Vegetables Pests and Diseases: ఆదిలాబాద్ జిల్లాలో గుడిహత్నూర్, ఇచ్చోడ, ఇంద్రవెల్లితో పాటు మరికొన్ని మండలాల్లో రైతులు విస్తారంగా కూరగాయలు సాగుచేస్తున్నారు. టమాట, వంగ, మిరప, బెండ మరియు తీగాజాతి కూరగాయలను సాధారణ మరియు పాలీహౌస్, మల్చింగ్, బిందు సేద్య పద్ధతి, పందిర్లు వంటి ఆధునిక పద్ధతులను అవలంభించి కూరగాయలలో అధిక దిగుబడి సాధిస్తున్నారు. కాని కొన్ని సమయాలలో ప్రకృతి విపత్తులు, చీడపీడలు ఆశించటం వలన దిగుబడులు తగ్గి రైతులు నష్టపోతున్నారు.
చీడపీడల నివారణ మరియు యాజమాన్య పద్ధతుల పైన సరైన అవగాహన లేకపోవడం వలన పంట నష్టం జరుగుతుంది. కృషి విజ్ఞాన కేంద్రం, ఆదిలాబాద్, శాస్త్రవేత్తల క్షేత్ర సందర్శనలో భాగంగా జిల్లాలోని ఇంద్రవెల్లి మరియు గుడిహత్నూర్ మండలాల్లోని కూరగాయ తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా దాదాపుగా అన్ని గ్రామాల్లోని సోరకాయ తోటల్లో బంక తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లు గమనించడం జరిగింది. ఈ తెగులు ఉధృతి గత 2-3 సంవత్సరాల నుండి ఎక్కువగా కనిపిస్తున్నది. దీని వలన పంట దిగుబడిలో సుమారుగా 60 నుండి 70 శాతం వరకు నష్టపోతున్నట్లు రైతులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో బంక తెగులు లక్షణాలు, వ్యాప్తి మరియు నివారణ చర్యలకు సంబంధించిన పలు అంశాలను ఈ క్రింది వ్యాసం ద్వారా వివరించటం జరిగింది.
డిడిమెల్ల బ్రయోనియే అను శిలీంధ్రం వల్ల సోకే ఈ బంక తెగులు సోరకాయ పంటను మాత్రమే కాకుండా పుచ్చ, కీరదోస, గుమ్మడి, బూడిద గుమ్మడి, తర్భూజ లాంటి ఇతర తీగాజాతి కూరగాయలను కూడా ఆశిస్తుంది. అధిక తేమతో కూడిన చల్లని వాతావరణ పరిస్థితులలో పుచ్చ మరియు తర్బూజ పంటల్లో కోత దశలో తెగులు ఉధృతి అధికంగా ఉండి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంది. ఈ పంటల్లో తెగులు సోకిన కాయల పైన ఏర్పడే నల్లని మచ్చల వలన ఈ తెగులును నల్ల కుళ్ళు తెగులు అని కూడా పిలుస్తారు.
Also Read: వంగలో కొమ్మ మరియు కాయ తొలుచు పురుగు యాజమాన్యం.!
లక్షణాలు : ఈ తెగులు విత్తన మొలక నుండి కాయ కోత వరకు అన్ని దశలలో తీగాజాతి కూరగాయలను ఆశిస్తుంది. వేర్లు తప్ప మొక్కలోని అన్ని భాగాలలో తెగులు లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. విత్తన మొలక దశలో లక్షణాలను గమనించినట్లయితే భీజ దళాల్లో ఆకుల అంచులు మొదట లేత పసుపు వర్ణం లోకి మారి, ఆ తర్వాత లేత నుండి ముదురు గోధుమ రంగులోకి మారి ఎండిపోతాయి. కొన్ని సందర్భాల్లో భీజ దళాలపై నీటితో కూడిన మచ్చలు ఏర్పడి, వడలిపోయి మొలకలు చనిపోతాయి.
