Pesara and Millet Cultivation: వేసవిలో పెసర, మినుము పైర్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో సాగుచేసే అవకాశముంది. పెసర పైరు వేసవిలో వేడిని, బెట్టను మినుము కంటే బాగా తట్టుకుంటుంది. కాబట్టి సకాలంలో నీరు అందించలేని తేలిక భూముల్లో పెసర సాగు అనువైంది. తేమను నిలుపుకోగల భూముల్లో నీటి వసతి బాగా ఉంటే పెసర కంటే మినుము అధిక దిగుబడినిస్తుంది. అందువల్ల రైతులు వారికి ఉన్న వనరులను బట్టి పైరును ఎంచుకోవాలి.
సాగుకు అనువైన ప్రాంతాలు: గోదావరి డెల్టా ప్రాంతంలో రబీ వరి తరువాత మూడో పంటగా మార్చి ఆఖరు నుంచి ఏప్రిల్ మొదటి వారం వరకు విత్తుకోవచ్చు.నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఆలస్యంగా నాటిన దీర్ఘకాలిక వరి తరువాత జనవరి నుంచి ఫిబ్రవరిలో విత్తుకోవచ్చు.నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రాంతంలో చెరువుల కింద ఆలస్యంగా నాట్లు వేసే ప్రాంతాల్లో వరి తరువాత ఫిబ్రవరిలో సాగుచేయవచ్చు.పసుపు సాగుచేసే నీటి వసతి గల లంక భూముల్లో పసుపు తరువాతఫిబ్రవరి – మార్చి లో సాగుచేయవచ్చు.కృష్ణా డెల్టాలో నీటి వసతి ఉన్నచోట వరిమాగాణుల్లో మినుము తరు వాత మూడో పంటగా వేసవిలో పెసర సాగుచేయవచ్చు. కొబ్బరి, పండ్లతోటలో అంతర పంటగా అవకాశం ఉన్నచోట నీటి వసతి గల అన్ని ప్రాంతాల్లో ఏ పంటల సరళిలోనైనా వేసవిలో అపరాలు సాగు చేయవచ్చు.. పత్తి తీసిన తరువాత ఫిబ్రవరిలో పెసర, మినుము విత్తుకోవచ్చు.
విత్తే సమయం: వేసవిలో మినుము, పెసర పైర్లను ఫిబ్రవరి నుంచి మార్చి 15 వరకు విత్తు కోవచ్చు. వరిమాగాణుల్లో అయితే (రబీ తరువాత) మార్చి ఆఖరు వరకువిత్తుకోవచ్చు. పైరు పూత సమయంలో అధిక ఉష్ణోగ్రతకు గురి కాకుండా చూసుకోవాలి.
రకాల ఎంపిక: తక్కువ కాలంలో కాపుకు వచ్చి వేసవిలో ఉండే వేడిని, నీటి ఎద్ద డిని తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలి. వేసవిలో వచ్చే ప్రధానమైన వైరస్ తెగుళ్ళను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకుని, సరైన యాజమాన్య పద్ధతులను పాటించాలి.
అనువైన రకాలు-
మినుము: అన్ని కాలాల్లో సాగుకు అనువై టి.బి.జి. 104, ఎల్.బి.జి. 752, పి.యు 31, ఎల్.బి.జి. 787, టి9 రకాలు, చిరుసంచుల దశలోని జి. బి. జి1 రకం వేసవికి అనువైనవి. ఈ రకాలు 70-80 రోజుల్లో కాపుకు వస్తాయి. రబీలో మాత్రమే సాగుచేసే అధిక దిగుబడినిచ్చు ఎల్.బి.జి 402, ఎల్.బి. జి. 709, ఎల్.బి.జి 685, ఎల్. బి. జి. 645 మినుము రకాలు వేసవి సాగుకుపనికిరావు. ఈ రకాలు వేసవిలో విత్తితే పూతరాదు. పెసర: ఎల్.జి.జి 460, ఎల్. జి.జి 407, డబ్ల్యూ.జి.జి 42, టి.ఎం. 96-2, ఐ.పి.యం -14 రకాలు అనువైనవి.
