Tasks for Fruit Orchards: మామిడి పాదుల్లో కలుపు లేకుండా చేయాలి. ఆకు జల్లెడ గూడు కట్టు పురుగు కనిపిస్తే గూళ్ళను నాశనం చేసి క్వినాల్ ఫాస్ 2 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. లేత ఆకులు తినే ఆకుతేలు, బూడిద రంగులో ఉండే ముక్కు పురుగు, లేత ఆకుల నుండి రసం పీల్చే తేనె మంచు పురుగు, ఆకులను కత్తిరించే పెంకు పురుగు, రెమ్మ తొలిచే పురుగు, ఆకు తొలిచే పురుగుల ఉధృతిని గమనించి నివారణ చర్యలు చేపట్టాలి. ఆకులపై వచ్చే ఆంత్రాక్నోస్ మచ్చలు, ఆకు అంచులను, చివరలను బూడిద రంగులోనికి మార్చే పెస్టలోషియా, ఆకులపై వచ్చే కుంకుమ రంగు మచ్చరోగం ఉధృతిని గమనించి అవసరమైతే కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా./లీ చొప్పున పిచికారి చేయాలి. ప్రధాన కొమ్మలపై నిద్రావస్ధలో ఉన్న మొగ్గలు చిగురిస్తాయి. వీటిని తొలగించాలి.
అరటి తోటలలో కలుపు లేకుండా జాగ్రత్తపడాలి. తల్లి మొక్క చుట్టూ ఉన్న పిలకలను ఎప్పటికప్పుడు కోసివేయాలి. ఆకుమచ్చ తెగులు గమనించినట్లయితే ప్రొపికొనజోల్ 0.1 శాతం లేదా టెబుకొనజోల్ G ట్రైఫ్లోక్సీస్ట్రోబిన్ 1.4 మి.లీ. ఒక లీటరు నీటికి కలపి రెండు మూడుసార్లు 25 రోజుల వ్యవధితో పిచికారి చేయాలి. తెల్లచక్కెరకేళి రకానికి రెండవ దఫా ఎరువులు వేయాలి.
నిమ్మలో ఎండుకొమ్మలను కత్తిరించి 1 శాతం బోర్డోమిశ్రమాన్ని పిచికారి చేయాలి. సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని లేత ఆకులపై పిచికారి చేయాలి. మంగునల్లి నివారణకు లీటరు నీటికి 3 గ్రా. నీటిలో కరిగే గంధకం లేక 1 మి.లీ. ప్రోపార్‌గైట్ లేదా ఇథియాన్ ఏ 1 మి.లీ. లేదా ఫెన్జాక్వీన్ ఏ 1 మి.లీ. లేదా స్పైరోమెసిఫిన్ ఏ 0.8 మి.లీ. గోళీకాయ దశలో ఒకసారి మరియు 20 రోజుల తరువాత రెండవ సారి పిచికారి చేయాలి. కాండం మొదల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. కందెన మచ్చ తెగులు (గ్రీజీ స్పాట్) నివారణకు ప్రొపికొనజోల్ 1 మి.లీ. లేదా టెబుకొనజోల్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.
జామలో ఎండుతెగులు ఆశించిన చెట్లకు 1 గ్రా. కార్బెండజిమ్ లేదా 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ లీటరు నీటికి కలిపిన మందు ద్రావణాన్ని చెట్టు మొదలు పాదుల్లో పోయాలి. పశువుల ఎరువుతోపాటు ఒక్కొక్క మొక్కకు 250 గ్రా. వేపపిండిGనులిపురుగుల గ్రుడ్లను ఆశించి నష్టపరిచే పాసిలోమైసెస్ లిలేసినస్ శిలీంద్రము 25 గ్రా. లేదా కార్బోఫ్యూరాన్ గుళికలు 60 గ్రా. వేయాలి.
సపోటాకు అవసరాన్ని బట్టి నీటి తడులు ఇవ్వాలి. పూత మొదలయ్యేటప్పుడు మొగ్గ తొలుచు పురుగు నివారణకు వేపగింజల కషాయం 5% లేదా వేపనూనె (0.15%) 5 మి.లీ./లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి. ఉధృతి అధికంగా ఉన్నపుడు మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా ప్రొఫెనోఫాస్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి చిగుర్ల దశలో పురుగు మందులను మార్చి పిచికారీ చేయాలి.
