Freshwater Fish Pond Culture: తెలుగు రాష్ట్రాలలో చేపల పెంపకం ముఖ్యంగా సాంప్రదాయ, విస్తృత, పాక్షిక సాంద్ర, మరియు సాంద్ర పద్ధతుల్లో చేపట్టడం జరుగుతున్నది. రైతులు కమ్యూనిటీ చెరువులలో, పంచాయతీ చెరువులలో మరియు తయారు చేసిన చెరువులలో గానీ చేపల సాగు చేపట్టే ముందు వాటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అంటే, నీటి వనరులను బట్టి, ఆహారపు అలవాట్లను బట్టి, సాగుకు అనువుగా ఉండే చేపల రకాలను ఎంపిక చేసుకోవడంలో జాగ్రత్తలు తీసుకోవడం వలన సాగు కాలంలో వాటి మరణాల శాతాన్ని తగ్గించుకోవచ్చు. నీటి వనరులలో సహజంగా దొరికే అన్ని రకాల చేపలు పెంపకానికి అనువుగా ఉండవు.
పెంపకానికి అనువుగా ఉండే రకాల లక్షణాలు :
చేపల పెంపకానికి ఉపయోగించే నీటి వనరులను బట్టి ఎంచుకున్న చేపల ఆహారపు అలవాట్లను బట్టి చెరువులలో చేపలను పెంపకానికి ఎంపిక చేసుకోవాలి. తక్కువ సమయంలో ఎక్కువ పెరుగుదలను చూపిస్తూ నీటి వనరులలో ఉండే సహజ మేత అయినా వృక్ష, జంతు ప్లవకాలు తీసుకుంటూ, అనుబంధంగా ఇచ్చే మేతలను కూడా తీసుకునే విధంగా ఉండాలి. అంతేకాకుండా వాతావరణంలో అప్పటికప్పుడు వచ్చే మార్పులను తట్టుకునే విధంగా ఉండాలి.
ఇండియన్ మేజర్ కార్ప్ రకాలయిన కట్ల (బొచ్చె), రోహు (రాగండి), మ్రిగాల (ఎర్రమైల) రకాలు పెంపకానికి చాల అనువైనవి. బొచ్చె రకం ముఖ్యంగా జంతు ప్లవకాలు, ఆల్గే మొక్కలు, కీటకాలు వంటివాటిని ఆహారంగా తీసుకుని, మంచి యాజమాన్య పద్ధతులను గానీ పాటించినట్లయితే ఇవి సంవత్సరానికి 1.5 నుండి 4 కేజీల బరువు వరకు పెరుగుతాయి.
రాగండి రకం, ఇవి ఎక్కువగా వృక్ష ప్లవకాలు, చిన్న సైజులో ఉన్న ఆల్గే, కుళ్ళుతున్న పదార్థాలను ఎక్కువగా తీసుకుంటాయి. ఇవి సంవత్సర పంట కాలంలో, 1 నుండి 3 కేజీల వరకు పెరుగుదల కలిగి ఉండి చెరువులో ఎక్కువ సంఖ్యలో వేసుకుని అధిక ఉత్పత్తి సాధించడానికి వీలుంటుంది.
ఎర్రమైల రకం, ఇది ఎక్కువగా కుళ్ళుతున్న సేంద్రీయ పదార్థాలను, అలాగే చనిపోయిన వృక్ష జంతు సంబంధ పదార్ధాలను ఆహారంగా తీసుకుంటాయి. ఈ మూడు రకాలు తవుడు, వేరుశెనగ చెక్క, ప్రతిచెక్క, మరియు సోయా చెక్క వంటి వాటిని అనుబంధ ఆహారంగా ఇచ్చినప్పుడు అధిక పెరుగుదలను చూపిస్తాయి.
వీటితో పాటు విదేశీ రకాలైన గడ్డి చేప, బంగారు తెగ, వెండి చేప రకాలను కూడా పెంచుకోవచ్చును. వెండి చేప ముఖ్యంగా, నీటి ఉపరితలంలో ఉండే వృక్ష ప్లవకాలను ఎక్కువగా ఆహారంగా తీసుకుంటాయి ఇవి సంవత్సర కాలంలో 1.5 నుండి 3 కేజీల వరకు బరువు పెరుగుతాయి.
