8 రోజులకోసారి నీరివ్వాలి. నీరు తక్కువున్న ప్రాంతాల్లో డ్రిప్ ద్వారా 2 లీటర్లు/మొక్కకు/రోజుకు అందించాలి. సకాలంలో నీరిస్తే అధిక దిగుబడి వస్తుంది.
సమగ్ర ఎరువులు:
నాణ్యమైన ఆకు దిగుబడి పొందడానికి, మొక్కలకు కావలసిన పోషకాల కోసం సేంద్రియ, రసాయన, జీవన ఎరువులను తప్పని సరిగా వాడాలి. మొక్క నాటిన రెండు నెలలకు కలుపును తొలగించాలి. నేలను తవ్వి మొదటి మోతాదు నత్రజని, భాస్వరం, పోటాష్ ఎరువులను 50:50:50 నిష్పత్తిలో వేయాలి. మొదటిసారి ఆరు నెలలకు ముందే ఆకును కోయకూడదు. ఆఎఉ నెలల్లో మొక్క కాండం 2-3 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. భూమి నుంచి 20 సెం.మీ. ఎత్తులో మొక్కను కత్తిరించాలి. మొక్క ధృడంగా, ఆరోగ్యంగా పెరిగేందుకు, బలమైన కాండాలను భూమి నుంచి 20 సెం.మీ.ఎత్తులో ఉంచాలి. ప్రతి కాండానికి 3-4 ఆరోగ్యమైన కొమ్మలు వుంచి, ఎక్కువ మొత్తంలో వున్నా కొమ్మలను తీసేయాలి. రెండో మోతాదు నత్రజనిని 3 నెలలతర్వాత వేయాలి. 12-15 నెలలకు మొక్క బాగా అభివృద్ధి చెందుతుంది.
సేంద్రియ ఎరువులు నేల స్వభావాన్ని వృద్ది చేస్తాయి. నీటి నిల్వ శక్తిని పెంచుతాయి. ఎడాదికి ఎకరాకు 8 టన్నుల సేంద్రియ ఎరువులను రెండు దఫాలుగా వేయాలి. రసాయన ఎరువులను నేలకు అందించడం ద్వారా పోషకాలు త్వరగా శక్తినిస్తాయి. కావాల్సిన రసాయన ఎరువులను భూసార పరీక్ష ఆధారంగా వేయాలి.
జీవన ఎరువుల వాడకం:
నత్రజని సంబంధిత జీవన ఎరువు: అజటో బ్యాక్టర్ ను ఎకరాకు ఏడాదికి 8కిలోల చొప్పున 5 మోతాదుల్లో సేంద్రియ ఎరువులతో కలిపి వేయాలి. దీంతో 50 శాతం యూరియా వాడకాన్ని తగ్గించవచ్చు.
భాస్వరం జీవన ఎరువు: మల్బరీ మొక్కలతో సహజీవనం చేస్తూ, నేలలో ఉండే భాస్వరాన్ని మొక్కకు అందించే వి.ఎ.మైకోరైజా అనే శిలీంద్రాన్ని నేలకు అందించటం ద్వారా 70 శాతం భాస్వరం వాడకాన్ని తగ్గించవచ్చు.
ట్రైకోడెర్మా: కంపోస్టు త్వరగా తయారయ్యేందుకు వేరుకుళ్ళు తెగులును నివారించేందుకు ఈ శిలీంద్రాన్ని సేంద్రియ ఎరువులతో కలిపి ఉపయోగించాలి.
కలుపు నివారణ:
మల్బరీ మొక్కలు ఏపుగా పెరిగేందుకు కావాల్సిన సూర్యరశ్మి, పోషకాలు, గాలి అందేలా తుంగ, గరిక, పార్థీనియం తదితర మొక్కలను ఎప్పటికప్పుడు అంతర సేద్యం ద్వారా తొలగించాలి. అంతరసేద్యం ద్వారా లేదా రసాయన ద్రావణమైన గ్లైసెల్ ను 0.7శాతం మోతాదులో కలిపి పిచికారీ చేయాలి. లీటరు నీటికి 7.1 మి.లీ. గ్లైసెల్ ద్రావణాన్ని కలిపి వాడాలి. ఈ మందు చల్లిన తర్వాత మల్బరీ ఆకులను 10-15 రోజుల వరకు పురుగులకు మేతగా వేయరాదు.
పంటకోత:
కనీసం 45-50 రోజులు పెరిగిన మొక్కల ఆకులనే పట్టుపురుగుల మేతగా వాడాలి. అంతకన్నా తొందరగా కోస్తే లేతాకు అవుతుంది. చాకీ పురుగులకు లేతాకులతో ప్రారంభించి చివరకు ముదిరిన ఆకులను మేతగా వేయాలి. ఆకులను తోటనుంచి తెచ్చిన తర్వాత సరిగ్గా నిల్వ ఉంచకపోతే ఆకు నాణ్యత, వాటిలోని పోషకాలు వృధా అవుతాయి. పురుగులు ఇష్టంగా తినవు. మల్బరీ ఆకులను పెంపక గృహాల్లో చల్లని తేమ ప్రదేశాల్లో వుంచి, అవసరం మేరకు తడిగోనే సంచి కప్పాలి.
చీడపీడల నివారణ:
మిగతా పంటలతో పోల్చితే మల్బరీలో చీడపీడల బెడద తక్కువే. కొంతమేర ఆకు తెగుళ్ళు, వేరు తెగుళ్ళు, కీటకాల బెడద ఉంటుంది. వీటి నివారణకు భౌతిక, రసాయన, జీవన పద్ధతులను ఉపయోగించి సమగ్ర సస్య రక్షణ పాటించాలి.