దానిమ్మ తోటల్లో అంతరకృషి చేసి, చెట్ల పాదుల్లో త్రవ్వకం చేసి కలుపు మొక్కలు లేకుండా శుభ్రం చేయాలి.
రేగులో కాయదొలుచు పురుగు నివారణకు పాలిట్రిన్ 1 మి.లీ. లేదా డెల్టామెత్రిన్ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి 2`3 దఫాలుగా బఠాణి గింజ సైజు నుండి 10 రోజుల వ్యవధిలో అవసరం మేరకు మందులను కాయ పక్వానికి రావటం మొదలయ్యే ముందు వరకు పిచికారి చేయాలి.
బొప్పాయిలో సూక్ష్మధాతులోప నివారణకు 2.5 గ్రా. జింక్ సల్ఫేట్ మరియు 1 గ్రా. బోరాక్స్ లీటరు నీటికి కలిపి ఆకులపై పిచికారి చేయాలి. పండు ఈగ నివారణకు మిథైల్ యూజినాల్ ఎరలను ఎకరానికి 4`5 చొప్పున అమర్చాలి.
బొప్పాయిలో జూలై`ఆగష్టు నెలల్లో పాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. ఒక మొక్క నుండి సంవత్సరానికి 700`800 గ్రా. పపెయిన్ లభ్యమవుతుంది. పపెయిన్‌ను తీసిన కాయలను టూటీ ఫ్రూటీ తయారీకి ఉపయోగించవచ్చు.
సీతాఫలంలో పిండినల్లి నివారణకు 1 గ్రా. ఎసిఫేట్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ఆస్ట్రేలియన్ అక్షింతల పురుగులను (బదనికలు) తోటలలో వదలాలి. 50 గ్రా. ఫాలిడాల్ పొడి మందును చెట్టు పాదులో వేయాలి.
ద్రాక్ష తోటలలో పక్షికన్ను మరియు బూడిద తెగలు కన్పించిన వెంటనే డైఫెన్‌కొనజోల్ 25% ఇ.సి.0.6 మి.లీ./లీ. గాని లేదా టెబుకొనజోల్ 25.9 యం/యం ఇ.సి. ` 0.25 మి.లీ./లీ. లేదా క్రిసోక్సిమ్ మిథైల్ 44.3% ఎస్.సి.`0.6 మి.లీ./లీ. లేదా ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ 25% G టెబుకొనజోల్ (50%) 75 డబ్యు.పి.0.25 గ్రా./లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ఉసిరిలో తామర పురుగు నివారణకు 2 మి.లీ. ఫిప్రోనిల్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
పనసలో కాయలను కోసిన తరువాత ఎండిన రెమ్మలను తీసివేసి కాండం మీద వెలుతురు పడే విధంగా కొమ్మలను కత్తిరించి మరల కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును 3 గ్రా. చొప్పున పిచికారి చేసుకొని ఎరువులను వేసి తడిపెట్టాలి.
తోటపంటలు:
జీడిమామిడి తోటలలో జూలై నెలలో కొమ్మ కత్తిరింపులు చేయనట్లయితే ఈ నెలలో చేసుకోవాలి. జూలై నెలలో ఎరువులు వేయడం కుదరని పక్షంలో ఈ నెలలో వేసుకోవాలి. వర్షాధార జీడి తోటలలో మొక్కకు వేయవలసిన మొత్తం మోతాదు ఎరువులను ఒకేసారి వేసుకోవాలి.
కొబ్బరి చెట్టుపైభాగము శుభ్రం చేసుకోవాలి. అవసరమైనచో నీరు పెట్టవలెను. కొబ్బరిపై ఆశించు ఎర్రముక్కు పురుగు, మొవ్వు కుళ్ళు మరియు నల్లమచ్చ తెగులు ఉనికిని పరిశీలిస్తూ ఉండాలి.
