ఉద్యానశోభ

కోతుల బెడదకు విరుగుడు..పంజరపు తోట

0

మిద్దె తోటలు సాగు చేసుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. యువత మొదలు రిటైల్డ్ ఉద్యోగి వరకు ప్రకృతితో మమేకమై పెరటి, మిద్దె తోటలు సాగు చేసుకునేందుకు మక్కువ చూపిస్తున్నారు. అయితే ఎంతో ఇష్టంగా పెంచుకున్న మొక్కలు కోతుల పాలవుతున్న సంఘటనలు చాలానే ఉన్నాయి. మిద్దె సాగుదారులకు ఇదో పెద్ద సమస్యగా మారుతోంది. కోతుల తాకిడికి తాలలేక ఇంటి పంటల సాగుకు స్వస్తి పలుకుతున్న వారు లేకపోలేదు కానీ ఆ దంపతులు కోతుల బెడదకు విరుగుడును కనిపెట్టారు. పంటలకు రక్షణ కల్పిస్తున్నారు. నారపల్లికి చెందిన విద్యాసాగర్, పద్మజ దంపతులు ప్రభుత్వ ఉద్యోగులు. విద్యాసాగర్ ఈ మధ్యనే రిటైల్డ్ అయ్యారు. పద్మజ, మహిళ మరియు శిశు సంక్షేమ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. వీరిద్దరికీ ప్రకృతికి దగ్గరగా జీవించాలన్న తపన కలిగింది. దీంతో 2010 సంవత్సరంలో మిద్దె తోటల సాగు నిపుణులు రఘోత్తమరెడ్డి గారి సలహాలు సూచనలతో నారపల్లిలోని తమ నివాసంలో మిద్దె తోటను ఏర్పాటు చేసుకున్నారు. శాశ్వత మడులను నిర్మించుకొని వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలను పండించుకుంటున్నారు. కుటుంబానికి సరిపడా కూరగాయలను మిద్దె తోటల ద్వారా పొందుతున్నారు. అంతే కాదు ప్రతి రోజు పచ్చటి మొక్కల మధ్య గడుపుతుంటే ఎంతో ఉత్సహాంగా, ఆహ్లాదంగా ఉందంటూ సంబరపడుతున్నారు ఈ దంపతులు. ఎంతో ఇష్టంగా ఇంటి పంటలు సాగు చేసుకున్నా కోతుల చేష్టలు కాస్త ఇబ్బంది కలిగించాయి. మిద్దె మీద పండిన కాయగూరలు వాటికే ఆహారంగా మారాయి. దీంతో వీటికి చెక్ పెట్టాలని భావించిన ఈ దంపతులు ఇనుప పంజరమే సరైన పరిష్కారమని నిర్ణయించుకున్నారు. 60 వేల రూపాయల పెట్టుబడితో మొక్కలకు ఎలాంటి ఇబ్బందులు రానీయకుండా ఎంతో పకడ్బందీగా శాశ్వత పంజరాన్ని మేడ మీద ఏర్పాటు చేసుకున్నారు. తద్వారా కోతుల బెడదకు స్వస్తి పలికారు. ఇప్పుడు తమ పంజరపు తోటలో కూరగాయలు, ఆకుకూరలను తినగలుగుతున్నామని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పూర్తి ప్రకృతి విధానంలోనే మిద్దె తోటలను సాగు చేస్తున్నారు ఈ దంపతులు. మేకల విసర్జాలు, పశువుల పెంట, వర్మీకంపోస్టు నే మొక్కలకు అందిస్తున్నారు. చీడపీడల నివారణకు నీమాస్త్రాన్ని వినియోగిస్తున్నారు. ప్రకృతి విధానంలో పండిన ఈ ఉత్పత్తులు ఎంతో రుచికరంగా ఉంటున్నాయని అంటున్నారు వీరు. మిద్దె మీద మొక్కల మధ్య ప్రతి రోజూ కాస్త సమయం గడపడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందంటున్నారు. శ్రమ అని అనుకోకుండా ప్రతి ఒక్కరు మిద్దె తోటలను సాగు చేసుకోవాలని సూచిస్తున్నారు. నీటి ప్రాముఖ్యతను తెలుసుకున్న ఈ దంపతులు తమ మేడ మీద కురిసిన ఒక్క నీటి చుక్కను వృధాగా పోనీయరు. వాన నీటిని సంరక్షించుకునేందుకు ప్రత్యేక పద్ధతులను అనుసరిస్తున్నారు. తద్వారా భూగర్భ జలాలు రీఛార్జ్ అవుతున్నాయని విద్యాసాగర్ తెలిపారు.

Leave Your Comments

వానపాములతో వర్మి కంపోస్ట్

Previous article

ఆరెంజ్ పండ్లతో విద్యుత్ ఉత్పత్తి

Next article

You may also like