Stem Borer: ఉద్యానపంటల సాగు పెరుగుతున్న నేపథ్యంలో పురుగుల బెడద అధికంగా ఉంది. ముఖ్యంగా జామ, దానిమ్మ, సపోటా, చీని మరియు రేగు తోటల్లో కాండం తొలిచే పురుగు అధికంగా ఉండటంతో రైతులు ఇబ్బందులు ఎదురుకొంటున్నారు. కావున సరైన సన్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా పురుగు బెడద తగ్గడంతో పాటు అధిక దిగుబడులు పొందవచ్చును.
కాండం తొలిచే పురుగు ఎక్కువగా ముదురు తోటల్లో నిర్లక్ష్యం చేయబడిన తోటల్లో కనిపిస్తుంది. దీని ఉధృతి జూలై- ఏప్రిల్ మాసాల్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జూలై, ఆగష్టు, సెప్టెంబర్ మాసాల్లో మొక్కమీద వున్న గుడ్లను గుర్తించి తీసివేయాలి. ఇది సంవత్సరం పొడవునా పండ్ల తోటలను ఆశిస్తుంది. ఈ పురుగు లేత కొమ్మల పై ఎక్కువగా దాడి చేస్తుంది. లేత గోధుమ రంగులో ఉన్న తల్లి పురుగులు మే, జూలై లో కోశస్థ దశ నుండి బయటకు వచ్చి బెరడు వదులుగా ఉన్న ప్రదేశాల్లో గుడ్లు పెడుతుంది. 10 రోజుల తరువాత గుడ్లు పొదిగి ముదురు గోధుమ రంగులో గొంగళి పురుగు బయటకు వచ్చిన తరువాత బెరడును తిని కాండంలోకి తొలుచుకొనిపోయి సొరంగాలు చేస్తుంది.
Also Read: సమస్యాత్మక భూములు – వాటి యాజమాన్యం
పురుగు పరిమాణం పెరిగే కొలది సొరంగాల పరిమాణం కూడా పెరుగుతుంది. ఈ పురుగు తిని విసర్జించిన పదార్థాలు చెక్కపొడి రూపంలో చెట్టు మొదలు దగ్గర కనిపిస్తుంది. బెరడు తుట్టెలను తెలిగిస్తే రంధ్రాలు కనబడతాయి. పురుగుల విసర్జనాన్ని చూసిగాని, కొమ్మను తట్టినప్పుడు వచ్చే బోలు శబ్దాన్ని బట్టిగాని వీటి ఉనికిని గమనించవచ్చు. ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు కొమ్మలు ఎండిపోయి చివరకు చెట్లు చనిపోతాయి.
నివారణ: దీని నివారణకు వదులుగా ఉన్న దెబ్బతిన్న బెరడును, పురుగు ఆశించిన కొమ్మలను తొలగించి కాల్చి వేయాలి. గట్టి ఇనుప తీగను రంధ్రాలలోకి చొప్పించి పురుగులను బయటికి లాగి చంపివేయాలి. తరువాత రంధ్రాలను కిరోసిన్ లేదా పెట్రోల్ ముంచిన దూదిలో నింపి బురదలో మూసి అరికట్టవచ్చు. లేదా ఇమిడాక్లోప్రిడ్ 17.8% ఎస్.ఎల్. 1 మి.లీ. లేదా థైయోమిథాక్సమ్ 25% డబ్ల్యూ.జి. 1 గ్రా. లీటరు నీటికి కలుపుకొని జూలై నుండి 15 రోజుల వ్యవధిలో 5 సార్లు పిచికారీ చేసుకోవాలి.
Also Read: మంచి నీటి చెరువులలో పెంపకానికి అనువైన చేపల రకాల ఎంపిక.!