వ్యవసాయానికి మరియు తాగునీటి వ్యవస్థకు నీటి కుంటలు, చెరువులు, కాలువల వ్యవస్థ అత్యంత కీలకమైనది. ప్రతి గ్రామములో, పట్టణములో, వ్యవసాయ భూములలో నీటిని సరైన పద్ధతుల్లో సంవత్సరం అంతా సరిపోయే విధంగా ప్రణాళికలు రచించుకొని దానికి తగిన విధంగా నీటి నిల్వ, పారుదల వ్యవస్థలకు కావలసిన అన్ని పనులను సమర్ధవంతంగా ప్రణాళిక ప్రకారం పూర్తిచేసుకొనుటకు అనువైన కాలం ఈ వేసవికాలం. కొన్ని దశాబ్దాల క్రితం వరకు సాగునీటి వ్యవస్థకు కావలసిన అన్ని ఏర్పాట్లు గ్రామాల్లో ఉన్న రైతులు సంఘటితంగా ఒక కట్టుబాటుతో కాలువ గట్టులను చెరువుల గట్టులను సరిచేసుకుని వాటికి కావలసిన అన్ని మరమ్మత్తులు చేసుకునేవారు. కాలువలు, చెరువుల పూడిక తీత పనులు అన్ని వేసవి కాలంలో పూర్తిచేసుకుని వాటి అనుసంధానంగా ఉన్న చిన్న కాలువలు ద్వారా నీటిపారుదల వ్యవస్థను పటిష్టపరుచుకునేవారు. కానీ రాను రాను కుల, వర్గ, రాజకీయాల అతి జోక్యం వల్ల ఆ వ్యవస్థ కలుషితమయ్యి యాజమాన్య పద్ధతులు లేక ఏటా అధిక వర్షపు నీటి వల్ల లేదా కాలువల నీటి పారుదల వ్యవస్థ లేక రైతులు అధికంగా నష్టపోతున్నారు. అతివృష్టి, అనావృష్టి వల్ల రైతులు పంట సాగు సమయంలో అనేక ఇబ్బందులు పడటమే కాక తీవ్రంగా నష్టపోతున్నారు. ఒక పక్కన గోదావరి తీర ప్రాంత వ్యవసాయమంతా అతివృష్టి కారణంగా వరదలు వచ్చి పంట నష్టపోతుంటే, కృష్ణానది పరివాహక ప్రాంతంలో అత్యల్ప వర్షపాతం వల్ల నీరు లేక పంటలు ఎండిపోయిన పరిస్థితిని మనం చూస్తున్నాము. చెరువులు, డ్యాముల వ్యవస్థ తగినంత లేకపోవడం వల్ల లేదా చెరువు కట్టల యాజమాన్యం లేకపోవడం వల్ల, కరకట్టల యాజమాన్యం పట్టించుకోకపోవడం వల్ల వర్షపు నీరు మొత్తం పంట పొలాలను ముంచి వేయడమే గాక వృధాగా సముద్రపాలవుతుంది. వర్షపు నీరు నిల్వ చేసే పద్ధతులు తగిన విధంగా లేకపోవడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి త్రాగునీరు కూడా దొరకని పరిస్థితులను మనం చూస్తున్నాము. ఇటువంటి సమస్యలపై ప్రభుత్వం ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి యాజమాన్య పద్ధతులకు తగినంత మోతాదులో నిధులను కేటాయిస్తే సమిష్టిగా ఈ సమస్యలను అధిగమించవచ్చు. వర్షపు నీటిని చెరువులు, డ్యాములు ద్వారా ఒడిసిపట్టి నిల్వ చేయటం ద్వార భూగర్భ జలాల్లో నీరు నిలువలు పెరిగి మనకి అతి వేసవికాలంలో కూడా త్రాగునీటిని ప్రజలకు అందుబాటులో ఉంచడానికి అనువుగా ఉంటుంది.