పంట ఎదిగే దశలో కాండం పైన చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలు ఏర్పడి క్రమేపి పెరుగుతూ గరుకుగా తయారవుతాయి. కాండం పైన బంకతో కూడిన పగుళ్ళు కూడా ఏర్పడుతాయి. ఎరుపు లేదా గోధుమ లేదా నలుపు రంగులో గజ్జి మచ్చలు కాండం పై ఏర్పడి ఎర్రని బంక లాంటి పదార్థం కారుతుంది. తీగజాతి కూరగాయలలో ఆంత్రక్నోస్ తెగులు వలన కూడా బంక కారడం జరుగుతుంది. కావున జాగ్రత్తగా గమనించి తగు నివారణ చర్యలు చేపట్టాలి. ఉధృతి పెరిగిన దశలో ఆకు ఈనెలు, ఆకు అంచులపైన నీటితో కూడిన పెద్ద పెద్ద గోధుమ రంగు మచ్చలు ఏర్పడి మొక్కలు వడలిపోయి చనిపోతాయి. తెగులు సోకిన 3-4 వారాల తర్వాత మొక్కలు వడలిపోవడం జరుగుతుంది. కాయ దశలో ముఖ్యంగా పుచ్చ, కీరదోస మరియు తర్భూజ పంటల్లో కాయల పైన గుండ్రని జిగురు ఆకు పచ్చ రంగు మచ్చలు ఏర్పడి క్రమేపి గోధుమ రంగులోకి మారి కాయలు కుళ్ళిపోతాయి.
తెగులు కారకము మరియు తెగులు వ్యాప్తి : డిడిమెల్ల బ్రయోనియే అను శిలీంధ్రం విత్తనాలు, కలుపు మొక్కలు మరియు గత పంట కాలంలోని తెగులు సోకిన తీగాజాతి మొక్కల అవశేషాలలో జీవిస్తుంది. వాతావరణం లోని తేమ మరియు ఉష్ణోగ్రతలు ఈ తెగులు వ్యాప్తిని ప్రభావితం చేస్తాయి. వాతావరణంలో 16-24 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు మరియు 85% తేమ ఉన్న పరిస్థితులలో తెగులు ఉధృతి అధికంగా ఉండి ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తుంది. విరిగిన మొక్క భాగాలు, పేనుబంక మరియు గుమ్మడి పురుగులు తిని వేసిన మొక్క భాగాలను ఈ శిలీంధ్రం ప్రవేశ ద్వారాలుగా చేసుకొని వ్యాప్తి చెందుతుంది.
సమగ్ర నివారణ చర్యలు :
. బంక తెగులు విత్తనం ద్వారా సంక్రమిచే అవకాశం కలదు, కావునా నాణ్యమైన నమ్మదగిన కంపెని విత్తనాలను వాడాలి.
. కిలో విత్తనానికి మ్యాంకోజెబ్ 2.5 గ్రాముల చొప్పున కలిపి విత్తన శుద్ధి చేయాలి. అర్క నూతన్, అర్క శ్రేయాస్ వంటి తెగులు తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలి.
. తీగాజాతి కూరగాయలను నారు ద్వారా సాగు చేసినప్పుడు నాణ్యమైన నారును ఎంపిక చేసుకోవాలి. నారుమడి దశలో ఈ తెగులు వలన కాండం పై నీటితో కూడిన మచ్చలు ఏర్పడుతాయి.
. గత పంట కాలం లో సాగు చేసినటువంటి తెగులు సోకిన పంట అవశేషాలు శిలీంధ్రానికి ఆశ్రయం కల్పిస్తాయి. కావున కోతానంతరం పంట అవశేషాలను సేకరించి నాశనం చేసి లోతైన దుక్కులు చేయాలి.
. అడవి జాతి దోస, కాకర వంటి మొక్కలు శిలీంధ్రానికి ఆశ్రయం కల్పిస్తాయి కావున వీటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ పీకి నాశనం చేయాలి.
. ఒకే పొలంలో తీగజాతి కూరగాయలను మళ్ళీ మళ్ళీ సాగు చేయడం వలన తెగులు వ్యాప్తి అధికంగా ఉంటుంది. కావున ఇతర జాతికి చెందిన కూరగాయలతో పంట మార్పిడి చేయాలి.
. పంట సాగు సమయం లో మొలక దశ నుండి కోత వరకు ఎప్పటికప్పుడు క్రమేపి పంటను పరిశీలించినట్లయితే తగిన సమయం లో సరైన మందులు పిచికారి చేసి తెగులును నివారించవచ్చు.
. తెగులు లక్షణాలు గమనించిన వెంటనే లీటరు నీటికి మ్యాంకోజెబ్ 2.5 గ్రా. లేదా క్లోరోథలోనిల్ 1.5 గ్రా. లేదా మేటిరాం G పైరక్లోస్ట్రోబిన్ 3 గ్రా. చొప్పున కలిపి పిచికారి చేయాలి.
Also Read: చామంతి సాగులో మెళకువలు