గడ్డి చేప రకం ముఖ్యంగా వృక్ష జంతు ప్లవకాలు, మెత్తటి గడ్డి, లెమ్నా, హైడ్రిల్లా, వాలిస్నేరియా వంటి నీటి మొక్కలను ఆహారంగా తీసుకుంటాయి. కలుపు మొక్కల బెడద ఎక్కువగా ఉండే కమ్యూనిటీ చెరువులు పంచాయితీ చెరువుల్లో ఈ రకం చేపలు ఎక్కువగా వేసుకుంటే అధిక ఉత్పత్తిని సాధించవచ్చును. గడ్డి చేప రకం ఒక రోజులో తన శరీర బరువుకు మూడు రెట్ల బరువు ఉండే ఆహారాన్ని తీసుకుంటాయి. ఇవి ఒక సంవత్సర పంట కాలంలో 2.5`5 కిలోల వరకు పెరుగుదల చూపిస్తాయి.
బంగారు తీగ రకం ముఖ్యంగా కీటక లార్వాల పురుగులు అడుగు భాగంలో ఉండే సేంద్రియ పదార్థాన్ని ఎక్కువగా ఆహారంగా తీసుకుంటాయి సంవత్సర కాలంలో 1.5 నుండి 3.5 కిలోల వరకు పెరుగుదల చూపిస్తాయి.
Also Read: ప్రస్తుత పరిస్థితుల్లో సోయా చిక్కుడు, వరి పంటల్లో వచ్చే తెగుళ్లు.!
చేప పిల్లల విడుదల సంఖ్య :
ఈ విధంగా పెంపకానికి ఎంపిక చేసుకున్న చేపలను నీటి వనరులను బట్టి ఏ ఏ నిష్పత్తిలో వేయాలో నిర్ణయించుకోవాలి. బొచ్చే, రాగండి, ఎర్రమల రకాలను మాత్రమే సాగుకు ఎంచుకున్నట్లు అయితే వీటిని 3:5:2 నిష్పత్తిలో చెరువులో విడిచిపెట్టాలి. ఈ మూడు రకాల తో పాటు బంగారుతీగ రకాన్ని కూడా ఎంచుకుంటే బొచ్చే, రాగండి, ఎర్రమల, బంగారు తీగ రకాల నిష్పత్తి 3:4:1:2 గా ఉండేట్లు చూసుకోవాలి. కలుపు మొక్కల బెడద ఎక్కువగా ఉండే చెరువుల్లో కనీసం పది శాతం వరకు గడ్డి చేపలను విడిచి పెట్టెలా చర్యలు తీసుకోవాలి.
మిశ్రమ పెంపక విధానానికి అనువైన రకాలు :
కార్ప్ రకాలతోపాటు తొందరగా పెరుగుదల చూపించి, నీటి లోతు తక్కువగా ఉన్నప్పుడు కూడా తట్టుకోగలిగే, పంగాషియస్ రకాలను, మార్పు రకాలను కూడా సాగుకు ఎంపిక చేసుకోవచ్చును. తక్కువ కాలం పాటు నీరు ఉండే చెరువుల్లోనూ నీటి లోతు తక్కువగా ఉండే చెరువుల్లో ఈ రకం చేపలు అధిక సాంద్రతలో పెంపకానికి అనువుగా ఉంటాయి.
మంచినీటి చేపల తోపాటు నీలకంట రొయ్యలను ను కూడా సాగు చేయడం వల్ల అధిక లాభాలను పొందవచ్చును, రొయ్యలను ఎకరాకు 10 వేల వరకు విడుదల చేసుకోవచ్చును. చేపలతో స్కాంపి రొయ్యల పెంపకం చేపట్టేటప్పుడు అడుగు భాగంలో తిరిగే చేపల రకాలైన ఎర్రమల, బంగారు తీగ రకాల సంఖ్యను తగ్గించుకోవాలి.