ఎర్రముక్కు పురుగు యాజమాన్యము: ఈ పురుగు ఆశించి చనిపోయిన మానులను సత్వరమే నరికి, చీల్చి తగులబెట్టాలి. ఎర్రముక్కు తల్లి పురుగులను గుంపుగా ఆకర్షించు కృత్రిమ ఎరను బక్కెట్లో ఉంచి, కొబ్బరి చెట్టు కాండమునకు 1 1/2 మీటర్ల ఎత్తులో అమర్చినచో, ఎర్రముక్కు తల్లి పురుగులు ఆకర్షితమయ్యి, బక్కెట్ లోపల గల విషాహారములో పడి చనిపోతాయి. సగం డొల్ల అయిన కాండములోని చెత్త, కుళ్ళు పదార్ధమును శుభ్రం చేసి, పుండుపై కోల్‌తార్ లేక జపాన్ బ్లాక్‌ను పూతగా పూయాలి. చెట్టు తొఱ్ఱను సిమెంట్, ఇసుక, కంకర రాళ్ళ మిశ్రమముతో పూడ్చినచో, చెట్టు బలంగా ఉండి, పెద్ద గాలులు వచ్చినపుడు పడకుండా ధృఢంగా ఉంటుంది.
మొవ్వుకుళ్ళు తెగులు యాజమాన్యం: మొవ్వుభాగం తడిచేలా కాపర్ ఆక్సీక్లోరైడ్ మందు (3 గ్రా./లీ. నీటిలో కలిపి) పిచికారి చేయాలి. కాయకుళ్ళు సోకిన గెలను తొలగించి, ఇతర గెలలు, మొవ్వుభాగం తడిచేలా కాపర్ ఆక్సీక్లోరైడ్ మందు (3 గ్రా./లీ. నీటిలో కలిపి) పిచికారి చేయాలి.
జీవనియంత్రణ పద్ధతి: కొబ్బరి మొక్క మొవ్వుభాగంలో సుడోమోనాస్ ఫ్లోరిసెన్స్ టాల్క్ పొడిని వేయాలి. మొక్క వయస్సును బట్టి సంవత్సరం లోపు మొక్కకు 5 గ్రా. ఒక సంవత్సరం మొక్కకు 10 గ్రా. అదే విధముగా 2,3,4,5 మరియు 5 సంవత్సరముల కంటే ఎక్కువ వయసు గల మొక్కలకు 75,100,150,200 గ్రా. సుడోమోనాస్ టాల్క్ పొడిని వేయాలి.
కాయకుళ్ళు సోకిన గెలను తొలగించి, ఇతర గెలలు, మొవ్వుభాగం తడిచేలా సుడోమోనాస్ ఫ్లోరిసెన్స్ కల్చర్ ద్రావణాన్ని పిచికారి చేయాలి. నల్చమచ్చ తెగులు యాజమాన్యం: కొబ్బరి కాండముపై ఎటువంటి గాయము కలిగించరాదు. ఈ తెగులు లక్షణాలు కాండముపై కనిపించిన వెంటనే, ఆ భాగముపై ట్రైకోడెర్మా విరిడి శిలీంధ్రపు పొడిని పేస్ట్‌గా తయారుచేసి పూయవలెను (50 గ్రా. పొడికి 25 మి.లీ. నీటిని కలిపిన పేస్ట్ తయారగును).
Also Read: పిచ్చి కుక్క కరిస్తే ఏం చేయాలి?
తమలపాకు మొదటి సంవత్సరం తమలపాకు తోటలలో అవిశ మొక్కల మధ్య సాళ్లను చేసి సాళ్ల మధ్య మట్టిని చెక్కి అవిశ మొదళ్ల వద్దవేసి, కయ్యలు చేసి వాటి వద్ద 5 సెం.మీ లోతు 20 సెం.మీ దూరంలో ఎకరాకు 20,000 తమలపాకు తీగలను ఎన్నుకొని (6 నుండి 8 కణుపులు ఉండేటట్లు) నాటాలి. తీగలను నాటే ముందు 0.5 శాతం బోర్డో మిశ్రమం G 250 పి.పి.ఎం. స్ట్రెప్టోసైక్లిన్ (250 మి.గ్రా లీటరు నీటికి) కలిపిన ద్రావణంలో 15`30 నిమిషాలు ముంచి శుద్ధిచేసి (100I20 సెం.మీ. దూరంలో) నాటుకోవాలి.