Also Read: Finger Millet Crop: రాగి పంటలో యాంత్రిక కోత యొక్క ప్రాముఖ్యత
ఈ రకాలన్నీ 60-65 రోజుల్లో కాపుకు వస్తాయి. తెలంగాణలో వేసవి పంటగా సాగుకు పెసరలో డబ్ల్యూ.జి.జి-37 (ఏకశిల) టి.ఎం. 96-2, ఎం. జి.జి- 347 (మధిర పెసర), ఎం.జి.జి- 351 (శ్రీరామ), డబ్యూ. జి.జి-42. (యాదాద్రి) రకాలు, మినుములో ఆంధ్రప్రదేశ్కు సూచించిన రకాలతో పాటు డబ్ల్యూ. జి. జి- 26, ఎం.బి.జి- 207 రకాలు కూడా సాగుచేసుకోవచ్చు.
విత్తన మోతాదు: మినుమును వేసవిలో ఆరుతడి పంటగా సాగుచేసినట్లయితే ఎకరాకు 8- 10 కిలోలు/, వరిమాగాణుల్లో అయితే 16-18 కిలోల మినుము విత్తనాలు వాడాలి. పెసరలో ఎకరాకు మెట్టకు 6-7 కిలోలు, వరిమాగాణుల్లో అయితే 12 కిలోలు విత్తనం వాడాలి.పంట విత్తుకునే 24-48 గంటల ముందుగా ఒక కిలో విత్తనానికి ఇమిడా క్లోప్రిడ్ 600 ఎఫ్ ఎస్ (గౌచో) 5 మి.లీ. లేదా థయోమిథాక్సిమ్ 70 డబ్లూ. ఎస్ (క్రూజర్) 5 గ్రా.. + కార్బెండాజిమ్ లేదా మాంకోజెబ్ 2.5 గ్రా. కలిపి విత్తనశుద్ధి చేసినట్లయితే తొలి దశలో వైరస్ తెగుళ్ళను వ్యాపింపచేసే రసం పీల్చే పురుగులు, వేరుకుళ్ళు తెగుళ్ళ బారినుంచి పంటను కాపాడుకోవచ్చు. వైరస్ తెగుళ్ళ నివారణకు విత్తనశుద్ధి తప్పనిసరిగా చేయాలి.
కలుపు నివారణ: మెట్ట భూముల్లో సాగుచేసినప్పుడు పెండిమిథాలిన్ 30 శాతం ద్రావకం ఎక రాకు 13 నుంచి 1.6 లీటర్ల చొప్పున విత్తిన వెంటనే గాని, మరుసటి రోజు గాని పిచికారి చేయాలి. విత్తిన 20-25 రోజులప్పుడు గొర్రుతో అంతరకృషి చేయాలి. వరిమాగాణుల్లో గడ్డిజాతి, వెడల్పాటి మొక్కలు ఉన్నప్పుడు ఇమ జితాపిర్ 10 శాతం ద్రావకం ఎకరాకు 200 మి.లీ. చొప్పున 20-25 రోజుల మధ్య పిచికారి చేయాలి. ఊద, చిప్పర, గరికలాంటి గడ్డిజాతి మొక్కల నిర్మూలనకు ఫెనాక్సోప్రాప్ ఇథైల్ 9 శాతం చొప్పున ద్రావకం ఎకరాకు 250 మి. లీ లేదా క్విజలాపాప్ ఇథైల్ 5 శాతం ద్రావకం ఎకరాకు 400 మి.లీ. చొప్పున ఏదో ఒకదానిని 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 20-25 రోజుల మధ్య పిచికారి చేసి కలుపు నివారణ చేసుకోవచ్చు.
Also Read: Pesara and Millet Crop: పెసర, మినుము పంటను ఆశించే వివిధ రకాల పురుగులు వాటి యాజమాన్యం.!
Also Watch: