Silkworm Chawki Rearing: చాకీ కేంద్రములు అందుబాటులో లేని ప్రాంతములలో చాకీ పురుగుల పెంపకానికి ప్రతి రైతు విడిగా చాకీ తోట పెంచుకోవటం వల్ల చిన్న పురుగులకు తగిన మంచి ఆకు నాణ్యతతో పాటు అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. తన తోటలోని పదోవంతు భాగాన్ని ఇందుకోసం కేటాయించుకొని శ్రద్ధతో, తగినంత నీరు పెడుతూ, ఎక్కువ పశువుల ఎరువును మరియు తక్కువ మోతాదులో రసాయన ఎరువులను వాడుతూ చాకీ తోటను మంచి నాణ్యతతో పెంచుకోవాలి.45 రోజుల నాటికి బ్రషింగ్ మొదలు పెట్టి 3వ దశ వరకు పురుగులకు ఈ తోటనుండి మైత అందించవచ్చు. మిగతా ముదురు ఆకును తుదిదశలో వాడుకోవచ్చును. సాధారణ తోట కంటే ఈ ప్రత్యేక తోటలో మంచి నాణ్యమైన ఆకును మేతగా పొందుటవలన పురుగులు అధిక రోగ నిరోధక శక్తిని కలిగి వుంటాయి. తద్వారా అధిక దిగుబడి మరియు నాణ్యమైన గూళ్ళను పొందవచ్చు.
ఆకు నాణ్యత:
చాకీ మేతకు ఉపయోగించే ఆకు 80-85 శాతం తేమను, మంచి పోషక విలువలు గల రసాన్ని కలిగి యుండి, మేత గా, తాజాగా ఉండాలి. ఆకులో పిండి పదార్థాలు, మాంసకృత్తులు, ఖనిజాలు అధికంగా వుండాలి.దీని కోసం తగిన మోతాదులో నీరు, సేంద్రియ ఎరువు, రసాయన ఎరువులు, సాగు పద్ధతులను పాటించాలి. చాకీ పురుగులు శైశవ దశలో వున్నప్పుడు దేహంలో ఎక్కువ నీరు కలిగివుండాలి.ఆకులో ఎక్కువ తేమశాతం వున్నమేతను ఇచ్చినపుడే ఇది సాధ్యమౌతుంది.
Also Read: Quail Rearing: కౌంజు పిట్టలపెంపకం లో కొన్ని సూచనలు.!
లేత ఆకుల్లో చక్కెరల పరిమాణం తక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువ తేమశాతం కలిగి అధిక రసవంతంగా, తక్కువ పీచుపదార్థం ఉండటంవల్ల జీర్ణ ప్రక్రియ సులభంగా జరగడంతో పాటు అన్ని రకాలుగా చాకీ పురుగుల మేతకు అనుకూలంగా ఉంటాయి. నీడలో పెరిగిన ఆకులు మరియు తడి ఆకులు, మురికి అంటిన ఆకులు, చాకీ మేతకు పనికి రావు.
నత్రజని ఎరువులు వేసిన తరువాత 10 నుండి 15 రోజులవరకు తోటలోని చాకీ ఆకులో పోషకాలు సమతుల్యంగా ఉండక నాణ్యత లోపిస్తుంది. కాబట్టి ఎరువుల వాడకం, చాకీ సమయాలను అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి. నత్రజని ఎరువులు వేయడానికి, ఆకు కోతకు మధ్య కనీసం 15 రోజుల వ్యవధి ఉండాలి.చాకీ ఆకుల కోత, రవాణా మరియు నిల్వచేయు సమయాల్లో తేమ శాతం తగ్గిపోకుండా తగిన మెలకువలను పాటించాలి.
Also Read: Importance of Food Grain Crops: ఆహార ధాన్య పంటల ప్రాముఖ్యత.!