విత్తనపు తీగను ఆరోగ్యవంతమైన తోట నుండి సేకరించాలి. తీగ నాటుటకు ముందే నీరు పెట్టడానికి అదే విధంగా మురుగు నీరు పోయే కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. 8`10 మీ. పొడవు సాలుకు ఒక పులక కాలువ ఉండేలా చూసుకోవాలి. అవిశలో కాండం తొలుచు పురుగు నివారణకు దీపపు ఎరలను ఏర్పాటు చేయాలి. రెండవ సంవత్సరం తోటలలో మొదటి సంవత్సరపు తోటలలో చేపట్టిన పనులు చేయాలి. ఆకులను ప్రతి నెలలో ఒకసారి కోయాలి. దానితో పాటుగా తీగలను దింపకం చేయాలి.
కూరగాయ పంటలు:
క్యాబేజీ మరియు కాలీఫ్లవర్ (మధ్యకాలిక రకాల) నారును పోసుకొనే సమయం.
కాప్సికం పాలీహౌస్‌లో సాగు చేసుకొనే కాప్సికం నారును నాటుకోవాలి.
వంగ మరియు బెండ పంటలలో మొవ్వు మరియు కాయతొలుచు పురుగు నివారణకు తలవాల్చిన కొమ్మలను త్రుంచి, పుచ్చు కాయలను ఏరి నాశనం చేయాలి. ప్రొఫెనోఫాస్ 2 మి.లీ. లేదా సైపర్ మెత్రిన్ 1 మి.లీ. లీటరు నీటిలో కలిపి రెండుసార్లు 10 రోజుల వ్యవధిలో కాయలు కోసిన తర్వాత పిచికారీ చేయాలి.
కందకు రెండవ పక్షంలో (80 రోజులకు) రెండవ దఫా 33 కిలోల నత్రజని, 33 కిలోల పొటాష్ ఎరువులు (72 కిలోల యూరియా, 55 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్) వేయాలి. అన్నబేధి 5 గ్రా., నిమ్మఉప్పు 1గ్రా., జింక్ సల్ఫేటు 3 గ్రా., మెగ్నీషియం సల్ఫేటు 3 గ్రా., ఎలిగారం (బోరాన్) 3 గ్రా. ఒక లీటరు నీటికి కలిపి అవసరాన్ని బట్టి 10 రోజుల వ్యవధిలో 2 నుండి 3 సార్లు పంటపై పిచికారి చేయాలి. వర్షాకాలంలో ఆకుమచ్చ తెగులును గమనించినట్లయితే కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
మునగ వార్షిక రకాలకు ఎకరానికి 250 గ్రా. గింజలను పాలిథీన్ సంచులలో గాని నేరుగా పొలంలో గాని విత్తుకోవాలి. పాలిథీన్ సంచులలో విత్తిన విత్తనాలను 35`40 రోజుల తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవాలి. విత్తనాలు మొలకెత్తడానికి 10`15 రోజుల సమయం పడుతుంది. బహువార్షిక రకాలను కూడా ఈ నెలలో నాటుకోవచ్చు. బహువార్షిక రకాలను 5`8 సెం.మీ. మందం మరియు 90`100 సెం.మీ. పొడవు గల కొమ్మ కత్తిరింపుల ద్వారా వ్యాప్తి చేయవచ్చు. ఎకరానికి 160 కాండం ముక్కలు కావాలి.
పెండలంలో నాటిన 40`45 రోజుల తరువాత కూలీలతో కలుపు తీయించాలి. రెండవ దఫాగా ఎకరానికి 28 కిలోల యూరియా, 18 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసి తేలికపాటి తడి ఇవ్వాలి.
చేమగడ్డలో వర్షాలు అధికమై గాలిలో తేమ అధికంగా ఉన్నప్పుడు ఆకుమచ్చ తెగులు త్వరగా వృద్ధి చెంది, ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తుంది. దీని నివారణకు మాంకోజెబ్ 2.5 గ్రా. లేదా కార్బెండజిమ్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధితో 2 సార్లు పిచికారి చేయాలి లేదా మెటలాక్సిల్ ఎమ్.జడ్ 2 గ్రా. లీటరు నీటికి కలిపి 20 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసి తెగులును అరికట్టవచ్చును.
