Sericulture వ్యవసాయంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు వ్యవసాయం అంటే వరి, గోధుమ, పత్తి, మిర్చి తదితర పంటలను వ్యవసాయంలో భాగంగా చూసేవారు. కానీ ప్రస్తుతం వ్యవసాయం దాని అనుబంధ రంగాలపై ఆధారపడి రైతులు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే వరి, గోధుమ, మిర్చి ఇతర పంటలతో పోల్చితే పశుపోషణ, పట్టు సాగు, ఆక్వా తదితర రంగాలు రైతులకు అధిక ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నాయి. ఇక రైతులు కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయ అనుబంధ రంగాలవైపు అడుగులేస్తున్నారు.
పట్టు గ్రుడ్లు జీవము కలిగినవి. పట్టుపురుగులు రోగనిరోధక శక్తిని పొంది ఆరోగ్యముగా పెరగాలన్నా, పట్టు గ్రుడ్లు 95% పైన పగలాలన్నా, మంచి ఆరోగ్యకరమైన చాకీ పురుగులు పొందాలన్నా పట్టు గ్రుడ్లను శాస్త్రీయ పద్ధతిలో పొదిగించాల్సి వుంటుంది.
పట్టుగ్రుడ్లకు చల్లని (25 °C ఉష్ణోగ్రత) మరియు, తేమాయుత (85శాతం గాలిలో తేమ) వాతావరణం అవసరము.
కాబట్టి, పట్టుగ్రుడ్లను రవాణా చేయునప్పుడు, మరియు తెచ్చిన తరువాత వాటిని పొదిగించునప్పుడు ఈ కింది విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి.
- గదిని, పరికరములను మరియు ఇతర అన్ని వస్తువులను రోగ నిరోధక శుద్ధి చర్యలు (డిసిన్ఫెక్షన్) చేసిన తరువాతనే పట్టు గ్రుడ్లను చాకి కేంద్రానికి తేవాలి. 2. పట్టు గ్రుడ్లను చల్లని వేళల్లోనే రవాణా చేయాలి.
- తడిపిన నూలుసంచిలో రవాణా చేయాలి. దీని వలన పట్టు గ్రుడ్లకు కావలసిన చల్లని తేమాయుత వాతావరణం సమకూరుతుంది.
- బస్సులో రవాణాచేయునప్పుడు డ్రైవర్ ప్రక్కన (బానెట్) కూర్చొనరాదు.
- గ్రుడ్లు ఇంటికి తెచ్చిన తర్వాత తట్టలలో మైనపు కాగితమును పరచి దానిపై గ్రుడ్ల షీట్లను విడివిడిగా పరచాలి. పిదప గ్రుడ్లపై మైనపు కాగితమును కప్పాలి. తడిచేసిన శుభ్రమైన బట్టను తట్టపై కప్పి అప్పుడప్పుడు తడి చేస్తూ వుండాలి.
- విడి గ్రుడ్లు (బాక్స్ గ్రుడ్లు) అయినచో పొదిగించు ఫ్రేములలో పోసి, ఫ్రేములను పైన తెలిపిన విధముగా తట్టలలో పొదిగించాలి.
- పట్టు గ్రుడ్లపై చుక్కలు వచ్చిన దశలో (అనగా చాకీ కట్టుటకు రెండు రోజుల మునుపు), వాటిపై వెలుతురు ఏమాత్రం పడకుండా నల్లని తడి చేసిన గుడ్డను తట్టల పై అన్ని వైపులా మూసుకొను విధముగా, లోపలికి వెలుతురు ఏమాత్రం పోకుండా చుట్టి వుంచాలి. నల్ల గుడ్డను చుట్టిన తర్వాత 48 గంటల (2 రోజులు) వరకు ఏమాత్రము తెరువరాదు. తేమను అందించుటకు వేరే నూలు బట్టను తడిపి కప్పుతూవుండాలి.
- నల్ల గుడ్డతో కప్పిన 48 గంటల తర్వాత నల్ల గుడ్డను తొలగించి గ్రుడ్లను వెలుతురులో వుంచాలి. దీనివలన తక్కువ సమయం లోనే గ్రుడ్లన్నియు పగలడం జరుగుతుంది. గ్రుడ్లు పూర్తిగా పగిలిన తర్వాత చాకీ కట్టాలి.