చేపల పెంపకానికి ఉపయోగించే నీటి వనరులను బట్టి, ఆహారపు అలవాట్లను బట్టి చేపల రకాలను ఎన్నుకోవాలి. చేపలను ఉత్పత్తి చేసిన వెంటనే అంటే గుడ్డు లేదా స్పాంజ్ దశలో నేరుగా చెరువులలో వదిలి నట్లయితే అలల తాకిడికి తట్టుకోలేక ఎక్కువ సంఖ్యలో చనిపోతాయి. అందువల్ల నర్సరీ చెరువుల్లో స్పాను దశ నుండి ఫ్రై లేదా ఫింగర్ లింగ్ దశ వరకు పిల్లలను పెంచుకోవాలి ఈ విధంగా పెంచిన చేపపిల్లలను ఒత్తిడికి గురి కాకుండా, ఉత్పత్తి స్థానం నుండి పెంపక చెరువుల వరకు జాగ్రత్తగా రవాణా చేసుకోవాలి. ఈ విధంగా ఎంపిక చేసుకున్న చేపల రకాలను కాలుష్యం లేని వాతావరణ పరిస్థితుల్లో ఉన్న నర్సరీ చెరువుల నుండి గాని రేరింగ్ చెరువుల నుండి గాని, వాటి నాణ్యతను ముందుగా పరీక్షించి ఆరోగ్యంగా ఉండే చేప పిల్లలు మాత్రమే సేకరించుకోవాలి. ఆలస్యంగా నీరు చేరే చెరువుల్లోనూ, తక్కువ కాలం పాటు నీరు ఉండే చేరువుల్లోను ఫింగర్ లింగ్ సైజు అంటే 5 నుండి 8 సెంటీమీటర్ల సైజు చేపపిల్లలను గాని సంవత్సరం వయసు ఉన్న చేపపిల్లలను (100-250 గ్రా.) గాని విడుదల చేసుకోవాలి.
నాణ్యమైన చేప పిల్లల ఎంపిక :
. వ్యాధి సోకని ఆరోగ్యంగా ఉండే ఒకే సైజు చేపపిల్లలను ఎంచుకోవాలి
. ఈ చేపపిల్లలను హాపాలో గానీ, బేసిన్‌లో గానీ వేసినప్పుడు అవి చురుకుగా తిరుగాడుతూ హపా అంచుల వెంబడి ఎక్కువగా కనబడతాయి
. చేపపిల్లలను బేసిన్లో వేసి చూసినప్పుడు పిల్లలు తళ తళ మెరుస్తూ ఉండాలి.
. ఒకే పరిమాణం గల చేప పిల్లలను ఎంపిక చేసుకున్నట్లయితే పెంపక కాలంలో చేపలు సమానంగా పెరుగుతాయి.
. చేప పిల్లల తోక, లేక రెక్క భాగాలను పరిశీలిస్తే ఎటువంటి కొరుకుడు కానీ, చీలినట్లు కానీ లేకుండా ఉన్నవాటిని ఆరోగ్యవంతమైనవాటివిగా గుర్తించుకోవాలి.
చెరువు నీటి గుణాలకు చేప పిల్లలను అలవాటు పరచుట :
సాధారణంగా చేప పిల్లల ఉత్పత్తి స్థానం, పెంపక చెరువుల నీటి వాతావరణ పరిస్థితులు వేరుగా ఉంటాయి కనుక చేపలు పెంచే నీటిలో పిల్లలను వదిలే ముందు నీటి వాతావరణ పరిస్థితులకు అంటే ఉష్ణోగ్రత అలవాటు చేసుకోవాలి. లేకపోతే ఒక్కసారిగా ఏర్పడే మార్పులకు అధిక ఒత్తిడికి గురై ఒక్కసారిగా ఎక్కువ సంఖ్యలో చేప పిల్లలు చనిపోయే అవకాశం ఉంది. చేప పిల్లలను చెరువులో చల్లని వాతావరణంలో అంటే ఉదయం సమయంలో, అలల తాకిడి తక్కువగా ఉన్నటువంటి ప్రదేశంలో విడిచి పెట్టాలి. పిల్లల బ్యాగును 15 నిమిషాల పాటు విప్పకుండా చెరువు నీటిలో ఉంచాలి. ఈ విధంగా చేయడం వలన ఉష్ణోగ్రతలు సమతాస్థితి లోకి వస్తాయి. తర్వాత చెరువు నీటిని బ్యాగులోకి నెమ్మదిగా వంచుతూ చెరువు నీటిని పట్టుకోవాలి తర్వాత బ్యాగ్‌లోని చేపపిల్లలను నీటితో సహా నెమ్మదిగా చెరువులోకి వదులుకోవాలి.
Also Read: వాతావరణం పంటల పరిస్థితి విశ్లేషణ, రైతులకు సూచనలు.!