ఉల్లిలో బోదెలు 30 సెం.మీ. ఎడంలో చేసి బోదెకు రెండువైపులా 10 సెం.మీ. ఎడంలో నాటుకోవాలి. నారును 20 మి.లీ. మలాథియాన్ G 10 గ్రా. కార్బెండజిమ్ 10 లీ. నీటిలో కలిపిన ద్రావణంలో 20 నిమిషాలు ముంచి నాటితే చీడపీడల బాధ తగ్గుతుంది. ఖరీఫ్ కాలంలో ఆగష్టు నెలలో మొదటి 15 రోజుల్లో, రబీలో డిసెంబర్ మొదటి పక్షంలో నాటుకుంటే మంచి దిగుబడులు వస్తాయి.
కర్రపెండలం మొక్క చుట్టూ మొలిచిన కలుపును కూలీలతో తీయించి, మిగతా కలుపును ఎద్దులతో నడిచే గొర్రుతో లేదా పవర్‌వీడర్‌తోగాని అంతరకృషి చేయాలి. రెండవ పక్షంలో (నాటిన 60 రోజులకు) రెండవ దఫా
ఎకరాకు 8 కిలోల నత్రజని మరియు 8 కిలోల పొటాష్ ఎరువులు (17.5 కిలోల యూరియా మరియు 13.5 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్) మొక్కకు రెండువైపులా గుంతల్లో వేసి మట్టితో కప్పాలి. ఎరువులు వేసిన వెంటనే తేలికపాటి తడి ఇవ్వాలి. మొక్కకు బలంగా ఎదురెదురుగా వున్న రెండు కొమ్మలను ఉంచి మిగిలిన వాటిని తొలగించాలి. ప్రతి మొక్క చుట్టూ గొప్పు చేసి, మొక్క మొదట్లోకి మట్టిని ఎగదోయాలి. తెల్లదోమను నివారించడానికి డైమిథోయేట్ 2 మి.లీ. లేదా ఎసిఫేట్ 1 గ్రా. లేదా ప్రొఫినోఫాస్ లేదా ట్రైజోఫాస్ 2 మి.లీ. లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మి.లీ. లీటరు నీటికి కలిపి ఎకరానికి 200 లీటర్ల మందు ద్రావణాన్ని 15`20 రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి.
పూల తోటలు:
గులాబి తోటల్లో వచ్చే నల్లమచ్చ మరియు ఆకు తినే పురుగు నివారణకు మచ్చలు ఆశించిన ఆకులను తీసివేసి కార్బెండజిమ్ 1 గ్రా. మరియు మోనోక్రోటోపాస్ 1.6 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
చామంతిలో నీరు నిలువ ఉండకుండా చూడాలి. మట్టిని ఎగదోసి పైపాటుగా ఎరువులను వేయాలి.
సుగంధ ద్రవ్య పంటలు:
వాము పంటకు నేలను 2`3 సార్లు దున్ని తయారుచేసుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 5 టన్నుల పశువుల ఎరువుతో పాటు, 15 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేసుకోవాలి.
పసుపులో కలుపుతీత, అంతర కృషి చేపట్టాలి. విత్తిన 30 రోజులకు మొదటి దఫా నత్రజని ఎరువు యూరియా రూపంలో ఎకరానికి 50 కిలోలు అదే మోతాదు వేపపిండితో కలిపి వేయాలి. అధిక తేమ శాతం వల్ల ఆశించే ఇనుపధాతు లోపమును 10 లీటర్ల నీటికి 50 గ్రా. ఫెర్రస్ సల్ఫేట్/100 గ్రా. అన్నబేధిని 5 గ్రా. నిమ్మఉప్పుతో పాటు 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి. ఆకులు ముదురు, లేత ఆకుపచ్చ చారలతో కనిపించినప్పుడు జింకుధాతు లోపముగా గుర్తించి లీటరుకి 5 గ్రా. జింక్ సల్ఫేట్‌ను 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేసుకోవాలి. పొగచూరు లక్షణాలతో నల్లి సోకినట్లయితే 3 గ్రా. నీటిలో కరిగే గంధకము లేదా 5 మి.లీ. డైకోఫాల్ లేదా 3 మి.లీ. జోలోన్ మరియు 0.5 మి.లీ. జిగురు లీటరు నీటికి కలిపి ఆకుల అడుగు భాగం తడిచేలా పిచికారి చేయాలి. ఆకుమచ్చ తెగులు ఆశించినట్లయితే తగు సస్యరక్షణ చేపట్టాలి.
మిరపలో సాలు తోటలకై రెండవ వారం వరకు విత్తనాన్ని ఎదబెట్టుకోవచ్చును. జూలైలో ఎదబెట్టిన సాలు తోటల్లో ఒత్తు పీకి, పాదుల మధ్య 30`45 సెం.మీ. దూరం ఉండేటట్లు చూడాలి. మొదటి దఫా ఎరువులను (65 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్) వేయాలి. ఆరువారాల వయస్సుగల నారును ప్రధాన పొలంలో నాటుకోవాలి. సూటి రకాలైతే పాదుకు రెండు మొక్కలు, సంకర రకాలైతే పాదుకు ఒక మొక్క చొప్పున నాటుకోవాలి. సాళ్ళ మధ్య 75 సెం.మీ., పాదుల మధ్య 30`45 సెం.మీ. ఎడం ఉండేటట్లు చూసుకోవాలి.
నాటుటకు 10 రోజుల ముందే పొలంచుట్టూ 2`3 వరుసలలో జొన్న/మొక్కజొన్నను రక్షక పంటగా విత్తుకోవాలి. పొలంలో అక్కడక్కడ ఆముదం, బంతి మొక్కలను ఆకర్షక పంటలుగా వేయాలి. నారువేర్లను ఇమిడాక్లోప్రిడ్ (5 మి.లీ./10 లీ.) మరియు కార్బెండజిమ్ (10 గ్రా./10 లీ.) కలిపిన మందు ద్రావణంలో 20 నిమిషాలు ముంచిన తరువాత నాటుకోవాలి. నారుమళ్ళలో, ఎదబెట్టిన పొలాల్లో నారుకుళ్ళు మరియు కొయనోఫోరా ఎండుతెగులు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడు (30 గ్రా./10లీ.) మరియు స్ట్రెప్టోసైక్లిన్ (1గ్రా./10 లీ.) మందులను పిచికారి చేయాలి. ఆలస్యంగా నారు పెంచుకునే వారు నారుమళ్ళలో విత్తనం వేసుకోవచ్చును.
ఔషధ మరియు సుగంధ పంటలు:
నిమ్మగడ్డికి వాతావరణం, నేల స్వభావాన్ని బట్టి 10`15 రోజుల వ్యవధిలో నీటి తడులివ్వాలి. మొక్కలు/పిలకలు నాటిన 3`4 నెలల వరకు, తదుపరి పంట కోసిన నెల రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి.
అశ్వగంధ: ఖరీఫ్‌లో ఆలస్యంగా సాగు చేస్తారు. కనీసం 65`70 సెం.మీ. వర్షపాతం అవసరం. పొడి వాతావరణం సాగుకు అనుకూలం. వర్షపాతం తక్కువగా/సరిపోని యెడల 2`3 సార్లు నీటి తడులు ఇవ్వాలి. ఎకరాకు 6`8 కిలోల విత్తనం సరిపోతుంది. వీటిని కనీసం 5 రెట్లు ఇసుకతో కలిపి విత్తుకోవాలి. వరుసలలో నాటటం అంత లాభసాటి కాదు. వెదజల్లడం వలన మొక్కల సాంద్రత ఎక్కువగా ఉంటుంది. తద్వారా దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. నేరుగా విత్తినపుడు 20`25 రోజుల తరువాత మొక్కలు పలుచన చేయాలి. కలుపు తీయాలి.
కలబందలో కలపుతీస్తూ నెలరోజులకొకసారి నీటి తడులివ్వాలి.
పామరోజాలో 50 శాతం మొక్కలు పూత మీద ఉన్నప్పుడు పంటను కోసి, నూనె సేకరించాలి. కోత తరువాత ఎకరానికి 20 కిలోల యూరియా వేయాలి.
కోలియస్ పంటకు ఎకరాకు 20 కిలోల నత్రజనిని నాటిన 30 రోజులకు వేయాలి.
పిప్పలికి కీటకాలు ఆశించినపుడు 0.5 శాతం వేపగింజలు లేదా బెరడు కషాయం పిచికారి చేయాలి. ఆకులపై మచ్చలాంటి తెగులు సోకినపుడు 1 శాతం బోర్డో మిశ్రమాన్ని పిచికారి చేయాలి.
Also Read: రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయుటకు చేపట్టాల్సిన వ్యూహాత్మక చర్యలు.!